చైనా చిన్నారుల్లో పెరుగుతున్న న్యుమోనియా కేసులు, ప్రపంచం ఎందుకు కలవరపడుతోంది, భారత్ పరిస్థితేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెలాన్ ఛటర్జీ, ఫెర్గస్ వాల్ష్ & తులిప్ మజుందార్
- హోదా, బీబీసీ న్యూస్
కోవిడ్ మహమ్మారి తరువాత చైనాలో ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. తాజాగా ఆ దేశంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలిసి మరోసారి ప్రపంచం దృష్టి చైనాపై పడింది. ఇందుకు సంబంధించి భారత్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
కోవిడ్ ఆంక్షలు సడలించాక పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కట్టడికి చైనా చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్‌ల సంఖ్యను పెంచాలని ఆదేశాలు ఇచ్చింది. చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న విషయంపై పూర్తిస్థాయి నివేదిక కావాలని కిందటివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ)చైనాను కోరిన తరువాత ఈ విషయంపై ప్రపంచం మొత్తం దృష్టిసారించింది.
2019లో సెంట్రల్ చైనాలోని ఊహాన్‌లో ఊపిరిపోసుకున్న కరోనా మహమహ్మారికి సంబంధించిన నివేదిక పారదర్శకతపై అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా చైనాలోని న్యూమోనియా కేసులలో కొత్తగా అసాధారణ వ్యాధికారకాలను కనుగొనలేదని డబ్ల్యుహెచ్ఓ వెల్లడించింది.
జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మీ ఫెంగ్ మాట్లాడుతూ శ్వాసకోశ వ్యాధి పెరుగుదలకు ఇన్‌ఫ్లుయెంజా సహా అనేక రకాలైన వ్యాధికారకాలు ఏకకాలంలో తోడవుతున్నాయని వివరించినట్టు రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది.
‘‘చికిత్స అందించేందుకు క్లినిక్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.చికిత్స అందించే సమయాలను మరింతగా పెంచడం, మందుల లభ్యతను పెంచుతున్నాం’’ అని ఆయన చెప్పారు.
‘‘ఇటువంటి మహమ్మారులను అణిచివేయడానికి కీలకంగా పనిచేయాలి.ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే పాఠశాలలు, పిల్లల సంరక్షణా కేంద్రాలు, నర్సింగ్‌హోంలకు సందర్శకుల తాకిడిని నియంత్రించాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో పరిస్థితేంటి?
చైనాలో వ్యాపిస్తున్న న్యుమోనియాను భారత ఆరోగ్య సంస్థలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖామంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘చైనాలో న్యుమోనియా వ్యాప్తిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోంది. ఐసీఎంఆర్, ఆరోగ్య సేవల డైరక్టర్ జనరల్ ఈ విషయంపై దృష్టి సారించారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని తెలిపారు.
చైనా ఉత్తర ప్రాంతంలో న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో భారత్‌పై ఇప్పటిదాకా దీని ప్రభావం లేదని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్ఎంఎల్)కు చెందిన డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు.
‘‘ చైనాలో చిన్నపిల్లల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వెలిబుచ్చి చైనాను సమాచారం కోరింది. కొంతమంది నిపుణులు ఇది బ్యాక్టిరీయా ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చే మైకోప్లాస్మా న్యుమోనియా అని చెపుతున్నారు. పూర్తి వివరాలు అందకుండా దీనిపై ఎక్కువగా చెప్పలేం. ఇది బహుశా లాక్‌డౌన్ పర్యవసానంగా రోగనిరోధశక్తి బలహీనపడటం వలన వ్యాపిస్తున్నదై ఉండవచ్చు. ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇప్పటిదాకా అయితే ఇండియాపై పెద్దగా ప్రభావం లేదు. భారత్‌లో ఈ కేసులేమైనా వెలుగులోకి వస్తే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ’’ అని డాక్టర్ శుక్లా ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
మరోపక్క కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయంపై రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. చైనాలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేేపథ్యంలో ఇండియాలోనూ ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ముందుజాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు ఆరోగ్య సమీక్షలు జరపాలని కోరింది. ఆస్పత్రుల సన్నద్ధతకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. భారత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కోవిడ్ ఆంక్షలు సడలించాక బీజింగ్, ఉత్తర చైనాలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. తమ దేశంలో న్యుమోనియా లక్షణాలతో ఉన్న కేసులు పెరుగుతున్నాయని నవంబరు 13వ తేదీన చైనా అధికారులు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
బీజింగ్‌లోని చిన్నపిల్లల ఆస్ప్రతికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ఆస్పత్రుల సామర్థ్యానికి మించి పేషెంట్లు వస్తున్నారని, సగటున రోజుకు 7వేలమంది రోగులు వస్తున్నారని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.
