లింగ మార్పిడి చికిత్సను విదేశాల్లో చేయించుకున్న వారికి కొత్త పాస్‌పోర్టులు... ఈ కొత్త పాలసీ ఎలా ఉండబోతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విదేశాలకు వెళ్లి, లింగ మార్పిడి చేసుకునే వారికి కొత్త పాస్‌పోర్టులను జారీచేసేందుకు కొత్త పాలసీని రూపొందించాల్సి ఉందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

విదేశాలకు వెళ్లి, లింగ మార్పిడి చేసుకునే వ్యక్తులకు సర్జరీ తర్వాత బయోమెట్రిక్స్ మారవని, కానీ వారి గుర్తింపును ధ్రువీకరించేందుకు అవసరమయ్యే సరికొత్త విధానం రూపకల్పనకు తమకు సమయం అవసరమని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్(బీఓఐ) తమకు ఈ సలహా ఇచ్చినట్లు కోర్టుకు తెలిపింది.

ఈ విధానంలో కొత్త పాస్‌పోర్టులు జారీ చేసే ముందు వారి గుర్తింపును తనిఖీ చేసే నిబంధన ఉండాలని సూచించింది.

అసలేంటి విషయం?

ఈ విషయంపై ట్రాన్స్‌జెండర్ మహిళ దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌లో మారిన పేరు, లింగ మార్పిడి, ఫోటో ఆధారితంగా తనకు మళ్లీ పాస్‌పోర్ట్ జారీ చేయాలని అభ్యర్థించారు.

కోర్టుకు ఇచ్చిన సమాచారంలో, పుట్టిన ఆధారంగా తన గుర్తింపును పురుషుడిగా చెప్పారు.

బార్ అండ్ బెంచ్‌లో ప్రచురితమైన సమాచారంలో, భారత్‌లో చదువుకున్న తర్వాత ఉపాధి కోసం ఆమె అమెరికా వెళ్లారు.

ఆ తర్వాత 2016 నుంచి 2022 మధ్యలో తాను లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు.

చట్టబద్ధంగా పేరు, లింగం మారిన తర్వాత డాక్యుమెంట్లలో తనకు కొత్త గుర్తింపును ఇవ్వాలని అమెరికాలోని ఒక కోర్టును ఆశ్రయించారు ఈ ట్రాన్స్‌జెండర్ మహిళ.

బార్ అండ్ బెంచ్ వద్దనున్న సమాచారం మేరకు, డాక్యుమెంట్లలో ఈ మార్పులు చేసేందుకు అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది.

మారిన పేరు, రూపురేఖలను బట్టి ఆమెకు అమెరికాలో కొత్త డాక్యుమెంట్లు ఇచ్చారు. కానీ, పాస్‌పోర్టులో ఆమె గుర్తింపు ఇంకా పురుషుడిగానే ఉంది.

‘‘పేరు, లింగం, రూపురేఖలో మార్పులు ఉండటంతో ఈ ట్రాన్స్‌జెండర్ మహిళ తిరిగి పాస్‌పోర్టు పొందడంలో కష్టతరమవుతుంది. ఈ ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు’’ అని దిల్లీ హైకోర్టు న్యాయవాది అరుంధతి కట్జు చెప్పారు.

‘‘ఈ కేసు సందర్భంగా ఒకవేళ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు విదేశాలకు వెళ్లి, లింగ మార్పిడి చికిత్స చేయించుకుంటే వారి మారిన పేరు, లింగం ఆధారంగా పాస్‌పోర్టులు జారీ చేయడంలో ఏమైనా సమస్య ఉందా? అని సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు అడిగింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది? అని కోర్టు ప్రశ్నించింది’’ అని అరుంధతి కట్జు తెలిపారు.

ఈ విషయంలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోమ్ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ, సాధికారిత శాఖలను భాగం చేసింది దిల్లీ హైకోర్టు.

ట్రాన్స్‌జెండర్ మహిళలు

ఫొటో సోర్స్, GETTYIMAGES/HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, ట్రాన్స్‌జెండర్ మహిళలు

కోర్టులో ఏం జరిగింది?

ఈ విషయం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు, లింగ మార్పిడి వైద్య చికిత్సలు చేయించుకున్న తర్వాత బయోమెట్రిక్స్‌లో ఎలాంటి మార్పులుండవని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అందువల్ల, దీనికి కొత్త విధానాన్ని రూపొందించాలని చెప్పింది.

