బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు

- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించినప్పుడు చీకటిలో కాంతి రేఖలు కనిపించాయి. ఆ కాంతిరేఖల్ని మా వైపుకు లాక్కుంటామని మాకు అనిపించింది.’’
ఈ మాటలు అన్నది రేవతి లాల్. గుజరాత్ అల్లర్లపై 'ది అనాటమీ ఆఫ్ హేట్' అనే పుస్తకాన్ని ఆమె రాశారు. బిల్కిస్ బానో కేసులో ఆమె పిటిషనర్.
రేవతి లాల్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఒక సాయంత్రం తోటి జర్నలిస్టు తనకు ఫోన్ చేసి ఈ కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలనుకుంటున్నావా? అని తనను అడిగినట్లు ఆమె చెప్పారు. అలా అడిగిన వెంటనే దానికి తాను ఒప్పుకున్నట్లు రేవతి తెలిపారు.
రేవతిలాల్ దిల్లీకి చెందినవారు. ‘‘గుజరాత్ అల్లర్ల తర్వాత నేను ఒక ప్రైవేట్ చానెల్‌లో జర్నలిస్టుగా పనిచేశాను. అప్పుడే ఈ కేసు మీద నా దృష్టి పడింది. ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారించినప్పుడు, బిల్కిస్ బానో విలేఖరుల సమావేశం నిర్వహించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కానీ నేను వ్యక్తిగతంగా బిల్కిస్ బానోను ఎప్పుడూ కలవలేదు. ఎందుకంటే ఆమె బాధను పెంచడం నాకు ఇష్టం లేదు. ఆమె ధైర్యాన్ని మనం ఊహించలేం. అందుకే నాకు ఫోన్ వచ్చిన వెంటనే పిటిషన్ వేసేందుకు ఒప్పుకున్నా. నాకెందుకు ఈ ఆలోచన రాలేదని అనుకున్నా’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, FB/REVATI LAUL
ఏంటి విషయం?
రేవతి లాల్ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో ‘‘సర్ఫరోషి ఫౌండేషన్’’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.
బిల్కిస్ బానో కేసులో తనకంటే ముందే సుభాషిణి అలీ, రూప్‌రేఖా వర్మ పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. సుభాషిణి అలీకి ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని ఆమె చెప్పారు.
బిల్కిస్ బానో అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సోమవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా దోషులంతా జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
ఈ కేసులో దోషులకు శిక్ష మాఫీ చేయడం, రిమిషన్ పాలసీపై విచారించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరరం బిల్కిస్ బానో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘దీన్ని న్యాయం అని పిలుస్తారు. నాకు, నా పిల్లలకు, మహిళలందరికీ సమాన న్యాయం జరుగుతుందనే ఆశను అందించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు" అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTYIMAGES/ANADOLU
బిల్కిస్ బానో కేసులో ఏళ్ల తరబడి జరిగిన విచారణ తర్వాత సీబీఐ కోర్టు 11 మందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
అయితే, రిమిషన్ పాలసీ కింద దోషుల విడుదల కోసం అప్పీల్ చేయగా, గుజరాత్ హైకోర్టు ఆ అప్పీల్‌ను తిరస్కరించింది.
దీంతో దోషులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో నిర్ణయం తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
గుజరాత్ ప్రభుత్వం ఈ కేసుపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల తర్వాత 2022లో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

‘‘ఇన్నేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు’’
‘‘ఒకవైపు ప్రధాని ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తున్నారు. మరోవైపు విడుదలైన ఈ దోషులకు పూలమాలలు వేసి స్వాగతం పలకడాన్ని అందరం చూశాం.
ఈ ఘటన తర్వాత ఒక ఇంటర్వ్యూలో బిల్కిస్ బానో మాట్లాడుతూ ఇది న్యాయానికి అంతమా? అని అడిగారు. అప్పుడే మాకో ఆలోచన వచ్చింది’’ అని మాజీ ఎంపీ, సీపీఐ (మార్క్సిస్టు) నేత సుభాషిణి అలీ అన్నారు.
ఆ తర్వాతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన తమకు వచ్చిందని సుభాషిణి చెప్పారు.
ఈ పోరాటంలో చాలా మంది పాల్గొన్నారని ఆమె అన్నారు. న్యాయవాదులు, ఎంపీ కపిల్ సిబల్, అపర్ణా భట్‌తో పాటు పలువురు వ్యక్తులు ముందుకు వచ్చి ఈ కేసులో మొదటి పిటిషనర్‌గా మారారని ఆమె వివరించారు.
2002లో ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తాను బిల్కిస్ బానోను శరణార్థి శిబిరంలో కలిశానని, అప్పటి నుంచి ఆమెకు సహకరిస్తున్నానని సుభాషిణి తెలిపారు.
‘‘ఇన్నేళ్లలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. నేను జడ్జీల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా’’ అని సుభాషిణి ప్రశంసించారు.
ఇంత సుదీర్ఘ పోరాటం ఎవరు చేయగలరు? ఎంత మంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలరు? అనే విషయాలను ఆలోచించాలని ఆమె అన్నారు.

