ఉత్తర కాశీ: సొరంగాలు, గనుల్లో వందల మీటర్ల లోపల జీవితం ఎలా ఉంటుంది?

ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నవంబర్ 12వ తేదీన ఉత్తరకాశీలోని సిల్క్యారా సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటన 41 మంది కార్మికులు చిక్కుపోయారు.
    • రచయిత, రవి ప్రకాష్
    • హోదా, బీబీసీ కోసం

చిమ్మచీకటి.. హెల్మెట్‌కు అమర్చిన టార్చ్‌లైట్ వెలుగులోనే పని..బ్యాటరీ సాయంతో నడిచే ఆ వెలుగు పోతే, అంతా చీకటే. మన చేతుల్ని కూడా మనం చూడలేని పరిస్థితి.

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి అనుమతి ఉండదు. పని ప్రదేశంలో (గని లేదా సొరంగం) టాయిలెట్స్ ఉండవు. ఫోన్ తీసుకువెళ్లడానికి లేదు. కనీసం తినడానికి టిఫిన్ కూడా ఉండదు. కేవలం రెండు లీటర్ల వాటర్ బాటిల్ మాత్రం తీసుకువెళ్లి, ఎనిమిది గంటలపాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పనిచేయాలి.

భూమి ఉపరితలానికి కొన్ని వందల మీటర్ల లోతున పనిచేసే కార్మికుల రోజువారీ జీవనం ఇది.

ఉత్తరకాశీలోని సిల్క్యారా సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటన తరువాత, బీబీసీ బృందం భూగర్భ పనుల్లో భాగమైన కార్మికులతో మాట్లాడింది.

వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో, సొరంగం లేదా గని లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో వారి ద్వారా తెలుసుకుంది.

ఎక్కువ కాలం సొరంగం లేదా గనుల్లో పనిచేసిన కార్మికుల (సుమారు 25 ఏళ్ల అనుభవం)తో మాట్లాడింది.

సిల్క్యారా ఘటన

ఫొటో సోర్స్, REUTERS/SHANKAR PRASAD NAUTIYAL

ఫొటో క్యాప్షన్, సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అంతా చీకటి..

దేశ బొగ్గు రాజధానిగా పిలిచే జార్ఖండ్‌లోని ఝరియా సమీపంలో ఉన్న బొగ్గు గనిలో పనిచేస్తున్న పొఖాన్ సావ్‌ను బీబీసీ సంప్రదించింది.

49 ఏళ్ల పొఖాన్ సావ్ బొగ్గు గనిలో సీనియర్ ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. 21 ఏళ్ల వయసులో 1995లో బొగ్గు గనిలో కార్మికుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు రెస్క్యూ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.

పొఖాన్ సావ్ తొలిసారి అనుభవజ్ఞుల వెంట గనిలోకి వెళ్లినప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. వారు తనతో ఉన్నప్పటికీ భయపడ్డానని అన్నారు. ఒకవేళ లోపలేమైనా జరిగితే తన పరిస్థితేంటోనని ఆందోళనగా అనిపించిందని అన్నారు.

“గనిలోకి వెళ్లేముందు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్(వీటీసీ)లో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. లోపల ఏం జరుగుతుందో, ఎలా పనిచేయాలో చెప్తారు. అత్యవసర సమయంలో ఎలా సమాచారం చేరవేయాలి? ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? ఇలాంటివి చెప్తారు. ఒక నమూనా గనిలో మేం సాధన కూడా చేశాం. తొలినాళ్లలో రోజుకు 2-3 గంటలు మాత్రమే పనిచేశాను. క్రమంగా భయం పోయింది. పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాను” అన్నారు.

గనుల్లోకి వెళ్లేముందు మైనింగ్ యూనిఫాం ధరించాలని, ప్రత్యేక షూ, అవసరమైన మెషిన్లు, నడుముకు బెల్ట్ వంటివి ధరించాలని చెప్పారు.

“తలకు ధరించే ప్రత్యేక హెల్మెట్, అందులో అమర్చిన టార్చ్‌లైట్ పనిచేసేందుకు బ్యాటరీని అమర్చుతారు. గతంలో ఈ బ్యాటరీ బరువు ఐదు కేజీలు ఉండేది. ఇప్పుడు 250 గ్రాములు మాత్రమే ఉంది. ఇది సన్నని వైర్‌‌తో క్యాప్‌లైట్‌కు కనెక్ట్ చేయబడుతుంది. తలకు ఉన్న టార్చ్ లైట్‌ వెలుగులోనే పని చేస్తాం. అయితే, పని ప్రదేశాల్లో ఇతర లైట్లు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మా పనంతా మా క్యాప్‌లైట్‌ వెలుగులోనే జరుగుతుంది” అన్నారు.