భారతీయ పౌరుల బయోమెట్రిక్స్ అన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపింది. కొత్త పాస్‌పోర్టు జారీ చేసే ముందు, వారి గుర్తింపును ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనతో తాము కూడా అంగీకరిస్తున్నట్లు హోమ్ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఒకవేళ ఎవరైనా వ్యక్తులు విదేశాలకు వెళ్లి లింగ మార్పిడి చికిత్స చేయించుకుంటే, సర్జరీ తర్వాత పేరు, లింగం(జెండర్), వారి రూపురేఖలు మారిపోతాయి.

పాత పాస్‌పోర్టులో ఉన్న సమాచారంతో ఇది సరితూగదు. ఆ సమయంలో ఆ వ్యక్తి మళ్లీ పాస్‌పోర్టును దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మళ్లీ మొత్తం ప్రక్రియను చేపట్టాలి. జెండర్, మారిన పేరు, రూపురేఖలకు అనుగుణంగా వారు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

ఆ తర్వాత వారికి కొత్త పాస్‌పోర్టు జారీ చేస్తారు.

పూర్తి డాక్యుమెంట్లను ఆ వ్యక్తి సమర్పించాలి. అలాగే, పోలీసు రిపోర్టు రశీదు దాఖలు చేయాలి.

పాస్‌పోర్టు కోసం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అప్లికేషన్‌ పెట్టుకోవాలి.

పేరు, ఊరు, పుట్టిన తేదీ, చేసే పని వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో సహా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫామ్‌ను సమర్పించాలి.

ఒకవేళ పేరులో మార్పు ఉంటే, మళ్లీ మొత్తం ప్రక్రియను మొదట్నుంచి చేపట్టాలి. అఫిడవిట్ చేయించుకుని, దాన్ని పాస్‌పోర్టు ఆఫీసులో ఇవ్వాలి.

కోర్టుకు వెళ్లిన ఈ ట్రాన్స్‌జెండర్ మహిళ కేసులో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమెకు పాస్‌పోర్టు దాఖలు చేసింది.

ట్రాన్స్‌జెండర్ల విషయంలో వివక్ష చూపించకూడదని చట్టం స్పష్టంగా చెబుతోందని న్యాయవాది అరుంధతి కట్జు తెలిపారు.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై వివక్ష చూపించకూడదని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై వివక్ష చూపించకూడదని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం

ట్రాన్స్‌జెండర్ మహిళల హక్కులు

మ‌న దేశంలోని ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పిస్తూ వారిని సాధార‌ణ స్రవంతిలో మ‌మేకం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం ది ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లు, 2019 చ‌ట్టాన్ని 2019లో తీసుకొచ్చింది.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ఈ బిల్లులో చాలా నిబంధనలను రూపొందించారు.

ఈ చ‌ట్టం ప్ర‌కారం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌త్యేక హ‌క్కులు, ప్రోత్సాహ‌కాల‌ను ప్రభుత్వం క‌ల్పించింది. వారికి స‌మాన విద్య‌, ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంది.

  • ప్రెస్ ఇన్‌ఫర్మరేషన్ బ్యూరో ప్రచురించిన సమాచారంలో, విద్యా సంస్థలలో, ఉపాధిలో, వైద్య సేవలలో ఎక్కడా కూడా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై వివక్ష చూపకూడదు.
  • ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించాలి.
  • వారి జెండర్‌ను గుర్తించే హక్కును వారికి కల్పించాలి.
  • ఏ జెండర్ లేదా సెక్స్‌ను వారు కోరుకుంటున్నారో ఆ గుర్తింపును కల్పించే హక్కును ఇవ్వాలి.
  • తల్లిదండ్రులతో, సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి జీవించే నిబంధనను రూపొందించాలి.
  • విద్య, సామాజిక భద్రతా, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ఆరోగ్యం కోసం సంక్షేమ పథకాలలో కేటాయింపులు చేయాలి.
  • ట్రాన్స్‌జెండర్ హక్కులను సంరక్షించేందుకు కౌన్సిలింగ్, మానిటరింగ్ వంటి వాటి కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు నేషనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి.

ఈ ట్రాన్స్‌జెండర్ మహిళకు కొత్త పాస్‌పోర్టు వచ్చినప్పటికీ, ఈ కేసు కోర్టు వరకు వెళ్లింది.

లింగ మార్పిడి చికిత్స చేసుకున్న వ్యక్తులు కొత్త పాస్‌పోర్టు పొందడంతో పాటు, వారి గుర్తింపును ధ్రువీకరించేందుకు సరికొత్త పాలసీతో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ కేసు తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 19కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)