ఉత్తరకాశి సొరంగ ప్రమాదం: బిహార్, ఝార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు ఏ పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్నారు?

- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, ఉత్తరకాశి నుంచి బీబీసీ ప్రతినిధి
బిహార్‌లోని మోతిహరి జిల్లా నుంచి వచ్చిన రాజు కుమార్ రెండు సంవత్సరాలుగా ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.
తొమ్మిది రోజుల క్రితం ఈ సొరంగం కూలిపోయిన తర్వాత ఇక్కడ పనులు పూర్తిగా ఆగిపోయాయి.
రాజు కుమార్ లాంటి 400 మంది కార్మికులకు వసతి కోసం ఈ సొరంగానికి అర్ధ కిలోమీటరు దూరంలోనే నివాస సదుపాయాలను ఏర్పాటు చేశారు.
కార్మికులుండే ఈ నివాస సదుపాయాల వద్దకు మేం వెళ్లి, రాజు కుమార్‌తో పాటు మరికొంత మంది కార్మికులతో వారి రోజువారీ జీవితం, కుటుంబ, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాం.
రాజు కుమార్ తన రోజువారీ జీవితాన్ని మాకు వివరించారు.
‘‘మా షిఫ్ట్ ముగిసిన తర్వాత, గదికి వచ్చి, చేతులు, ముఖం కడుక్కుని ఫ్రెషప్ అవుతాం. ఆ తర్వాత మా బట్టలు ఉతుక్కుంటాం. కొద్దిసేపు ఇంట్లో వాళ్లతో మాట్లాడి విశ్రాంతి తీసుకుంటాం’’ అని చెప్పారు.
ఇక్కడ పనిచేసే వారందరూ మగవారే. చాలా మంది యువకులే, పెళ్లి కూడా కాలేదు.
ఎనిమిది మంది కార్మికులు ఒకే గదిలో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు.
గదులకు ఎదురుగానే అందరికీ కలిపి టాయిలెట్లు ఉంటాయి. అక్కడే కార్మికులు షేవ్ చేసుకుని, స్నానం చేసుకునేందుకు ఒక ట్యాప్ కూడా ఉంటుంది.
భోజన సమయంలో మెస్‌లో రోటి, పప్పు, కూర, అన్నంతో వేడివేడి ఆహారాన్ని కార్మికులకు పెడతారు.
‘‘కార్మికులందరం కలిసే ఒక దగ్గరుంటాం. మా ఇంటికి, కుటుంబానికి, ప్రపంచానికి దూరంగా మేముండే ఇల్లు ఇది’’ అని 22 ఏళ్ల రాజు కుమార్ చెప్పారు.
రాజు కుమార్‌ను కలవడానికి వెళ్లినప్పుడు, తన బట్టలు ఉతుక్కుని అప్పుడే బయటికి వచ్చారు.
రాజు కుమార్ తన గదిని చూపించారు. లోపల ఎనిమిది బెడ్లు ఉన్నాయి. సొరంగంలో పనిచేసేందుకు అవసరమైన కొన్ని బట్టలు, షూలు, హెల్మెట్లు లోపల కనిపించాయి.
ఆ గది సైజు పెద్దదే. కానీ, ఎనిమిది బెడ్లు దానిలో వేయడం వల్ల అంత పెద్దగా కనిపించడం లేదు.
ఏదైనా కొనుక్కోవడానికి వెళ్లాలంటే తనకు, స్నేహితులకు చాలా కష్టంగా ఉంటుందని రాజు కుమార్ చెప్పారు.
ఎందుకంటే, అక్కడి నుంచి మార్కెట్ 10 కి.మీల దూరంలో ఉంటుందని తెలిపారు.
అక్కడికి వెళ్లేందుకు ఏమీ ఉండవని, తాము కాలినడకనే మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/SHANKAR PRASAD NAUTIYAL
కార్మికులు ఏ రాష్ట్రాలవారు?
సిల్క్యారా సొరంగం పనులు 2018లో ప్రారంభమయ్యాయి. రాజులాగా సుమారు 400 మంది ఈ సొరంగ ప్రాజెక్టు పనులను చేపట్టేవారు.
సొరంగ ప్రమాదానికి ముందు కొందరికి షిఫ్ట్ అయిపోతే, కొందరికి అప్పుడే షిఫ్ట్ ప్రారంభమైంది.
కార్మికుల్లో చాలా మంది బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లకు చెందిన వారు.
రాజును కలిసిన తర్వాత ఝార్ఖండ్ డియోఘర్ నుంచి వచ్చిన రాజేష్ కుమార్ యాదవ్‌ను మేం కలిశాం.
‘‘ప్రతి నెలా మాకు రూ.17 వేల జీతం వస్తుంది. దానిలో రూ.4 వేలు మెస్ ఫీజు, పీఎఫ్ కింద కట్ చేస్తారు. కొంత డబ్బును రోజువారీ అవసరాల కోసం పక్కన ఉంచుకుంటా. రూ.10 వేలను మా తల్లిదండ్రులకు పంపుతా’’ అని రాజేష్ కుమార్ యాదవ్ చెప్పారు.
ఝార్ఖండ్‌తో పోలిస్తే ఉత్తరకాశీ చాలా చల్లగా ఉందని, దీంతో తాను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానని రాజేష్ చెప్పారు.
‘‘ బయట చల్లటి నీళ్లతో స్నానం చేసినప్పుడు మరింత చల్లగా ఉంటుంది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, UTTARAKHAND STATE DISASTER RESPONSE FORCE/HANDOUT VIA REUTERS
నవంబర్ 12 దీపావళి రోజున రాజు, రాజేష్‌లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత రూమ్‌కి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.
దీపావళి పండగ చేసుకునేందుకు వారు ఇంటికి వెళ్లలేదు.
