ఉత్తర్‌కాశి సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికుల్లో బయటికి తీసుకొస్తారనే నమ్మకం పోతోందా?

ఫొటో సోర్స్, REUTERS/SHANKAR PRASAD NAUTIYAL
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, ఉత్తర్‌కాశి నుంచి బీబీసీ ప్రతినిధి
ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయి అందులో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయ చర్యలు నిలిచిపోవడంతో, వారి కుటుంబ సభ్యుల్లో నిరాశ, నిస్పృహలు తీవ్రమవుతున్నాయి.
ఉత్తర్‌కాశీలోని సిల్క్యారా గ్రామంలో జరిగిన ఈ ఘటనలో కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయ చర్యలు కొన్ని ఆటంకాల కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి.
దిల్లీ నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం శుక్రవారం సాయంత్రం నుంచి పనిచేయడం లేదు.
ఇందోర్ నుంచి మరో యంత్రాన్ని తెప్పించారు. అది ఇప్పుడు సొరంగంలో 200 మీటర్ల లోపలికి వెళ్తోంది. ఆ తర్వాత నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి.
సొరంగం కూలి 70 మీటర్ల మేర అడ్డుగా పడిన శిథిలాల్లో ఇప్పటివరకు 24 మీటర్ల మేర శిథిలాల తొలగింపు పనులు జరిగాయి. అయితే, కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.
కొండ పైనుంచి తవ్వేందుకు ఆలోచనలు
ఇప్పటివరకు సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను ముందు వైపు నుంచి తొలగిస్తున్నారు. సొరంగం లోపలికి వెళ్లి ఆ దారిలోనే వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు కొండ పైనుంచి నిలువుగానూ తవ్వేందుకు సిద్ధమయ్యారు.
కొండ పైభాగంలో చెట్లను తొలగించి అక్కడ డ్రిల్లింగ్ (తవ్వే) యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త యంత్రం పని మొదలుపెట్టిన తర్వాత శిథిలాలను తొలగించే పనులు కూడా ప్రారంభమవుతాయని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ముందు వైపు నుంచి శిథిలాలను తొలగించేందుకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందువల్ల కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు సొరంగం లోపలి నుంచి మాత్రమే కాకుండా, కొండ పైనుంచి కూడా డ్రిల్లింగ్ పనులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
అంతా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగితే, లోపల చిక్కుకుపోయిన కార్మికులను చేరుకోవడానికి మరో నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు పడుతుందని వారు చెప్పారు.
పీఎంవో నుంచి నిపుణుల బృందం
సొరంగం పైభాగంలో ఉన్న కొండను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి నిపుణుల బృందం శనివారం వచ్చి పరిశీలించింది.
సొరంగంలో కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి కొండపై నుంచి నేరుగా డ్రిల్లింగ్ జరిపే అవకాశాలపై చర్చిస్తున్నట్లు వారు రిపోర్టర్లకు చెప్పారు. కొండపై నాలుగు అనువైన ప్రదేశాలను గుర్తించినట్లు చెప్పారు.
ఈ ప్రతిపాదనలపై ఇంకా చర్చిస్తున్నారు. కొండ పైనుంచి నేరుగా కార్మికులు ఉన్న చోటుకు చేరుకునేందుకు దాదాపు 103 మీటర్ల మేర రంధ్రం చేయాల్సి ఉంటుంది. అయితే, అది చాలా క్లిష్టమైన పని.
మరోవైపు సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలు ఆగ్రహంగా ఉన్నాయి.
నిర్మాణ కంపెనీకి భయపడి నిన్నటి వరకూ చాలా మంది జర్నలిస్టులతో మాట్లాడేందుకు వెనకాడారు. కానీ, వారిలో సహనం నశించినట్లు కనిపిస్తోంది.

క్రమంగా మనోస్థైర్యం తగ్గిపోతోంది
మృత్యుంజయ్ కుమార్ ఇదే ప్రాజెక్టులో లోడర్, ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు.
''లోపల చిక్కుకుపోయిన వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పటికే ఏడు రోజులు గడచిపోవడంతో వాళ్లలో మనోస్థైర్యం తగ్గిపోతోంది. ఈ ఆహారం తిని ఎన్నిరోజులు బతుకుతామని అంటున్నారు. నిజంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా, లేక మభ్యపెడుతున్నారా అని వాళ్లు మమ్మల్ని అడుగుతున్నారు. ప్రస్తుతం వాళ్లు బాగానే ఉన్నారు, కానీ వారిలో బయటికి రాగలమన్న విశ్వాసం తగ్గిపోతోంది'' అని ఆయన అన్నారు.
సొరంగంలోని ఒక పైపు ద్వారా కార్మికులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. దాని ద్వారానే మంచినీళ్ల బాటిళ్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కూడా పంపిస్తున్నారు. కార్మికులకు మందులు కూడా అందిస్తున్నారు. ఆ పైపు ద్వారానే ఇరువైపుల ఉన్నవారి మధ్య మాటలు నడుస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని చంపౌర్ జిల్లాకి చెందిన విక్రమ్ సింగ్ అక్కడికి వచ్చారు. ఆయన 24 ఏళ్ల తమ్ముడు ఆ సొరంగంలో చిక్కుకుపోయారు.
పైపు ద్వారా శుక్రవారం తన తమ్ముడితో విక్రమ్ మాట్లాడారు.''గొంతు పీలగా ఉంది. బాగానే ఉన్నాడు కానీ, భయంభయంగా ఉన్నాడు'' అని ఆయన చెప్పారు.
అయితే, సొరంగం లోపల చిక్కుకుపోయిన వారి కోసం అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యుల కోసం నిర్మాణ సంస్థ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఈ గ్రామంలో హోటళ్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెబుతున్నారు.