జార్ఖండ్ బొగ్గు గనులు

ఫొటో సోర్స్, POKHAN SHAO

ఫొటో క్యాప్షన్, బొగ్గు గనిలో పనిచేసే జార్ఖండ్‌కు చెందిన పొఖాన్ సావ్ తన వృత్తి జీవితంపై బీబీసీతో మాట్లాడారు

‘మంచినీళ్లు తప్ప ఏం ఉండవు’

“మాతో మంచినీళ్ల బాటిల్‌ను ఉంచుకుంటాం. నిబంధనల (మైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్) ప్రకారం పైప్‌లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి కానీ, ఇది ఎక్కువగా జరగదు. అందుకే మేం నీటిని తీసుకువెళ్తాం. ఆహారం లోపలికి తీసుకువెళ్లం” అని పొఖాన్ సావ్ చెప్పారు.

గతంలో కొన్ని గనుల్లో క్యాంటీన్లు ఉండేవని, వాటిలో చాలావరకు ఓపెన్ కాస్ట్ మైన్స్‌గా మారాయని చెప్పారు.

“ఇప్పుడు గనుల్లో క్యాంటీన్లు లేవు. అందుకే డ్యూటీలోకి వచ్చే ముందే కార్మికులు తినేసి వస్తారు. మాకు ఎనిమిది గంట షిఫ్ట్ ఉంటుంది. ఏమీ తినడానికి కుదరదు. షిఫ్ట్ తర్వాత కూడా, గని నుంచి బయటకు వచ్చాక శుభ్రం చేసుకోవడం, పేపర్ వర్క్ పూర్తిచేశాక, ఇంటికి వెళ్లి తింటాం. అప్పటిదాకా అలానే ఉండాలి.” అన్నారు.

ప్రాణవాయువు సరిపడా ఉంటుందా?

పొఖాన్ సావ్ గనుల్లో ప్రాణవాయువు సరఫరా గురించి చెప్తూ, “రెండు మార్గాల ద్వారా గనుల్లోకి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తారు. ఫ్యాన్ల ద్వారా సాధారణ గాలిని గనిలోకి పంపిస్తారు. ఆ గాలి మరో మార్గం ద్వారా బయటకు వెళ్తుంది. సరిపడా వెంటిలేషన్ ఉండేలా చూస్తారు. దీని వలన ఆక్సిజన్ కొరత అనే సమస్య తలెత్తదు. ఎప్పుడూ కూడా ఆక్సిజన్ శాతం 19కి తగ్గలేదు” అన్నారు.

“దీనితోపాటు మాకు సెల్ఫ్ రెస్క్యూయెర్‌ను ఇస్తారు. ఇది కేజిన్నర బరువు ఉంటుంది. కానీ కొన్నిసార్లు కార్మికులు దీనిని తీసుకుని వెళ్లరు. ఇది పెద్ద నిర్లక్ష్యం. అయినప్పటికీ ఆక్సిజన్ సమస్యైతే ఎదురుకాలేదు. నా 28 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ ఆక్సిజన్ కొరతను ఎదుర్కోలేదు” అన్నారు.

గనుల్లోకి కాలినడకన ద్వారానే మెట్ల మార్గం గుండా వెళతారు కార్మికులు. ఒకవేళ గని లోతుగా ఉంటే, లిఫ్ట్ సాయంతో కార్మికులను రవాణా చేస్తారు. దీనిని చానక్ అని కూడా పిలుస్తారు.

జార్ఖండ్‌

ఫొటో సోర్స్, RAVI PRAKASH

ఫొటో క్యాప్షన్, 2016లో జార్ఖండ్‌లోని ఈసీఎల్ మైన్‌లో ప్రమాదం జరిగి రెండు డజన్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 18 మంది కార్మికులు చనిపోయారు.

‘బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు’

“భూ ఉపరితలం నుంచి కొన్ని వందల మీటర్ల లోతున పనిచేయడమనేది ప్రమాదంతో కూడుకున్నది. ఇది ప్రకృతికి విరుద్ధంగా చేసే పని, కాబట్టి సవాళ్లు, ప్రమాదాలు ఉంటాయి.

గని లేదా సొరంగంలోకి వెళ్తున్నామంటే, దానర్థం బయటి ప్రపంచంతో సంబంధం తెంచుకున్నట్లే” అన్నారు చందేశ్వర్ కుమార్‌.

బీహార్‌లోని సుగౌలి ప్రాంతం నుంచి జార్ఖండ్‌కు వచ్చిన చందేశ్వర్ కుమార్‌ 1993లో గని కార్మికుడిగా మొదలై, ఇప్పుడు క్లర్క్‌గా పనిచేస్తున్నారు.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ, “అక్కడ మీకు ఆహారం ఉండదు. మీ చేతిలో ఫోన్ ఉండదు. అందుకే, ఎనిమిది గంటల పనిని దృష్టిలో పెట్టుకుని మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి” అన్నారు.

ఉత్తరకాశీ సొరంగ ప్రమాదం గురించి ఆయన ప్రస్తావిస్తూ, “సొరంగంలో చిక్కుకున్న కార్మికులు కేవలం వారి షిఫ్ట్ సమయానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుని ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో, ఆహారం,నీరు వారికి అందకపోతే, ఎంతకాలం జీవించగలరు?” అని ప్రశ్నించారు.

