ఇండి గ్రెగోరి : ఫలించని న్యాయపోరాటం, లైఫ్ సపోర్ట్ ఆపివేయడంతో కన్నుమూసిన చిన్నారి

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
- రచయిత, విల్ జెఫోర్డ్
- హోదా, బీబీసీ న్యూస్
లైఫ్ సపోర్ట్‌ను ఆపివేయడంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక పాప ప్రాణాలు విడిచింది. ఈ పాపకు లైఫ్ సపోర్ట్ అందివ్వాలని కోరుతూ తల్లిదండ్రులు చేసిన న్యాయపోరాటం ఫలించలేదు.
మైటోకాండ్రియల్ వ్యాధితో బాధపడుతున్న 8 నెలల చిన్నారి ఇండి గ్రెగోరిని బతికించేందుకు ఇక ఎలాంటి వైద్యం లేదని బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో ఉన్న క్వీన్ మెడికల్ సెంటర్ (క్యూఎంసీ)కి చెందిన వైద్యులు చేతులెత్తేశారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 01:45 గంటలకు పాప ప్రాణాలు విడిచినట్లు తండ్రి డీన్ గ్రెగోరి చెప్పారు.
పాపకు అంత్యక్రియలు నిర్వహిస్తామని తండ్రి తెలిపారు.
పాప లైఫ్ సపోర్ట్‌ను తన ఇంట్లో తొలగించవద్దని శుక్రవారం కోర్టు తెలిపింది. దీంతో చిన్నారిని హోస్పైస్ (నయం కాని జబ్బులతో బాధపడేవారికి సంరక్షణ అందించే విభాగం)కు తరలించారు.
‘‘ఇండి 01:45కు తుది శ్వాస విడిచింది. నేను, క్లెయిర్ చాలా కోపంగా, బాధగా ఉన్నాం’’ అని డీన్ గ్రెగోరి అన్నారు.
‘‘ఎక్కువ కాలం పాటు జీవించే తమ చిన్నారి అవకాశాన్ని ఎన్‌హెచ్‌ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్), కోర్టులు తీసేసుకోవడమే కాకుండా, సొంత ఇంట్లో చనిపోయే ఇండి గౌరవాన్ని కూడా వారు లాగేసుకున్నారు’’ అని ఆరోపించారు.
ఇండి కుటుంబానికి తోడుగా నిలిచిన క్రిస్టియాన్ కన్సర్న్ సంస్థ, సెక్యూరిటీ ఎస్కార్ట్‌తో అంబులెన్స్‌లో శనివారం ఇండిని హోస్పైస్‌కు తీసుకెళ్లారు.
ఆ సమయంలో ఇండి చాలా ప్రశాంతంగా, ప్రయాణమంతా నిద్రపోతూనే ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు.
హోస్పైస్‌లో ఆమె లైఫ్ సపోర్ట్‌ను, తదుపరి అందించే వెంటిలేషన్‌ను తీసేశారు.
ఇండి పుట్టినప్పటి నుంచే ఎంతో ప్రత్యేకమైందని తనకు తెలుసని తండ్రి గ్రెగోరి అన్నారు.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
‘‘ఇండి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్టమైన సమయంలో తన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం’’ అని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ (ఎన్‌యూహెచ్) ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ అధికార ప్రతినిధి చెప్పారు.
ఇండికి, ఆమె తల్లిదండ్రులకు, ఈ పాపతో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా సుదీర్ఘమైన, సవాలుతో కూడుకున్న ప్రయాణమని అన్నారు.
న్యాయ పోరాటం
డెర్బిషైర్‌లోని ఇల్కెస్టన్ పట్టణానికి చెందిన ఇండి తల్లిదండ్రులు డీన్ గ్రెగోరి, క్లెయిర్ స్టానిఫోర్త్ కొన్ని నెలలుగా తీవ్ర న్యాయపోరాటం చేశారు.
తమ కూతురి జీవితాన్ని మరికొంత కాలం పాటు పొడిగించాలని కోరుతూ పలు న్యాయపోరాటాలు చేశారు.
ఇండికి ఉన్న మైటోకాండ్రియల్ వ్యాధి వల్ల శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసేందుకు కణాలు పనిచేయవు. పాప ఆరోగ్య పరిస్థితి ఎప్పటికీ బాగుచేయలేనిదని ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.
క్రిస్టియాన్ కన్సర్న్‌కు చెందిన క్రిస్టియాన్ లీగల్ సెంటర్ మద్దతుతో హైకోర్టు, కోర్ట్ ఆఫ్ అప్పీల్, యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యుమన్ రైట్స్ జడ్జీలను ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు.
పాపకు వైద్య సంరక్షణను కొనసాగించాలని కోరుతూ కోర్టుల చుట్టూ తిరిగారు.
కానీ, పాప చనిపోతుందని, ఆమెకు చికిత్స ఇస్తూ వెళ్తే ఆ పాపకు భరించలేని బాధ కలుగుతుందని, ఈ చికిత్స ఇచ్చినా ప్రయోజనం లేదని వైద్య నిపుణులు చెప్పారు.
ఈ వాదనను పాప తల్లిదండ్రులు అంగీకరించలేదు.
పాపను రోమ్‌లోని ఆస్పత్రికి తరలించాలని కోర్టుల్లో కోరారు.
కానీ, తల్లిదండ్రుల ప్రయత్నాలు ఫలించలేదు. పాప ఇండికి లైఫ్ సపోర్టు ఆపేయడంతో సోమవారం(ఇవాళ) కన్నుమూసింది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్: సొరంగంలో చిక్కుకున్న 36 మంది ఎలా ఉన్నారు? వారిని బయటికి ఎలా తీసుకొస్తారు?
- పెళ్లి చేసుకుంటా కానీ పిల్లలొద్దు అంటూ 20 మంది అబ్బాయిలను తిరస్కరించిన 20 ఏళ్ల అమ్మాయి
- ఇండియా తొమ్మిది మందితో బౌలింగ్ ఎందుకు వేయించింది? ద్రవిడ్, రోహిత్ ప్లాన్ అదేనా?
- గాజా ఆస్పత్రిలో పేరుకుపోతున్న శవాలు.. పనిచేయని ఐసీయూ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ప్రాణాలకు ముప్పు
- చెట్టు కిందే గర్భిణులు, రోగులకు వైద్యం.. కుట్లు, కట్లు కూడా అక్కడే.. రేకుల షెడ్డులో వైద్య సామగ్రి, మందులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














