ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ వ్యూహం అదేనా?

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్‌ను ఫ్యాన్స్ ‘హిట్‌ మ్యాన్’ అని పిలుచుకుంటారు
    • రచయిత, భాను ప్రకాశ్ కర్నాటి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“అంతా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమీల పర్‌ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారు. కానీ, భారత జట్టు అప్రోచ్‌ను మార్చి, అందరినీ ఒప్పించి, ఈ విజయాన్ని అందుకోవడంలో కీలకంగా మారింది రోహిత్ శర్మ. అతనే నిజమైన హీరో” - సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇండియా భారీ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన సందర్భంలో వ్యాఖ్యాత, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నజీర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

నవంబరు 15న ముంబయిలో జరిగిన ఈ సెమీఫైనల్లో భారత కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్ శర్మ, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి, జట్టు భారీ స్కోరు(397)కు బలమైన పునాది వేయడాన్ని అభినందిస్తూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ ఆటలో ఇలాంటి దూకుడు ఎప్పట్నుంచో ఉన్నదే.

అయితే కెప్టెన్‌గా ఈ దూకుడుకు సమయోచిత ఆటతీరును మేళవించి ప్రపంచ కప్ టోర్నీలో మంచి విజయాలు రాబట్టాడు రోహిత్.

ఈ ప్రపంచ కప్‌లో వరుసగా 10 విజయాలతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆటగాళ్ల సమష్టి కృషితోపాటు, ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

గ్రౌండ్‌లోకి దిగక ముందు, కెప్టెన్, కోచ్ సహా టీం మేనేజ్‌మెంట్ ఎన్ని వ్యూహాలు వేసినా, వాటిని అమలు చేయాల్సింది, పరిస్థితులకు తగినట్లుగా స్పాంటేనియస్‌గా నిర్ణయాలు తీసుకోవాల్సింది కెప్టెనే అన్నది తెలిసిన విషయమే.

భారత జైత్రయాత్ర వెనుక రోహిత్ నాయకత్వ లక్షణాలు, సమయ స్ఫూర్తితో కూడిన వ్యూహ చతురత కీలకంగా నిలుస్తున్నాయి.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటింగ్‌ వ్యూహం అదే

సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అంత దూకుడుగా ఆడిన రోహిత్, అంతకుముందు అక్టోబరు 29న లఖ్‌నవూలో ఇంగ్లండ్‌తో లీగ్ మ్యాచ్‌లో 27 పరుగులకే శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీల రూపంలో రెండు వికెట్లు, 40 పరుగులకే శ్రేయస్ అయ్యర్ రూపంలో మూడో వికెట్‌‌ను కోల్పోయిన పరిస్థితుల్లో పూర్తి భిన్నంగా తన ఇన్నింగ్స్ సాగించాడు.

జట్టు అవసరాలకు, పిచ్ స్వభావానికి తగినట్టు వెంటనే తన ఆటను మార్చేసుకుని, 101 బంతుల్లో 87 పరుగులు సాధించి, జట్టు విజయానికి బాటలు వేశాడు.

ఇదే తరహా వ్యూహం జట్టు బ్యాటింగ్ తీరులో స్పష్టంగా కనిపిస్తోంది.

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బలమైన పునాది వేయడం, వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు ఇరుసుగా మారి, సాధ్యమైనంత సుదీర్ఘంగా బ్యాటింగ్ కొనసాగించడం, ఒకవేళ త్వరత్వరగా వికెట్లు కోల్పోతే, అప్పటికే నిలదొక్కుకున్న బ్యాటర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడం… చాలా మ్యాచుల్లో కనిపించింది.

ఇప్పటివరకు సెమీఫైనల్ మ్యాచ్ కలుపుకొని 10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్, 550 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు.

రోహిత్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. కానీ తరువాతి రెండు మ్యాచ్‌లలో చెలరేగి ఆడాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

దిల్లీ వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

‘ఎవరి పాత్ర ఏమిటో వారికి తెలుసు’

బౌలింగ్‌ వ్యూహాల విషయానికి వస్తే- ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడి, టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆరో బౌలర్ లోటు ఏర్పడింది. స్పెషలిస్ట్ ఆరో బౌలర్‌ను తుది జట్టులోకి తీసుకోకుండానే ఈ లోటును భర్తీ చేసుకోవడంలోనూ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు.

ఈ వ్యూహంలో ఆశ్చర్యపరిచే అంకం ఇండియా చివరి లీగ్ మ్యాచ్‌లో ఆవిష్కృతమైంది.

నవంబరు 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది మంది బౌలింగ్ చేశారు.

ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ తప్ప ఎవరితోనూ వారి కోటా అయిన 10 ఓవర్లు వేయించలేదు. వీరి స్థానంలో ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లతో బౌలింగ్ చేయించారు. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు కూడా. అయితే శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయారు.

ఈ ప్రయోగంపై మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ, “ఇప్పుడు మాకు తొమ్మిది ఆప్షన్స్ ఉన్నాయి, ఇది చాలా ముఖ్యం. జట్టుగా మేం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాం. ఏం చేయగలమో చూడాలనుకున్నాం. దానికి ఇది సరైన మ్యాచ్​ అనుకున్నాం” అని చెప్పాడు.

ఏ మాత్రం తేడా కొట్టినా, తీవ్ర విమర్శలు ఎదురయ్యేవే. కానీ, అన్నీ మదింపు చేసి, అతడు ‘కాలిక్యులేటెడ్ రిస్క్’ తీసుకున్నాడు.

