మిజోరాం సరిహద్దుల్లో ఘర్షణలు, మియన్మార్ నుంచి భారీ సంఖ్యలో వస్తున్న శరణార్థులు... అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి, దిల్లీ
భారత్- మియన్మార్ సరిహద్దు సమీపంలో మియన్మార్ సైన్యానికి, మిలటరీ పాలనను వ్యతిరేకిస్తున్న బలగాలకు మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు తీవ్రమయ్యాయి.
ఈ నేపథ్యంలో నిర్వాసితులైన సుమారు 5 వేల మంది ప్రజలు మియన్మార్ నుంచి మిజోరాంకు చేరుకున్నారు.
బుధవారం నాటికి మియన్మార్ సైన్యానికి చెందిన 45 మంది జవాన్లు కూడా మిజోరాం పోలీసుల ముందు లొంగిపోయారు.
వారిని భారత సైన్యానికి అప్పగించారు. తర్వాత మియన్మార్‌కు తిరిగి పంపించారు.
మిజోరాం పోలీస్ ఐజీపీ (లా అండ్ ఆర్డర్) లాల్బియాక్త్‌గంగా ఖియాంగ్టే, బీబీసీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
“సరిహద్దుకు అవతలి వైపు పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. అయితే భారత్ వైపు ఎటువంటి హింసాత్మక కార్యకలాపాలు జరగలేదు. మియన్మార్-భారత్ సరిహద్దులకు అతి సమీపంలో జరుగుతున్న ఘర్షణలు, సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రభావం చూపాయి. తిరుగుబాటుదారులు చాలా చోట్ల దాడులు చేసి ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మియన్మార్ సైనికులు, అడవుల్లో దాక్కోవాల్సి వచ్చింది’’ అని ఖియాంగ్టే చెప్పారు.
2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొలగించి సైన్యం, మియన్మార్‌లో అధికారంలోకి వచ్చింది.
అప్పటి నుంచి మియన్మార్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. దీని కారణంగా లక్షల మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు.

ఫొటో సోర్స్, ANI
మియన్మార్ సైన్యానికి ఎదురు దెబ్బ
ఇటీవలి రోజుల్లో, మియన్మార్‌లోని శాన్ ప్రావిన్స్‌లో అనేక సాయుధ గ్రూపులు ఏకమై మియన్మార్ సైన్యంపై దాడులకు తెగబడ్డాయి. అనేక చోట్ల విజయం కూడా సాధించాయి.
దీని తర్వాత, భారత సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ స్థావరాలపై కూడా తిరుగుబాటుదారులు భారీ దాడులు చేశారు.
ఈ కారణంగానే భారత్-మియన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు పెరిగాయని మిజోరాం పోలీసులు తెలిపారు.
నిర్వాసితుల్లో ఎక్కువ మంది చంపై జిల్లా సరిహద్దు పట్టణాలకు చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు.
“మియన్మార్ లోపల చాలా అశాంతి నెలకొని ఉంది. ఇది సరిహద్దును కూడా ప్రభావితం చేసింది. అయితే, మిజోరాం వైపు హింసాత్మక ఘటనలు లేవు. గత కొద్ది రోజులుగా మియన్మార్ నుంచి దాదాపు అయిదు వేల మంది మిజోరాం వచ్చారు. నిన్న కూడా కొంతమంది వచ్చారు. ఈరోజు కూడా కొందరు భారత్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి. బుధవారం సాయంత్రం నాటికి 45 మంది మియన్మార్ ఆర్మీ సైనికులు, మిజోరాం పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని కేంద్ర బలగాలకు అప్పగించాం. సరిహద్దులను అస్సాం రైఫిల్స్ పర్యవేక్షిస్తోంది’’ అని ఖియాంగ్టే వివరించారు.

ఫొటో సోర్స్, ANI
భారీగా తరలివస్తున్న నిర్వాసితులు
మియన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న మిజో యూత్ అసోసియేషన్ సభ్యులతో బీబీసీ మాట్లాడింది.
సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రం కావడంతో శరణార్థులు భారత్ వైపు వస్తున్నారని వారు చెప్పారు. శరణార్థుల కోసం చంపై, జోఖథార్ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఐజీపీ ఖియాంగ్టే మాట్లాడుతూ, “భారత్ వైపు శాంతియుత వాతావరణం ఉంది. కానీ, మియన్మార్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ ఘర్షణలు తీవ్రతరం అయినప్పుడల్లా, వాటి ప్రభావం కచ్చితంగా సరిహద్దులపై పడుతుంది. సరిహద్దు ఘర్షణలకు సంబంధించిన నివేదికలు బుధవారం సాయంత్రానికి మాకు అందాయి’’ అని చెప్పారు.
నివేదికల ప్రకారం, నవంబర్ 12 సాయంత్రం చిన్ నేషనల్ ఆర్మీతో పాటు దాని సహాయక బృందాలైన సీడీఎఫ్- హువాల్గోరం, సీడీఎఫ్ జానియాత్రమ్, పీపుల్స్ డిఫెన్స్ ఆర్మీ, సీడీఎఫ్ థాంత్లాంగ్ బృందాలు సంయుక్తంగా మియన్మార్ సైన్యానికి చెందిన ఖావ్మావీ (తియావూ), రిఖాద్వార్ స్థావరాలపై దాడి చేశాయి. ఈ రెండు స్థావరాలు భారత సరిహద్దుకు సమీపంలో ఉంటాయి. ఈ దాడిలో మియన్మార్ ఆర్మీకి చెందిన పలువురు సైనికులు మరణించారు. కొందరు గాయపడ్డారు.
ఈ దాడి తర్వాత మియన్మార్ ఆర్మీకి చెందిన 43 మంది సైనికులు మిజోరంకు పారిపోయి వచ్చారు. పోలీసుల ముందు లొంగిపోయారు. బుధవారం మరో ఇద్దరు సైనికులు లొంగిపోయారు.
ఆర్మీ స్థావరాలపై దాడి తర్వాత, ఎంఐ హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లను మియన్మార్ సైన్యం సహాయం కోసం పంపింది. బాంబు దాడులు చేసింది.
మిజోరాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సరిహద్దుల్లో ఇప్పుడు ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. అయితే అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, ANI
తెరిచి ఉన్న భారత్ - మియన్మార్ సరిహద్దు
భారత్‌లోని మిజోరాం ప్రాంతానికి, మియన్మార్‌లోని చిన్ ప్రావిన్స్ మధ్య 510 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది.
అయితే, ఈ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు సులభంగా అటూ ఇటూ వెళ్లవచ్చు. ఇరువైపులా 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు.
మియన్మార్‌లోని చిన్ ప్రజలు, మిజోరాంలోని మిజో ప్రజల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఐజ్వాల్‌లోని ప్రభుత్వ జాన్సన్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ లాల్‌రించనా చెప్పారు. తమ పూర్వీకులంతా ఒకటేనని ఈ రెండు సమూహాలు నమ్ముతాయని చెప్పారు.
‘‘వారి చరిత్ర, సంస్కృతి, విశ్వాసాలు ఒకేలా ఉంటాయి. ఈ ప్రజలు సరిహద్దుకు రెండువైపులా నివసిస్తున్నప్పటికీ, వారంతా సోదర-సోదరీమణులుగా భావిస్తారు. మిజోరాం ప్రజలకు మియన్మార్‌లోని చిన్ ప్రజల మద్దతు ఉంటుంది’’ అని చెప్పారు.
మియన్మార్ నుంచి వచ్చే చిన్ వలసదారులకు మిజోరాంలో పూర్తి మద్దతు లభించడానికి ఇదే కారణమని ఆయన తెలిపారు.
సరిహద్దులు దాటి వచ్చిన వారికి సహాయం చేస్తున్నట్లు యంగ్ మిజో అసోసియేషన్ కార్యదర్శి లాల్‌నుంత్‌లుంగా చెప్పారు.
తమ అనుబంధ సంఘాల నుంచి విరాళాలు సేకరించి నిర్వాసితులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
భారత్-మియన్మార్ సరిహద్దును దాటడం పెద్ద కష్టమేమీ కాదు, సులభమే అని ఆయన అన్నారు. సరిహద్దుకు రెండు వైపులా 25 కిలోమీటర్లు ప్రయాణించే స్వేచ్ఛ అక్కడ ఉంది అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
మిజోరాంలోని శరణార్థుల సంఖ్య ఎంత?
మియన్మార్‌లో అంతర్యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు భారత్‌కు చేరుకున్నారు.
