పేపర్ స్ట్రాలతో డ్రింక్స్ తాగుతారా? అది ఎంత ప్రమాదమో తెలుసుకోండి...

పేపర్ స్ట్రాలు

ఫొటో సోర్స్, ANJALI DAS

ఫొటో క్యాప్షన్, పేపర్ స్ట్రాలలో శాశ్వత రసాయనాల అవశేషాలు ఉంటాయని పరిశోధనలు చెపుతున్నాయి

ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి.

పర్యావరణానికి ప్లాస్టిక్ శాపంలాంటిది. ఇది మన పరిసరాలను మాత్రమే కాదు, ఎక్కడో దూరంగా ఉండే కొండలు, నదులు, సమద్రాలకు కూడా హాని చేస్తుంది.

2040 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగుపడుతుందని ది సైన్స్ జర్నల్‌ ప్రచురించిన ఓ నివేదిక తెలిపింది. ఒక్క ఇండియాలోనే ఏటా 33 లక్షల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది.

భారత్‌లో ఏటా 340 కోట్ల కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయని, ఇందులో కేవలం 33 శాతాన్ని మాత్రమే పునర్వినియోగం చేస్తున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ , ప్రాక్సిస్ గ్లోబల్ అలయెన్స్ సహకారంతో రూపొందించిన నివేదిక తెలిపింది. గడిచిన ఐదేళ్ళలో దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తి తీవ్రంగా పెరిగినట్టు ఈ నివేదిక చెప్పింది.

ప్లాస్టిక్ వస్తువులపై మనిషి ఆధారపడటం పెరగడంతో భూమి ‘తెల్ల కాలుష్యం’(వైట్ పొల్యూషన్) బారిన పడుతోంది.

ప్లాస్టిక్ వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రంగుల్లో కనిపించే ఈ స్ట్రాలు కాలుష్య కాసారానికి కారణం

భూమిలో కలిసిపోవడానికి 300 ఏళ్ళు

ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి 300 ఏళ్ళు పడుతుంది.

అమెరికాలో ప్రతిరోజూ 500 మిలియన్ల డ్రింకింగ్ స్ట్రాలను వినియోగిస్తున్నారని ఒక అంచనా. అయితే ఈ లెక్కలపై పంచాయతీ ఉన్నా, నిజమైన సంఖ్య ఇందులో సగం ఉండొచ్చంటున్నారు.

గడిచిన రెండు దశాబ్దాలలో డిస్పోజబుల్ డ్రింకింగ్ స్ట్రాలపై వెచ్చించే మొత్తం ఏటా పెరుగుతోందనేది నిజం.

తాగడం పూర్తికాగానే ఈ స్ట్రాలను చాలామంది చెత్తకుండీలలో పడేస్తారు. ఇది మన వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) భూమిలో కలిసిపోవడానికి 300 సంవత్సరాలు పడుతుంది.

స్ట్రాలాంటి ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడానికి వ్యతిరేకంగా ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.

ఇండియాలో జరుగుతున్న ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారానికి కూడా ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిమంది ప్రజల మద్దతు లభిస్తోంది. ఇలాంటి వాటిలో స్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కూడా ఉంది. ప్లాస్టిక్ స్ట్రాల వినియోగాన్ని వ్యతిరేకించడంలో కొంత ఘనతను మిలో క్రుసోకు ఇవ్వాలి. ఇతను తన 9 ఏళ్ళ వయసు నుంచే ‘బీ స్ట్రా ఫ్రీ’ ప్రచారాన్ని నిర్వహించారు. దీనివలన స్టార్‌బక్స్, మెక్‌డోనాల్డ్స్ కంపెనీలు ప్లాస్టిక్ స్ట్రాలను వినియోగించడం పూర్తిగా మానేశాయి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిరసన పెరుగుతుండటంతో ఇప్పుడు మార్కెట్‌లో కాగితం, గ్లాసు, మొక్కల ఆధారంగా తయారుచేసిన స్ట్రాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటివాటిలోంచి ఒకదానిని ఎన్నుకోవడం తేలికేనా? ఇవి పర్యావరణానికి హాని చేయవా?

ప్లాస్టిక్ వ్యర్థాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కాగితం స్ట్రాలలో శాశ్వత రసాయనాలు ఉన్నాయని పరిశోధకుల మాట

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

కాగితం స్ట్రాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఓ పరిశోధన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెల్జియంకు చెందిన ఆంట్రెప్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో కాగితం స్ట్రాలలో ప్లాస్టిక్‌లో కంటే ఎక్కువగా పాలీఫ్లూరో ఆల్కై అవశేషాలు (పీఎఫ్ఏఎస్) ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు.

పాలీఫ్లూరో ఆల్కైల్ అవశేషాలను త్వరగా నాశనం చేయలేం. పైగా దీర్ఘకాలంపాటు వాననీటిలోనూ, భూమిలోను మనుగడ సాగించగలవు. అందుకే వీటిని శాశ్వత రసాయనాలుగా పిలుస్తున్నారు. పాలీఫ్లూరో అవశేషాలు వాతావరణంలో దశాబ్దాల తరబడి ఉండటంతోపాటు నీటి కాలుష్యం సహా మనుషులలో అనేక అనారోగ్యాలను కలిగిస్తాయి.

