మహమ్మద్ షమీ: అమ్రోహాలో టెన్నిస్ బాల్‌తో ఆడిన 'సిమ్మీ' వరల్డ్ క్రికెట్ సెన్సేషన్‌గా ఎలా ఎదిగాడు? -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ నుంచి నేషనల్ హైవే-9పై 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒకచోట ఒక సన్నని మలుపులు తిరిగిన రోడ్డు కనిపిస్తుంది.
ఆ రోడ్డుకు రెండు వైపులా చెరకు తోటలు కనిపిస్తాయి. హైవేకు దాదాపు కిలోమీటరు దూరంలో నాలుగు వైపులా తెల్లని పెద్దగోడలతో ఒక ఇల్లు కనిపిస్తుంది.
ఇది ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ ఇల్లు. షమీ విజయాలు, పేరు ప్రఖ్యాతులకు సాక్ష్యంగా ఈ ఇల్లు నిలుస్తోంది.
అమ్రోహాలోని ప్రశాంతమైన సహస్‌పుర్ అలీనగర్ గ్రామంలో జన్మించిన షమీ ఇక్కడే మట్టి మైదానాలపై టెన్నిస్ బాల్స్‌తో క్రికెట్ ఆడేవాడు. నేడు అతడి పేరు ఐసీసీ వరల్డ్ కప్ 2023లో మార్మోగుతోంది.
ఆరు మ్యాచ్‌లలో వరుసగా 5, 4, 5, 2, 0, 7 చొప్పున మొత్తంగా షమీ 23 వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌పై ఏకంగా ఏడు వికెట్లు తీసి షమీ రికార్డు సృష్టించాడు.

ఫొటో సోర్స్, ANI
బౌలర్లు ఏ స్థాయి ప్రదర్శన ఇవ్వాలని కలలు కంటారో అది నిజంచేసి చూపించాడు షమీ. వరల్డ్ కప్‌లో గరిష్ఠంగా 27 వికెట్లతో మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేందుకు షమీ నాలుగు అడుగుల దూరంలోనే ఉన్నాడు.
ప్రస్తుతం సహస్‌పుర్ అలీనగర్ గ్రామానికి జర్నలిస్టులు వరస కడుతున్నారు. మహమ్మద్ షమీ గురించిన కథలు చెప్పేందుకే ఇక్కడి గ్రామస్థులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఇక్కడి ప్రజలు షమీని ముద్దుగా ‘సిమ్మీ భాయ్’ అని పిలుచుకుంటారు. షమీ చిన్నప్పుడు ఆయన తండ్రి తౌషిఫ్ అలీ ఇక్కడ క్రికెట్ ఆడేవారు.

తౌషిఫ్ గురించి సహస్‌పుర్ అలీనగర్ గ్రామవాసి మహమ్మద్ జుమ్మా మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రామానికి తౌసిఫ్ క్రికెట్‌ను తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మేం రేడియోలో కామెంటరీ వినేవాళ్లం. అలా మాలో క్రికెట్‌పై అభిమానం పెరిగింది. తౌషిఫ్ అప్పట్లోనే ఒక క్రికెట్ కిట్ కొని తీసుకొచ్చారు. క్రికెట్ ఆడేందుకు ఒక పిచ్‌ను కూడా ఆయన ఇక్కడ సిద్ధంచేశారు’’ అని చెప్పారు.
‘‘చాలా చిన్నప్పుడే చిన్నప్పుడు సిమ్మి కూడా క్రికెట్ ఆడేవాడు. ఎక్స్‌ట్రా ఫీల్డర్‌గా తను ఉండేవాడు. చాలా వేగంగా పరిగెత్తేవాడు. తర్వాత నెమ్మదిగా బౌలింగ్‌పై అతడికి ఆసక్తి పెరిగింది. ఆడటానికి ఎవరూ లేకపోతే తను ఒక్కడే బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు’’ అని జుమ్మా వివరించారు.
సహస్‌పుర్ అలీనగర్‌లోని షమీ ఇంటికి పక్కనే ఒక శ్మశానం కనిపిస్తోంది. ఆ పక్కనే నేలపై బాగా గడ్డి పెరిగి కనిపిస్తోంది. ఒకప్పుడు షమీ ఇక్కడే క్రికెట్ ఆడటం ప్రాక్టీస్ చేసేవాడు. అప్పట్లో ఇది ఒక పిచ్‌లా ఉండేది. షమీ తన బౌలింగ్‌తో ఇక్కడి పిచ్‌లపై చెలరేగేవాడు.
‘‘ఈ గ్రామానికి సొంతంగా ఒక క్రికెట్ జట్టు ఉంది. షమీ అన్నయ్య తౌసిఫ్ కూడా అల్‌రౌండర్. అప్పట్లో పిల్లలు పోలీసు విభాగం, సైన్యంలో చేరాలని భావించేవారు. దీంతో ఫిట్‌నెస్ కోసం క్రికెట్ ఆడేవారు. అలా గ్రామంలో ఒక క్రికెట్ జట్టు ఏర్పడింది. ప్రస్తుతం వారంతా ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోయారు’’ అని జుమ్మా చెప్పారు.
బౌలింగ్‌లో స్పీడ్‌తో మహమ్మద్ షమీ ఇక్కడ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చుట్టుపక్కల ఊళ్లలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లలో అతడి ఆట చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చేవారు.
‘‘ఆ ప్లేయర్లకు మా గ్రామంలోని గ్రౌండ్‌లు సరిపోయేవి కాదు. వీరు నెమ్మదిగా సిటీ జట్లతో పోటీపడటం మొదలుపెట్టారు. అలా మొరాదాబాద్ సోనక్‌పుర్ స్టేడియంలో ఆడేటప్పుడు కోచ్ బద్రుద్దీన్ దృష్టి షమీపై పడింది. ఆయనే అక్కడి స్టేడియంలో ఆడేందుకు షమీని ఆహ్వానించారు’’ అని జుమ్మా చెప్పారు.

