మచిలీపట్నం హిందూ కాలేజీ భూముల్ని ఎందుకు అమ్మకానికి పెట్టింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం హిందూ కళాశాలకు సుమారు 160 ఏళ్ల చరిత్ర ఉంది.
అయితే, ఇప్పుడు ఈ కాలేజీ మనుగడ కోసం భూములు అమ్ముకునే స్థాయికి వచ్చింది.
అనేక దశాబ్దాల పాటు కృష్ణా జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా వెలుగొందిన ఈ కాలేజీ ఇప్పుడు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక పోతోంది. కాలేజీ నిర్వహణ భారంగా మారింది.
కారణాలు ఏంటి?
మచిలీపట్నంలోని ‘‘ది హిందూ కాలేజీ’’ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఎయిడెడ్ విద్యాసంస్థల చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులే కారణమని యాజమాన్యం అంటోంది.
సాధారణంగా కొంత ప్రభుత్వ సహకారం, మరికొంత విద్యార్థుల నుంచి వసూలయ్యే ఫీజులతో ఎయిడెడ్ విద్యాసంస్థలు నడుస్తుంటాయి.
కొంత ప్రభుత్వ సహకారం, మరికొంత విద్యార్థుల నుంచి వసూలయ్యే ఫీజులతో నడిచే ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో చేసిన చట్ట సవరణ ప్రకారం ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆయా సంస్థలకు చెందిన భూములు సహా ఆస్తులన్నీ ప్రభుత్వ సొంతం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.
అదే సమయంలో ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించని విద్యాసంస్థల యాజమాన్యాలకు ఇకపై ప్రభుత్వం నుంచి ఎయిడ్ అందించబోమని, ప్రైవేటు విద్యాసంస్థల మాదిరిగా కొనసాగించుకోవచ్చని తేల్చింది.
ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లలో మచిలీపట్నం హిందూ కాలేజ్ యాజమాన్యం రెండో దానిని ఎంచుకుంది. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిరాకరించింది. దాంతో ప్రభుత్వ సాయం నిలిచిపోయింది. సిబ్బంది వేతనాలు, కాలేజీ నిర్వహణ ఖర్చుల భారం కూడా పాలకమండలి మీద పడింది.
ఎయిడెడ్ కాలేజీగా ఉన్న నాటి నుంచే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఫీజులను భారీగా పెంచేందుకు అవకాశం లేకపోవడంతో ఆదాయం తగ్గిపోయిందని యాజమాన్యం చెబుతోంది.
జీతాల కోసం సిబ్బంది ఆందోళన
ప్రస్తుతం ‘‘ది హిందూ కాలేజ్’’కు సంబంధించిన వివిధ సంస్థల్లో సుమారు 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో అత్యధికులు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహణ భారం పెరిగిపోవడంతో సిబ్బంది వేతనాలకు ఇబ్బందిగా మారింది.
జీతాల కోసం ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బంది అనేక సార్లు ఆందోళనలు చేసి చివరకు కోర్టులను ఆశ్రయించే వరకు వ్యవహారం వెళ్లింది.
‘‘ఏళ్ల తరబడి జీతాలు పెండింగులో పెడితే మా కుటుంబాల పోషణ ఎలా? ఎన్నిసార్లు అడిగినా గడువు కోరుతున్నారే తప్ప మా సమస్యలు పరిష్కరించలేదు. మాకు రావాల్సిన బకాయిల కోసం కోర్టులను ఆశ్రయించడం అనివార్యం అయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయనే కారణంతో మాకు జీతాలు పెండింగులో పెడితే గడిచేది ఎలా అని నిలదీస్తున్నా కదలిక లేదు. ఆయా విభాగాల్లో దాదాపు 200 మంది ఉద్యోగులు ఉన్నారు. త్వరలోనే మా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం" అని బీబీసీతో హిందూ కాలేజీలో పనిచేసే కె. రమేష్ అన్నారు.
