ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యం కలిగించే పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?

భారత్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, భారత సారథి రోహిత్ శర్మ
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్-2023 ఆఖరి సమరానికి అంతా సిద్ధమైంది.

20 ఏళ్ల తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు వరల్డ్ కప్ ఫైనల్ పోరులో మరోసారి తలపడనుండటంతో ఈ రెండు దేశాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తి పెరిగిపోయింది.

ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారే ఫైనల్లో తలపడ్డాయి. 2003 ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ట్రోఫీని అందుకుంది.

2003 తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.

నవంబర్ 19 ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరుగనుంది.

ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన 20 ఏళ్ల నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ నేపథ్యంలో 2003 టోర్నీకి, 2023 టోర్నీకి గల పోలికలు, ఆశ్చర్యం కలిగించే అంశాలు, ‘సెంటిమెంట్స్’, నాటికీ నేటికీ మారిన పరిస్థితులు, ఇతర విషయాలను చూద్దాం.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపు

సింపుల్‌గా చెప్పాలంటే 2003 టోర్నీ అంతటా ఆస్ట్రేలియా, 2023 సిరీస్ మొత్తం టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించాయి.

అజేయంగా ఫైనల్‌కు చేరుకున్నాయి.

2003లో రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఫైనల్‌కు చేరుకోగా, భారత్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. అప్పుడు భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ.

ఈసారి ఈ గణాంకాలు రివర్స్ అయ్యాయి. తాజా ఎడిషన్‌లో భారత్ వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గి ఓటమన్నదే లేకుండా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. లీగ్ దశలో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడింది.

ఈ వరల్డ్ కప్ తరహాలో భారత్ ఏ ఐసీసీ టోర్నీలోనూ ఆధిపత్యం ప్రదర్శించలేదు.

2003 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిగ్గజ బ్యాటర్ అయిన రాహుల్ ద్రవిడ్ 2003 వరల్డ్ కప్ టోర్నీలో స్పెషలిస్ట్ కీపర్ స్థానంలో వికెట్ కీపింగ్ చేశాడు.

అప్పుడు రాహుల్ ద్రవిడ్ , ఇప్పుడు కేఎల్ రాహుల్

ఈ రెండు సిరీస్‌లకూ ఉన్న మరో సారూప్యం వికెట్‌ కీపర్ స్థానంలో రాహుల్ పేరున్న క్రికెటర్ ఉండటం.

దిగ్గజ బ్యాటర్ అయిన రాహుల్ ద్రవిడ్ 2003లో స్పెషలిస్ట్ కీపర్ స్థానంలో వికెట్ కీపింగ్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

వికెట్‌కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ద్రవిడ్ మెరిశాడు. 11 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

ఆశ్చర్యకంగా భారత్‌కు ఇప్పుడు మరో రాహుల్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు.

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోలుకుంటున్న రిషభ్ పంత్ జట్టుకు దూరం కావడంతో, వికెట్‌ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది టీం మేనేజ్‌మెంట్.

ఈ సిరీస్‌లో వికెట్ల వెనుక కూడా రాహుల్ ఆకట్టుకున్నాడు. కొన్నిసార్లు అద్భుత డైవింగ్‌తో క్యాచ్‌లు ఒడిసి పడుతున్నాడు. డీఆర్‌ఎస్ ప్రకారం అప్పీలు చేసే విషయంలో తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. బ్యాటింగ్‌లోనూ 10 మ్యాచ్‌ల్లో 386 పరుగులు చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్యా దూరం అయ్యాక వైస్ కెప్టెన్‌గానూ రాహుల్ ఎంపికయ్యాడు.

అప్పుడు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.

రాహుల్ ద్రవిడ్, కేహెల్ రాహుల్ ఇద్దరూ కర్ణాటక నుంచి వచ్చిన ఆటగాళ్లే.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ తెందూల్కర్ రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లీ

అప్పుడు సచిన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ

ఒకప్పుడు వరల్డ్ కప్‌లో సచిన్ తెందూల్కర్ పేరు మార్మోగితే, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు.

2003 వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ ఓవరాల్‌గా 673 పరుగులు చేసి వరల్డ్‌ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

తాజాగా విరాట్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. న్యూజీలాండ్‌తో సెమీఫైనల్లో తన వ్యక్తిగత స్కోరు 80 పరుగుల వద్ద ఈ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు.

ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 711 పరుగులు ఉన్నాయి. 10 ఇన్నింగ్స్‌లలో 101.57 సగటులో కోహ్లీ ఈ పరుగులు సాధించాడు. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నందున కోహ్లీ ఖాతాలో మరిన్ని పరుగులు చేరే అవకాశం ఉంది.

టీమిండియా

ఫొటో సోర్స్, DARRIAN TRAYNOR-ICC/ICC VIA GETTY IMAGES

మూడో టైటిల్ కోసం..

2003 వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా రెండు సార్లు వన్డే క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది.

1987లో రిలయన్స్ వరల్డ్‌కప్, 1999లో ఐసీసీ వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. 2003లో మూడో టైటిల్‌ను దక్కించుకుంది.

ఇలా చూస్తే, ఈ ఫైనల్లో గెలిస్తే భారత్ ఖాతాలో కూడా మూడో వన్డే వరల్డ్ కప్ చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

1983లో కపిల్‌ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారిగా వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. తర్వాత, 2011లో మహేంద్ర సింగ్ నాయకత్వంలో రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను చేజిక్కించుకుంది.

ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మూడో టైటిల్‌‌కు చేరువైంది.

ప్రస్తుతం వరల్డ్ కప్‌లో టీమిండియా గణాంకాలు, విజయాల పరంపరతో పాటు, సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు వీటన్నింటి కలయికతో భారత మూడో టైటిల్ కల నిజం అవుతుందేమో చూడాలి.

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, ANI

ఆధిపత్యం మారింది

2003 వరల్డ్ కప్ జరిగి 20 ఏళ్లు గడిచాయి. ఈ 20 ఏళ్లలో భారత్, ఆస్ట్రేలియా జట్లలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్‌లో కంగారూలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేవారు.

ఈ వరల్డ్ కప్‌లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియాతో పోలిస్తే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఈసారి వరల్డ్ కప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరి కొత్త తరహా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

నవంబరు 15న జరిగిన సెమీఫైనల్లోనూ 2019 వరల్డ్ కప్ రన్నరప్ న్యూజీలాండ్‌ను టీమిండియా 70 పరుగుల తేడాతో ఓడించింది. రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను మూడు వికెట్ల తేడాతో ఓడించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

ఈ వరల్డ్‌ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాను చూస్తే టాప్-5లో ఒక్క ఆస్ట్రేలియన్ కూడా లేడు. అదే సమయంలో భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకున్నారు.

విరాట్ కోహ్లీ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ కాగా, 550 పరుగులతో రోహిత్ శర్మ అయిదో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ 528 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే మొహమ్మద్ షమీ 23 వికెట్లతో అగ్రస్థానంలో, 18 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా అయిదో స్థానంలో ఉన్నారు.

ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా 22 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

వరల్డ్ కప్-2023 సెమీస్ ముగిశాక టాప్-5 స్కోరర్లు

  • విరాట్ కోహ్లీ (భారత్): 711 పరుగులు
  • క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా): 594 పరుగులు
  • రచిన్ రవీంద్ర (న్యూజీలాండ్): 578 పరుగులు
  • డరైల్ మిచెల్ (న్యూజీలాండ్): 552 పరుగులు
  • రోహిత్ శర్మ (భారత్): 550 పరుగులు

వరల్డ్‌ కప్-2023 సెమీస్ ముగిశాక టాప్-5 బౌలర్లు

  • మొహమ్మద్ షమీ (భారత్): 23 వికెట్లు
  • ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా): 22 వికెట్లు
  • మధుషనక (శ్రీలంక): 21 వికెట్లు
  • కోట్జీ (దక్షిణాఫ్రికా): 20 వికెట్లు
  • బుమ్రా (భారత్): 18 వికెట్లు
2003 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనల్స్‌లో ఎదురైన ఫలితం ఏమిటి?

ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు ఏడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడింది. అందులో అయిదుసార్లు విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగే ఫైనల్ కంగారూలకు ఎనిమిదవది. ఏడు ఫైనల్స్‌లో ఆసీస్‌కు ఎదురైన ఫలితం..

