పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి ఉండాలా... లేక వేరుగా ఉండడమే మంచిదా?

ఫొటో సోర్స్, Getty Images
ఒక తల్లి తన ఇద్దరు కుమారులను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఎంతకీ కదలట్లేదంటూ కోర్టుకు వెళ్ళారు. ఆమె వయసు 75 ఏళ్ళు.
ఇటీవల, ఇటలీలోని పావియా నగరంలో ఈ ఘటన జరిగింది. తన ఇంటి నుంచి ఇద్దరు కుమారుల్ని బయటకు పంపాలంటూ 75 ఏళ్ల వృద్ధురాలు కోర్టును ఆశ్రయించారు.
వృద్దురాలి పెద్ద కుమారుని వయస్సు 42 ఏళ్లు. చిన్న కుమారుని వయస్సు 40 ఏళ్లు.
విడివిడిగా జీవించాలని తన కుమారులను పలుమార్లు కోరినప్పటికీ వారు వినడం లేదని కోర్టుకు ఆ మహిళ తెలిపారు.
డిసెంబర్ 18లోగా ఇల్లు ఖాళీ చేయాలని ఆమె కుమారులిద్దరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కాబట్టి మొదట్లో కుమారులు, తల్లిదండ్రుల వద్ద ఉండొచ్చని, ఇప్పుడు వారి వయస్సు 40 ఏళ్లు దాటినందున ఆ నియమం వర్తించదని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
యుక్తవయస్సు రాగానే పిల్లలు, తల్లిదండ్రుల ఇంటిని వదిలి వెళ్లాలని భావించే దేశాల్లో ఈ తీర్పు కొత్త చర్చకు దారి తీసింది.
పిల్లలు ఏ వయస్సులో తల్లిదండ్రుల నుంచి విడిగా జీవించడం ప్రారంభించాలి? వయస్సు ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలా? లేదా ఆర్థిక పరిస్థితిని బట్టి తీసుకోవాలా అనే చర్చ జరుగుతోంది.
నిజానికి, భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఒకే ఇంటిలో అనేక తరాలు నివసించడం సర్వసాధారణం.
కానీ, కొన్ని దేశాల్లో పెద్దయ్యాక లేదా ఆర్థికంగా స్వతంత్రంగా మారినప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి విడిగా జీవించాలని భావిస్తున్నారు.
ఇలా చేయలేని వారిపై సామాజిక ఒత్తిడి ఉంటుంది. అలాగే వారు అవహేళనలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉదాహరణకు, ఇటలీలో తల్లిదండ్రుల ఇంట్లో నివసించే పెద్దవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇలా పెద్దయ్యాక కూడా తల్లిదండ్రుల ఇంట్లో నివసించే వారిని అక్కడ బంబోచియోనీ (పెద్ద పిల్లలు) అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటారని బీబీసీ సౌండ్ పాడ్‌కాస్ట్ ‘విమెన్స్ అవర్’ ప్రజెంటర్ కృపా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రుల నుంచి వేరుగా జీవించే సంప్రదాయం
పాశ్చాత్య సంస్కృతిలో ఆత్మనిర్భరత, స్వాతంత్ర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తారని సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్నేహ అన్నారు.
పిల్లల్లో కూడా అదే ఆలోచనాధోరణి ఉంటుందని బీబీసీతో మాట్లాడుతూ ఆమె చెప్పారు.
"పిల్లలు తమంతట తాముగా ఎదిగేందుకు పశ్చిమ దేశాల్లో యుక్త వయస్సు రాగానే పిల్లల్ని వేరుగా ఉంచుతారు.
వారి పనులను వారే చేసుకునే సామర్థ్యం పిల్లలకు వచ్చిందని అక్కడివారు నమ్ముతారు. పిల్లలు కూడా పెద్దయ్యాక తమ జీవితాల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు" అని వివరించారు.
ఆర్థిక కారణాలతోనే ఇటలీలో చాలామంది పెద్దయ్యాక కూడా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తారని పాడ్‌కాస్ట్ ‘విమెన్స్ అవర్’లో ఇటలీకి చెందిన బీబీసీ ప్రతినిధి అడ్రియానా అర్బానో తెలిపారు.
తన తోటి వయస్సున్న వారిలో చాలామంది తల్లిదండ్రుల ఇంట్లోనే నివసిస్తున్నారని 29 ఏళ్ల అర్బానో చెప్పారు.
“ఇటలీలో పిల్లలు పెద్దయ్యాక కూడా చాలాకాలం పాటు తమ తల్లిదండ్రులతో జీవించడం మామూలే. దీని వెనుక సాంస్కృతిక కారణాల కంటే ఆర్థిక కారణాలే ఎక్కువ. మంచి జీతాలతో పర్మినెంట్ ఉద్యోగాలు పొందడం అంత సులభం కాదు. అందుకే ఆర్థికంగా నిలదొక్కుకునేవరకు తల్లిదండ్రులతోనే ఉంటారు’’ అని అర్బానో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పెద్దలు తల్లిదండ్రులతో ఎందుకు నివసిస్తున్నారు?
భారత్‌లో అనేక తరాలు ఒకే ఇంట్లో కలిసి జీవించడానికి ఆర్థిక కారణాలే కాదు, కొన్ని సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయని డాక్టర్ స్నేహ అన్నారు.