“బొగ్గు గనుల్లో పనిచేయడం ఇంకా ప్రమాదకరం. మండే స్వభావం ఉన్న మిథేన్ వాయువు వెలువడుతుంది. దీని వల్ల ప్రమాదం ఏర్పడొచ్చు. ఒకవేళ మంటలు అంటుకుంటే పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఉపరితలంతో పోల్చుకుంటే, గనుల్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. భూగర్భంలో ప్రతికూల పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది” అన్నారు.

ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదం

ఫొటో సోర్స్, RAVI PRAKASH

ఫొటో క్యాప్షన్, గనుల్లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ప్రస్తుతం క్లర్క్‌గా పనిచేస్తున్న చందేశ్వర్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

మౌలిక సదుపాయాలు ఉంటాయా?

గనుల నియమాలను అనుసరించి, కార్మికులు మలమూత్ర విసర్జన కోసం గనుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. పరిశుభ్రంగా ఉంచాలి. కానీ చాలా గనుల్లో టాయిలెట్లు లేవు. సొరంగాల లోపల కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఉత్తరకాశీలోని సొరంగం ప్రాజెక్టులో పనిచేసే కార్మికుడు, ఝరియాలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు కూడా తాము పనిచేసే చోట్ల మరుగుదొడ్లు లేవని చెప్పారు.

ఓ కార్మికుడు బీబీసీతో మాట్లాడుతూ, “మూత్రవిసర్జన చేయాలంటే, గనిలోనే ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలి. చీకటిలో ఎవరూ చూడరు. మలవిసర్జన కోసం నిర్దేశిత ప్రదేశంలో పరదా ఏర్పాటు చేసి ఉంటుంది. ఇంతకు మించి మరో దారి లేదు. గనుల బయటే, సరైన మరుగుదొడ్లు ఉంటాయి” అని చెప్పారు.

బొగ్గు గనులు
ఫొటో క్యాప్షన్, కొన్నేళ్ల క్రితం బీబీసీ ప్రతినిధి సాల్మన్ రవి బొగ్గు గనిలో ఉండే పరిస్థితులపై కథనం అందించారు.

ప్రమాదం జరిగితే పరిస్థితేంటి?

గనులు లేదా సొరంగాల్లో సంభవించే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహాయక చర్యలు చాలా కష్టతరం, కొన్నిసార్లు ప్రాణనష్టం ఏర్పడొచ్చు.

పొఖాన్ సావ్, చందేశ్వర్ కుమార్ సింగ్‌లు బీబీసీతో మాట్లాడిన సందర్భంలో, గనుల్లో పనిచేసే సిబ్బంది అంకితభావం, సమర్థత, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతోపాటు అందరి ఆశీర్వాదాల వలన తమకు అలాంటి ప్రమాదాలేవీ జరగలేదని అన్నారు.

అయితే, వీరిద్దరూ ఫిబ్రవరి 2001లో ఝరియా కోల్ బ్లాక్‌లో జరిగిన బగ్దిగి బొగ్గు గని ప్రమాదాన్ని చూశారు. ఈ ప్రమాదంలో 29 కార్మికులు మరణించగా, ఒకరిని మాత్రమే కాపాడగలిగారు.

ఈ ప్రమాదంపై పొఖాన్ సావ్ మాట్లాడుతూ, “అప్పుడు 12వ గనిలో మొత్తం నీటితో నిండిపోయింది. త్వరత్వరగా నీరు చేరడంతో ఎవరూ బయటకు రాలేకపోయారు. కార్మికుల మృతదేహాలను వెలికితీయడానికి 7-8 రోజులు పట్టింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా జరిగింది” అన్నారు.

2010లో జీత్‌పూర్ గని ప్రమాద సమయంలో పనిచేసిన రెస్క్యూ బృందంలో పొఖాన్ కూడా ఒకరు. గనిలోపలికి వెళ్లే లిఫ్ట్ ఐరన్‌లో వేడి వలన మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి.

“గనిలో నీరు ఉంది. హైడ్రోజన్, ఆక్సిజన్‌ల కలయిక వలన రసాయనికంగా ఏర్పడిన నీరు అది. ప్రమాదం జరిగినప్పుడు ఈ కంపౌండ్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్, హైడ్రోజన్‌లు వేరయ్యాయి. హైడ్రోజన్ అనేది మండే స్వభావం గలది. ఆక్సిజన్ మండటానికి సహకరిస్తుంది. అందువలన మంటలు వేగంగా మొదలయ్యాయి. కాబట్టి, చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవ్వొచ్చు” అన్నారు.

అనారోగ్యం బారిన పడే అవకాశం...

దీర్ఘకాలం అక్కడే పనిచేయడం వలన చాలా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా, బొగ్గు గనులు, క్వారీలు, సొరంగ నిర్మాణాల వంటి ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు నయం చేయలేని న్యుమోకోనియోసిస్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకం.

మైనింగ్ నియమాలను అనుసరించి, రెగ్యులర్ చెకప్‌లతోపాటు కార్మికులకు ప్రతి ఐదేళ్లకు ప్రత్యేక చెకప్‌లు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, అలా జరగడం లేదు.

వీడియో క్యాప్షన్, ఉత్తరకాశీ సొరంగం దుర్ఘటనకు సంబంధించిన మొదటి వీడియో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)