సుప్రీంకోర్టు: ముస్లిం మహిళలకు మనోవర్తి తీర్పు ఎంత వరకు సాయ పడుతుంది, ఎదురయ్యే సమస్యలేంటి?

మనోవర్తి కేసు
    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు మనోవర్తి పొందవచ్చని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

విడాకులు తీసుకున్నముస్లిం మహిళలకు భరణం అంశం అనేక సంవత్సరా‌ల నుంచి వివాదాస్పదంగా ఉంది.

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తిరిగి పెళ్ళి చేసుకునేవరకు సీఆర్‌పీసీ కింద మనోవర్తి పొందవచ్చనే విషయాన్ని1985నాటి షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది.

కానీ కొన్ని ముస్లిం సంఘాల నిరసనకారణంగా ఓ ఏడాది తరువాత అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు మనోవర్తిని మూడు నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ ఓ చట్టాన్ని తీసుకువచ్చింది.

అయితే సీఆర్‌పీసీ కింద మహిళల మనోవర్తి హక్కును 1986నాటి చట్టం అడ్డుకోలేదని కోర్టులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాయి.

ఈ విషయంలో దశాబ్దాల తరబడి నిలకడగా ఉన్నకోర్టు వైఖరి, ఈ తీర్పు ద్వారా పునరుద్ఘాటించినట్టు అయిందని న్యాయనిపుణులు, సామాజిక కార్యకర్తలు బీబీసీకి చెప్పారు.

ఈ తీర్పుద్వారా కింది కోర్టులకు ఏమైనా సంశయాలు ఉన్నా తొలగిపోతాయని, అలాగే ప్రజలలో అవగాహన పెంచడానికి తోడ్పడుతుందని, తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.

మనోవర్తి ఉత్తర్వులు పొందడానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చని, దాని అమలు సవాలుతో కూడుకున్నదనే విషయాన్ని వారు గుర్తు చేశారు.

ముస్లిం సామాజిక కార్యకర్తలు తీర్పును స్వాగతించారు. ‘‘ఇదో హర్షించదిగిన ప్రగతిశీల తీర్పు’’ అని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్థకు చెందిన జకియా సోమన్ చెప్పారు.

అనేక కుటుంబన్యాయస్థానాలకు మనోవర్తి విషయంలో ఏ చట్టాన్ని అమలు చేయాలనే విషయంపై స్పష్టత లేదని ఆమె అన్నారు.

‘‘పర్సనల్ లా కింద మాత్రమే ముస్లిం మహిళలకు భరణం లభిస్తుందనేది ఇప్పటిదాకా ఉన్న నమ్మకం’’ అని సోమన్ తెలిపారు.

సుప్రీంకోర్టు తాజా తీర్పు మూలాలు, వివాహమైన ఐదేళ్ళ తరువాత 2017లో విడాకులు తీసుకున్న ఓ ముస్లిం జంట కేసులో ఉన్నాయి.

సీఆర్‌పీసీ కింద భరణం కోరుతూ ఆ మహిళ కేసు దాఖలు చేశారు.

కిందటేడాది జూన్‌లొ ఓ కుటుంబం న్యాయస్థానం ఆమెకు ప్రతినెలా 20,000 రూపాయలు భరణంగా చెల్లించాలని తీర్పు ఇవ్వగా, తరువాత దానిని హైకోర్టు 10,000 రూపాయలకు తగ్గించింది.

అయితే విడాకులు పొందిన ముస్లిం మహిళ, ముస్లిం మహిళలచట్టం (రక్షణ, విడాకులు) 1986 కింద మాత్రమే భరణం కోరాలని, లౌకిక చట్టమైన సీఆర్‌పీసీ కింద భరణాన్ని కోరడానికి వీల్లేదంటూ ఆ భర్త హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకెక్కారు.

ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏ చట్టం కింద భరణం కోరాలనేది ఆ మహిళ ఇష్టమని, కావాలనుకుంటే రెండింటినీ ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.

ట్రిపుల్ తలాక్ కేసులలో కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు చెప్పింది కొత్తచట్టమా?

ఈ కేసులోని మౌలిక విషయాన్ని 2001నాటి అనేక తీర్పులలో సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. అందుకే ఇదేమీ కొత్త చట్టం కాదు.