నిలిచిపోయిన పనులు
సొరంగంలో 70 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలను తొలగించి 900 ఎంఎం పైపును ఏర్పాటు చేసి, అందులో నుంచి కార్మికులు బయటకు వచ్చేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ అందులో 24 మీటర్ల వరకూ మాత్రమే పనులు జరిగాయి.
అయితే, డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి మట్టి, శిథిలాలు పడుతున్నాయని శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
లోపల ఏదో పేలినట్లుగా భారీ శబ్దం వినిపించిందని, దీంతో డ్రిల్లింగ్ కార్మికులు బయటికి వచ్చేశారని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ తెలిపింది.
సొరంగం కూలిపోయే అవకాశం ఉన్నందు వల్ల ప్రస్తుతానికి సహాయ చర్యలు నిలిపివేసినట్లు ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
రహదారి నిర్మాణంలో భాగంగా కొంత దూరం నిర్మించిన ఈ సొరంగంలో కొంత భాగం నవంబర్ 12, ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి శిథిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, REUTERS/SHANKAR PRASAD NAUTIYAL
ఇతర మార్గాలపై దృష్టి
శిథిలాలను తొలగించేందుకు చేసిన మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడో ప్రయత్నం కూడా అంత విజయవంతంగా కనిపించడం లేదు. దీంతో కార్మికులను రక్షించేందుకు అధికారులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు.
లోపల చిక్కుకుపోయిన కార్మికులు, సొరంగం బయట మనతో మాట్లాడుతున్న ఈ కార్మికులందరూ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఈసీఎల్) కోసం పనిచేస్తున్నారు. ఈ కంపెనీయే రహదారి, సొరంగం పనులు చేస్తోంది.
సొరంగం పనులు 2018లో ప్రారంభమయ్యాయని నిర్మాణ సంస్థ సూపర్‌వైజర్లు చెప్పారు.
''ఇంకొంత పని చేస్తే సొరంగం పూర్తవుతుందనుకున్న సమయంలో, గతంలోనూ ఇప్పుడు కూలిపోయిన చోటే కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మళ్లీ ఆ పనులు పూర్తి చేయడానికి ఆరు నెలలు పట్టింది. బహుశా, అది అంత బలంగా కట్టలేదేమో'' అని సూపర్‌వైజర్లలో ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, UTTARAKHAND STATE DISASTER RESPONSE FORCE/HANDOUT VIA REUTERS
చార్‌ధామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మాణం
ఇదే విషయాన్ని కంపెనీ స్థానిక అధికారులతో మాట్లాడి ధ్రువీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు మీడియాతో మాట్లాడబోరని చెప్పారు.
నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగం. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఇది ఒక వివాదాస్పద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని, ఇప్పటికే అదో పెద్ద సమస్యగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
దీపావళి రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టి ఈ ఆదివారానికి ఎనిమిదో రోజులైంది.
శిథిలాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాలు పనిచేయకపోవడంతో మొదటి నాలుగు రోజులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- రోజుకు 4 సెం.మీ. కుంగిపోతున్న పట్టణం.. అక్కడేం జరుగుతోంది?
- అఫ్గానిస్తాన్: 'పదేళ్ళ వయసు వరకూ నన్ను మా నాన్న అబ్బాయిగానే పెంచారు... అలానే అందర్నీ నమ్మించి నన్ను కాపాడారు'
- గాజా: బాంబుల శబ్దాలతో మహిళలకు గర్భస్రావాలు, పెయిన్ కిల్లర్స్ లేకుండానే ప్రసవాలు... చెప్పతరం కాని గర్భిణుల కష్టాలు
- గాజా: అల్-షిఫా హాస్పిటల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా... ఇజ్రాయెల్ సైన్యంతో లోపలికి వెళ్ళిన బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?
- హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














