చైనా పిల్లల్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఏమిటి ? భారత్‌కు ఎంత ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగేళ్ల క్రితం చైనాలో ప్రారంభమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించాయి, కోట్ల మంది ప్రజలు దీని బారిన పడ్డారు.
ఇప్పుడు చైనాలోని ఉత్తర ప్రాంతాలలో పిల్లల్లో కనిపిస్తున్న న్యుమోనియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జబ్బుపడిన పిల్లలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్లు అనేక రిపోర్టులు చెబుతున్నాయి.
కోవిడ్, శీతాకాలానికి సంబంధించి చైనాలో ఎత్తివేసిన ఆంక్షలు కూడా ఈ శ్వాసకోశ వ్యాధితో ముడిపడి ఉన్నాయి.
చైనాలో శ్వాసకోశ వ్యాధి కేసులు కోవిడ్ మాదిరిగా మరీ ఎక్కువగా లేవని, కొత్త, అసాధారణమైన వ్యాధికారకమేదీ బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు తెలిపారు.
కోవిడ్ కారణంగా చైనాలో రెండేళ్లు ఆంక్షలు విధించి పిల్లలకు ఆ వ్యాధి సోకకుండా దూరంగా ఉంచారని, ఇప్పుడు ఆ నిబంధనలను ఎత్తివేయడం వల్ల వారికి ఈ వైరస్ సోకడం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాత్కాలిక డైరెక్టర్ మారియా వెన్ తెలిపారు
ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కేసులు కరోనా కాలంలో (2018-19 సంవత్సరంలో) చూసినట్లుగా లేవని మారియా అన్నారు.
ప్రధానంగా ఇన్‌ఫ్లుయేంజా వంటి అనేక వ్యాధికారకాల వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం తెలిపారు.
భారత్‌కు చైనా పొరుగు దేశం. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధిని నివారించడానికి భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షించింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
భారత ప్రభుత్వం ఎలా సిద్ధమైంది?
శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కోవడానికి సంసిద్ధత, చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక సమీక్ష నిర్వహించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన సమాచారం ప్రకారం, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాశారు. ఈ విషయంలో సన్నాహాలు, సమీక్షలు చేయాలని ప్రజారోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు సూచించారు.
ఫ్లూ, ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు, తగినన్ని మందులు, వ్యాక్సిన్లను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని ఈ లేఖ పేర్కొంది.
అదే సమయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సవరించిన కోవిడ్ నిఘా వ్యూహంలోని మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు.
ఈ వ్యూహం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. ఇన్‌ఫ్లూయెంజా తరహా అనారోగ్యం (ILI), అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (SRI)లను జాగ్రత్తగా గమనించాలని అందులో సూచించారు.
చైనా నుంచి డబ్ల్యూహెచ్‌వోకు అందిన సమాచారం ప్రకారం ఈ వ్యాధి లక్షణాలలో దగ్గు, జలుబు కూడా ఉన్నాయని ఎయిమ్స్‌లో పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ హెడ్ డాక్టర్ అనంత్ మోహన్ అన్నారు.
"అటువంటి కేసుల సంఖ్య పెరుగుతోంది, దీనికి ప్రధాన కారణాలలో ఒకటి ఎక్కువ పరీక్షలు కావచ్చు, కానీ ఇది కొత్త వైరస్ అయితే కాదు" అని తెలిపారు.

ఇది అంటువ్యాధి కాదా?
వైద్యుల ప్రకారం ఇది ఒక అంటువ్యాధి. సాధారణ భాషలో చెప్పాలంటే శ్వాస సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి దగ్గు, తుమ్ములు, మాట్లాడటం, పాడటం మొదలైన వాటి ద్వారా (వైరస్ లేదా బ్యాక్టీరియా) సోకుతుంది.
కోవిడ్ సమయంలో విధించిన ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో ఇది మొదటి శీతాకాలమని, అందువల్ల అక్కడి ప్రజలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని డా. వేద్ ప్రకాశ్ అంటున్నారు.
డాక్టర్ వేద్ ప్రకాశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చీఫ్. చైనాలో కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా వ్యాధికారకం ఏదీ కనుగొనలేదని ఆయన గుర్తు చేశారు.
ఇలాంటి అనారోగ్యాలను వ్యాప్తి చేసే చిన్నపాటి రోగకారకాలే ఈ వైరస్‌లు, బాక్టీరియాలని వైద్యులు చెబుతున్నారు. మైకోప్లాస్మా అనేది బ్యాక్టీరియా సూక్ష్మక్రిమి అని, ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుందని డాక్టర్ వేద్ ప్రకాష్ వివరించారు. ఇది న్యుమోనియాకు దారితీసే గొంతు, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
ఆర్ఎస్వీ అనేది ఒక రకమైన వైరస్, దీనిని ఆంగ్లంలో రెస్పిరేటరీ సిన్‌కైషియల్ వైరస్ అంటారు.
