గంగూలీకి వేసిన ఆ బౌన్సర్లే షమీ కెరీర్‌ను మలుపు తిప్పాయి

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు ప్రపంచ కప్ 2023 టోర్నీలో భారత జైత్రయాత్రలో అత్యంత కీలక పాత్ర పోషించిన బౌలర్ మొహమ్మద్ షమీ.
వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొని తిరిగి గెలుపు బాట పట్టిన షమీ కెరీర్, తొలినాళ్లలో ఎప్పుడు మలుపు తిరిగిందనేది ఆసక్తికరం.
అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఓసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి వేసిన బౌన్సర్లు షమీ కెరీర్‌ను మలుపు తిప్పాయి.

ఫొటో సోర్స్, Getty Images
యూపీలో చోటు దక్కక బెంగాల్‌కు..
1990 సెప్టెంబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని సదాస్‌పూర్ గ్రామంలో జన్మించాడు మొహమ్మద్ షమీ. ఐదుగురు సంతానంలో షమీ చిన్నవాడు. తండ్రి తౌషీఫ్ అలీ రైతు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఫాస్ట్ బౌలర్ కావాలని కలలుగన్నారు. కానీ, కుటుంబ పరిస్థితి సహకరించకపోవడంతో వ్యవసాయంలోకి దిగారు.
తను క్రికెట్ ఆడలేకపోయినా, కొడుకు ద్వారా ఆ కలను నిజం చేసుకోవాలనుకున్న తౌషీఫ్, షమీకి 15 ఏళ్ల వయసులోనే అతడికి క్రికెట్ కోచింగ్ ఇప్పించడానికి తమ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్‌కు తీసుకెళ్లేవారు.
అప్పుడే షమీలోని సత్తాను గుర్తించాడు క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ. కానీ, షమీకి యూపీ అండర్-19 జట్టులో చోటు దొరకలేదు. దీంతో బెంగాల్ వెళ్లిన మొహమ్మద్ షమీ, కోల్‌కతాలోని డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్‌లో కొంత కాలం క్రికెట్ ఆడాడు.
ఆ తర్వాత మోహున్ బగాన్ క్రికెట్ క్లబ్‌కు ఆడే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో షమీ ఒకసారి ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేశాడు.
షమీ వేసిన రెండు బంతులు బౌన్స్ కాగానే, పిచ్‌లోనే ఏదో సమస్య ఉందనుకున్న గంగూలీ బ్యాట్‌తో పిచ్‌ను నొక్కడం మొదలెట్టాడు.
ఆ తర్వాత కూడా షమీ వేసిన బంతులు బౌన్సర్లుగా రావడంతో, గంగూలీ బ్యాటింగ్ పక్కనబెట్టి, అతడి గురించి వివరాలు అడిగాడు.
షమీ అతడికి తన కథంతా చెప్పాడు.
తర్వాత పశ్చిమ బెంగాల్ రంజీ జట్టులోకి రాలేకపోయానని గంగూలీకి వివరించాడు.
అదే షమీ కెరీర్‌ను మలుపు తిప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
గంగూలీ సిఫారసుతో బెంగాల్ జట్టులో చోటు
గంగూలీ సిఫారసుతో 2010–11 రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టు తరఫున ఆడేందుకు షమీకి అవకాశం వచ్చింది.
ఆ తర్వాత 2012-13 రంజీ ట్రోఫీ సిరీస్‌లో షమీ 28 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో షమీ ప్రదర్శన భారత జట్టులో ఆడే అవకాశాన్ని కల్పించింది.
2013లో వెస్టిండీస్ భారత్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో షమీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
రివర్స్ స్వింగ్, ఇన్ స్వింగ్, కట్టర్‌లతో వెస్టిండీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన షమీ, తన మొదటి టెస్టులోనే 9 వికెట్లు పడగొట్టాడు.