ఈనెల 25వతేదీన టియాన్జిన్ సమీపంలోని ఓ చిన్నపిల్లల ఆస్పత్రిలో ఒక్కరోజే 13వేలమంది పిల్లలు ఔట్ పేషెంట్లుగానో, అత్యవసర విభాగంలోనో చేరారని సీఎన్ఎన్ వార్తను ఏఎన్ఐ ఉటంకించింది.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న కేసులు , డబ్ల్యుహెచ్ఓ ఏం చెబుతోంది?
చైనా ఉత్తర ప్రాంతంలోని బీజింగ్, లియోనోంగ్ రాష్ట్రాలలో పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో కొత్తగా ఆస్ప్రతికి వచ్చేరోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది.
ఈ శీతాకాలం, వసంతకాలాలలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఎక్కువగా ఉంటాయని, కొన్ని ప్రాంతాలలో ఈ ఇన్ఫెక్షన్ తారస్థాయిలో ఉంటుందని, కోవిడ్ ప్రమాదం కూడా పుంజుకుందనే అవకాశం ఉందని చైనా ప్రకటించినట్టు రాయ్‌టర్స్ తెలిపింది.
అయితే చైనా అందించిన నివేదికలో శ్వాసకోశ వ్యాధులు సాధారణ బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్ అని,పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని, మే నుంచి ఈ కేసులు వ్యాప్తిలో ఉన్నాయని పేర్కొందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది.
చైనా ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, వాక్సిన్ వేయించుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని కోరింది. ఆస్పత్రులన్నీ రోగులతో రద్దీగా మారుతున్నాయని చైనా స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
న్యుమోనియా అనేది ఓ సాధారణ వైద్య పారిభాషిక పదం. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్, వాపును తెలియజేయడానికి ఈ పదాన్ని వాడతారు. ఇది అనేక వైరస్‌లు, బ్యాక్టిరీయా, ఫంగై సూక్ష్మక్రిముల ద్వారా వ్యాపిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులపై మరింత సమాచారం కావాలని కోరిన తరువాత చైనా అధికారిక న్యూస్ ఏజెన్స్సీ జిన్హువా , చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులను ఉటంకిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల వ్యాధి నిర్థరణలోనూ, వారి సంరక్షణ విషయంలోనూ అధికారులు దృష్టిసారించినట్టు పేర్కొంది.
అక్టోబరు నుంచి చైనా ఉత్తర ప్రాంతంలో ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులు పెరుగుతున్నాయని, గడిచిన మూడేళ్ళ కంటే ఈ ప్రాంతంలో ఈసారి కేసులు బాగా పెరిగాయని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.
‘‘చైనాలో పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నాం, ఆ దేశ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లడుతున్నాం’’ అని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.
చైనాలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతుండటంతో ప్రజలకు కోవిడ్ 19 భయాలు గుర్తుకు వస్తున్నాయి. దీంతో ఈ కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత కోరడం మంచి పరిణామం. కానీ ఇలా మరింత సమాచారం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరడం సాధారణ విషయమే.
