తెరుచుకున్న పూరీ రత్న భండార్, ఆ రహస్య గదిలో ఏముంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఉన్న రత్న భండార్‌ను తెరిచారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ గదిని తెరిచారు. పూర్తి వివరాలను మేనేజింగ్ కమిటీ వెల్లడిస్తుందని ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు.
విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని చెప్పే ఈ నిధి తలుపులు తెరిచే విషయంలో గత కొంతకాలంగా వివాదం నెలకొంది.
ఈ రహస్య గదిని తెరిచేందుకు ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చిందని, ఈ పనులను పర్యవేక్షించేందుకు ఆలయ ప్రధాన అధికారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పామని ఒడిశా న్యాయశాఖా మంత్రి పృథ్వీరాజ్ వెల్లడించారు.
ఇన్‌స్పెక్షన్ కమిటీలోని ఇద్దరు సభ్యులతోపాటు, మొత్తం 11మంది సభ్యులు ఆలయంలోని రహస్య గదిలోకి ప్రవేశిస్తారని ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వెల్లడించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు తెరుస్తున్నారు?
ఆలయ నిర్వహణ కోసం తీసుకొచ్చిన శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్-1955 ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి రత్న భండార్‌ను తెరచి, లోపల సంపదను లెక్కించాల్సి ఉంటుంది.
అయితే, 45 ఏళ్లుగా రత్న భండార్ లోపలి గది తెరవలేదు. దీన్ని తెరిచేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదని అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రత్నభండార్ తలుపులు తెరవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రహస్య గదిని తెరిచేలా అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తులసి యాత్ర చేపడతామని గత ఏడాది నవంబర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అయితే, అన్ని అంశాలను పరిశీలించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం తప్ప ఎందుకు తెరవడం లేదనే అంశంపై బిజూ జనతా దళ్(బీజేడీ) ప్రభుత్వం ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు.
ఈ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ అధికారాన్ని కోల్పోయింది. మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది.
ఆలయంలోని రత్నభండార్‌ను తెరిచి, ఆభరణాలను లెక్కించేందుకు 16 మంది సభ్యులతో ఒక హైలెవెల్ కమిటీని నియమించింది ప్రభుత్వం. దీనికి ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అంతకుముందు బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఇదే వ్యవహారంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పసాయత్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. అయితే, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆ కమిటీని పక్కనబెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ రత్న భండార్?
12వ శతాబ్దంనాటి పూరీ జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా ‘రత్న భండార్’ను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘ఒడిశా రివ్యూ’ మ్యాగజైన్ అభివర్ణించింది.
ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్‌మెంట్‌లో ఉండే ఈ భండార్‌లో భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను ఉంచుతారు.
జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగభీమ 2,50,000 మధాల (ఒక మధా అంటే 5.83 గ్రాములు) బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఉత్కళ్ యూనివర్సిటీ ప్రచురించిన ‘మదాలా పంజీ’లో పేర్కొన్నారు.
అలానే ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతోపాటు చాలా మంది రాజులు భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా అందించినట్లు ‘మదాలా పంజీ’లో ప్రస్తావించారు. వీటితోపాటు సాధారణ భక్తులు అందించే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలను కూడా ఈ భండార్‌లోనే భద్రపరుస్తూ వచ్చారు.
ఈ భండార్‌లో రెండు గదులు ఉన్నాయి. వీటిలో ఒకటి బీతర్ భండార్. అంటే లోపలి గది అని కూడా పిలుస్తారు. రెండోది బాహరా భండార్. దీన్ని వెలుపలి గది అని అంటారు.
దేవుడి విగ్రహాలకు అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం బాహరా భండార్‌ను తరచూ తెరుస్తుంటారు. కానీ, బీతర్ భండార్‌ను తెరచి 45 ఏళ్లకుపైనే అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో తెరచినప్పుడు ఏమైంది?
చివరిసారిగా 1978లో ఈ రత్న భండార్ లోపలి గదిని తెరచినట్లు ‘ఒడిశా రివ్యూ’ మ్యాగజైన్ తెలిపింది. ఆ ఏడాది మే నెలలో తలుపులు తెరిచారు. లోపల సంపదను లెక్కించే ప్రక్రియలు జులైలో ముగిశాయి.