డాక్టర్ అనంత్ మోహన్ చెప్పినదాని ప్రకారం ఈ వైరస్ ఎగువ శ్వాసకోశం, ముక్కు, గొంతుపై ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం కలిగిస్తుంది. మైకోప్లాస్మా, HIV లేదా ఇన్‌ఫ్లూయెంజా తీవ్రమైనది కానట్లయితే యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయవచ్చు.

ఫొటో సోర్స్, GETTYIMAGES/KATERYNA/SCIENCE
లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధిగ్రస్తుల్లో గొంతు మంట, దగ్గు, తుమ్ము, ఊపిరి ఆడకపోవడం, జ్వరం తదితర లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం కొన్నిసార్లు ఇది దానికదే నయమవుతుంది. దీనికి అలర్జీ మందులు ఇస్తారు. ఒకవేళ న్యుమోనియా సోకితే యాంటీబయాటిక్ మందులు ఇస్తారు.
కోవిడ్ తర్వాత కలిగే ప్రభావాలతో ఈ వ్యాధికి సంబంధముందా?
చైనాలో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లూయెంజాలతో కోవిడ్‌ను పోల్చడం కష్టమని డాక్టర్ అనంత్ మోహన్ అభిప్రాయపడ్డారు.
"కరోనా సోకని వారిలో ప్రతిరోధకాలు(యాంటీబాడీస్) డెవలప్ కాకపోవచ్చు" అని అనంత్ అంటున్నారు.
ఇది ఒక సిద్ధాంతం కావచ్చుగానీ, కరోనా ప్రతిరోధకాలనేవి ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్‌ల నుంచి రక్షణను అందించాల్సిన అవసరమూ లేదు.
ఇప్పుడు ఇన్‌ఫ్లూయెంజాకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి, వాటికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఉన్నాయి, కాబట్టి వాటిని కూడా తీసుకోవచ్చు.
కానీ, టీకాపైనే ఎక్కువగా ఆధారపడకూడదని, నివారణ కూడా ముఖ్యమని డాక్టర్ అనంత్ అంటున్నారు. అయితే డాక్టర్ వేద్ ప్రకాశ్ దీనికి భిన్నంగా చెబుతున్నారు.
"కోవిడ్ సోకని వారు, టీకాలు తీసుకోనివారు, మారుతున్న వాతావరణం, బాక్టీరియా, వైరస్‌లు లేదా ఇన్‌ఫ్లూయెంజాకు గురికాని వారికి రోగనిరోధక శక్తి ఉండదు.
అటువంటి పరిస్థితిలో తక్కువ ప్రభావవంతమైన బ్యాక్టీరియా లేదా వైరస్‌లు అటువంటి వ్యక్తులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి'' అని అన్నారు.
ఈ వ్యాక్సిన్‌ను చిన్న పిల్లలకు వాడలేదని, అందుకే వారికి వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువుందని అంటున్నారు. అదేవిధంగా, టీకాలు వేసుకోని లేదా కోవిడ్ సోకని పెద్దలు కూడా ఈ జాబితాలోనే ఉంటారంటున్నారు.
అదే సమయంలో గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ రకమైన ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, GETTYIMAGES/BLOOMBERG CREATIVE PHOTOS
కాలుష్యం ఎంత ప్రభావం చూపుతుంది?
వైద్యులు చెప్పినదాని ప్రకారం వాతావరణం మారినప్పుడల్లా శరీరం సహజ రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.
పర్యావరణానికి గరిష్టంగా ప్రభావమయ్యేది శరీరం, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ. అందువల్ల ఇవి ఇన్ఫెక్షన్ తదితర వాటితో పోరాడాలి.
శీతాకాలం వంటి వాతావరణంలో తక్కువ నిరోధక శక్తి కారణంగా శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియా లేదా ఇన్‌ఫ్లూయెంజా దాడులకు గురవుతుంది.
ఇది అలెర్జీ, న్యుమోనియాకు కూడా కారణమవుతుంది. అధిక కాలుష్యం ఉంటే, అప్పుడు PM 2.5 లేదా PM 10 కణాలు శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి, ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?
గత దశాబ్ద కాలంలో గుండె జబ్బులు, స్ట్రోక్ లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చాయని వైద్యులు అంటున్నారు, అయితే గత ఐదేళ్ల డేటా పరిశీలిస్తే శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరిగిందని తెలుస్తోంది.
అటువంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో శ్వాసకోశ వ్యాధులు అంటువ్యాధి రూపం సంతరించుకుంటాయని వైద్యులు భయపడుతున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అయితే నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, నివారణ వ్యూహం, సిబ్బంది, ప్రత్యేక సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: లక్షమంది టీచర్లు వీధుల్లోకి ఎందుకు వచ్చారు... వారి ఆగ్రహానికి కారణమేంటి?
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- హిట్లర్‌కు సన్నిహితులైన గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