  • 1975లో లార్డ్స్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమి
  • 1987లో ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు
  • 1996లో లాహోర్‌లో శ్రీలంక చేతిలో ఓటమి
  • 1999లో లార్డ్స్‌లో పాకిస్తాన్‌పై గెలుపు
  • 2003లో జోహాన్నెస్‌బర్గ్‌లో భారత్‌పై గెలుపు
  • 2007లో బ్రిడ్జ్‌టౌన్‌లో శ్రీలంకపై గెలుపు
  • 2015లో మెల్‌బోర్న్‌లో న్యూజీలాండ్‌పై గెలుపు

భారత్ మూడుసార్లు ఫైనల్స్ ఆడి రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇది భారత్‌కు నాలుగో ఫైనల్. ఆయా ఫైనల్స్‌లో ఇండియాకు ఎదురైన ఫలితం..

  • 1983లో లార్డ్స్‌‌లో వెస్టిండీస్‌పై గెలుపు
  • 2003లో జోహాన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
  • 2011లో ముంబయిలో శ్రీలంకపై గెలుపు
2003 వరల్డ్ కప్ ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2003 వరల్డ్ కప్ పైనల్లో గెలిచిన తర్వాత మైదానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల సంబరాలు

2003 ఫైనల్లో ఏం జరిగింది?

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జోహాన్నెస్‌బర్గ్‌లోని న్యూవాండరర్స్ స్టేడియంలో 2003 ఫైనల్ జరిగింది.

టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో రెండే వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57 పరుగులు, మాథ్యూ హెడెన్ 54 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు సాధించారు.

వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ చెలరేగి ఆడాడు. 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 140 పరుగులు చేశాడు. డామీన్ మార్టిన్ కూడా అజేయంగా 88 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ (2) తప్ప ఎవరూ వికెట్ సాధించలేకపోయారు.

ఆ మ్యాచ్‌లో హర్బజన్, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్, ఆశీష్ నెహ్రాతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ , యువరాజ్ సింగ్, దినేశ్ మోంగియాలను కూడా బౌలింగ్‌కు దింపాడు కెప్టెన్ గంగూలీ.

అనంతరం భారత్ 39.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటై తుదిమెట్టుపై బోల్తా పడింది.

టోర్నీలోనే టాప్ స్కోరర్ అయిన సచిన్, ఫైనల్లో నాలుగు పరుగులకే వెనుదిరిగాడు.

భారత ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ (81 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌. అతడు రనౌట్ అయ్యాడు.

సెహ్వాగ్ తర్వాత టాప్ స్కోరర్‌గా రాహుల్ ద్రవిడ్ (47 పరుగులు) నిలిచాడు.

కెప్టెన్ గంగూలీ (24), యువరాజ్ సింగ్ (24), మొహమ్మద్ కైఫ్(డకౌట్) విఫలమయ్యారు.

మిగతావారు కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మెక్‌గ్రాత్ 3 వికెట్లు పడగొట్టాడు. బ్రెట్ లీ, ఆండ్రూ సైమండ్స్ చెరో 2 వికెట్లు తీశారు. బ్రాడ్ హాగ్, ఆండీ బిచెల్‌ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

రికీ పాంటింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

రోహిత్ శర్మ, పాట్ కమిన్స్

ఫొటో సోర్స్, ANI

ప్రపంచ కప్ ఫైనల్ గెలిచిన జట్టుకు ట్రోఫీతోపాటు పెద్ద మొత్తంలో నగదు బహుమతి లభిస్తుంది.

2023 టోర్నీ విజేతకు 40 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది. భారత కరెన్సీలో ఇది సుమారు 33 కోట్లు.

రన్నరప్‌గా నిలిచే జట్టుకు 20 లక్షల అమెరికా డాలర్లు అంటే రూ.16.5 కోట్లు బహుమతిగా ఇస్తారు.

ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన అంటే సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు (న్యూజీలాండ్, దక్షిణాఫ్రికాలకు) రూ.6.66 కోట్ల చొప్పున ఇచ్చారు.

లీగ్ స్టేజ్‌తోనే ఇంటి ముఖం పట్టిన ఆరు జట్లకు రూ.83 లక్షల చొప్పున అందాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)