మొత్తం రెండు టెస్టుల్లో కలిపి 11 వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి మ్యాచ్‌తోనే సత్తా చాటాడు
2013లో దిల్లీలో పాకిస్తాన్‌తో షమీ తొలి వన్డే ఆడాడు. తన తొలి మ్యాచ్‌లో 9 ఓవర్లు వేయగా, అందులో 4 మెయిడిన్లు. మొత్తం 23 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆడిన తొలి వన్డేలోనే 4 మెయిడిన్లు వేసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లో షమీని తొలిసారి 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తన జట్టులోకి తీసుకుంది.
2014లో షమీని కొనుగోలు చేసిన దిల్లీ డేర్‌డెవిల్స్, ఐదేళ్లపాటు రిటైన్ చేసుకుంది.
ఆ తర్వాత 3 సీజన్లు పంజాబ్ తరఫున ఆడాడు షమీ. అనంతరం గుజరాత్ టైటాన్స్ తరఫున 2 సీజన్లు ఆడాడు.
మొహమ్మద్ షమీ అసలు కోల్‌కతా జట్టులోకి ఎలా వచ్చాడో కేకేఆర్ ప్రధాన కోచ్ డేవ్ వాట్‌మోర్ ఓ సందర్భంలో చెప్పాడు.
‘‘వసీం అక్రమ్ ఒకసారి షమీ బౌలింగ్ శైలిని చూశాడు. ఆ తర్వాత, అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం వేలంలో అతడిని తీసుకున్నాడు. షమీ తన బౌలింగ్‌తో వసీం అక్రమ్‌ను ఆకట్టుకున్నాడు. షమీకి గొప్ప ప్రతిభ ఉందని వసీం అక్రమ్ నమ్మాడు’’ అని డేవ్ వాట్‌మోర్ చెప్పాడు.
హసన్ జహాన్‌తో ప్రేమ, వివాహం, గొడవలు
ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్న సమయంలో షమీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తాయి.
షమీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నప్పుడు ఆ జట్టు చీర్‌లీడర్‌గా ఉన్న హసన్ జహాన్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
2014లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉంది. అయితే షమీ వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. భార్య జహాన్, షమీకి మధ్య గొడవలు వచ్చాయి. షమీపై గృహ హింస ఫిర్యాదు చేసిన జహాన్, 2018లో అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసి చర్చకు దారితీశారు.
షమీ ప్రతిభపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, ఆమె ఫిర్యాదుపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అతడిని తమ కాంట్రాక్ట్ లిస్టు నుంచి తీసేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు షమీ, బీసీసీఐ ‘అవినీతి విచారణ కమిటీ’ ముందు హాజరై వివరణ ఇచ్చాడు.
బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ, జహాన్ ఆరోపణలో నిజం లేదని తేల్చింది. దీంతో షమీని తిరిగి కాంట్రాక్ట్‌లోకి తీసుకున్నారు.
అంతే కాదు, షమీ కూడా తన భార్యపై ఆరోపణలు చేశాడు. తన భార్య జహాన్‌కు ఇదివరకే వివాహమైందని, పిల్లల ఉనికిని దాచిపెట్టిందని ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న షమీ
ఈ కేసు విచారణ సమయంలో, తనపై వచ్చిన ఆరోపణల వల్ల షమీ, సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఎంతో నిరాశానిస్పృహలకు లోనయ్యాడు.
తన కుటుంబం, స్నేహితుల ప్రోత్సాహంతో అన్నింటినీ అధిగమించి మళ్లీ జట్టులో స్థానం సంపాదించి, 2023 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు.
అయితే, లీగ్ దశలో ఐదు మ్యాచులు అయ్యాకగానీ షమీకి ఆడే అవకాశం రాలేదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవడంతో షమీకి అవకాశం దక్కింది. దీనిని చక్కగా వినియోగించుకున్నాడు. నవంబరు 15 వరకు షమీ ఐదు మ్యాచ్‌లు ఆడగా, 23 వికెట్లు తీశాడు. భారత్‌కు అద్భుత విజయాలు అందించాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి..
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














