రాణీ కి వావ్: ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ ఈ బావి దగ్గర ఫోటో ఎందుకు దిగారు? దీని కథేంటి?

రోహిత్ శర్మ, పాట్ కమిన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్రికెట్ ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు ప్రపంచ కప్‌ ట్రోఫీతో దిగిన ఫోటో ఆసక్తికరంగా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మధ్యలో ప్రపంచ కప్.. వెనక ఎత్తుగా మెట్లు, పక్కన పురాతన రాతి స్తంభాలు, భారీ ప్రాకారాలు, వెనక మండపం లాంటి నిర్మాణాలు కనిపిస్తుండడంతో ఆ ఫోటో ఎక్కడిదనే ఆసక్తి మరింత పెరిగింది.

అది ఒక పురాతన మెట్ల బావి. దాని పేరు రాణీ కి వావ్, అంటే రాణి గారి బావి అని అర్థం.

రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ | మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, Getty Images

'రాణి గారి బావి'

గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో ఈ బావి ఉంది. హిందువులు పవిత్ర నదులుగా భావించే సప్తనదుల్లో ఒకటైన సరస్వతీ నది ఒడ్డున ఇది ఉంది.

నది ఒడ్డున ఉండడంతో వరదల కారణంగా ఈ బావి కూడిపోయినట్లు చెబుతారు.

మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, patan.nic.in

ఈ బావిని భారత పురావస్తు శాఖ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) గుర్తించి, 1958లో తవ్వకాలు చేపట్టింది.

1982లో బావి పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. 1988 నాటికి ఆ పనులు పూర్తయ్యాయని వార్తా సంస్థ ది హిందూ తెలిపింది.

దాదాపు ఏడంతస్తుల లోతు, భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ బావి ఒక్కో అంతస్తులో రాతి మండపాలు, ప్రాకారాలు, స్తంభాలపై వెయ్యి వరకూ చిన్నా, పెద్ద శిల్పాలు చెక్కి ఉన్నాయి.

ఈ అద్భుత కట్టడానికి 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుదక్కింది.

మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, patan.nic.in

ఎవరు నిర్మించారు?

క్రీస్తు శకం 1063 నుంచి 1068 మధ్య కాలంలో మారు-గుర్జారా నిర్మాణ శైలిలో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు యునెస్కో తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

దాదాపు ఆరు వందల ఏళ్లు గుజరాత్ రాజధానిగా వెలుగొందిన పాటన్ (గతంలో అన్హిల్‌పూర్‌గా పిలిచేవారు)‌లో ప్రజల నీటి అవసరాల కోసం ఈ బావిని ఏర్పాటు చేశారు.

మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, @Archaeological Survey of India

తూర్పు నుంచి పడమరకు 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 28 మీటర్ల లోతు ఉంది.

భారత్‌లోని అద్భుత కట్టడాల్లో ఇది కూడా ఒకటి.

క్రీస్తు శకం 1022 నుంచి 1063 వరకూ పాలించిన సోలంకి రాజవంశానికి చెందిన రాజు ఒకటో భీమ్‌దేవ్‌కి గుర్తుగా ఆయన భార్య, రాణి ఉదయమతి దాదాపు 950 ఏళ్ల కిందట ఈ బావిని నిర్మించారు.

అందువల్ల ఈ బావికి ‘రాణీ కి వావ్’ అని పేరొచ్చినట్లు చెబుతారు.

మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, @Ko Hon Chiu Vincent

అద్భుత శిల్ప సంపద

ఒకప్పుడు భారత ఉపఖండంలో బావులే ప్రధాన నీటి వనరులుగా ఉండేవి. క్రీస్తు పూర్తం 3వ శతాబ్దం నుంచి బావులను నిర్మించినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారీ లోతుల నుంచి నీళ్లు తీసుకోవడానికి వీలుగా ఆనాటి రాజులు నిర్మించిన ఈ బహుళ అంతస్తుల బావులు కాలక్రమేణా కళలు, వాస్తుశిల్పాలకు నెలవుగా మారాయి.

మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, patan.nic.in

గుజరాత్‌లో ఇలాంటి పురాతన బావులు చారిత్రక, పర్యాటక ప్రదేశాలుగా మారాయి. గాంధీనగర్‌కి సమీపంలోని అడాలజ్ మెట్లబావి, అహ్మదాబాద్‌లోని దాదా హరీర్ మెట్లబావి, రాజ్‌కోట్‌లోని వాంకనేర్ ప్యాలెస్ మెట్లబావి, జునాగఢ్‌లోని ఆది కడీ మెట్లబావి, భుజ్‌లోని రామ్‌కుండ్ మెట్లబావి ఈ కోవకు చెందినవే.

పాటన్‌లోని రాణి కి వావ్ (రాణి గారి బావి)ను ఏడు అంతస్తుల మాదిరిగా మెట్లతో అద్భుతంగా నిర్మించారు. సుమారు వేయి శిల్పాలను చెక్కించారు. వాటితో హిందూ దేవతల విగ్రహాలతో పాటు మరెన్నో శిల్పాలు ఉన్నట్లు హిందూ పత్రిక పేర్కొంది.

మెట్ల బావి | Rani Ki Vav

ఫొటో సోర్స్, @ Archaeological Survey of India

హిందూ పురాణాల్లోని విష్ణువు దశావతారాలు, శివుడు, గణేశుడు, లక్ష్మీదేవి, పార్వతి, దుర్గా దేవి, బ్రహ్మ, కుబేర, భైరవ, అష్టదిక్పాలకులు, సాధువులు, అప్సరసలు, యోగినిల శిల్పాలు వాటిలో ఉన్నాయి.

అత్యవసర సమయాల్లో రాజు పాటన్ పట్టణం నుంచి సిధ్‌పూర్ చేరుకునేందుకు ఈ మెట్ల బావి చివరి మెట్టు వద్ద ఉన్న ఒక చిన్న గుహలో నుంచి దాదాపు 30 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందని చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)