‘‘ముస్లిం మహిళలు భరణం పొందేందుకు సెక్షన్ 125 సీఆర్‌పీసీని ఉపయోగిస్తుంటాం. ఈ తీర్పుకు ముందు కూడా మీరు సెక్షన్ 125 లేదా 1986 చట్టం రెండింటిలో దేనినైనా ఎంచుకునే వెసులుబాటు ఉంది.’’ అని ముంబయిలోని ఫ్యామిలీ కోర్టు లాయర్ నీలోఫర్ అక్తర్ చెప్పారు.

ట్రిపుల్ తలాక్‌ (దీనిని 2019నాటి చట్టం నేరంగా పరిగణించింది) తో విడాకులు పొందిన మహిళలు కూడా సెక్షన్ 125 కింద భరణం పొందవచ్చని కోర్టు తెలిపింది.

మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 2019నాటి ట్రిపుల్ తలాక్ చట్టంలో మహిళకు భత్యం పొందే అవకాశాన్ని కల్పించారు.

ముస్లిం మహిళ
ఫొటో క్యాప్షన్, మహిళల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు.

గృహిణుల హక్కు

వ్యక్తిగత ఆదాయం లేని భార్యకు ‘ఆర్థిక సాధికారికత’ కల్పించాల్సిన బాధ్యత భర్తదేనని జస్టిస్ బీవీ నాగరత్న తన తీర్పులో రాశారు.

‘‘మన సమాజంలోని అనేక వర్గాలలో మహిళల శ్రమకు ప్రతిఫలం దక్కడం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాక, విడాకులు పొందిన తరువాత ఆ మహిళను ఇల్లు విడిచిపొమ్మనవచ్చు. అప్పుడు ఆమె తలదాచుకునే విషయంలో అభద్రతాభావానికి గురవుతుందని, ఇలాంటి విషయాలలో ఆమెకు రక్షణ కల్పించాలని చెప్పారు.

‘‘ నా వరకు ఈ తీర్పులో ఇది ముఖ్యమైన భాగం’’ అని ఫ్యామిలీ మేటర్స్ కూడా చూసే లాయర్ అభే నరుల చెప్పారు.

‘‘అనేకమంది గృహిణులకు సొంత ఆదాయం ఉండదు. కానీ ఆమె తన వైవాహిక జీవితంలో ఓ కుటుంబాన్ని నిర్మించడంలోని ఆమె పాత్రను విస్మరించలేదనిగా గుర్తించాలి.’’ అని చెప్పారు.

అయితే న్యాయమూర్తి వ్యాఖ్యలు అన్ని సందర్భాలలోనూ అనుసరించే నిర్బంధ ఉదాహరణ కాదు.

హైకోర్టులు కూడా పరస్పర భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయని సుప్రీం కోర్టు గుర్తించింది.

సెక్షన్ 125 కింద ముస్లిం మహిళ భరణం కోరడానికి వీల్లేదంటూ 2008 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం ప్రస్తావించింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వారా స్పష్టత వస్తుందని జకియా సోమన్ విశ్వసిస్తున్నారు.

సెక్యులర్ లా కింద భరణం పొందడం ఇస్లాంకు వ్యతిరేకమని, మహిళలు అలా చేయరని పలువురు మతగురువులు చెబుతున్నారని, సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ షీబా అస్లాం ఫెహ్మీ చెప్పారు.

సుప్రీంకోర్టు చేసిన పునరుద్ఘాటన ఈ విషయం ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘పునరుద్ఘాటన మరింత అవగాహన తెస్తుంది’’ అని స్త్రీవాద కార్యకర్త, బెబాక్ కలెక్టివ్ వ్యవస్థాపకురాలు హసీనాఖాన్ చెప్పారు.

‘‘విడాకుల తరువాత కొంతమంది మహిళలు భరణం అడుగుతారు. మేం 20 మంది మహిళలతో సమావేశమై, తీర్పును చదివి, వారికి వివరించాం. వారంతా ఇది మంచి తీర్పు అని చెప్పారు. అంతకుముందు దీని గురించి వీరికి తెలియదు. ఇలా తెలియకపోవడమనేది సాధారణ విషయమే’’ అని ఆమె చెప్పారు.

