నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం

- రచయిత, అర్చన శుక్లా
- హోదా, బీబీసీ బిజినెస్ కరస్పాండెంట్
అస్సాంలో సిల్చార్‌లోని ఒక క్యాన్సర్ ఆసుపత్రి వెయిటింగ్ రూంలో రోగులు నిండిపోయారు. గత కొన్నినెలలుగా అక్కడి క్యాచర్ క్యాన్సర్ సెంటర్‌కు సమీపంలోని పట్టణాలు, గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారు.
దానికి కారణం.. క్యాన్సర్ మందులు తక్కువ ధరకు అందిస్తుండడం.
నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌లోని ట్రీట్‌మెంట్ సెంటర్‌ల సమూహంలోనిది ఈ ఆసుపత్రి.
నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌లోని ఆసుపత్రులు పెద్దమొత్తంలో ఔషధాలు కొని 85 శాతానికి పైగా తక్కువ ధరకు సామాన్యులకు అందిస్తున్నాయి.
ఈ విధానం దేశంలోని కొంతమంది పేదలకు ప్రాణదాతగా మారింది.
ఖరీదైన, సుదీర్ఘమైన చికిత్సలు కుటుంబాలను ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తాయి, ఇంకా చెప్పాలంటూ వారికి ఈ చికిత్సలు చాలావరకు అందుబాటులో ఉండవు కూడా.
ఉదాహరణకు, రొమ్ము క్యాన్సర్ చికిత్సలు చాలా రోజులు చేయించుకోవాల్సి వస్తుంది, దీనికి రూ. 5 లక్షలు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక వ్యక్తి సగటు నెలవారీ జీతం రూ. 58 వేల కంటే తక్కువగా ఉన్న ఈ దేశంలో, అది చాలా ఎక్కువ మొత్తం.

'అప్పు చేయాల్సి వచ్చేది'
బేబీ నంది (58) కాచర్ హాస్పిటల్ క్లినిక్‌లో తన తదుపరి కీమోథెరపీ సెషన్ కోసం వేచి ఉన్నారు. గతంలో ఆమె రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం దాదాపు 2,000 కి.మీ ప్రయాణించాల్సి వచ్చేది.
ఒకసారి మందులకే రూ. 54 వేలు ఖర్చవుతాయి. ఆమె అలా ఆరు సార్లు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ, వసతి ఖర్చులతో పాటు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది.
కొత్త విధానం కారణంగా ఆమె స్వస్థలమైన సిల్చార్‌లో మూడో వంతు ధరకే క్యాన్సర్ మందులు అందుబాటులో దొరుకుతున్నాయి.
"మా వద్ద అంత డబ్బు లేదు, నేను ఆమెను చెన్నైకి తీసుకెళ్లడానికి భూమి అమ్మి, బంధువుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడామెకు పూర్తి చికిత్స చేయిస్తూ ఇంట్లో ఉండగలుగుతున్నాం" అని బేబీ భర్త నారాయణ్ నంది అంటున్నారు.
భారత్‌లో సంవత్సరానికి దాదాపు 20 లక్షల క్యాన్సర్ కేసులు రికార్డవుతున్నాయి, ఈవై కన్సల్టెన్సీ సంస్థ గణాంకాల ప్రకారం వాస్తవ సంఖ్య దీనికి మూడు రెట్లు ఎక్కువే.
దేశంలో చాలామంది ప్రజలు వారి ఆరోగ్య సంరక్షణ కోసం స్వయంగా చెల్లించాలి. బీమా, ప్రభుత్వ పథకాల ద్వారా కూడా క్యాన్సర్ సంరక్షణ ఖర్చులు ఎక్కువగా కవర్ కావు.
అస్సాం గ్రామీణ ప్రాంతంలోని చిన్న దుకాణం యజమాని అయిన అమల్ చంద్రకి ఈ సమస్య బాగా తెలుసు. గత సంవత్సరం ఆయన భార్యకు ప్రభుత్వ హెల్త్ కార్డ్ ద్వారా రూ.1.5 లక్షల వరకు ఆరోగ్య ఖర్చులు కవర్ అయ్యాయి. అయితే, ఆమె రొమ్ము క్యాన్సర్ చికిత్స మధ్యలో ఉండగానే ఆ కార్డు గడువు ముగిసింది.
దీంతో "ఆమెకు మిగిలిన కీమోథెరపీ ఇంజెక్షన్ల కోసం రూ. 20 వేలు అప్పు చేయాల్సి వచ్చింది" అని అమల్ బీబీసీకి చెప్పారు.
అమల్ భార్యకు క్యాన్సర్ తిరిగి రావడంతో దంపతులిద్దరూ మళ్లీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే, ఈసారి మందుల ధరలు తగ్గడంతో ఇప్పుడామె చికిత్స ఖర్చు మొత్తం కవర్ అవుతోంది.

