విడాకులు తీసుకుంటే ముస్లిం మహిళ ఏ చట్టప్రకారం భరణం పొందొచ్చు, ఇస్లాంలోని 'ఇద్దత్' ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, GETTYIMAGES/ROLLINGEARTH
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
విడాకుల తర్వాత ముస్లిం మహిళ ఏ చట్టప్రకారం భరణం పొందవచ్చు? సీఆర్పీసీ సెక్షన్ 125 కిందా, లేక ముస్లిం పర్సనల్ లా కింద పొందవచ్చా?
ఈ విషయంలో సహకరించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జి మసీహ్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్‌ను అమికస్ క్యూరీగా నియమించారు.
ఈ విషయంలో ఓ ముస్లిం వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇది సుప్రీం కోర్టుకు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు విషయం ఏమిటి?
విడాకుల తర్వాత మాజీ భార్యకు ప్రతి నెలా 20,000 రూపాయలు భరణం చెల్లించాలని తెలంగాణ ఫ్యామిలీ కోర్టు మహ్మద్ అబ్దుల్ సమద్‌కు సూచించింది.
సమద్ తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చారని ఫ్యామిలీ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 125 కింద భరణం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ తెలిపారు.
ఫ్యామిలీ కోర్టు నిర్ణయంపై సమద్ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఈ కేసులో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో, దీనిపై నిర్ణయం తీసుకునే వరకూ 10,000 రూపాయలు మధ్యంతర భృతిగా చెల్లించాలని పిటిషనర్ సమద్‌ను కోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సమద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ ఒక సాధారణ చట్టమని, సీఆర్పీసీ సెక్షన్ 125తో పోలిస్తే, 1986 చట్టం ఒక ప్రత్యేక చట్టమనే వాస్తవాన్ని హైకోర్టు విస్మరించిందని, దానిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
మహ్మద్ అబ్దుల్ సమద్ తరఫు న్యాయవాది వసీం ఖాద్రీ బీబీసీతో మాట్లాడుతూ, "ముస్లిం మహిళకు విడాకుల విషయంలో సెక్షన్ 125 అమలు చేయడం సాధ్యం కాదు, కానీ ముస్లిం మహిళ భర్త నుంచి విడిపోవడం లేదా ఆమె భర్త పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో, సదరు మహిళ ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చు'' అన్నారు.
"విడాకులు తీసుకున్న మహిళకు 1986 ప్రత్యేక చట్టం వర్తిస్తుంది, అంటే, ఆమెకు ఇద్దత్ కాలం(ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, సుమారు మూడు నెలలు)లో మాత్రమే భరణం చెల్లించాల్సి ఉంటుంది. కోర్టులో అవే వాదనలు వినిపించాను. అది కూడా అతని సామర్థ్యం మేరకు చెల్లించాల్సి ఉంటుంది'' అని వసీం ఖాద్రీ అన్నారు.
అయితే, ఈ విషయంలో సెక్షన్ 125 కింద ప్రతి నెలా భరణం చెల్లించాలని ఆదేశాలిస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టులు ఇచ్చిన డజనుకు పైగా తీర్పులను అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ తన వాదనల సందర్భంగా ఉదహరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పిటిషన్‌పై ప్రశ్నలు
పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి షా బానో కేసుకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారా? అనే ప్రశ్నను లేవనెత్తారు జర్నలిస్టు, రచయిత జియా ఉస్ సలామ్.
విమెన్ ఇన్ మసీద్, టిల్ తలాక్ డూ అజ్ పార్ట్: అండర్‌స్టాండింగ్ తలాక్, ట్రిపుల్ తలాక్, ఖులా వంటి పుస్తకాలను జియా ఉస్ సలామ్ రచించారు. ''గత 47 ఏళ్లలో భారత దేశంలోని ముస్లిం సమాజం ఎక్కడికి చేరుకుందో ఆలోచించాల్సిన అవసరముంది. షా బానో అప్పట్లో ఒక చిన్న డిమాండ్ చేశారు, రాజీవ్ గాంధీ దానిని తోసిపుచ్చారు'' అని ఆయన అన్నారు.
ముస్లిం పర్సనల్ లా ఇద్దత్ గురించి చెబుతుందని, కానీ మీ భార్య బాధ్యత మీదేనని, ఆమె మరొకరిని వివాహం చేసుకునేంత వరకూ అది మీ బాధ్యతేనని ముస్లిం అనలిస్టులు అంటున్నారని ఆయన అన్నారు.
ఇస్లామిక్ చట్టం గురించి ఆయన మాట్లాడుతూ, ''డబ్బు సంపాదించడం పురుషుడి బాధ్యత అని, ఒకవేళ మహిళ డబ్బులు సంపాదించినా పురుషుడి నుంచి భరణం, భృతి తీసుకునే హక్కు ఆమెకు ఉంది. తన స్వార్జితంపై పూర్తి హక్కు మహిళకు ఉంటుంది. ఆమె సంపాదించిన డబ్బుపై పురుషుడికి ఎలాంటి హక్కూ లేదు'' అన్నారు.
ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే, ఆమెకు తగిన భరణం చెల్లించాలని ఖురాన్‌లో కూడా ఉందని జియా ఉస్ సలామ్ చెప్పారు.
అయినప్పటికీ దానిపై భిన్నమైన వానదలు పుట్టుకొచ్చాయి.

ఫొటో సోర్స్, GETTYIMAGES/TWENTY47STUDIO
షా బానో కేసు
ముస్లిం మహిళల హక్కులు, పర్సనల్ లా (వ్యక్తిగత చట్టం)కి వ్యతిరేక పోరాటం విషయంలో షా బానో కేసును ఒక మైలురాయిగా పరిగణిస్తారు.
ముస్లిం మహిళలు చట్టపరమైన హక్కులు పొందేందుకు ఈ కేసు చట్టపరంగా వీలు కల్పించింది.
విడాకుల తర్వాత ఎలిమొనీ (భరణం) చెల్లించాలన్న నిర్ణయాన్ని షా బానో కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది.
''హిందూ వివాహ చట్టం ప్రకారం, ఎలీమొనీలో పర్మినెంట్ ఎలిమొనీ, మంత్లీ ఎలిమొనీ అనేవి రెండు రకాలు. భార్యాభర్తలు పరస్పర సమ్మతితో విడాకులు తీసుకునేందుకు అంగీకరించిన పక్షంలో కోర్టు పర్మినెంట్ ఎలిమొనీ (శాశ్వత భరణం - సింగిల్ టైమ్ సెటిల్‌మెంట్) ఆదేశాలివ్వొచ్చు. లేదా మంత్లీ ఎలిమొనీ, అంటే మంత్లీ మెయింటెనెన్స్ (ప్రతి నెలా భరణం) ఇవ్వాలని తీర్పు ఇవ్వొచ్చు'' అని ఏపీ హైకోర్టు న్యాయవాది లీలాకృష్ణ చెప్పారు.
'ఒకవేళ పిటిషనర్ భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తే, ఆ కేసు తుది తీర్పు వచ్చేలోపు ఖర్చుల కోసం ఇంటెరిమ్ మెయింటెనెన్స్ (మధ్యంతర భరణం) ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించవచ్చు'' అని ఆయన అన్నారు.
అయితే, ముస్లిం వ్యక్తిగత చట్టంలో కోర్టు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చనే దానిపై రాజకీయ వివాదం కూడా తలెత్తింది.
అలాగే, ముస్లిం మహిళలకు వివాహంలో సమాన హక్కులు కల్పించడంతో పాటు, సాధారణ కోర్టులో విడాకులు తీసుకునే వెసులుబాటును షా బానో కేసు కల్పించింది.
1978లో షా బానో అనే 62 ఏళ్ల ముస్లిం మహిళ తన భర్త మహ్మద్ అహ్మద్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
1932లో షా బానోకి, మహ్మద్ అహ్మద్ ఖాన్‌తో వివాహమైంది. వారికి ఐదుగురు పిల్లలు.
మహ్మద్ అహ్మద్ ఖాన్ వృత్తిరీత్యా న్యాయవాది, ఆయన ఇస్లామిక్ చట్టం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారు.
దీని తర్వాత, షా బానో 1978లో ఇందోర్ కోర్టును ఆశ్రయించారు. నెలకు రూ.500లు భరణంగా చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 125 ప్రకారం, భరణం చెల్లించాలని కోరారు.
కానీ, భారతీయ ముస్లిం పర్సనల్ లా ప్రకారం, విడాకుల తర్వాత ఇద్దత్ కాలం వరకు మాత్రమే భరణం చెల్లిస్తారని మహ్మద్ అహ్మద్ ఖాన్ వాదించారు.

ఫొటో సోర్స్, GETTYIMAGES/TASHDIQUE MEHTAJ AHMED
ఏమిటీ ఇద్దత్?
ముస్లిం పర్సనల్ లా ప్రకారం, భర్త మరణం లేదా విడాకుల తర్వాత భార్య గడిపే కాలం ఇద్దత్.
సాధారణంగా ఈ వ్యవధి మూడు నెలలు. కానీ, పరిస్థితులను బట్టి ఇది మారుతుంది. ఇద్దత్ కాలం తర్వాత సదరు మహిళ మళ్లీ వివాహం చేసుకోవచ్చు.
మహ్మద్ అహ్మద్ ఖాన్ కేసు సందర్భంలో ఆలిండియా పర్సనల్ లా బోర్డు ఆయనకు మద్దతిచ్చింది. ముస్లిం వ్యక్తిగత చట్ట పరిధిలోకి వచ్చే విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని పేర్కొంది.