అది టర్నింగ్ పాయింట్..
మహమ్మద్ షమీ కెరియర్‌లో అది టర్నింగ్ పాయింట్ లాంటిది. దీంతో ఆయనకు గ్రౌండ్, కోచ్ కూడా దొరికారు. తన కలలను నిజం చేసుకునే దిశగా అతడు ముందుకు వెళ్లాడు.
షమీ స్పీడ్‌ను చూసి కోచ్ బద్రుద్దీన్ మంత్రముగ్ధుడయ్యారు. ఆయనే కోల్‌కతాలో తర్వాత దశ ట్రైనింగ్‌కు షమీని దగ్గరుండి పంపించారు.
షమీ ప్రతిభ చూసి తనకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుందని బద్రుద్దీన్ చెబుతుంటారు.
‘‘షమీ తన కెరియర్‌లో చాలా ముందుకు వెళ్తాడని మేం ముందే అనుకున్నాం. కానీ, ఇంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తాడని మేం ఎప్పుడూ అనుకోలేదు. నేడు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ ఎవరంటే షమీ పేరే ఇక్కడ చెబుతారు’’ అని ఆయన అన్నారు.
షమీ సక్సెస్ గురించి బద్రుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘బాల్‌లో సీమ్ లైన్‌పై చేయిపెట్టి అద్భుతంగా తను బౌలింగ్ చేస్తాడు. ప్రస్తుత సీమ్ బౌలర్లలో అతడే బెస్ట్’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ టెక్నిక్ చాలా సింపుల్. అదే అతడి బలం. ఈ టెక్నిక్‌పైనే అతడు ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు. అతడు బౌలింగ్‌లో ఇటు సీమ్, అటు స్వింగ్ రెండూ కనిపిస్తాయి. అందుకే అతడిని బెస్ట్ అని అంటున్నాం. అత్యుత్తమ బ్యాటర్లు కూడా అతడి ముందు తడబడుతున్నారు’’ అని ఆయన చెప్పారు.

షమీ ప్రదర్శన క్రెడిట్ అతనికే దక్కుతుందని బద్రుద్దీన్ చెబుతున్నారు.
''అతనెప్పుడూ ప్రాక్టీస్ మానేయలేదు. కష్టపడుతూనే ఉండేవాడు. ఎన్నో ఏళ్లుగా తను పడుతున్న కష్టానికి ఫలితం ఈ ప్రపంచకప్‌లో కనిపిస్తోంది'' అని తెలిపారు బద్రుద్దీన్.
సహస్పూర్ అలీనగర్ గ్రామం బయట నిర్మిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలోని మైదానం కూడా పిల్లలకు ఆటస్థలం.
పచ్చటి గడ్డి, చదునైన పిచ్‌తో కూడిన ఈ మైదానంలోనే మధ్యాహ్నం గ్రామంలోని చాలామంది ప్లేయర్స్ క్రికెట్ ఆడుతుంటారు.

ఇపుడు తన ఎదుగుదలతో షమీ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇందులో అతని గ్రామంలోని అబ్బాయిలు కూడా ఉన్నారు. మునీర్ కూడా ఫాస్ట్ బౌలర్.
''సిమ్మీ భాయ్‌ని చూసి మేం కూడా ఆడుతున్నాం. అతను అద్భుతాలు చేయగలిగితే ఏదో ఒక రోజు మేం కూడా ఆ స్థానానికి చేరుకోగలం అనుకుంటున్నాం’’ అంటున్నాడు మునీర్.
గ్రామంలో ఇదొక్కటే మైదానం, అయితే ప్రస్తుతం అక్కడ కొత్త నిర్మాణాల కోసం గుంతలు తవ్వుతున్నారు.
ఇక్కడైతే ప్రస్తుతానికి క్రీడా సౌకర్యాలు తగినంతగా లేవు.
''సౌకర్యాలున్నా లేకపోయినా ఆడుకుంటాం, భాయ్ మాదిరి బౌలింగ్ చేస్తే, ఎక్కడో మంచి స్థానం దక్కుతుంది’’ అంటున్నాడు మునీర్.

