కుక్క మాంసాన్ని నిషేధించిన దక్షిణ కొరియా... ఎందుకీ నిర్ణయం?

సౌత్ కొరియా డాగ్ మీట్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియాలో కుక్క మాంసం విక్రయాలపై నిషేధం విధించారు

శునక వధశాలలను, మాంసం కోసం కుక్కలను విక్రయించడాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా కొత్తచట్టం తీసుకువచ్చింది.

ఈ చట్టం 2027 నుంచి అమల్లోకి రానుంది. శతాబ్దాల తరబడి అలవాటుగా మారిన కుక్కమాంస భక్షణకు దక్షిణ కొరియాలో ఎండ్ కార్డు పడనుంది.

వంటకాల్లో కుక్కమాంసం ఉండటాన్ని సౌత్ కొరియాకు చెందిన పాతతరంవారు గొప్పగా భావించేవారు. కుక్కమాంసం వంటకాన్ని ‘బోషిన్‌తంగ్’ అని పిలుస్తారు. కానీ, దక్షిణ కొరియా యువతకు ఇప్పుడు ఈ వంటకం అంతగా రుచించడం లేదు.

కొత్త చట్టం ప్రకారం కుక్క మాంసాన్ని తినడమైతే అక్రమమేమీ కాదు. కిందటేడాది జరిపిన ప్రజాభిప్రాయసేకరణలో గత 12 నెలల్లో తాము కుక్క మాంసాన్ని తిన్నట్టు 8 శాతం మంది చెప్పారు. ఈ సంఖ్య 2015లో 27 శాతంగా ఉంది. అయితే, కొంతమంది మాత్రం కుక్క మాంసం వినియోగాన్ని సమర్థించారు.

జంతువుల హక్కుల కాపాడటానికి ఈ నిషేధం తప్పనిసరి 22 ఏళ్ళ విద్యార్థి లీ చే యెన్ చెప్పారు. ‘‘ఈ రోజుల్లో చాలామంది వద్ద పెంపుడు జంతువులు ఉన్నాయి’’అని ఆమె బీబీసీతో చెప్పారు. ‘‘కుక్కలు ఇప్పుడు మన కుటుంబంలో భాగంగా మారాయి. మాంసం కోసం వాటిని చంపడం భావ్యం కాదు’’ అని తెలిపారు.

ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలను వధించేవారికి మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తారు. అలాగే మాంసం కోసం కుక్కలను పెంచుకునేవారికి, కుక్కలను మాంసం కోసం విక్రయించేవారికి రెండేళ్ళ గరిష్ఠ జైలు శిక్ష పడుతుంది.

ఈ చట్టం అమల్లోకి వచ్చేలోపు కుక్కమాంసం వ్యాపారంపై ఆధారపడిన రైతులు, రెస్టారెంట్‌లు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది.

దక్షిణ కొరియాలో కుక్క మాంసం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు, ఆయన సతీమణి ఇద్దరూ జంతుప్రేమికులే

మూడేళ్ళలో మొత్తం వ్యాపారం బంద్

దక్షిణ కొరియా ప్రభుత్వ లెక్కల ప్రకారం..2023లో ఆ దేశంలో 1600 కుక్కమాంసం రెస్టారెంట్లు, 1,150 కుక్కల పెంపక కేంద్రాలు ఉన్నాయి. వీరంతా కూడా తమ వ్యాపారాలను ఎలా మూసివేయనున్నారో ఓ ప్రణాళికను స్థానిక అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

అయితే వీరందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏ మేర నష్టపరిహారం ఇవ్వనుందనే విషయం మాత్రం ప్రకటించలేదు.

మంగళవారం నాడు సియోల్‌లోని ఓ వీధిలో కుక్కమాంసం వంటకాలను సర్వ్ చేసే రెస్టారెంట్‌లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధులు ప్రవేశించడం కనిపించింది. ఇక్కడే తరాల విభజన చాలా స్పష్టంగా కనిపించింది.