ఈ తీర్పుపై పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.

‘‘విడాకులు పొందిన ముస్లిం మహిళకు జీవితాంతం భరణం చెల్లించాలంటూ నిన్న సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది. ఇది షరియా చట్టానికి వ్యతిరేకం’’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.క్యూ.ఆర్. ఇలియాస్ అన్నారు.

హిందూ ముస్లింలు వైవాహిక కేసులకు సంబంధించి వారి వారి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ‘‘అందుకే పై చట్టాలకు విరుద్ధంగా కోర్టులు ఐపీసీ, సీఆర్‌పీసీ వర్తింపచేయడాన్ని నిరోధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏఐఎంపీఎల్‌బీ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తోందని, అందుబాటులో ఉన్న న్యాయపరమైన అవకాశాలపై నిర్ణయం తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చట్టప్రకారం మధ్యంతర మనోవర్తి 60రోజులలోగా మంజూరు చేయాలి.

సెక్షన్ 125లోని ఇబ్బందులు

సెక్షన్ 125 కింద సహాయం కోరడం సవాలుతో కూడుకున్నదని న్యాయవాదులు, కక్షిదారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న హుమాకు 2023లో విడాకులు వచ్చాయి. అయితే దీనికి 8 సంవత్సరాలు పట్టింది. ఈప్రక్రియలో ఆమె మధ్యంతర మనోవర్తి పొందడం అగ్నిపరీక్షగా మారింది.

చట్టప్రకారం మధ్యంతర మనోవర్తి 60 రోజులలోగా మంజూరు చేయాలి. ‘‘మొత్తం ప్రక్రియ భావోద్వేగ, మానసిక, ఆర్థిక ఇబ్బందిగా ఉంటుంది’’ అని ఆమె అన్నారు.

2015 సెప్టెంబరులో మెయింటెనెన్స్ కోసం హుమా దరఖాస్తు చేసుకోగా, ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులకు మూడేళ్లు పట్టింది. ఈ తీర్పును ఆమె భర్త హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సవాలు చేశారు.

చివరకు ఆమె భరణం విషయంలో తన భర్తతో రాజీ కుదుర్చుకున్నారు.

‘‘భరణం పొందడం అంత తేలిక కాదు. భర్తకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలి. నా భర్త ఆర్థికస్థితిగతులు నాకు తెలుసు. అయినా చాలా కష్టాలు పడ్డాను. ఓ మామూలు వ్యక్తికి ఇదో పెద్దపని.’’ అని ఆమె చెప్పారు.

ఇదో నిత్యకృత్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు.

‘‘కోర్టు సమయం తీసుకుంటుంది. ముందుగా మీకు ఎటువంటి ఆదాయం లేదని నిరూపించాలి. అలాగే భర్తకు మంచి ఆదాయ వనరులు ఉన్నాయని కూడా చూపించాలి. అది కూడా సమయం పడుతుంది.’’ అని ఫ్యామిలీ కోర్ట్ లాయర్ నీలోఫర్ అక్తర్ చెప్పారు.

‘‘మధ్యంతర మనోవర్తి పొందడానికి 1 నుంచి 2 ఏళ్ళు పడుతుంది. ఇక తుది ఉత్తర్వులు రావడానికి సగటున 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది’’ అని అక్తర్ అన్నారు.

కోర్టు ఉత్తర్వులు పొందినా, దాని అమలు సవాలుతో కూడుకున్నది.

‘‘అతిపెద్ద సవాలు డబ్బు రికవరీ చేయడమే. నా క్లయింట్స్ చాలామందికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ వారి భర్తలు డబ్బులు ఇవ్వకపోవడం, లేదంటే ఆలస్యంగా చెల్లించడమో చేస్తారు. అలాంటప్పుడు ఆ మహిళ మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది.’’ అని దిల్లీలో న్యాయవాదిగా పనిచేస్తున్న అభే నరులా చెప్పారు.

ఈ జాప్యం లేకుండా ఉండటానికి గృహహింస చట్టం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయత్నించాలని కక్షిదారులకు సలహా ఇస్తున్నట్టు న్యాయనిపుణులు చెబుతున్నారు.

( బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)