రోహిత్ శర్మ జర్నీ: 275 రూపాయల స్కాలర్‌షిప్ నుంచి ప్రపంచ కప్ దాకా..

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో తన కలను నెరవేర్చుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో చివరి మ్యాచ్ అని అన్నాడు.
"ఇది నా చివరి మ్యాచ్ కూడా. ఇందులో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భారత్ ప్రపంచకప్ గెలిచింది. నేను సాధించాలనుకున్నది ఇదే" అని ‘హిట్ మ్యాన్’ రోహిత్ చెప్పాడు.
రోహిత్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కొన్ని అరుదైన విషయాలను చూద్దాం.


ఫొటో సోర్స్, ROHITSHARMA45/INSTAGRAM
బాల్యంలో ఎన్నో కష్టాలు..
భారత జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ బాల్యంలో ఆర్థిక కష్టాల కారణంగా క్రికెట్‌కే దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్న సంగతి తెలుసా?
1999లో ఇండియన్ క్రికెట్ టీమ్ మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ ఆడుతోంది.
ఆ సమయంలో ముంబయి శివార్లలోని బొరివాలీలో 12 ఏళ్ళ వయసున్న రోహిత్ శర్మను క్రికెట్ క్యాంప్‌కు పంపేందుకు ఆయన తండ్రి, కుటుంబ సభ్యులు చందాలు పోగు చేస్తున్నారు.
రోహిత్ శర్మ తండ్రి ఓ రవాణా సంస్థకు చెందిన గిడ్డంగిలో పనిచేసేవారు. ఆయన ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది. ఆ రోజులలో రోహిత్‌శర్మ తన తాత, మామ రవిశర్మలతో కలిసి ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం.
అదే ఏడాది రోహిత్ బోరివాలిలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుతో ఓ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ రోహిత్ వివేకానంద స్కూల్‌లో చేరేందుకు, ఆపైన స్కాలర్‌షిప్ పొందేందుకు అవకాశం ఇచ్చింది.
ఆ మ్యాచ్‌లో రోహిత్ ప్రతిభను వివేకానంద స్కూల్ కోచ్ రమేష్ లాడ్ గుర్తించారు. ఆయనే రోహిత్ చెల్లించాల్సిన ఫీజును స్కాలర్‌షిప్‌గా మార్చాలని పాఠశాల నిర్వాహకుడు యోగేశ్ పటేల్‌కు సిఫార్సు చేశారు. అది రోహిత్ జీవితాన్ని మలుపు తిప్పింది.

ఫొటో సోర్స్, YOGESH PATEL
‘మా కోచ్ చెప్పిందే నిజమైంది’
అప్పటి సంగతులను యోగేష్ పటేల్ కొన్ని నెలల కిందట గుర్తు చేసుకున్నారు.
‘‘రోహిత్‌లోని క్రికెట్ ప్రతిభను మా కోచ్ గుర్తించారు. అతని కుటుంబం 275 రూపాయల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉందని, ఆ మొత్తాన్ని రోహిత్‌కు స్కాలర్‌షిప్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజున స్కాలర్‌షిప్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం.. రోహిత్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని పటేల్ చెప్పారు.
గతంలో రోహిత్ శర్మ కూడా ఇదే విషయాన్ని ESPNCRICKINFO.COMకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.
‘‘నన్ను వివేకానంద స్కూల్లో చేరి క్రికెట్ ఆడమని కోచ్ చెప్పారు. కానీ, నా దగ్గర డబ్బులు లేవు. దాంతో, ఆయన నాకు స్కాలర్‌షిప్ వచ్చేలా చేశారు. నాకు అటు ఆడుకోవడానికి, ఇటు చదువుకోవడానికి నాలుగేళ్ళపాటు ఓ అవకాశం ఉచితంగా దక్కింది’’ అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.
ఈ స్కూల్లో చేరిన కొద్ది నెలలకే రోహిత్ శర్మ అజేయంగా 140 పరుగులు చేశాడు. అప్పట్లో స్కూళ్ళలోనూ, గ్రౌండ్స్‌లోనూ రోహిత్ చేసిన పరుగుల గురించే చర్చ జరిగేది.

ఫొటో సోర్స్, Getty Images
ముంబయిలోని శివాజీ పార్కులోనే సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే తదితరులు క్రికెట్ నేర్చుకుంటూ పెరిగారు.
ఈ మైదానంలో డజన్ల కొద్దీ నెట్ ప్రాక్టీస్‌లు జరుగుతుంటాయి.
వీటిల్లో ఒకటి అశోక్ శివాల్కర్‌ది. ఈయన కూడా రోహిత్ సమయంలోనే క్రికెట్ ప్రాక్టీస్ చేసేవారు.
‘‘రోహిత్‌శర్మ తన స్కూలు తరపున ఆఫ్‌స్పిన్నర్‌గా బరిలోకి దిగడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ కోచ్ రోహిత్‌లోని బ్యాటింగ్ ప్రతిభను గుర్తించారు’’ అని అశోక్ శివాల్కర్ చెప్పారు.
‘‘దీని తరువాత ముంబయిలో ప్రసిద్ధి చెందిన కంగా లీగ్ క్రికెట్‌లోనూ, ముంబయి క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్లలోనూ తన మార్కును చూపెట్టడం మొదలుపెట్టాడు’’ అని శివాల్కర్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వివేకానంద స్కూల్ యజమాని యోగేష్ పటేల్ ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు. ‘‘కోవిడ్ – 19 సమయంలో రోహిత్ నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నానో కనుక్కున్నారు. నేను అందరికీ సాయం చేస్తుండమని రోహిత్‌కు చెప్పాను. రోహిత్‌ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’’ అని పటేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images















