అల్‌జహ్రా: గాజాలోని ఈ అందమైన నగరం ఇప్పుడెలా ఉందో చూడండి...

అల్‌జహ్రా

ఫొటో సోర్స్, bbc

ఫొటో క్యాప్షన్, అల్‌జహ్రా ఒకనాడు ఇంతపచ్చగానూ, సంతోషంగానూ ఉండేది

అల్ జహ్రా. గాజా ఉత్తరాన ఉండే పొరుగుప్రాంతం. మధ్యధరా సముద్రపు ఒడ్డున నిశ్చింతగా సేదతీరుతుంటుంది. ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో ఈ ప్రాంతం అప్పటిదాకా పెద్దగా ప్రభావితం కాలేదు. ఇక్కడి ప్రజలు కూడా తమ ప్రాంతానికి ఏం కాదు అనే ధైర్యంతోనే ఉన్నారు.

కానీ..

అక్టోబరు 20 శుక్రవారం మధ్యాహ్నం వారి నమ్మకం సడలిపోయింది. శుక్రవారం ప్రార్థనలకు ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ వారాంతంలో అల్ జహ్రా వాసులు నోరూరించే ఫలాఫెల్, హుమ్మూస్ ( మాంసంతో తయారుచేసిన పదార్థాలు)ను, కాఫీ, టీలను తమ విశాలమైన అపార్ట్‌మెంట్లలోకానీ, మధ్యదరాసముద్రపు తీరం వెంబడి ఉండే విల్లాల్లో కానీ స్వీకరిస్తుండేవారు. ఈ సౌఖ్యం కారణంగానే కావచ్చు అల్‌జహ్రా వాసులు తామెప్పుడూ గాజావాసులకంటే అదృష్టవంతులమని నమ్మేవారు.

కానీ, రాత్రికి రాత్రే పాతిక అపార్ట్‌మెంట్లపై ఇజ్రాయెల్ బాంబులు పడ్డాయి. దీంతో వందలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వీరంతా తమ ఇంటి శిథిలాల ముందు దుమ్ము, ధూళిమధ్య నిలబడాల్సి వచ్చింది.

ఇక్కడ నివసించే వారిలో డాక్టర్లు, లాయర్లు, విద్యావేత్తలు, ఫ్యాషన్ డిజైనర్లు, వ్యాపారవేత్తలు ఈ శిథిలాల మధ్యనే బతికేందుకు ప్రయత్నించారు.

వీరిలో చాలామంది గాజాస్ట్రిప్ అంతటా చెల్లాచెదురయ్యారు. అక్టోబరు 7న హమాస్ దాడులకు బదులుగా ఇజ్రాయెల్ గాజాపై బాంబులవర్షం కురిపిస్తోంది.

గాజాకు ఉత్తరాన ఉన్న అల్‌జహ్రా ఇటీవల వరకు బాంబుల తాకిడికి గురికాలేదు.

అల్‌జహ్రాలో పుట్టి పెరిగిన హనా హుస్సేన్ రెండేళ్ళ కిందటే ఇక్కడికి కొన్నివందల కిలోమీటర్ల దూరంలోని టర్కీకి వెళ్ళారు. అక్కడి నుంచి ఆమె ఈ వార్త విని భయపడుతూ ఇంటికి ఫోన్ చేశారు. తన కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారో లేరో కనుక్కున్నారు. తాను వారిని ప్రేమిస్తున్నట్టు చెప్పారు. ఈ మాట పూర్తయిందో లేదో ఫోన్ కాల్ కట్ అయిపోయింది.

అల్‌జహ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన ఇంటి శిథిలాల వద్ద విషాదవదనంతో ఓ అల్‌జహ్రా పౌరుడు

దాడులకు ముందు ఫోన్..

అల్‌జహ్రాలో నిరాశ్రయులైనవారంతదరూ దగ్గరలోని యూనివర్సిటీలో ఆశ్రయం పొందారు. బాంబుదాడులతో నిరాశ్రయులైనవారందరనీ ఇక్కడికి చేర్చే పనిని దంతవైద్యుడు మహమ్మద్ షహీన్ దగ్గరుండి చూసుకున్నారు.

ఈయనే తన పొరుగువారందరిని బాంబులు పడకముందే ఖాళీ చేయించడానికి నాయకత్వ వహించారు.