అయితే, ఆనాడు లోపలున్న సంపద విలువెంతో ఆలయ నిర్వహణ కమిటీ బయటపెట్టలేదు.
1985 జులై 14న మరోసారి లోపలి గదిని తెరిచారు. కానీ, ఆనాడు కూడా సంపద లెక్కింపు జరగలేదు.
ఈ విషయంపై 2018 ఏప్రిల్‌లో అసెంబ్లీ వేదికగా ఒడిశా ప్రభుత్వం స్పందించింది.
1978 లెక్కల ప్రకారం, రత్న భండార్‌లో 12,831 భారీల (ఒక భారీ అంటే 11.66 గ్రాములు) బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు గత ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రి ప్రతాప్ జెనా ఇంతకు ముందు వెల్లడించారు. అయితే, వీటి మొత్తం విలువపై సమాచారం అందుబాటులో లేదన్నారు.
అంతేకాదు, 1978 నుంచి 2018 మధ్య భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల విలువను లెక్కించాల్సి ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తాళం కనిపించలేదన్నారు
2018 ఏప్రిల్‌లోనూ ఒడిశా హైకోర్టు ఆదేశాలపై రత్న భండార్ లోపలి గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం సఫలం కాలేదు. లోపలి గది తాళం కనపడకపోవడమే దీనికి కారణమని అప్పట్లో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఒక కథనం ప్రచురించింది. మొత్తానికి అప్పుడు బయట నుంచే అధికారులు పరిశీలన చేపట్టారు.
అయితే, తాళం కనపడట్లేదనే వార్తలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ఈ కమిటీ 324 పేజీల నివేదికను 2018 నవంబరులోనే ప్రభుత్వానికి సమర్పించింది. కానీ, దానిలో వివరాలను బయటపెట్టలేదు.
మరోవైపు రత్న భండార్ లోపల ఎంత సంపద ఉంది, దీన్ని ఎప్పుడు తెరుస్తారు అని బలాంగిర్‌కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు హేమంత్ పండా ఆలయ నిర్వహణ కమిటీకి ఒక సమాచార హక్కు దరఖాస్తును కూడా దాఖలు చేశారు.
అయితే, ఈ దరఖాస్తుపై స్పందించకపోవడంతో 2022 ఆగస్టులో శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జేటీఏ)కు చెందిన అధికారి ఎస్‌కే చటర్జీకి రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా కూడా విధించింది.
ఆ సమయంలో టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ (డెవలప్‌మెంట్) అజయ్ కుమార్ జెనా పీటీఐతో మాట్లాడుతూ- ‘‘రత్న భండార్ లోపలి గదిని తెరిచే నిర్ణయం ఎస్‌జేటీఏ చేతుల్లో లేదు. ఈ విషయాన్ని ఆలయ నిర్వహణ కమిటీ ముందుకు తీసుకెళ్తాం. కమిటీ తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. అప్పుడే ఈ విషయంలో నిర్ణయం సాధ్యం అవుతుంది.’’ అని చెప్పారు.
ఆలయ కమిటీ ఎందుకు తెరవాలన్నది?
మొత్తానికి గత ఏడాది ఆగస్టు 5న రత్న భండార్‌లోని లోపలి గదిని తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది.
ముఖ్యంగా లోపలి గదిలోని దెబ్బతిన్న నిర్మాణాలను సరిచేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సూచించడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎస్‌జేటీఏకు ఏఎస్ఐ ఒక లేఖ కూడా రాసింది.
‘‘ఆలయంలో సంప్రదాయాలకు ఎలాంటి అవరోధం కలగకుండా లోపల తనిఖీలు చేపట్టేలా ప్రతిపాదనలు మేం ప్రభుత్వానికి పంపిస్తాం’’ అని ఆలయ కమిటీ సమావేశం అనంతరం పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ్ వర్మ అప్పట్లో విలేఖరులతో అన్నారు.
ముఖ్యంగా రత్న భండార్ లోపలి గదిని తెరచి, మరమ్మతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నట్లు వర్మ గత ఏడాది చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విష ప్రాణులు, చెట్లపై నుంచి శరీరంపై పడే జలగలు.. ఆ భయంకర పర్వతం ఎక్కి శాస్త్రవేత్తలు ఏం చేశారు?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















