భారత జైత్రయాత్ర వెనక రాహుల్ ద్రవిడ్ పాత్ర ఇదీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
2003 వరల్డ్ కప్ ఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు బరిలోకి దిగిన జట్టులో రాహుల్ ద్రవిడ్ వైస్ కెప్టెన్.
రెండు దశాబ్దాల తర్వాత నాడు ఫైనల్‌కు చేరిన ఇండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియాను ఆస్ట్రేలియా భారీ తేడాతో ఓడించడాన్ని కోట్ల మంది భారతీయులు జీర్ణించుకోలేకపోయారు.
2007 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ద్రవిడ్ కెప్టెన్. ప్రపంచ కప్‌పై ఆశలు చిగురించినా, జట్టు తొలి దశలోనే వెనుదిరగడంతో అభిమానులకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది.
20 ఏళ్ల తర్వాత అదే రాహుల్ ద్రవిడ్ మరోసారి భారత జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలిపే కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈసారి మాత్రం భారత జట్టు హెడ్ కోచ్ హోదాలో, అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తుది పోరుకు సిద్ధమవుతోన్న భారత జట్టుకు దిశానిర్దేశం చేస్తున్నాడు.
అయితే, ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? ట్రోఫీ ఎవరికి దక్కుతుందన్న విషయాలు అటుంచితే, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత జట్టును ముందుకు నడిపించడంలో వేసిన తనదైన ముద్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
అయితే, లెజండరీ బ్యాటర్ నుంచి కోచ్‌గా మారిన ద్రవిడ్, జట్టుకు నీడలా ఉంటూనే, అద్భుతమైన ప్రదర్శనలో తన పాత్రను ఎలా పోషిస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం ద్రవిడ్ అద్భుతమైన కెరీర్‌లోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చివరి వరకు పోరాడే తత్వం
రాహుల్ ద్రవిడ్ జట్టులో ఆటగాడిగా ఉన్న రోజుల్లో అతడు చేసిన కృషి, పడ్డ కష్టం అతడికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. అతడు వికెట్ తేలిగ్గా ఇచ్చేవాడు కాదు.
ద్రవిడ్ తన వికెట్‌ను పారేసుకోవడం అనేది చాలా అరుదు. ఆ ప్రతిభే ద్రవిడ్‌ను ‘ద వాల్’ అని, ‘మిస్టర్ డిపెండబుల్’ అని పిలుచుకునేలా చేసింది.
బ్యాటర్‌గా తన సామర్థ్యం ఎలాంటిదో పిచ్‌పై ప్రపంచానికి చూపాడు ద్రవిడ్.
2001 మార్చిలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో దాదాపు ఆస్ట్రేలియాదే విజయం అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్(180 పరుగులు), వీవీఎస్ లక్ష్మణ్(281 పరుగులు)తో కలిసి అత్యధికంగా 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఆ ఫలితాన్నే తిరగరాయడంలో కీలక పాత్ర పోషించాడు.
2004లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 12 గంటలపాటు సుదీర్ఘంగా ఆడిన ఇన్నింగ్స్‌ను, ఆటగాళ్ల మొక్కవోని దీక్ష, పట్టుదలకు ఒక ఉదాహరణగా చెప్తారు.
2011లో ఇంగ్లండ్ టూర్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ ద్రవిడ్ మాత్రం తన చక్కటి ప్రదర్శనతో మెరిశాడు. 4-0 తేడాతో జట్టు ఓటమిని ఎదుర్కొన్నా, ఈ టూర్‌లో 602 పరుగులు సాధించాడు.
అంత సులభంగా ఓటమిని ఒప్పుకోకుండా, చివరి వరకు మైదానంలో పోరాడే ద్రవిడ్ మార్క్, అతడి కోచింగ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
సూక్ష్మంగా పరిశీలిస్తే, ద్రవిడ్‌ను వరించిన హెడ్ కోచ్ పదవి అంత సులభంగా ఏమీ దక్కలేదన్న విషయం అర్థమవుతుంది.
ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఎంత శ్రమించాడో, కోచ్‌గా మారినప్పుడు కూడా అంతే కృషి చేశాడు. విమర్శలను పట్టించుకోకుండా, తన పని మీదే, ‘ప్రాసెస్’ మీదే నమ్మకం పెట్టుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
క్లిష్ట సమయంలో బాధ్యతలు
కోచ్‌గా ద్రవిడ్‌కు విజయాలు శూన్యంలోంచి రాలేదు. సీనియర్ జట్టుకు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను అందించే జాతీయ స్థాయి జట్టుకు దిశా నిర్దేశం చేసే స్థాయి నుంచి కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు ద్రవిడ్.
2016లో అండర్-19, ఏ (జూనియర్స్) జట్లకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. జాతీయ స్థాయిలో ఉంటే వచ్చే గ్లామర్, మెరుపులకు దూరంగా ఉండే పోస్టు ఇది.
కానీ, జట్టును అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకొచ్చి, అందరి దృష్టిని ఆకర్షించాడు ద్రవిడ్.