ఈ నిషేధంపై 86 ఏళ్ళ కిమ్ సియోన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మధ్యయుగాల నుంచి మేం దీనిని తింటున్నాం. మా సంప్రదాయ ఆహారాన్ని ఇప్పుడు కాదాంటారా?’’ అని ప్రశ్నిస్తూ ‘‘కుక్క మాంసాన్ని నిషేధిస్తే గొడ్డు మాంసం కూడా నిషేధించాలి’’ అన్నారు.

1980ల నాటి దక్షిణ కొరియా ప్రభుత్వాలు కుక్క మాంసం నిషేధిస్తామని చెప్పాయి. కానీ ఆచరణలో విఫలమయ్యాయి. ప్రస్తుత దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్, ఫస్ట్ లేడీ కిమ్ కియో హీ జంతు ప్రేమికులుగా ప్రసిద్ధి చెందారు. వీరి వద్ద ఆరు శునకాలు ఉన్నాయి. శునక మాంసం తినే అలవాటుకు స్వస్తి పలకాలని ఫస్ట్ లేడీ పిలుపు ఇచ్చారు.

మంగళవారంనాడు ఈ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్ ఓటు చేయడాన్ని జంతు హక్కుల గ్రూపులు స్వాగతించాయి.

కొరియాలోని హ్యూమన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జంగ్ ఆహ్ ఛే తన జీవితకాలంలో ఈ నిషేధం జరుగుతుందని అనుకోలేదని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. ‘‘లక్షలాది కుక్కలను తలుచుకుంటే నా గుండె ముక్కలవుతోంది. ఇప్పటికైనా ఈ దయనీయ ఘట్టానికి ముగింపు పలికినందుకు, భవిష్యత్తులో వాటితో స్నేహపూరితంగా మెలిగేందుకు అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.

దక్షిణ కొరియాలో కుక్కమాంసంపై నిషేధం

ఫొటో సోర్స్, GETTY IMAGES

నిషేధంపై వ్యతిరేకత

అయితే, కుక్కల పెంపకం దార్లు ఈ నిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే యువత శునక మాంస భక్షణ పట్ల ఆసక్తి చూపడం లేదు కనుక ఈ వ్యాపారం ఆదరణ లేక దానంతట అదే మూలనపడేవరకు కొనసాగనివ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న రెస్టారెంట్ యజమానులు, పెంపకందారులందరూ వృద్ధులే కావడంతో ఈ సమయంలో తాము మరో జీవనోపాధిని వెదుక్కోవడం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు.

జూ యోంగ్ బాంగ్ అనే రైతు ఇప్పటికే ఈ పరిశ్రమ నిరాశలో కూరుకుపోయిందని బీబీసీకి చెప్పారు.

‘‘మరో పదేళ్ళలో ఈ పరిశ్రమ కనుమరుగవుతుంది. మేమిప్పుడు 60లలో,70లలో ఉన్నాం. మా జీవనోపాధిని కోల్పోవడం తప్ప మాకు మరో దారి లేదు’’ అని ఆయన చెప్పారు. ‘‘ప్రజలకు తమకు ఇష్టమైన ఆహారాన్ని తినే స్వేచ్ఛను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని’’ తెలిపారు.

నిషేధం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని శునకమాంసం హోటల్ ను నిర్వహించే కిమ్ అనే 60 ఏళ్ళ మహిళ తెలిపారు. దీంతోపాటు దక్షిణకొరియాలో జంతువులను పెంచుకునేవారి సంఖ్య పెరగడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు.

‘యువతరం పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడం లేదు. వారికి పెంపుడు జంతువులే ఫ్యామిలీగా మారుతున్నాయి. ఏదమైనా ఆహారం ఆహారమే. మనం కుక్క మాంసాన్ని ఆమోదించాలి. కానీ వాటిని పరిశుభ్రమైన వాతావరణంలో వధించేలా చూడాలి’’ అని ఆమె చెప్పారు.

‘‘చైనా, వియాత్నాం దేశాలలో శునకమాంసాన్ని తింటున్నారు కదా...ఇక్కడ మాత్రం నిషేధం ఎందుకు?’’ అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)