అతిపెద్ద సమస్య ఇదే!
ప్రధాన సమస్య ఏమిటంటే దేశంలోని క్యాన్సర్ రోగులలో ఎక్కువ మంది పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
వైద్య సంబంధిత విభాగాలు ఎక్కువ భాగం పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. బేబీ నంది వంటి రోగులు, వారి కుటుంబాలు చికిత్స పొందేందుకు చాలాదూరం ప్రయాణిస్తూ అదనపు భారాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ ప్రాంతాలకు క్యాన్సర్ మందులు అందడం హెల్త్ కేర్ వ్యవస్థ అతిపెద్ద సమస్యలలో ఒకటని హెల్త్ కేర్ నిపుణులు అంటున్నారు.
దేశంలోని ఈశాన్య కొండల్లో ఉన్న ఏకైక సదుపాయమైన కాచర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆ సవాలును ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది.
ఇది ఏటా 25,000 మందికి చికిత్సను కొనసాగిస్తూ, మరో 5 వేల మంది కొత్త రోగులకు చికిత్స అందిస్తుంది. వీరిలో ప్రధానంగా తక్కువ జీతంతో పనిచేసే వారే ఎక్కువ, వారంతా క్యాన్సర్ చికిత్స, ప్రయాణ ఖర్చులను భరించలేరు. అయితే, లాభాపేక్ష లేని ఈ సంస్థ నిధులపై ఈ విధానం ప్రభావం చూపిస్తోంది. నెలకు దాదాపు రూ.16.5 లక్షల కంటే ఎక్కువ బడ్జెట్ లోటును సంస్థ ఎదుర్కొంటుంది.
క్యాన్సర్ మందుల ధరలను తగ్గించడానికి తీసుకున్న చొరవ, రోగులు నాణ్యమైన మందులు కొనుగోలు చేయడానికి, ఎక్కువ మందికి ఉచితంగా చికిత్స చేయడానికి సహాయపడిందని ఆసుపత్రి కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి కన్నన్, బీబీసీతో చెప్పారు.
చిన్న పట్టణాలలోని ఆసుపత్రులలో క్యాన్సర్ మందుల కొరతను నివారించడంలో ఇది సహాయపడింది. గతంలో రోగుల సంఖ్య తక్కువుండటం, పరిమిత నిధుల కారణంగా పెద్ద పట్టణ కేంద్రాల వెలుపల మందుల సరఫరాలు అస్తవ్యస్తంగా ఉండేవి.
"ఇప్పుడు చిన్న ఆసుపత్రులు ధరలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధరలు ఇప్పటికే నిర్ణయించారు, ఇక అన్ని ఆసుపత్రులకు సమానంగా సరఫరా చేసే నిబద్ధత కూడా ఉంది" అని డాక్టర్ కన్నన్ చెప్పారు.

ముందడుగు వేసిన టీఎంహెచ్ గ్రూపు
ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ (టీఎంహెచ్) దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ కేంద్రంగా ఔషధాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసే విధానానికి నేతృత్వం వహిస్తోంది.
ప్రారంభ జాబితాలో పేటెంట్ లేని 40 సాధారణ జెనరిక్ మందులను కొంటున్నారు, టీఎంహెచ్ గ్రూపు ఫార్మసీ పెట్టే ఖర్చులలో కేవలం 80 శాతం నిధులతో కొని, రూ. 14 వేల కోట్లు ఆదా చేసింది.
ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఈసారి 100కి పైగా మందులు కొనాలనుకొంటోంది, అదే సమయంలో డయాగ్నస్టిక్స్, పరికరాలు వంటి విస్తృత క్యాన్సర్ సంరక్షణ వస్తువులను కూడా కొనే ఆలోచనలో ఉంది. అయితే ఖరీదైన పేటెంట్ చికిత్సలు ప్రస్తుతం ఈ ప్రణాళికలో చేర్చలేదు.
"భారత మార్కెట్‌లో ఫార్మాస్యూటికల్ కంపెనీలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఖర్చులను తగ్గించకపోతే, ఎక్కువ సంఖ్యను పొందలేరు" అని టీఎంహెచ్ డైరెక్టర్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కన్వీనర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ తెలిపారు. .
''ప్రపంచ క్యాన్సర్ మరణాలలో దాదాపు 70 శాతం భారత్ వంటి దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఉన్నట్లు అంచనా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు సహాయపడటానికి నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలు కీలకమవుతాయి'' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














