ప్రీమెచ్యూర్ బేబీ: నెలలు నిండకుండానే శిశువు పుడితే కాపాడుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
నెలలు నిండకుండానే జన్మించడం లేదా ఇలా పుట్టడంతో వచ్చే సమస్యలే ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణాలకు ప్రధాన కారణం.
2019లో ప్రపంచ వ్యాప్తంగా నెలలు నిండకుండా పుట్టడంతో వచ్చే సమస్యల వల్ల దాదాపు 9,00,000 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏమిటి?
గర్భంలో 37 వారాలు కూడా నిండకుండానే సజీవంగా పుట్టే శిశువులను ప్రీటర్మ్ బేబీ లేదా ప్రీమెచ్యూర్ బేబీ అంటారు.
గర్భంలో ఎన్ని వారాలు ఉన్నారనే కాలాన్ని బట్టి ప్రీటర్మ్ బర్త్‌లను మూడు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు.
- ఎక్స్‌ట్రీమ్లీ ప్రీటర్మ్ (28 వారాల కంటే తక్కువ)
- వెరీ ప్రీటర్మ్ (28 నుంచి 32 వారాలు)
- మోడరేట్ టు లేట్ ప్రీటర్మ్ (32 నుంచి 37 వారాల మధ్య)
శిశువులు నెలలు నిండకుండా ఎంత ముందు జన్మిస్తే వారిలో సమస్యలు ఉండే అవకాశం అంత ఎక్కువ. ‘ప్రీటర్మ్ బర్త్’ అనేది ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలనూ వేధిస్తున్న సమస్య.

ఫొటో సోర్స్, AJ PHOTO
నెలలు నిండకుండానే ఎందుకు పుడతారు?
గర్భంలో శిశువు చుట్టు ఉండే పొరలు ముందుగానే పగిలి ఉమ్మనీరు బయటకు రావడం అంటే ‘ప్రీటర్మ్ రప్చర్ ఆఫ్ ద మెంబ్రేన్స్’ వల్ల ప్రధానంగా నెలలు నిండాకుండా శిశువులు జన్మిస్తారని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది.
ఇతర కారణాలు ఇవీ..
- ఇన్ఫెక్షన్
- గర్భిణుల్లో ప్రీ-ఎక్లంప్షియా లాంటి అనారోగ్య సమస్యలు (ప్రీ-ఎక్లంప్షియా వల్ల తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు సమస్యలు, వాంతులు వస్తుంటాయి)
- గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉండటం
- గర్భంలో ఒకరి కంటే ఎక్కువ మంది శిశువులు ఉండటం
నెలలు నిండకుండానే ఇలా శిశువులు జన్మించే ముప్పును అడ్డుకునేందుకు ‘సెర్వికల్ స్టిచ్’ లేదా ‘సెర్‌క్లాజ్’ లాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రీమెచ్యూర్ జననాలపై పరిశోధన చేపడుతున్న బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య స్వచ్ఛంద సంస్థ ‘టామీ’లో ప్రీటర్మ్ బర్త్ సర్వైలెన్స్ క్లినిక్‌ను నడిపిస్తున్న అబ్‌స్టెట్రిక్స్ ప్రొఫెసర్ ఆండ్రూ షెనా చెప్పారు.
సెర్వికల్ స్టిచ్ ఆపరేషన్‌లో భాగంగా గర్భశయ ముఖ ద్వారం దగ్గర కుట్లు వేస్తారు.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
ఎలాంటి సంకేతాలు వస్తాయి?
నెలలు నిండకుండా ప్రసవం అయ్యేటప్పుడు గర్భిణుల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయని ప్రొఫెసర్ షెనా చెప్పారు. ఈ సంకేతాలు సాధారణ ప్రసవ సమయంలో కనిపించే సంకేతాల్లానే ఉంటాయని వివరించారు.
యోని నుంచి ఉమ్మనీరు బయటకు రావడం ఈ సంకేతాల్లో ప్రధానమైనది. కొన్నిసార్లు గర్భాశయ ముఖద్వారం కాస్త వదులు కావడం, మరికొన్ని సార్లు రక్తం రావడం లాంటివి కూడా జరుగుతుంటాయి.
‘‘చాలా సమయాల్లో గర్భిణుల్లో సంకేతాలు కనిపించిన తర్వాతే చికిత్స మొదలుపెడతారు. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వారం వదులుగా అవుతున్నప్పుడు గర్భిణిని తీసుకొస్తే, వెంటనే ఆ శిశువును జాగ్రత్తగా సంరక్షించే సదుపాయాలుండే ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లాలి’’ అని షెనా చెప్పారు.
‘‘ఇలాంటి సమయంలో శిశువును కాపాడేందుకు కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నిషియంతో శిశువు మెదడుకు రక్షణ కల్పించొచ్చు. శిశువులో శ్వాస సమస్యలు తలెత్తకుండా చూసేందుకు, ఊపిరితిత్తుల శక్తిని పెంచే స్టెరాయిడ్లను కూడా ఇవ్వొచ్చు’’ అని షెనా వివరించారు.

