శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం...'

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దీపాలి జగ్‌తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''హత్య కేసు దర్యాప్తు చివరి దశలో ఉందని పోలీసులు రెండు నెలలుగా చెబుతున్నారు. ఇంకా ఎన్ని నెలలు పడుతుంది దానికి? ఇంతవరకూ ఎలాంటి ఫలితమూ లేదు, ఎందుకు? కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.''
బీబీసీ మాట్లాడినప్పుడు శ్రద్ధా వాల్కర్ తండ్రి వికాస్ వాల్కర్ స్పందన ఇది.
నిరుడు నవంబర్‌లో శ్రద్ధా వాల్కర్ హత్యోదంతం బయటపడింది. శ్రద్ధను హత్య చేసిన తీరు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇప్పటికి ఏడాది దాటి ఒక నెల కూడా గడిచిపోయింది. కానీ ఇంతవరకూ తమ కూతురికి అంత్యక్రియలు చేయలేకపోవడంపై వాల్కర్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఆ దారుణం జరిగి ఏడాది గడచినా ప్రధాన నిందితుడికి శిక్ష ఖరారు కాకపోవడంపై వారు విచారం వ్యక్తం చేశారు.
''ఆమె శరీరంలోని ఒక్క ముక్క అయినా దొరికి ఉంటే అంత్యక్రియలు చేసి ఉండేవాళ్లం'' అని వికాస్ వాల్కర్ చెప్పారు.
ఈ ఏడాదిలో ఎన్నో దర్యాప్తులు, కోర్టు విచారణలు జరిగాయి. కానీ దర్యాప్తు పూర్తయ్యేందుకు ఇంకెతం కాలం పడుతుంది? అని శ్రద్ధా వాల్కర్ తండ్రి వికాస్ వాల్కర్ ప్రశ్నిస్తున్నారు.
27 ఏళ్ల శ్రద్ధా వాల్కర్ తన లివ్ ఇన్ పార్టనర్ (సహజీవన భాగస్వామి) అఫ్తాబ్ పూనావాలాతో కలిసి బతకాలనే ఉద్దేశంతో ముంబయి నుంచి దిల్లీ వెళ్లారు.
2022 మే 18న శ్రద్ధ హత్యకు గురయ్యారు. అయితే, ఆమె దారుణ హత్యకు గురైనట్లు ఆరు నెలల తర్వాత నవంబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.
ఈ కేసులో శ్రద్ధ పార్టనర్ అఫ్తాబ్ పూనావాలాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
అయితే ఇదంతా జరిగి ఏడాది గడచిపోయినా, ఈ కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదంటూ శ్రద్ధ తండ్రి వికాస్ వాల్కర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వికాస్ వాల్కర్ ఏమన్నారు? ఈ కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
'...అప్పుడు కనీసం అంత్యక్రియలైనా చేసుకోవచ్చు'
''కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది, కానీ, ఇప్పటి వరకూ తీర్పు ఎందుకు రాలేదన్నదే ప్రశ్న. ఈ కేసులో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రక్రియ అంతా నత్తనడకన సాగుతోంది.
దర్యాప్తు చివరి దశలో ఉందని పోలీసులు గత రెండు నెలల నుంచి చెబుతూ వస్తున్నారు. కేసు దర్యాప్తు చివరి దశలో ఉంటే ఇంకా ఎన్ని నెలలు పడుతుంది, ఇంతవరకూ ఎలాంటి ఫలితం లేదు ఎందుకు?'' అని వికాస్ వాల్కర్ అన్నారు.
''అక్టోబర్‌లో పూర్తవుతుందన్నారు. ఎందుకు కాలేదు? ఇప్పుడు డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అంటున్నారు. కానీ, ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఇంకా ఏం దర్యాప్తు చేస్తున్నారో, ఏం చేశారో తెలియడం లేదు.'' అన్నారు.
ఈ కేసులో వికాస్ వాల్కర్ సాక్ష్యం కూడా తీసుకున్నారు. జూలై - ఆగస్టులో కోర్టులో తాను వాంగ్మూలం ఇచ్చానని ఆయన అన్నారు.
''వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కొద్ది నెలల ముందు దిల్లీకి వచ్చాను. ఆమె శరీరంలో కేవలం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసుకుంటాం. అదే నా కోరిక.
అంత్యక్రియలు చేసుకునేందుకు ఒక్క భాగం ఇచ్చినా ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేస్తాం. కానీ, పోలీసులు, కోర్టు అందుకు అనుమతించడం లేదు. తీర్పు వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.