షమీ ప్రదర్శనతో మినీ స్డేడియం
ప్రపంచకప్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేయడంతో అమ్రోహా జిల్లా యంత్రాంగం ఇక్కడ మినీ స్టేడియంను నిర్మించబోతోంది.
"షమీ గ్రామంలో మినీ స్టేడియం నిర్మించాలని మేం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం, మేం భూమిని గుర్తించాం, జిల్లా అధికారులు గ్రామాన్ని కూడా సందర్శించారు" అని అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ కుమార్ త్యాగి తెలిపారు.
కాగా, షమీ వల్ల గ్రామంలో స్టేడియం నిర్మాణం, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మునీర్ లాంటి క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ఈ గ్రామంలో క్రీడా సౌకర్యాలు కల్పించడానికి రాజకీయ పార్టీలు కూడా ప్రకటనలు చేస్తున్నాయి.
షమీ గ్రామంలో క్రీడా సౌకర్యాలను తన పార్లమెంటరీ నిధులతో అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు రాష్ట్రీయ లోక్ దళ్ నాయకుడు జయంత్ చౌదరి ప్రకటించారు.
షమీ ఎవరిని చూసి క్రికెట్ నేర్చుకున్నారు?
మరోవైపు షమీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. దిల్లీ నుంచి డజన్ల కొద్దీ జర్నలిస్టులు ఇక్కడికి చేరుకుని షమీ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూ చేస్తున్నారు.
''షమీ ఐదు వికెట్లు తీసినప్పుడు ఏదో ఒక రోజు ఆరు లేదా ఏడు వికెట్లు పడగొట్టాలని నా మనసులో అనుకున్నాను. ఇప్పుడు షమీ ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ ప్రాంతమంతా సంతోషం వ్యక్తం చేసింది" అని షమీ సోదరుడు హసీబ్ బీబీసీతో అన్నారు.
హసీబ్ కూడా క్రికెట్ ఆడుతుండేవారు.
"మా నాన్న క్రికెట్ ఆడేవారు, ఆయనను చూస్తూ మేమిద్దరం నేర్చుకున్నాం. షమీకి మంచి స్పీడ్ ఉంది. దీంతో షమీ శిక్షణపై దృష్టి పెట్టింది కుటుంబం. మా ఇద్దరిలో ఒకరికి మాత్రమే ముందుకు వెళ్లేందుకు అవకాశముంది, షమీ వెళ్లాడు, ఈ రోజు ఫలితం ప్రపంచం ముందుంది"అని అన్నారు హసీబ్.
ఫైనల్ మ్యాచ్‌ని చూడాలని భావించిన హసీబ్, సెమీస్ మ్యాచ్‌కు వెళ్లలేదు.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నామని, అందుకే అహ్మదాబాద్ వెళ్లాలని అనుకున్నామని, అయితే సెమీ-ఫైనల్ చూడనందుకు చింతిస్తున్నామని హసీబ్ చెప్పారు. మైదానంలో ఈ చారిత్రాత్మక ప్రదర్శనను చూడలేకపోయామని తెలిపారు.
'ఎవరితోనూ మాట్లాడడు'
తన కుటుంబంతో మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్లాడు హసీబ్.
''ఈ రోజు ప్రతి భారతీయుడితో సమానంగా షమీ పట్ల గర్వపడుతున్నాం' అని ఆయన అంటున్నారు.
తన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ, షమీ శిక్షణ వదిలిపెట్టలేదు, ఆటపైనే దృష్టి సారించాడు.
"షమీ ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 మధ్య ప్రాక్టీస్ చేస్తాడు. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడడు. ఏం జరిగినా శిక్షణ వదల్లేదు, ఈ నిరంతర కృషే అతని విజయానికి కారణం " అని సోదరుడు హసీబ్ అభిప్రాయపడ్డారు.
''షమీ చాలా సిగ్గరి, అందరితో చాలా తక్కువగా మాట్లాడతాడు. నవ్వుతూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చినా బయటికి రావడం చాలా అరుదు’’ అని హసీబ్ వివరించారు.
షమీ తల్లి అంజుమ్ ఆరాకు క్రికెట్‌పై ఆసక్తి లేదు. కుమారుడి విజయంతో ఆనందంగా ఉన్న ఆమె ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రార్థనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