ఆయా దేశాలలో వ్యాపించే వ్యాధులపై వచ్చే వేలాది పత్రికా వార్తలను, అంతర్గత నిఘా సమాచారాన్ని క్రోడీకరించడానికి , ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఓ ప్రత్యేక బృందం ప్రతిరోజూ కుస్తీపడుతుంటుంది. దీనిని బట్టే అదనపు సమాచారం కావాలో వద్దో నిర్ణయించుకుంటూ ఉంటుంది. కానీ మరింత అదనపు సమాచారం కావాలని బహిరంగంగా కోరడం అసాధారణ విషయమే. గతంలో ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు, సంబంధిత దేశానికి చెందిన అధికారుల మధ్య ప్రైవేటుగా సాగేది.
కోవిడ్ 19 ప్రజలలో కల్పించిన భయాల కారణంగా, చైనాలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రజలు ఎంతలా కంపించిపోతున్నారో ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిలో ఉంది. అందుకే మహమ్మరి తరువాత డబ్ల్యుహెచ్‌ఓ కూడా మరింత పారదర్శకత పాటిస్తోంది.
యునైటెడ్ కింగ్‌డమ్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ కూడా తామ పరిస్థితిని గమనిస్తున్నామని పేర్కొంది.

ఫొటో సోర్స్, MAYUR KAKADE
అంటువ్యాధి కాదా?
కిందటివారం చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ దేశవ్యాప్తంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ప్రకటించింది. కోవిడ్ 19 ఆంక్షలు సడలించడం వలనే ఈకేసులు పెరుగుతున్నాయని అధికారులు చెప్పారు. అమెరికా, యూకేలలో కూడా కోవిడ్ ఆంక్షలు సడలించాకా ఇలాంటి కేసుల పెరుగుదలను చూశాయి.
‘‘సుదీర్ఘకాల లాక్‌డౌన్ తరువాత వచ్చిన తొలి శీతాకాలంలో చైనా ఈ శ్యాసకోశ సంబంధ వ్యాధులను ఎదుర్కొంటోంది . ఈ దీర్ఘకాల లాక్‌డౌన్ శ్వాసకోశ సంబంధిత సూక్ష్మక్రిముల వ్యాప్తిని అడ్డుకుని ఉంటుంది. దాంతోపాటు సాధారణ సూక్ష్మక్రిములనుంచి తట్టుకునే రోగనిరోధశక్తి కూడా తగ్గి ఉంటుంది’’ అని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అండన్‌లోని జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ ఫ్రాన్కోయిస్ బల్లౌక్స్ చెప్పారు.
‘‘ ఈ ఇన్‌ఫెక్షన్లకు కారకాన్ని గుర్తించడానికి తగిన సమాచారం లేదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంజెలియా ప్రొఫెసర్ ఫౌల్ హంటర్ చెప్పారు.
‘‘ ఇది అంటువ్యాధిలా అనిపించడంలేదు. అదే కనుక నిజమైతే చాలామంది పెద్దవాళ్ళకు కూడా ఈ వ్యాధి సోకి ఉండాలి. కొంతమంది పెద్దవాళ్ళకు వచ్చిన ఇన్ఫెక్షన్స్‌ను పరీక్షిస్తే, గతంలో సోకిన మహమ్మారి కారణంగా ఏర్పడిన రోగనిరోధకశక్తి కనిపిస్తోందని’’ ఆయన చెప్పారు.
ఇవికూడా చదవండి:
- కశ్మీర్: అమర్నాథ్ గుహ మార్గంలో రోడ్డు నిర్మాణంపై వివాదం ఎందుకు రాజుకుంది?
- డీబీ కూపర్: విమానం హైజాక్ చేసి, డబ్బు సంచులతో ఆకాశం నుంచి దూకేశాడు...
- పెండ్యాల రాఘవరావు: ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత.. ఆయన తర్వాత ఇది ఎన్టీఆర్కే సాధ్యమైంది
- ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయని మీకు తెలుసా... ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- Pregnancy Tourism: ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














