సైనికుడు చనిపోతే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం భార్య ఒక్కరికే దక్కుతుందా? ఈ ఆర్మీ రూల్‌పై కెప్టెన్ అన్షుమాన్ తల్లిదండ్రుల అభ్యంతరమేంటి

ఫొటో సోర్స్, @RASHTRAPATIBHVN
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు ఆయన మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం లభించింది. అయితే, మరణానంతరం అందిస్తున్న పురస్కారాల విషయంలో భారత సైన్యం అనుసరిస్తున్న 'నెక్స్ట్ ఆఫ్ కిన్ (ఎన్‌వోకే)' పాలసీలో సవరణలు చేయాలని కెప్టెన్ అన్షుమాన్ తండ్రి కోరుతున్నారు.
ఈ పాలసీ ప్రకారం.. మరణించిన సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులకు గౌరవం, ఆర్థిక సాయం అందజేస్తారు.
సైనిక సిబ్బంది శౌర్యానికి, సాహసానికి ప్రతీకగా అందించే పురస్కారం కీర్తి చక్ర.
నిరుడు జులైలో, సియాచిన్‌లో తన సహచరులను కాపాడే క్రమంలో కెప్టెన్ అన్షుమాన్ మరణించారు. కెప్టెన్ అన్షుమాన్ ధైర్యసాహసాలకు గాను మరణానంతరం ఆయనకు కీర్తి చక్ర అవార్డు లభించింది.
రాష్ట్రపతి భవన్‌లో జులై 5న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా కెప్టెన్ అన్షుమాన్ భార్య స్మృతి, ఆయన తల్లి మంజు సింగ్ ఈ అవార్డును అందుకున్నారు.
అయితే, ఒక సైనికుడి మరణానంతరం ఇచ్చే ఆర్థిక సాయం, గౌరవం ఆయన భార్యతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకూ అందాలని.. ఆ మేరకు ఎన్‌వోకే విధానాన్ని సవరించాలని కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.

కెప్టెన్ అన్షుమాన్ కుటుంబం ఏమంటోంది?
కెప్టెన్ అన్షుమాన్ తండ్రి రవిప్రతాప్ సింగ్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''కీర్తి చక్ర అవార్డును ఇంటికి తీసుకురాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది'' అన్నారు.
కీర్తి చక్ర తన కోడలు స్మృతి వద్దే ఉందని, కనీసం దానిని సరిగ్గా చూడలేకపోయానని ఆయన చెప్పారు.
ఎన్‌వోకే (నెక్స్ట్ ఆఫ్ కిన్) పాలసీలో సవరణలు చేయాలని కోరుతున్న రవిప్రతాప్ సింగ్ ఇలా అన్నారు.. ''అందరికీ ఆమోదయోగ్యమైన, సమగ్రమైన పాలసీని తీసుకురావాలి. రెండు కుటుంబాల మధ్య అనుకూల పరిస్థితులు ఉన్నా, లేకపోయినా.. ఎవరి హక్కులనూ ఉల్లంఘించేలా ఆ పాలసీ ఉండకూడదు.''
''ఎన్‌వోకే విధానంలో నిర్మాణాత్మక మార్పులు అవసరం'' అని ఆయన అన్నారు.
ఈ విధానంలో సవరణ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తండ్రి మాట్లాడారు.
అయితే, తమ కోడలు స్మృతి ఆమెకు ఉన్న హక్కు ప్రకారమే తీసుకున్నారని, కానీ ఈ హక్కుల విషయంలో సవరణ చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఫొటో సోర్స్, @RASHTRAPATIBHVN
ఏమిటీ ఎన్‌వోకే?
నెక్స్ట్ ఆఫ్ కిన్ అంటే, ఆ వ్యక్తి జీవిత భాగస్వామి, లేదా సమీప బంధువు, కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన గార్డియన్ అని అర్థం.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కోహ్లీ బీబీసీతో మాట్లాడుతూ, సైన్యంలో ఉన్న ప్రతి వ్యక్తీ తన సర్వీస్ సమయంలో అతని/ఆమె ఎన్‌వోకే వివరాలు అందించాలని చెప్పారు.
''ఎన్‌వోకేని ప్రభుత్వం కానీ, సైన్యం కానీ నిర్ణయించవు. అది ఆ వ్యక్తికి సంబంధించిన విషయం. వివాహం కాకపోతే, సాధారణంగా వారి తల్లిదండ్రులే ఎన్‌వోకే అవుతారు. వివాహమైతే, ఆ హోదా వారి భాగస్వామికి మారుతుంది'' అని ఆయన చెప్పారు.
ఏవైనా కారణాలుంటే ఆ వ్యక్తి తన ఎన్‌వోకేను మార్చుకోవచ్చని, అయితే అది చాలా అరుదుగా జరుగుతుందని నితిన్ కోహ్లీ అన్నారు.
మరో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ బీబీసీతో మాట్లాడుతూ, తన ఎన్‌వోకే ఎవరనేది సైనికుడు సొంతంగా నిర్ణయించుకుంటారని చెప్పారు.
''సైన్యంలో ఉన్న వ్యక్తి పార్ట్-2 ఆర్డర్(వివరాలు)ను నింపాలి. అప్పుడే ఆ వ్యక్తికి పెళ్లైనట్లు రికార్డ్ అవుతుంది. అందులో ఆ వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని వివాహం చేసుకున్నారు వంటి వివరాలను ఆ దరఖాస్తులో నింపాల్సి ఉంటుంది. దానికి కొన్ని పత్రాలు కూడా అవసరం'' అని ఆయన చెప్పారు.
తన వివరాలు బయటికి చెప్పేందుకు ఇష్టపడని సదరు రిటైర్డ్ జనరల్ ఇంకా వివరిస్తూ, ''పార్ట్ - 2 నింపే సమయంలో, తన ఎన్‌వోకే వివరాలను కూడా రాస్తారు. అప్పుడు, ఆ వ్యక్తికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎన్‌వోకేగా తన జీవిత భాగస్వామిని చేర్చవచ్చు. అలాగే తన తల్లిదండ్రులను కూడా చేర్చవచ్చు.''
''చాలామంది కొత్తవాళ్లకి ఎన్‌వోకే గురించి తెలియదు. అలాంటప్పుడు, యూనిట్‌లో ఉండేవారు ఎవరిని ఎన్‌వోకేలో చేర్చవచ్చో వారికి తెలియజేస్తారు'' అని ఆయన అన్నారు.
''ఒకవేళ మరణించిన సైనికుడి భార్య కీర్తి చక్ర ప్రదానం నాటికి మరో వివాహం చేసుకుంటే.. కీర్తి చక్ర అవార్డు తల్లిదండ్రులకు అందిస్తారు'' అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు.
ఎన్‌వోకే విధానంలో మార్పులు చేయాలన్న డిమాండ్ ఇదే మొదటిసారి కాదని, కార్గిల్ యుద్ధానంతరం ఇలాంటి కేసులు చాలా వచ్చాయని ఆయన చెప్పారు.
రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షి మాట్లాడుతూ, సర్వీసులో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా తన వీలునామా రాయొచ్చని, తన తదనంతరం ఆస్తిని ఎలా పంపిణీ చేయాలో తను నిర్ణయించుకోవచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రస్థాయిలోనూ పాలసీలో మార్పులు
సర్వీస్‌లో ఉండగా మరణించిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయం అందిస్తుంటాయి. ఇలాంటి కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ విధానాల్లో మార్పులు తెచ్చాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, భద్రత సిబ్బంది అమరులైతే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఆయన భార్యకు, తల్లిదండ్రులకు సమానంగా అందజేస్తారు.
అలాగే, ఉత్తరప్రదేశ్‌కి చెందిన సైనికుడు ఎవరైనా అమరుడైతే ఆయన కుటుంబానికి ఇస్తున్న రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను 50 లక్షల రూపాయలకు పెంచుతూ 2020లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ 50 లక్షల రూపాయల్లో రూ.35 లక్షలు భార్యకు, రూ.15 లక్షలు తల్లిదండ్రులకు అందజేస్తారు.
ఈ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందుకున్నట్లు కెప్టెన్ అన్షుమాన్ తండ్రి కూడా చెబుతున్నారు.
అమరులైన సైనికుల భార్యలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా విషయంలో హరియాణా ప్రభుత్వం కూడా 2017లో మార్పులు చేసింది. అందులో 70 శాతం భార్యాబిడ్డలకు, 30 శాతం తల్లిదండ్రులకు అందజేస్తోంది.