షాహీన్‌కు ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అపార్ట్‌మెంట్స్‌పై బాంబుదాడులు జరుగుతాయని ఆ ఏజెంట్ హెచ్చరించిన కథనాన్ని బీబీసీ గతంలో ప్రచురించింది.

అయితే అల్‌జహ్రా హౌసింగ్ అపార్ట్‌మెంట్స్ పై దాడులు చేయాలనే నిర్ణయాన్ని షహీన్ ప్రశ్నించినప్పుడు ‘‘ కొన్ని ప్రత్యేకమైన ఆపరేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేం’’ అని చెప్పారు.

హమాస్ గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. వాటిలో పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి అని వారు తెలిపారు.

అల్‌జహ్రాలో హమాస్‌కు సంబంధించినవారినెవరినైనా హతమార్చినట్టు ఇజ్రాయెల్ చెప్పలేదు. ఇక్కడ అలాంటి మరణాలు ఏవీ జరగలేదని కూడా నమ్ముతున్నారు.

హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాలనే వ్యూహానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంది. అయితే పౌరుల మధ్య దాక్కుంటూ హమాస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పౌరుల మరణాలను తగ్గించేందుకు, బాంబుదాడుల ముందు షాహీన్‌కు చేసినట్టు ఫోన్ కాల్స్ చేస్తోంది. షాహీన్ కూడా ఇటువంటి ఫోన్‌కాల్ అందుకోవడం వలనే తన పరిసరాలలోనివారిని ఖాళీ చేయించగలిగారు.

షాహీన్‌కు ఫోన్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఏజెంట్ ‘‘మీరు చూడనిది..మేం చూశాం’’ అని చెప్పారు.

అల్‌జహ్రాపై బాంబు దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూటాముల్లె సర్దుకుని అల్‌జహ్రాను వీడుతున్న పౌరులు

‘మేమింకా బతికే ఉన్నాం’

బీబీసీ ఈ ప్రాంతంలో రెండువారాలపాటు గడిపింది. అనేక కుటుంబాలతో మాట్లాడింది. అనేకమందితో ఫోన్లలోనూ, వాట్సాప్‌లలోనూ సంభాషించింది. వీరిలో ఇక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నవారు, యువకులు, జీవితంలో పైకి ఎదగాలనే బలమైన కోరికగలవారు ఉన్నారు.

వీరంతా తమ కళ్ళెదుటే తమ ఇళ్ళు నేలమట్టమవడాన్ని చూశారు. అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న గాజా స్ట్రిప్ అంతటా తాము ఎలా చెల్లాచెదురైపోయారో చెప్పారు.

గాజాస్ట్రిప్ అంతటా ఉన్న ఆశ్రయాలు, తాత్కాలిక గృహాలలో ఆశ్రయం పొందుతున్నవారందరూ తమ పొరుగుప్రాంతాలవారి చావుబతుకుల గురించి చెప్పాలనుకుంటున్నారు.

చాలా సందర్భాలలో వీరు ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు బాంబుల శబ్దాలు కూడా వినిపించేవి. అప్పుడప్పుడు వాట్సాప్ సందేశాలు కూడా వస్తుండేవి.

గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ తరువాత అల్‌జహ్రాలో నివసించే ఓ వ్యక్తి మాకు ఓ సంక్షిప్త సందేశాన్ని పంపారు. ‘‘ మా గురించి అడిగినందుకు ధన్యవాదాలు. మేమింకా బతికే ఉన్నాం’’ అని పంపారు.

మా సంభాషణ ద్వారా అల్ జహరాను వదిలేసినవారందరూ బతికిలేరని అర్థమైంది. చనిపోయినవారిలో ఓ బాడీ బిల్డర్ కూడా ఉన్నారు. ఆయన తనస్నేహితుడికి పంపిన చివరి సందేశంలో ‘‘ అక్కడ ఇంకా ఏమీ మిగల్లేదు’’ అని చెప్పారు.

అల్‌జహ్రా
ఫొటో క్యాప్షన్, సూర్యోదయ,సూర్యాస్తమయాలను అల్‌జహ్రా ప్రజలు ఆస్వాదించేవారు

ఇక్కడ హమాస్ జాడలేమీ లేవు

యుద్ధం మొదలైనప్పటి నుంచి 10వేలకుపైగా మరణించారని, వీరిలో మూడోవంతు చిన్నారులేనని హమాస్ నియంత్రణలోని ఆరోగ్యశాఖ తెలిపింది.