వాళ్ల దగ్గర 13 శరీర భాగాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి ఇవ్వండి, మిగిలినవి విచారణ కోసం ఉంచండి. అయినా వాళ్లు పట్టించుకోవడం లేదు'' అని వికాస్ వాల్కర్ అన్నారు.
శ్రద్ధ శరీర భాగాలు ఈ కేసులో సాక్ష్యాధారాలని, కేసు పూర్తయ్యే వరకూ వాటిని అప్పగించడం కుదరదని చెప్పారని వికాస్ వాల్కర్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ఇప్పటి వరకూ ఏం జరిగిందంటే...
2022 మే 8వ తేదీ: దిల్లీలోని ఆమె నివాసంలో శ్రద్ధా వాల్కర్ హత్యకు గురయ్యారు. హత్యానంతరం ఆమె శరీరాన్ని 20కి పైగా ముక్కలు చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పూర్తిగా మాయం చేసేందుకు ఆమె శరీర భాగాలను దిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, హిమాచల్ ప్రదేశ్‌లో పడేశారు.
2022 అక్టోబర్ 22: శ్రద్ధా వాల్కర్ తండ్రి వికాస్ వాల్కర్ తన కూతురు కనిపించడం లేదంటూ వసాయ్ పోలీస్ట్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత కేసును దిల్లీ పోలీసులకు బదిలీ అయింది.
2022 నవంబర్ 10: కొద్ది నెలల నుంచి కనిపించకుండా పోయినట్లు కేసు నమోదైంది. అయితే ఆమె ఫోన్ సిగ్నల్ దిల్లీలో ఉన్నట్లు నిర్ధారణ అయింది.
2022 నవంబర్ 14: శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
2022 నవంబర్ 20: దిల్లీలోని ఛత్తర్‌పూర్ అటవీ ప్రాంతానికి సమీపంలో శ్రద్ధా వాల్కర్ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.
2022 డిసెంబర్ 9: శ్రద్ధా వాల్కర్ తండ్రి వికాస్ వాల్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అఫ్తాబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
2023 జనవరి 4: శ్రద్ధా వాల్కర్ ఎముకలకు, ఆమె కుటుంబ సభ్యులతో సరిపోలుతున్నాయా లేదా అని డీఎన్‌ఏ టెస్టు నిర్వహించారు. దీంతో అవి శ్రద్ధా వాల్కర్ శరీర భాగాలేనని నిర్ధారణ అయింది.
2023 జనవరి 24: దిల్లీ పోలీసులు 6,629 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
2023 మే 9: ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై హత్యానేరం కింద కేసు విచారణ జరపాలని దిల్లీ కోర్టు నిర్ణయించింది.

ఫొటో సోర్స్, ANI
పోలీసులు ఏమంటున్నారు?
దిల్లీలోని ఛత్తర్‌పూర్‌లోని ఆమె నివాసంలో శ్రద్ధా వాల్కర్ హత్యకు గురయ్యారు. ఆమె పార్టనర్ అఫ్తాబ్ హత్యానేరం కింద అరెస్టయ్యారు.
శ్రద్ధా వాల్కర్ కనిపించకుండా పోవడం, కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో 2022 అక్టోబర్‌లో ఆమె తండ్రి వికాస్ వాల్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఆమె హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.
శ్రద్ధ హత్య కేసులో అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించామని, చార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు చెబుతున్నారు. అఫ్తాబ్ పూనావాలాపై హత్యానేరం కింద కేసు నమోదైంది.
ఈ కేసు విచారణలో ఉంది. హత్యకు వాడిన ఆయుధాలు, ఆమె ఎముకలు, ఇతర ఆధారాలను సీజ్ చేశారు.
అఫ్తాబ్‌ను అరెస్టు చేసిన తర్వాత దిల్లీ పోలీసులు దర్యాప్తులో భాగంగా అతన్ని మెహ్రోలి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె శరీర భాగాలను అఫ్తాబ్ వేర్వేరు చోట్ల పడేసినట్లు పోలీసులు చెప్పారు.
శ్రద్ధా వాల్కర్‌ను అఫ్తాబ్ గొంతు నులిమి చంపేశాడని పోలీసులు చెప్పారు.

చార్జిషీట్‌లో ఏముంది?
2023 జనవరిలో శ్రద్ధా వాల్కర్ కేసులో దిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. దిల్లీ హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.
అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాల్కర్‌ను హత్య చేసి, ఆమె శరీరాన్ని 17 భాగాలుగానరికేశాడని, ఆ తర్వాత శరీర భాగాలను ఫ్రిజ్‌లో, అల్మారాలలో దాచాడని దిల్లీ పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
శ్రద్దా వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా దిల్లీలో సహజీవనం చేశారు. విచారణ సమయంలో మొదట అఫ్తాబ్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు.
శ్రద్ధా వాల్కర్ మృతదేహాన్ని దహనం చేసి, ఆమె బూడిద, ఎముకలను విసిరి పారేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను వేర్వేరు చోట్ల పడేసినట్లు ఒప్పుకున్నాడని చార్జిషీట్‌లో పోలీసులు తెలిపారు.
2023 నవంబర్ 15న పోలీసులు అఫ్తాబ్ పూనావాలాను శ్రద్ధ శరీర భాగాలు పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు.
ముంబయిలో పనిచేసే సమయంలో శ్రద్ధా వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా మధ్య సాన్నిహిత్యం పెరిగిందని దిల్లీ పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
శ్రద్ధా కుటుంబం ముంబయికి సమీపంలోని వసాయ్‌లో నివాసముంటుంది. తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ దిల్లీ వచ్చి ఛత్తర్‌పూర్‌లో ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
శ్రద్ధ పెళ్లి గురించి అడగడం మొదలుపెట్టడంతో ఇద్దరి మధ్య వాదన జరిగేదని, 2022 మే 18న ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవ జరగడంతో గొంతునులిమి చంపేశాడని పోలీసులు తెలిపారు.
''ప్రియురాలిని హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలు చేసినట్లు విచారణలో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మృతదేహం వాసన రాకుండా ఒక పెద్ద ఫ్రిజ్ కొని అందులో ఆమె శరీర భాగాలను పెట్టాడు.
రాత్రివేళల్లో చిన్న చిన్న ముక్కలను తీసుకెళ్లి అడవిలో వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు'' అని దిల్లీ సౌత్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అంకిత్ చౌహాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
దర్యాప్తు ఎలా మొదలైంది?
హత్య తర్వాత శ్రద్ధ ఫోన్‌ను అఫ్తాబ్ పారేశాడు. ఆ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేలో శ్రద్ధను చంపేసిన తర్వాత ఆమె బతికే ఉన్నట్లు అందరినీ నమ్మించేందుకు జూన్ వరకూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంటను వాడుతూనే ఉన్నాడు.
హత్య కోసం ఆన్‌లైన్‌లో కొన్ని రసాయనాలను కూడా అఫ్తాబ్ ఆర్డర్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఆమె శరీర భాగాలను 18 రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచి ఒక్కో భాగాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. హత్యకు ముందు నిందితుడు అఫ్తాబ్ డెక్స్‌టర్ వెబ్ సిరీస్ చూసినట్లు కొన్ని వార్తలు కూడా వచ్చాయి.
2018లో శ్రద్ధా వాల్కర్ ఒక కాల్ సెంటర్‌లో పనిచేసేది. ఆ సమయంలో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
శ్రద్ధ ఆమె తల్లితో కలిసి ఉండేది. ఆమె తండ్రి వేరుగా ఉండేవారు. అఫ్తాబ్‌తో కలిసి ఉండాలనుకుంటున్నట్లు 2019లో శ్రద్ధ తన కోరికను తన తల్లికి చెప్పింది. అయితే, అతను వేరే మతానికి చెందిన వ్యక్తి కావడంతో తల్లి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంటి నుంచి వచ్చేసి అఫ్తాబ్‌తో సహజీవనం చేసింది.
కొద్దిరోజుల తర్వాత అఫ్తాబ్ తనను కొడుతున్నట్లు శ్రద్ధ తన తల్లికి చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తల్లి చనిపోవడంతో తండ్రికి చెప్పుకుని బాధపడింది. ఆయన్ను కలిసి అఫ్తాబ్ గురించి చెప్పింది.
రెండు నెలలుగా కనీసం ఫోన్ కూడా లేకపోవడంతో ఆమె స్నేహితురాలు శ్రద్ధ సోదరుడికి విషయం చెప్పింది.
ఆ తర్వాత పోలీసులు శ్రద్ధ మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. శ్రద్ధ ఫోన్ లొకేషన్ చివరిసారి దిల్లీలోని మెహ్రోలీలో ఉన్నట్లు ముంబయి పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇవి కూడా చదవండి:
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