ఫొటో సోర్స్, SOCIALMEDIA
కెప్టెన్ అన్షుమాన్ వివాహం
2023 జులై 19వ తేదీ తెల్లవారుజామున సియాచిన్ గ్లేసియర్‌లోని భారత సైన్యానికి చెందిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో పలువురు సైనికులు చిక్కుకుకున్నారు.
ఆ సమయంలో తన ప్రాణాలను లెక్కచేయకుండా తన సహచరులను కాపాడేందుకు కెప్టెన్ అన్షుమాన్ ప్రయత్నించారు. నలుగురైదుగురు సైనికులను ఆయన రక్షించారు. కానీ, తాను మంటల నుంచి బయటపడలేకపోయారు.
ఈ ప్రమాదం జరగడానికి ఐదు నెలల ముందు, ఫిబ్రవరి 10న ఆయన స్మృతిని వివాహం చేసుకున్నారు. ఆమె వృత్తిరీత్యా ఇంజినీర్.
స్మృతి చెప్పిన వివరాల ప్రకారం, ఆమె ఇంజినీరింగ్ కాలేజీలో అన్షుమాన్‌ను కలిశారు. ఆ తర్వాత ఆయన పుణెలోని ఆర్మ్‌డ్ ఫోర్స్‌స్ మెడికల్ కాలేజీకి ఎంపికయ్యారు.
అక్కడ వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరారు. ఒకసారి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన పుణె నుంచి గురుదాస్‌పూర్ వచ్చారని స్మృతి చెప్పారు.
అన్షుమాన్‌ను గుర్తు చేసుకుంటూ, ''కాలేజీ మొదటి రోజు కలిశాం. తొలిచూపులోనే ప్రేమ పుట్టింది. నెల రోజులు ఒకరినొకరు కలుసుకున్నాం, తర్వాత ఎనిమిదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దురదృష్టవశాత్తూ, పెళ్లైన రెండు నెలల్లోనే ఆయనకు సియాచిన్‌లో పోస్టింగ్ వచ్చింది'' స్మృతి చెప్పారు.
''నేను మామూలుగా చనిపోను. నా ఛాతీపై పతకం ఉంటుంది. ప్రజలు నన్నెప్పుడూ గుర్తు చేసుకుంటారని అంటుండేవారు'' అని స్మృతి చెబుతున్నారు.
( బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