కాగితంతోనూ, వెదురుతోనూ తయారుచేసిన స్ట్రాలలో కూడా చెప్పుకోదగ్గ పరిమాణంలో పాలీఫ్లూరోలను కనుగొన్నట్టు పరిశోధకులు చెప్పారు. అందుకే ప్లాస్టిక్ స్ట్రాల కంటే కాగితం స్ట్రాలు మెరుగైనవనుకోవడం సమంజసం కాదని తెలిపారు.

కాగితం స్ట్రాలలోని శాశ్వత రసాయనాల అవశేషాల కారణంగా అవి పర్యావరణ హితమైనవని ఎలా చెప్పగలమనే ప్రశ్నను లేవనెత్తుతోంది.

ప్లాస్టిక్ వ్యర్థాలు

ఫొటో సోర్స్, PARMITA SARMA

ఫొటో క్యాప్షన్, పర్మిత శర్మ ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగంపై ప్రజేంటేషన్ ఇచ్చారు

ప్లాస్టిక్ స్ట్రాలపై మాత్రమే వ్యతిరేకత ఎందుకు?

ప్లాస్టిక్ స్ట్రాలు పర్యావరణానికి తక్కువ హాని కలిగించేవే అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎందుకు వస్తోంది?

‘‘ఇది తేలికైన విషయమేమీ కాదు, ఎందుకంటే ఇది కేవలం ప్లాస్టిక్‌ స్ట్రాలకు సంబంధించినది మాత్రమే కాదు, ప్లాస్టిక్ కాలుష్యం అతిపెద్ద ప్రపంచ సంక్షోభం. ప్రజలందరూ తమ వంతు పోషిస్తేనే దీనిని పరిష్కరించగలం’’ అని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్‌ లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, వాణిజ్య విభాగ వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ సైమన్ బీబీసీ కరస్పాండెంట్ ఎలి హిర్ష్‌లాగ్‌కు చెప్పారు.

‘ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం’పై అక్షర్ ఫౌండేషన్’కు చెందిన పర్యావరణవేత్త పర్మిత శర్మ ఐక్యరాజ్యసమితి సదస్సులో ఓ ప్రజేంటేషన్ ఇచ్చారు.

‘‘ఏ రూపంలో ఉన్న ప్లాస్టిక్ అయినా మనకు హాని కలిగించేదే. కాకపోతే దాని వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా ఆహారం చెడిపోకుండా వీటి ద్వారా పంపగలుగుతున్నాం. అందుకే పేదరికంలో నివసిస్తున్న ప్రజలు అటువంటి ఆహారాన్ని తాజాగా పొందగలుగుతున్నారు’’ అని పర్మిత శర్మ బీబీసీతో అన్నారు.

‘‘కేవలం పునర్వియోగం చేయగలిగే ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే వాడాలి’’ అని పర్మిత చెప్పారు.

‘‘ప్లాస్టిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇందుకోసం వారు పునర్వినియోగ ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే కొనాలి. ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవాలి’’ అని శర్మ చెప్పారు.

‘‘పాఠశాలలు, కళాశాలలోనూ ప్లాస్టిక్ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారి ద్వారా సమాజంలోని విభిన్న వర్గాలోని సామాన్యులకు చేరుతుంది. ప్లాస్టిక్ పునర్వినియోగానికి మనం కట్టుబడి ఉంటే, ఇందుకు సంబంధించిన వనరులు మన దగ్గర ఉంటే ప్లాస్టిక్ సమస్యను మనం ఎదుర్కోగలం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్లాస్టిక్ పునర్వినియోగం వైపు మొగ్గుచూపుతున్నాయి. వీటివల్ల అవి ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి’’ అని ఆమె తెలిపారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు

ఫొటో సోర్స్, ANJALI DAS

ఫొటో క్యాప్షన్, కాగితం స్ట్రాలు

ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడమెలా?

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ 38 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగువుతున్నట్టు ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అంత తేలికైనది కాదు. కానీ మనం దీనిని తీవ్రంగా పరిగణిస్తే కనీసం ప్లాస్టిక్ వినియోగాన్ని అయినా అరికట్టవచ్చు. తద్వారా మన జీవితంతోపాటు ఇతరుల జీవితాల్లోనూ చెప్పుకోదగ్గ మార్పు తీసుకురావచ్చు. దీని సాధనకు ముఖ్యమైన మార్గం ఏమిటంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగించకపోవడమే.

ఇండియాలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ కారణంగా 43 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జులై 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

స్ట్రాలతోపాటు గుట్కా, షాంపూపౌచ్’లు, చిన్న బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు, తదితర వస్తువులను ఒకసారి వాడి పారేస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ఇవి ప్రధాన కారణంగా మారుతున్నాయి. మనం కనుక వీటిని వాడటం మానేస్తే దీని ప్రయోజనమేమిటో తప్పనిసరిగా అనుభవమవుతుంది.

భారతదేశంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు తయరవుతున్నప్పటికీ, రీసైక్లింగ్ ప్లాస్టిక్ వినియోగంలో ప్రపంచంలోని మిగతా దేశాలకంటే ముందుంది.

ఇందులో భాగంగా 2000 సంవత్సరంలోనే ప్లాస్టిక్ వైర్‌ను రూపొందించింది. ఇందులో ప్లాస్టిక్, తారు కలిపి రహదారుల నిర్మాణానికి ఉపయోగించింది.

దిల్లీ, మేరఠ్ రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వైర్‌ను ఉపయోగించారు. ఇలాంటి అనేక చిన్నపాటి చర్యలతో ప్లాస్టిక్ వ్యర్థాలను అర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)