“భారతీయ సంస్కృతిలో ఉమ్మడి కుటుంబం అనే భావన ఒక భాగం. ఉమ్మడి కుటుంబంలో అనేక తరాలు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తాయి. ఇలాంటి కుటుంబాల్లో సభ్యులందరికీ ఆర్థిక, సామాజిక, మానసిక భద్రత లభిస్తుంది. పిల్లలను కుటుంబంలోని పెద్దలు చూసుకుంటారు. వయస్సు పైబడిన తల్లిదండ్రుల్ని వారి పిల్లలు చూసుకుంటారు’’ అని చెప్పారు.
పెద్దయ్యాక కూడా తల్లిదండ్రులతో కలిసి జీవించేందుకు అనేక కారణాలు ఉన్నాయని ప్రొఫెసర్ స్నేహ చెప్పారు.
ఉదాహరణకు, పెళ్లి తర్వాత వధువు సాధారణంగా తన అత్తమామలతో కలిసి జీవించడానికి వెళ్తుంది. పూర్వీకుల ఇల్లు, ఆస్తి కారణంగా కూడా ప్రజలు కలిసి జీవిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రులను పీడించడం
భారత్‌లో చట్టప్రకారం పెద్దయ్యేవరకు పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం ఉందని బీబీసీతో దిల్లీ హైకోర్ట్ న్యాయవాది ప్రణబ్ ఘబ్రూ అన్నారు.
"సామాజిక నిబంధనలు వేరుగా ఉండొచ్చు. కానీ, యుక్తవయస్సు వచ్చే వరకు పోషించమని తల్లిదండ్రులను పిల్లలు అడగవచ్చని చట్టం చెబుతోంది’’ అని ప్రణబ్ చెప్పారు.
ఇటలీలో ఒక వృద్ధురాలు తన కుమారుల బాధ్యతను ఇక మోయలేక కోర్టును ఆశ్రయించారు.
ఆమె కుమారులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇంటి ఖర్చులు, ఇతర పనుల్లో ఆమెకు సహాయపడలేదని జర్నలిస్ట్ అడ్రియానా అర్బానో చెప్పారు.
‘‘వారిద్దరూ ఆ తల్లికి భారంగా ఉన్నారు. తల్లిని లెక్కచేయకుండా ఆమెను సేవకురాలిగా వాడుకునే అంశం ఇది’’ అని అర్బానో అన్నారు.
తల్లిదండ్రుల పట్ల ఇలా ప్రవర్తించే కేసులు భారత్‌లో కూడా పెరుగుతున్నాయి. తమ పిల్లల దోపిడీతో విసిగిపోయిన చాలా మంది తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేస్తున్నారని న్యాయవాది ప్రణవ్ ఘబ్రూ చెప్పారు.
వృద్ధాప్యంతో నిస్సహాయతలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, తల్లిదండ్రుల ఆస్తిని కాజేసి వారిని పట్టించుకోకపోవడం వంటి కేసులు తమ దృష్టికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
అలాంటి పరిస్థితి తలెత్తితే, తల్లిదండ్రులు తమ ఇంటి నుంచి వారి పిల్లలను బయటకు పంపవచ్చు. లేదా వారి నుంచి భరణం వసూలు చేసేందుకు పిటిషన్ దాఖలు చేయవచ్చని న్యాయవాది ప్రణవ్ వివరించారు.
ఇందుకోసం సీఆర్పీసీ సెక్షన్ 125, మెయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరేంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వంటి చట్టాల సహాయం తీసుకోవచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి?
ఏ సమాజంలోనైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లమని కోరడం అసాధారణ చర్యగా పరిగణిస్తారు. అందుకే, ఇటలీ ఘటనపై ఎక్కువగా చర్చ జరిగింది.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని బేషరతుగా ఎల్లవేళలా ప్రేమించాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సమాజం ఆశిస్తుందని లక్నోకు చెందిన సైకాలజిస్ట్ రాజేష్ పాండే అన్నారు.
భారత్‌లో ప్రజల జీవితాలపై సామాజిక ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ స్నేహ చెప్పారు.
‘‘ఇక్కడ ప్రతికూలత ఏంటంటే, పెద్దవారయ్యాక కూడా పిల్లలు, తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తిని సాధించలేరు. పిల్లలకు పెళ్లి చేశాక కూడా తల్లిదండ్రులు వారి పింఛన్ డబ్బును పిల్లల కోసమే వాడటం కనిపిస్తుంది’’ అని స్నేహ తెలిపారు.
పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి జీవించాలా? లేదా? అనేది వారి ఆర్థిక, సాంస్కృతిక స్థితితో పాటు వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
‘‘పరస్పర అవసరాలు, అంచనాలను అర్థం చేసుకున్న తర్వాతే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలి’’ అని డాక్టర్ స్నేహ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- షరాన్ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’
- కేసీఆర్, రేవంత్, ఈటల: రెండు నియోజకవర్గాలలో పోటీ...చరిత్ర ఏం చెప్తోంది?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- బంగ్లాదేశ్ చరిత్రలో రక్తపు మరకలు...ఆ వారం రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