‘‘పోరాడాల్సింది ఇంకా చాలా ఉంది’’
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలకు సంబంధించిన వార్త విన్నప్పుడు ఎంతో షాక్ కలిగిందని, చాలా నిరాశగా అనిపించిందని ప్రొఫెసర్ రూప్‌రేఖా వర్మ అన్నారు.
‘‘న్యాయం మీద ఆశలు చచ్చిపోయాయి. కానీ, ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నిరాశ మేఘాలు కాస్త తొలిగిపోయాయి’’ అని రూప్‌రేఖా వర్మ వ్యాఖ్యానించారు.
ఆమె లక్నో యూనివర్సిటీలో తత్వశాస్త్రం బోధించారు. సామాజిక, లింగ వివక్ష సమస్యలపై పనిచేశారు.
‘‘దోషులు విడుదలైన కొన్ని రోజుల తర్వాత దీనిపై ఏదైనా చేయాలని చర్చించి దిల్లీలోని మా వ్యక్తుల్ని సంప్రదించడం మొదలుపెట్టాం’’ అని ఆమె చెప్పారు.
ఇంకా చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయని భావిస్తోన్న ఆమె తమ వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడానికి నిరాకరించారు.
కానీ కపిల్ సిబల్, వృందా గ్రోవర్, ఇందిరా జైసింగ్ వంటి సహచరులతో చర్చల గురించి ఆమె బహిరంగంగా చెబుతారు.
పిల్ దాఖలు చేయాలనే చర్చ వచ్చినప్పుడు ఆమె దిల్లీ విమానాశ్రయానికి వెళుతున్నారు. ఈ పిటిషన్‌లో పేరు చేర్చాలంటూ అప్పుడే ఆమెకు ఫోన్ వచ్చింది.
ఆ తర్వాత సుప్రీం కోర్టులో సామూహికంగా పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో సుభాషిణి అలీ, రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్‌రేఖా వర్మ పేర్లు ఉన్నాయి. అయితే, బిల్కిస్ బానోను ప్రొఫెసర్ రూప్‌రేఖా వర్మ ఎప్పుడూ కలవలేదు. ఎందుకంటే ఆమెను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని రూప్‌రేఖా వర్మ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మహారాష్ట్రలో బీజేపీ సర్కారు... కేసు ముందుకెళ్లే దారిపై సందేహాలు’’
సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
"కోర్టు తీర్పు దోషులకు గుణపాఠం నేర్పింది. వారి పరువు పోయింది. ఎందుకంటే వారు అబద్ధాలు చెప్పి శిక్ష నుంచి ఉపశమనం పొందారు. కానీ ఇప్పటికీ భయం అలాగే ఉంది ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ సర్కారు ఉంది. కానీ, మాకు కోర్టుపై నమ్మకం ఉంది’’ అని ఆమె అన్నారు.
సుభాషిణి అలీ కూడా ఈ కేసులో ముందుకు వెళ్లే దారిపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే మహిళలు ధైర్యం కోల్పోకూడదని, వారికి సహాయం చేయడానికి చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆమె ధైర్యం చెప్పారు.
ఇది సామాన్య పౌరులు, మీడియా, ప్రతీ ఒక్కరు చేసిన ప్రజా పోరాటమని సుభాషిణి అన్నారు.
ఈ కేసులోని మొత్తం 11 మంది దోషులు మరో రెండు వారాల్లోగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు శిక్షను తగ్గించడం అంత తేలిక కాదని సుప్రీం కోర్టులో బిల్కిస్ బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా అన్నారు.
2008లో మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పాలసీ ప్రకారం, బిల్కిస్ బానో కేసు నిందితులు కనీసం 28 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు వంటి కేసుల్లో 28 ఏళ్ల జైలు శిక్ష తర్వాత మాత్రమే మాఫీ ఇవ్వొచ్చని మహారాష్ట్ర ప్రభుత్వ విధానం చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