గాజాస్ట్రిప్ జనసాంద్రత ఎక్కువ. పైగా దుర్భర దారిద్య్రం, , రాకపోకలపై కఠినమైన పర్యవేక్షణ ఉన్న ప్రాంతం.

కానీ అల్‌జహ్రా గాజాస్ట్రిప్ పొరుగుప్రాంతం. ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, విశాలమైన బహిరంగప్రదేశాలు, బాదం, అత్తిచెట్లు, ఆట మైదానాలు, పార్కులతో ఉంటుంది.

అధికారుల కోసం, మద్దతుదారుల కోసం పాలస్తీనియన్ అథార్టీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ 1990లో అల్‌జహ్రాను ఏర్పాటు చేశారు.

అల్‌జహ్రాకు ఇప్పటికీ వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్ అథార్టీతో గట్టి సంబంధాలే ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

అల్‌జహ్రా గాజా నదికి ఉత్తరాన ఉంటుంది. ఈ ప్రాంతం నుంచే అక్టోబరు 13న పౌరులను ఖాళీ చేసి పోవాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశించింది.

హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ అనేక రోజుల నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్ దాడులలో 1400మంది చనిపోయారు.

వీరిలో చాలామంది అనేకమంది చిన్నారులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. హమాస్ గన్‌మెన్లు 200మందికిపైగా ప్రజలను బందీలుగా పట్టుకుపోయారు.

దీనిపై తమకు తెలిసినంతవరకు చెప్పమని కోరగా, ఈ ప్రాంతం హమాస్‌కు, గాజాలోని దాని కార్యకలాపాలకు చాలా దూరంగా ఉందని తెలిపారు.

2007 నుంచి హమాస్ గాజాను పాలిస్తోంది. ‘‘ ఇక్కడ ఎటువంటి సైన్యం లేదు. ఇక్కడ హమాస్ మద్దతు దారులు ఉంటున్నారని నేను అనుకోవడంలేదు’’ అని ఓ స్థానికుడు తెలిపారు.

నష్వా రజాక్

ఫొటో సోర్స్, NASHWA REZEQ

ఫొటో క్యాప్షన్, కుమారుడితో నష్వా

కల చెదిరింది... కథ మారింది

నష్వా రజెక్ 18ఏళ్ళుగా అల్‌జహ్రాలో నివసిస్తున్నారు. ఇది వారికో గొప్ప నగరం. ఈమె తన పొరుగువారితోనూ, స్థానిక యువజన సంఘంలోనూ చురుకుగా ఉండేవారు. నష్వా ఫేస్‌బుక్‌లో ఓ కమ్యూనిటీని దశాబ్దానికిపైగా నడుపుతున్నారు.

మీరు ఏదైనా ప్రత్యేకంగా ఓ ఇంటి గురించి అడిగే ఆ ఇంట్లో వారు ఎవరు, వారి ఫోన్ నెంబర్ ఏమిటో ఆమె చెప్పగలరు.

ఈ ఫేస్‌బుక్ పేజీలో 10వేలమంది ఫాలోయర్లు ఉన్నారు. యుద్ధానికి ముందురోజు ఈ ఫేస్‌బుక్ పేజీ లోకల్ కేఫ్‌లో జరిగిన బిలియర్డ్ టోర్నమెంట్ కు సంబంధించిన అభినందనలు, స్టూడెంట్స్ డిగ్రీలు పొందిన విషయాలతో నిండి ఉంది.

ఇప్పుడీ పేజీలో తన ఇరుగుపొరుగు ప్రాంతాలలో జరిగిన విధ్వంసం గురించిన సమాచారం ఇస్తున్నారు. అక్కడి నివసించనివారిలో చనిపోయినవారిని గుర్తిస్తున్నారు.

నష్వా మునెపన్నడూ ఇంత బిజీగా లేరు. ఇటాలియన్ రెస్టారెంట్‌లో ఓ కుటుంబం చనిపోవడంపై సంతాపం తెలిపిన పోస్టు ఈ పేజీలో తాజాగా ప్రచురితమైంది.

యుద్ధం ప్రకటించాక నష్వా గాజా దక్షిణ ప్రాంతానికి తన భర్త, నలుగురు పిల్లలతో కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళేముందు తన పక్కింటివారికి ఇంటితాళం ఇచ్చి, తన ఇంటితోపాటు తానెంతగానో ప్రేమించే మొక్కలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు.