దశల వారీగా పెండింగ్ వేతనాలు క్లియర్ చేస్తామని చెప్పినా అది కూడా జరగలేదని తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
భూములు అమ్మకానికి
ఎయిడెడ్ సంస్థగా ఉన్నంత కాలం సిబ్బంది వేతనాలు ప్రభుత్వం నుంచి వచ్చేవి. ఫీజుల రూపంలో వచ్చిన డబ్బు కాలేజీ నిర్వహణకు సరిపోయేది. విద్యాసంస్థ ప్రారంభమైన తొలినాళ్లలో దాతలు ఇచ్చిన భూముల ద్వారా మరి కొంత ఆదాయం వచ్చేది.
ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం నిలిచిపోవడంతో ఫీజుల రాబడితోనే కాలేజీని నిర్వహించడం భారంగా మారిదని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ప్రస్తుతం ‘‘ది హిందూ కాలేజ్’’ విద్యాసంస్థల పాలకవర్గం అధ్యక్షుడుగా ఆయన ఉన్నారు.
‘‘ది హిందూ కాలేజ్’’ పేరుతో మచిలీపట్నం సమీపంలోని పోతేపల్లి పరిధిలో ఉన్న14.95 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా.
"సంస్థ భూములు అమ్ముకోవాల్సి రావడం బాధాకరం. అయినా తప్పడం లేదు. సిబ్బంది జీతాలు చెల్లించలేకపోతున్నాం. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదలు చేయాలని చాలాకాలంగా కోరుతున్నాం. కానీ, ఎలాంటి స్పందన లేదు. సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మాకు మరో మార్గం కనిపించడం లేదు" అని కొనకళ్ల నారాయణ అన్నారు.
1980లో మొదలైన శ్రీ వెంకటేశ్వర హిందూ ఇంజినీరింగ్ కాలేజ్ నిర్వహణకు సంబంధించి ఫీజులు వసూలు కాకపోవడం, ప్రభుత్వ బకాయిలు విడుదల కాకపోవడం ప్రధాన సమస్యలుగా ఆయన చెబుతున్నారు.
‘‘ది హిందూ కాలేజ్’’ విద్యాసంస్థల పరిధిలో ఇంజినీరింగ్, లా కాలేజీ మినహా మిగిలిన ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ ఎయిడెడ్ సంస్థలుగా ఉన్న కాలంలో బాగానే సాగాయి. కానీ రెండేళ్ల క్రితం ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి బదలాయించి, కాలేజీలను ప్రైవేటుగా మార్చేసినప్పటి నుంచి సమస్యలు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు.
విద్యార్థులు కంప్యూటర్స్ కోర్సుల మీదనే ఆసక్తి చూపడం కూడా ప్రస్తుత సమస్యకు ఒక కారణమని కొందరు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఒకప్పుడు ఇంజినీరింగ్ కాలేజీ కళకళలాడేది. కానీ మెకానికల్, సివిల్ వంటి కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కంప్యూటర్ కోర్సులకు మాత్రమే విద్యార్థులు ఆసక్తి చూపుతుండటంతో ఇతర బ్రాంచీల నిర్వహణ భారంగా మారింది. జీతాల్లేకపోవడంతో కొందరు సిబ్బంది వెళ్లిపోయారు. మిగిలిన వారికి జీతాలు చెల్లించలేని దుస్థితి. హిందూ విద్యాసంస్థలను మరింత విస్తరించేందుకు ఆ భూములు ఉపయోగపడతాయి. కానీ, సిబ్బంది వేతనాలు చెల్లించాలంటే మరో దారి లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాలో వేస్తోంది. అది విద్యాసంస్థకు చేరడం కష్టమే" అని మచిలీపట్నానికి చెందిన కొడాలి శర్మ అన్నారు.