మూడేళ్ల వరకు జూనియర్ లెవల్‌లో ప్రతిభావంతులను తీర్చిదిద్దిన అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
ఈ అకాడమీ గాయపడిన ఆటగాళ్లు కోలుకోవడానికి లేదా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడానికి సహాయపడే వేదిక.
ద్రవిడ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో భారత జట్టు పరిస్థితి అంత బాలేదు. భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని చాలా కాలమైంది. దానిని 2013లో గెలుచుకుంది.
2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. జట్టులో అలజడి నెలకొని ఉంది.
2021లో భారత జట్టుకు కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. సీనియర్ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మంది జూనియర్ లెవల్‌లో అతడి దగ్గర శిక్షణ తీసుకున్నవారే కాబట్టి, ఇది అతడికి సులభమైన బాధ్యతలాగే కనిపించింది. నిజానికి అది అంత సులభమేమీ కాదు. అప్పటికే వరుసగా కోచ్‌ల మార్పు జరుగుతోంది. దీనికితోడు 2022లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా రాజీనామా చేయడంతో మరిన్ని సమస్యలు తెరపైకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా..
జట్టు కూర్పులో కోచ్‌గా ద్రవిడ్ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నాడు. తను బాధ్యతలు చేపట్టే వరకు నెలకొన్న గందరగోళాన్ని సద్దుమణిగేలా చేసి, పరాజయాల గురించి కుంగిపోవద్దని, ఆటతీరును మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాలని జట్టుకు సూచించాడు.
2023లో జరగబోయే వరల్డ్ కప్ టోర్నీపైనే అతడి దృష్టి ఉంది. భిన్నమైన మేళవింపులతో (కాంబినేషన్లతో) ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ ఫలితాలు విఫలమైనా పట్టించుకోలేదు.
కష్టకాలంలో ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు ద్రవిడ్. కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని విమర్శకులు ఎంతగా ప్రశ్నించినా, అతడు వెనక్కు తగ్గలేదు.
ప్రస్తుత టోర్నీలో కేఎల్ రాహుల్ తన నైపుణ్యాలతో బ్యాటర్‌గానే కాదు, వికెట్ కీపర్‌గా జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.
ఇలాంటి నిర్ణయాలు ద్రవిడ్‌కే సాధ్యం.
దిగ్గజ బ్యాటర్ అయిన ద్రవిడ్, 2003 వరల్డ్ కప్‌లో తుది జట్టులో అదనపు బౌలర్‌ను లేదా బ్యాటర్‌ను తీసుకొనేందుకు వీలుగా వికెట్ కీపింగ్ చేశాడు. అందులోనూ రాణించాడు.
శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వడాన్ని కూడా చాలా మంది ప్రశ్నించారు. కానీ భారత్‌కు నంబర్ 4 స్థానంలో ఆడిన అత్యుత్తమ బ్యాటర్లలో శ్రేయస్ ఒకడిగా నిలిచాడు.
బౌలర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు ద్రవిడ్.
జట్టులోని పేసర్ల స్క్వాడ్‌లో మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీల త్రయం ఇప్పుడు కీలకంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
సరైన సమయానికి సరైన కాంబినేషన్
అతిపెద్ద టోర్నీ అయిన ప్రపంచ కప్‌కు ముందు విభిన్నమైన మేళవింపులను ద్రవిడ్ ప్రయత్నించి చూశాడు. ఆ ఫలితాల ఆధారంగా, సరైన కాంబినేషన్‌తో సరైన సమయానికి జట్టును తీర్చిదిద్దాడు.
అదే సమయంలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో విశ్వసనీయ బంధం ఏర్పడింది. రోహిత్ ఈ టోర్నమెంట్లో నిస్వార్థ బ్యాటింగ్‌తోపాటు వ్యూహాత్మకమైన నిర్ణయాలతో అద్భుతంగా రాణిస్తున్నాడు.
ప్రపంచ కప్‌కు ముందు, ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత జట్టు, టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక జట్లను భారీ తేడాతో ఓడించింది. ఇది రాహుల్ ద్రవిడ్ జట్టును సరైన దిశలో నడిపించిన తీరుకు అద్దం పడుతుంది.
2023లో ప్రపంచ విజేతగా నిలవడానికి భారత్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. దిగ్గజ ప్లేయర్‌గా తాను సాకారం చేసుకోలేకపోయిన కలను కోచ్‌గా నెరవేర్చుకోవడానికి ద్రవిడ్ కూడా ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు.
ట్రోఫీని అందుకోవాలన్న ఆతృతతోనే ఉండి ఉంటాడు. కానీ, మ్యాచ్ ముందు గానీ, మ్యాచ్ అయిపోయిన తర్వాత గానీ ద్రవిడ్ స్పందనలో ఊహించినంత స్థాయిలో ఆతృత ఏమీ కనిపించదు.
అదే ‘వింటేజ్’ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకత. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోవడమే అతడి స్టైల్.
ఇవి కూడా చదవండి..
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