ఈ విషయంలో సుదీర్ఘ విచారణ అనంతరం 1985లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ కింద భరణం చెల్లించాలన్న హైకోర్టు తీర్పు సరైనదేనని జస్టిస్ వైవీ చంద్రచూడ్ సమర్థించారు.
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత రాజకీయ దుమారం రేగడంతో పాటు ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల చట్టం (రక్షణ, విడాకులు చట్టం) 1986ను ఆమోదించడం మరో అంశం.
ఫలితంగా, షా బానో కేసులో వచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ, ఇద్దత్ కాలానికి మాత్రమే భత్యం ఇవ్వగలమని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఆర్పీసీ సెక్షన్ 125 ఏం చెబుతోంది?
సీఆర్పీసీ సెక్షన్ 125, 1973 ప్రకారం, నిర్లక్ష్యానికి గురైన ప్రతి వ్యక్తికి సామాజిక న్యాయం కింద భరణం అడిగే హక్కు ఉంటుంది.
ఈ సెక్షన్ కింద ఏ మతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఆర్పీసీ సెక్షన్ 125లో భరణం గురించి, ఎవరెవరు భరణం కోరవచ్చనే విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.
భార్య
హిందూ మతంలో, పురుషుడితో వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు అయితే మాత్రమే మహిళను భార్యగా పరిగణిస్తారు.
ఇందులో రెండో భార్య భరణం డిమాండ్ చేయలేదు. ఎందుకంటే, చట్టప్రకారం రెండో వివాహం చట్టబద్ధం కాదు.
తన మొదటి పెళ్లి గురించి వివరాలు దాచిపెట్టి భర్త రెండో పెళ్లి చేసుకుని ఉంటే, అలాంటప్పుడు రెండవ భార్య భరణం కోరవచ్చు.
ఏ మూడు పరిస్థితులలో భరణం పొందేందుకు భార్య అర్హురాలు కాదు?
- ఆమె మరొకరితో వివాహేతర సంబంధంలో ఉన్నప్పుడు..
- సరైన కారణం చెప్పకుండానే భర్తను వదిలేసినప్పుడు..
- పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు విడిగా జీవిస్తున్న సందర్భంలో..

ఫొటో సోర్స్, Getty Images
''సెక్షన్ 125 ప్రతి మహిళకు భరణం పొందే హక్కు కల్పిస్తోంది. అందులో మతంతో సంబంధం లేదు'' అని న్యాయవాది, మహిళా హక్కుల గురించి బలంగా వాదించే సోనాలి కద్వాస్రా చెప్పారు.
అయితే, పర్సనల్ లాలో భరణం చెల్లింపులకు సంబంధించి వేర్వేరు నిబంధనలు ఉన్నట్లుగానే, మహిళలకు భరణం చెల్లించే నిబంధనలో కొంత తేడా ఉంటుంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24, భారతీయ విడాకుల చట్టంలోని సెక్షన్ 37, ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 24లో ఈ నిబంధనలు పొందుపరిచారు.
కానీ, సీఆర్పీసీ సెక్షన్ 125ని ముస్లిం వ్యక్తిగత చట్టంతో పోల్చలేమని కూడా స్పష్టం చేసింది.
ముస్లింలలో పురుషుడు, మహిళ అంగీకారం తెలిపితేనే ఆ నిఖా (వివాహం) చెల్లుబాటు అవుతుంది. అలాగే, మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆమె ఇద్దత్‌లో ఉండకూడదు.
సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం, ఒక ముస్లిం మహిళ ఇద్దత్ కాలం గడిచిన తర్వాత కూడా మరో పెళ్లి చేసుకోకపోతే, భరణం పొందే హక్కు ఆమెకు ఉంటుంది.
దీనితో పాటు, వారికి చట్టబద్ధంగా పుట్టిన పిల్లలు లేదా వివాహం జరగకుండానే(సహజీవనం లాంటివి) జన్మించిన పిల్లలు కూడా భరణం పొందేందుకు అర్హులు. అలాగే, తల్లిదండ్రులు కూడా తమ కడుపున పుట్టిన పిల్లలు, లేదా దత్తత తీసుకున్న పిల్లల నుంచి భరణం డిమాండ్ చేయవచ్చు.
ఈ అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది, తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.
ఇవి కూడా చదవండి:
- ఎస్. జైశంకర్: రష్యా విషయంలో భారత్ 'స్మార్ట్' అని అమెరికా విదేశాంగ మంత్రితో ఎందుకన్నారు?
- యువ ఆటగాళ్ల ఆట కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ల రిటైర్మెంట్కు కారణమవుతుందా?
- విన్స్టన్ చర్చిల్: హిట్లర్ మాదిరిగానే ఆయన చేతులూ రక్తంతో తడిచాయా... బెంగాల్ కరవుకు ఆయనే కారణమా?
- విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు... తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?
- తిరుపతి: ఎస్వీ జూ పార్క్‌లో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