ఫొటో సోర్స్, JOE JAMES
బతికే అవకాశం ఎంత?
ప్రీటర్మ్ బర్త్ అనేది ప్రపంచ దేశాలను వేధిస్తున్న సమస్య. అయితే, ఇలాంటి కేసులు ఎక్కువగా దక్షిణాసియా, సబ్-సహారన్ ఆఫ్రికాల్లో ఎక్కువగా నమోదు అవుతుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.
అయితే, ఇలా పుట్టే శిశువులు బతికే అవకాశాలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
ఉదాహరణకు అల్పాదాయ దేశాల్లో 28 వారాల కంటే ముందే జన్మించిన శిశువుల్లో 90 శాతం మంది చనిపోతున్నారు. అయితే, ధనిక దేశాల్లో ఇది పది శాతం కంటే తక్కువగానే ఉంది.
అయితే, ఇలాంటి ముప్పులను దాటుకుని వచ్చే శిశువుల్లో చాలా మంది శాశ్వత వైకల్యాల బారిన పడుతుంటారు. వినికిడి సమస్యలు, కంటి చూపు సమస్యలు వీటిలో ఉంటాయి. గర్భంలో శిశువు పూర్తిగా అభివృద్ధి చెందకుండా బయటకు రావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణం.
గర్భంలో చాలా తక్కువ వారాలు గడపడంతోపాటు బరువు 1 కేజీ నుంచి 1.3 కేజీలు ఉండేవారికి అనారోగ్య సమస్యలు, వైకల్యం వచ్చే ముప్పు మరింత ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ప్రీమెచ్యూర్ బేబీని చూసుకోవడం ఎలా?
24 వారాల తర్వాత జన్మించిన శిశువులు బతికే అవకాశం ఉంటుంది. కానీ, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జన్మించిన మొదటి వారాల్లో వారిని ఆసుపత్రిలో నిపుణుల సమక్షంలో ఉంచాల్సి ఉంటుంది.
వారికి కొన్ని రకాల ఆరోగ్య పరికరాలు, సదుపాయాలు అవసరం అవుతాయి. అవేమిటంటే..
- ఇంక్యుబేటర్లు: నవజాత శిశువుల ఆరోగ్య సదుపాయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని శిశువులకు కల్పిస్తాయి.
- వెంటిలేటర్లు: ఇవి శిశువులకు ఆక్సిజన్ అందేలా చూస్తాయి. ఎందుకంటే శిశువులు తమకు తాముగా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.
- మోనిటర్స్: శిశువుల ఆరోగ్యంతోపాటు గుండె కొట్టుకునే తీరు, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయులను నిత్యం గమనించేందుకు ఇవి అవసరం.
- ఇంట్రావీనస్ డ్రిప్స్: వీటి సాయంతో శిశువుకు రక్త నాళాల ద్వారా ద్రవాలు, ఔషధాలను అందిస్తారు.
- ఫీడింగ్ ట్యూబ్స్: వీటి సాయంతో శిశువుకు నోరు లేదా ముక్కు ద్వారా ఆహారం అందించేందుకు వీలుపడుతుంది.
- ఇన్‌ఫ్యూజన్ పంప్స్: పోషకాలు, ఇతర ద్రవాలు, రక్తం, ఔషధాలను వీటి ద్వారా అందిస్తారు.
- అంబ్లికల్ క్యాథెటర్స్: వీటి ద్వారా ఔషధాలు, పోషకాలు అందిస్తారు. రక్తంలో కొన్ని రకాల గ్యాస్‌ల పరిమాణాన్ని గమనించడంతోపాటు రక్తపోటును చూసేందుకూ ఇవి ఉపయోగపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్
నెలలు నిండకుండా పుట్టే పిల్లల సంరక్షణ విషయంలో నిరుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో ప్రధాన మైనది ‘కంగారూ కేర్’. తల్లీబిడ్డల చర్మాలు తాకేలా ఇద్దరినీ కలిపి వుంచే స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్‌ను ప్రసవం అనంతరం వెంటనే మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇంక్యుబ్యేటర్ లేని పరిస్థితుల్లోనూ ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
అటు తల్లి, ఇటు బిడ్డ ఇద్దరినీ ఇది ప్రశాంతంగా ఉంచుతుంది. శిశువు గుండె కొట్టుకునే తీరు, శ్వాసను కూడా ఇది నియంత్రించగలదు. గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు చుట్టుపక్కల పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది తోడ్పడుతుంది.
శిశువు జీర్ణ వ్యవస్థను ఇది మెరుగుపరచగలదు. అంతేకాదు, శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించగలదు.
ప్రసవం అనంతరం మొదలుపెట్టే ఈ స్కిన్-టు-స్కిన్ కేర్ వల్ల ఏటా 1,50,000 మంది శిశువుల ప్రాణాలు కాపాడొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైన అనంతరం తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