సొరంగ ప్రమాదం జరిగిందన్న వార్త తెలియడానికి ముందు కార్మికులందరూ దీపావళి పండగ చేసుకోవాలని అనుకున్నారు. దాని కోసం సిద్ధం కూడా అవుతున్నారు.
‘‘కూలిపోయిన సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులందరూ మా సోదరులు. వారు సురక్షితంగా బయటికి రావాలని మేం వేచిచూస్తున్నాం. వారి గురించి మేం చాలా ఆందోళన చెందుతున్నాం’’ అని రాజేష్ అన్నారు.
కూలిన సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల కుటుంబ సభ్యుల్లో నిరాశ, నిస్పృహలు తీవ్రమవుతున్నాయి.
మధ్యాహ్న సమయంలో మేం వారి గదులకు వెళ్లాం. ఆ సమయంలో వారు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.
అన్నం తినేందుకు రాజు మెస్‌కి వచ్చారు. మెస్‌లో కొద్దిగా వెలుతురు మాత్రమే ఉంది. టేబుళ్లు, చైర్లు లేవు. కూర్చుని, తినేందుకు కాంక్రీటు బల్లలు మాత్రమే ఉన్నాయి.
రాజు ప్లేటులో అన్నం, రోటీ, పప్పు, కూర ఉంది. కిచెన్ ఉన్నంతలో శుభ్రంగా ఉంది.
కెమెరా మందు మాతో కొందరు కార్మికులు మాట్లాడారు. కెమెరా ముందు మాట్లాడేందుకు ఇష్టపడని, భయపడే కొందరు కార్మికులతో కూడా మేం మాట్లాడాం.
సొరంగం ప్రాజెక్టులో పెద్ద రాతి బండలను కోసే బృందంలో తాము పనిచేసే వాళ్లమని ఇద్దరు కార్మికులు మాకు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘‘ప్రమాదానికి కొన్ని రోజుల ముందు సొరంగంలో 200 నుంచి 270 మీటర్ల మధ్యలో ఏదో సమస్య వచ్చింది. రాళ్లు కిందకి పడ్డాయి. దానికి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత నవంబర్ 12న అకస్మాత్తుగా ఆ భాగం కూలిపోయింది’’ అని వారిలో ఒకరు చెప్పారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే జషెండ్‌పూర్‌లో ఉంటున్న తన కుటుంబానికి ఫోన్ చేసి, తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన పనుల్లో లేరు.
బిహార్ నుంచి వచ్చిన మరో కార్మికుడు మాత్రం తాను సొరంగ ప్రాజెక్ట్‌లో పనిచేసేందుకు వచ్చినట్లు తన కుటుంబానికి ఇంకా చెప్పలేదన్నారు.
నవయుగ ఇంజినీరింగ్ అనే నిర్మాణ కంపెనీ ఈ సొరంగాన్ని నిర్మిస్తోంది. వీరందరూ ఈ కంపెనీ ఉద్యోగులే.
కార్మికుల వసతికి సంబంధించి ఈ కంపెనీ అధికారులను మేం కొన్ని ప్రశ్నలు అడగ్గా, వారు సమాధానం ఇవ్వలేదు.
కార్మికులందరూ బిహార్, ఝార్ఖండ్, ఒడిశా నుంచి వచ్చిన కార్మికులని ఈ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్‌వైజర్లు చెప్పారు.
ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల కొరత ఉండటంతో పనిచేసేందుకు ఇక్కడకు వచ్చారన్నారు.
వారు కుటుంబాలను పోషించాల్సి ఉందన్నారు. అందుకే అంత దూరం నుంచి పనిచేసేందుకు ఇక్కడికి వచ్చారని తెలిపారు.
70 శాతం పనులు పూర్తి
నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగం.
బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఇది ఒక వివాదాస్పద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని, ఇప్పటికే అదో పెద్ద సమస్యగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
2020లో వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 2024 చివరి నాటికి ఈ సొరంగ నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు.
నవంబర్ 12 ప్రమాదం తర్వాత, ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఇప్పట వరకు ప్రాజెక్ట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి.

ఫొటో సోర్స్, REUTERS
పైపుల ద్వారా ఆహారం
ప్రమాదం జరిగిన తర్వాత, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ఐదు రకాల ప్రయత్నాలను చేపట్టారు అధికారులు.
త్వరలోనే కార్మికులను కాపాడతామని అధికారులు చెబుతున్నారు.
నిర్మాణంలో ఉన్న నాలున్నర కి.మీ పొడవైన ఈ సొరంగం నవంబర్ 12, ఆదివారం కూలిపోయింది.
ఈ ఘటనలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి శిథిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి.
సొరంగంలో 70 మీటర్ల ప్రాంతానికి పైగా శిథిలాలు విస్తరించాయి. దీంతో కార్మికులు బయటికి వచ్చే మార్గం లేదు.
సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులకు పైపుల ద్వారా ఆహారాన్ని, ఆక్సిజన్‌ను, నీటిని అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ హార్బర్ అగ్నిప్రమాదం: యూట్యూబర్ 'లోకల్ బాయ్ నాని' వల్లే 43 బోట్లు తగులబడ్డాయా?
- ఇండియా - ఆస్ట్రేలియా ఫైనల్లో అసలు ‘టర్నింగ్ పాయింట్’ అదేనా?
- ఏటీఎం కార్డుతో 5 రకాల ఇన్సూరెన్స్.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- ఉత్తర్కాశి సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికుల్లో బయటికి తీసుకొస్తారనే నమ్మకం పోతోందా?
- ప్రీమెచ్యూర్ బేబీ: నెలలు నిండకుండానే శిశువు పుడితే కాపాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