హిందూ కాలేజీ మాత్రమే కాకుండా ఆంధ్రా నేషనల్ కాలేజీ వంటి విద్యాసంస్థలకు వందల ఎకరాలు ఉన్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నం విద్యావ్యవస్థలో మూలస్తంభాల వంటి సంస్థల పరిరక్షణకు స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని శర్మ అభిప్రాయపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాని కారణంగా సిబ్బంది వేతనాలు చెల్లించలేకపోతున్నట్టు కాలేజీ యాజమాన్యం చెప్పడం గురించి మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇది పూర్తిగా కాలేజీ మేనేజ్‌మెంట్ వ్యవహారమని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయం తెలిపింది.
‘‘ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలు తగ్గిపోయి, ఒకప్పుడు 500 మంది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 240కి పడిపోయింది. కాలేజీ నిర్వహణ భారంగా మారడానికి ఇది కూడా ఒక కారణం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేవు. ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే తల్లుల ఖాతాల్లో వాటిని జమ చేస్తున్నాం’’ అని వివరించింది.

ఫొటో సోర్స్, CMO ANDHRA PRADESH/TWITTER
160 ఏళ్ల చరిత్ర
ఆంధ్రప్రదేశ్‌లో ఒకనాటి ప్రముఖ విద్యాకేంద్రాల్లో మచిలీపట్నం ఒకటి. సముద్రతీర ప్రాంతం కావడం వలన నాటి బ్రిటిష్ పాలకుల వ్యాపార కార్యకలాపాలకు కూడా కేంద్రంగా ఉండేది.
బ్రిటిష్ పాలనా కాలంలో మచిలీపట్నం ఎన్నో విద్యాసంస్థలకు నెలవు. అలా స్థాపించిన కాలేజీల్లో ‘‘ది హిందూ కాలేజ్’’ ఒకటి.
క్రైస్తవ విద్యాసంస్థల్లో హిందువులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంతో హిందువుల విద్య కోసమంటూ దాతల సహకారంతో ఓ విద్యాసంస్థ ఏర్పాటు చేయాలని భావించారు. అలా 1856 జనవరి 1న హిందూ విద్యాసంస్థ ప్రారంభమైంది. 1863లో హిందూ హైస్కూల్ భవనాన్ని నిర్మించారు. నాడు అది మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది.
తర్వాత 1928లో హైస్కూల్ నుంచి కాలేజీగా మారింది. అప్పటి నుంచి హిందూ కాలేజీగా కొనసాగుతోంది. ఆ తర్వాత హిందూ కాలేజీ బాగా విస్తరించింది. వివిధ రకాల కోర్సులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ నుంచి పీజీ వరకు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఎయిడెడ్ విద్యాసంస్థగా ప్రభుత్వ సహాయంతో నడిచిన కాలేజీ కావడం వల్ల తక్కువ ఫీజులతో అత్యధికులు చదువుకునేవారు. ఇక్కడ చదువుకుని ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరారు.
ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణ హిందూ కాలేజీలో పని చేశారు. చల్లపల్లి జమీందారు అంకినీడు, దివాకర్ల వేంకటావధాని, అమెరికాలో ప్రొఫెసర్‌గా పేరు తెచ్చుకున్న వేమూరి వేంకటేశ్వరరావు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు వంటి వారు ఈ కాలేజీలోనే చదివారు.
ఇవి కూడా చదవండి:
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'శరీరంలో ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం...'
- ఉత్తర కాశీ: సొరంగంలో పని చేయడమంటే ప్రాణాలకు తెగించడమేనా?
- అహ్మదాబాద్: భారత ప్రేక్షకులు, టీమిండియా ఆటగాళ్ల తీరుపై ఆస్ట్రేలియా మీడియా ఏం రాసింది?
- ఉత్తరకాశి సొరంగ ప్రమాదం: బిహార్, ఝార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు ఏ పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్నారు?
- తిరుమల లడ్డూ తయారీలో ‘శ్రీవైష్ణవ బ్రాహ్మణులే’ ఉండాలా? టీటీడీ నిబంధనపై వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