ఈ ఏడాది మార్చి వరకు ఉన్న డేటా ప్రకారం, మియన్మార్ శరణార్థులు దాదాపు 31,500 మంది మిజోరాం రాజధాని ఐజ్వాల్‌తో పాటు ఇతర జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరంతా చిన్ ప్రావిన్స్ నుంచి వచ్చారు.
మిజోరాం హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో మియన్మార్ శరణార్థులు ఆశ్రయం పొందారు.
మిజోరాంలో 160కి పైగా సహాయక శిబిరాలు ఉన్నాయి. వీటిలో సుమారు 13 వేల మంది శరణార్థులు ఉన్నారు. మిగిలిన శరణార్థులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఇప్పుడు అక్కడ నెలకొన్న తాజా హింస తర్వాత, అయిదు వేల మందికి పైగా కొత్త శరణార్థులు మిజోరాం చేరుకున్నారు.
మియన్మార్ నుంచి వచ్చిన శరణార్థులను ఆదుకోవడం మిజోరాం మానవతా బాధ్యత అని ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌థాంగా అన్నారు.
ఈ శరణార్థులు తనకు, తన పార్టీకి లాభదాయకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
"సానుభూతి చూపడం మన మానవ బాధ్యత. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని బలవంతంగా వెనక్కి పంపం. మియన్మార్ నుంచి వచ్చే ప్రజలు మా మిజో ప్రజలే’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్‌తో సంబంధాలు ప్రభావితం అవుతాయా?
మిజోరాం ఒక చిన్న రాష్ట్రం. ఇక్కడ మొత్తం జనాభా దాదాపు పదమూడున్నర లక్షలు ఉంటుంది. మియన్మార్ నుంచి వస్తున్న శరణార్థుల ప్రభావం స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
“ఈ సంక్షోభం చాలా కాలంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి పెట్టడం లేదు. అందుకే దీనికి ఇంకా పరిష్కారం దొరకలేదు. ఇటీవలి ఘటనల తర్వాత, వెంటనే జోఖాథర్ సరిహద్దులో వ్యాపారం నిలిచిపోయింది. సరిహద్దు క్రాసింగ్‌ల మూసివేత కారణంగా చాలా వస్తువుల దిగుమతి ఆగిపోయింది. దీని కారణంగా స్థానికంగా ధరలు పెరుగుతున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతోంది’’ అని డేవిడ్ చెప్పారు.
పెద్ద సంఖ్యలో నిర్వాసితులు రావడం వల్ల రాష్ట్ర బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
విస్తృత స్థాయిలో మియన్మార్‌తో భారతదేశ సంబంధాలు, మియన్మార్ పట్ల భారతదేశ విధానం ఈ సంక్షోభం వల్ల ప్రభావితమవుతాయి.
“మియన్మార్‌లోని ప్రస్తుత సైనిక ప్రభుత్వంతో స్నేహం పెంచుకోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ఈ సంక్షోభం ప్రభావం చూపవచ్చు. మిజోరాం రాజకీయ పార్టీలు, ప్రభుత్వం మియన్మార్‌లో నివసిస్తున్న మిజో ప్రజలకు మద్దతు ఇస్తుండగా... మిజోరాంలోని శరణార్థులకు రాష్ట్ర స్థాయి సహాయాన్ని పరిమితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతం మధ్య వైరుధ్యం ఉంది. ఈ సైద్ధాంతిక భేదాలు మియన్మార్‌తో భారతదేశ సంబంధాలను ప్రభావితం చేయగలవు" డేవిడ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- సచిన్‌కూ, విరాట్ కోహ్లీకీ అదే తేడా: వసీం అక్రమ్
- అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు తమకు క్రికెట్ నేర్పించిన పాకిస్తాన్‌ను కాదని భారత్‌ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?
- భారత క్రికెట్లో ‘విరాట్ కోహ్లీ తరం’ ఎప్పుడు మొదలైంది?
- అజహరుద్దీన్: యూపీలో గెలిచి, రాజస్థాన్‌లో ఓడి, ఇప్పుడు తెలంగాణ బరిలో దిగిన టీమిండియా మాజీ కెప్టెన్
- ‘విరాట్ GOAT’.. ‘షమీ ఫైనల్’ ఈ రెండు పదాలూ సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