వరల్డ్‌కప్ కోసం చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నామని, జట్టులోని ఆటగాళ్లందరికీ ఈ టోర్నీలో వారి పాత్ర ఏంటనేది తెలుసని రోహిత్ శనివారం(నవంబరు 18 ) అహ్మదాబాద్‌‌లో చెప్పాడు.

“రెండేళ్ల ముందు నుంచే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాం. మొదట టీ20, ఆ తరువాత ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్.. ఈ మూడు ఫార్మాట్లకు ఎవరెవరు సరిపోతారో ముందే గుర్తించాం. ఆటగాళ్లకు వారు పోషించబోయే పాత్ర గురించి వివరించాం” అని ఆదివారం ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరల్డ్ కప్ 2023లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది భారత జట్టు

ఆస్ట్రేలియాతో ఫైనల్‌పై రోహిత్ ఏమన్నాడు?

ఫైనల్ వరకు సాగిన తమ ప్రయాణం గురించి రోహిత్ మాట్లాడుతూ, “ఫైనల్ వరకు చేరడమే తొలి ప్రాధాన్యం. ఇందుకోసం ఏ ఆటగాడిని ఎక్కడ ఆడించాలో పూర్తి స్పష్టతతో పనిచేశాం. అంతా మేం అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పాడు.

భారత్, ఆస్ట్రేలియా రెండూ ఫైనల్‌ ఆడేందుకు అర్హత ఉన్న జట్లేనని రోహిత్ అన్నాడు.

“ఆస్ట్రేలియా ఏం చేయగలదో మాకు తెలుసు. అయితే ప్రత్యర్థి జట్టు ఏం చేస్తుందనేదానిపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మా దృష్టంతా మా ప్రదర్శనపైనే ఉంది. మా ప్రణాళికలను అమలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాం” అని వివరించాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోచ్, కెప్టెన్ మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు.

అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు

విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టు వైఫల్యాల వల్ల రోహిత్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

2022లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో భారత్ టీ20 సిరీస్‌లలో ఒకానొక సమయంలో అతడిపై తీవ్ర విమర్శలే వచ్చాయి.

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత జట్టుకు ఓటమి ఎదురైన సమయంలో రోహిత్ విమర్శలు ఎదుర్కొన్నాడు.

జూన్ 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటమి పాలయ్యాక రోహిత్ బ్యాటింగ్‌ను, నిర్ణయాలను తప్పుబట్టాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గావస్కర్. 2023 ఐపీఎల్ నాటి నుంచి ఫామ్‌ను అందుకోవడానికి రోహిత్ తంటాలు పడుతున్నాడని అతడు అన్నాడు.

కానీ, హర్భజన్ సింగ్, ఇతర మాజీ క్రికెటర్ల నుంచి రోహిత్‌కు మద్దతు లభించింది.

అదే సమయంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌ అతడికి అండగా నిలిచాడు.

ఆసియాకప్‌ 2023 విజయం అనంతరం మొదలైన ప్రపంచ కప్ టోర్నీలో భారత్ వరుస విజయాలతో రోహిత్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రాహుల్ ద్రవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటు జట్టు నుంచి, అటు కోచింగ్ స్టాఫ్ నుంచి సమానంగా గౌరవం పొందే అతి తక్కువ మంది కెప్టెన్లలో రోహిత్‌ ఒకడని రాహుల్ ద్రవిడ్ కితాబిచ్చాడు.

రోహిత్ కెప్టెన్సీ అద్భుతం: కోచ్ రాహుల్ ద్రవిడ్

ఓపెనర్‌గా, కెప్టెన్‌గా రెండు బాధ్యతలనూ రోహిత్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న తీరును కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసించాడు.

నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడటానికి ముందు రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ- “నాయకుడిగా రోహిత్ శర్మ సమర్థత, ఇప్పటికే ఉదాహరణలతో సహా నిరూపితమైంది” అన్నారు.

రోహిత్ దూకుడు బ్యాటింగ్ గురించి ద్రవిడ్ మాట్లాడుతూ- “మేమిద్దరం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మ్యాచ్ ఆడటంపై చర్చించుకున్నాం. రిస్క్ తీసుకుని దానిని పాటించి, ఇతరులకు ఆదర్శంగా నిలవడం నాయకుడి లక్షణం. రోహిత్ ఈ పద్ధతినే అనుసరించి, ఫలితాన్ని సాధించి చూపాడు. అతడి కెప్టెన్సీ అద్భుతం. ఇటు జట్టు నుంచి, అటు కోచింగ్ స్టాఫ్ నుంచి సమానంగా గౌరవం పొందే అతి తక్కువ మంది కెప్టెన్లలో రోహిత్‌ ఒకడు” అని మెచ్చుకున్నాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

‘హిట్‌ మ్యాన్’ అనే పేరు ఎలా వచ్చింది?

రోహిత్‌ను ఫ్యాన్స్ ‘హిట్‌ మ్యాన్’ అని పిలుచుకుంటారు. అతడికి ఈ ‘బిరుదు’ను ఇచ్చింది మాజీ కోచ్ రవిశాస్త్రి.

అతడి హిట్టింగ్‌కు మరో ఉదాహరణ: అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది.

2014 నవంబర్ 13వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ రికార్డు నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)