రెండురోజుల తరువాత మొదటి బాంబుపడ్డాక, ఆమె భవనం నేలమట్టమైంది. అల్‌జహ్రాలో ఇది అతి పొడవైన భవనం.

‘‘ఇప్పుడే నేలమట్టమైన మీ టవర్ ముందునుంచి వెళుతున్నాం’’ అని ఎవరో ఫోన్ చేసి చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.

తన ఇల్లు ఐదో అంతస్తులో ఎంతో విశాలంగా ఉండేదని నష్వా చెప్పారు. మేము ఆ ఇల్లు కొన్నాకా ఈ పదేళ్ళలో దానిలో ఎన్నో మార్పులు చేసుకున్నాం. ఈ మధ్యనే కొత్త ఏసీని, టీవీ, ఫర్నిచర్ కొన్నాం. చాలామందికి ఇదంతా డబ్బుతో ముడిపడిన విషయంగా అనిపించవచ్చు. కానీ నాకు నా ఇల్లు నా ఆత్మ లాంటిది అని చెప్పారు.

అల్‌జహ్రాను వదిలివెళ్ళేటప్పుడు టీవీ, ఏసీ ఎందుకు తమతోపాటు తీసుకురావడం లేదని పిల్లలు గొడవ చేశారు. ఇప్పుడు వారు తిరిగి ఇంటికి ఎప్పుడు వెళతాం, ఎప్పుడు తమ బొమ్మలతో ఆడుకుంటాం అని అడుగుతున్నారని చెప్పారు. నష్వాకు మొక్కలు చాలా ప్రీతిపాత్రమైనవి.

అల్‌ జహ్రా

ఫొటో సోర్స్, AHMED HAMMAD

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ అహ్మద్ హమ్మద్

వంటచెరకు కోసం ప్రొఫెసర్ తిప్పలు

అహ్మద్ హమ్మద్ ఓ యూనివర్సిటీ ఫ్రొఫెసర్. నష్వా భవనానికి సమీపంలోనే ఆయనా నివసించేవారు. ఈ కమ్యూనిటీ వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒకరు. దాడులు జరిగిన తరువాత కూడా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నవారిలో ఈయన కూడా ఒకరు.

హమ్మద్ వయసు 50 ఏళ్ళు. ఆయన యూనివర్సిటీలో మీడియా అండ్ కమ్యూనికేషన్స్ బోధిస్తారు. ఆయన ‘8 నుంచి 27 ఏళ్ళ మధ్య వయసున్న తన ఆరుగురు పిల్లల గురించి ఎంతో గర్వంగా చెబుతారు.

‘‘వారిలో ఒకరు డెంటిస్ట్. ఒకరు ఐటీలో పనిచేస్తున్నాడు, ఇంకొకరు ఇంగ్లీషు లిటరేచర్ చదివాడు. మిగిలిన ముగ్గురు పిల్లలు ఇంకా స్కూలుకు వెళుతున్నారు’’ అని చెప్పారు.

మేము కిందటి నెల ఫోన్’లో మాట్లాడినప్పుడు ఆయన అల్‌జహ్రాలోని తన ఇంటిలోనే ఉన్నారు. ఇప్పుడా ఇల్లు తలుపులు, కిటికీలు లేకుండా ఉంది. వీరంతా తమ పనులకు కానీ, స్కూల్‌కుకానీ వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వారు వంటచేసుకోవడానికి కావాల్సిన కట్టెపుల్లల కోసం వెదకడానికే సమయమంతా వెచ్చిస్తున్నారు. వాళ్ళు ఇల్లు వదిలి బయటకు రావడానికి భయపడుతున్నారు.

ఇజ్రాయెల్ అక్టోబరు 27న వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. భూతల ఆపరేషన్లనూ ముమ్మరం చేసింది. మాకు అహ్మద్‌తో సంబంధాలు తెగిపోయిన కొన్నిరోజుల తరువాత ఆయనే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. తన ఇంటిని ఎన్నో నిద్రలేని రాత్రుల నడుమ వదిలేశానని ఆయన చెప్పారు. ఎప్పడు బాంబుల శబ్దం వచ్చినా తాము నేలపై పడుకునేవారమని చెప్పారు.

అల్‌జహ్రా

ఫొటో సోర్స్, HANA HUSSAIN

ఫొటో క్యాప్షన్, సోదరుడు యహ్యతో హనా హుస్సేనీ

‘నేను చనిపోతే నా పిల్లలను చూసుకుంటావా?’

టర్కీలో నివసించే హనా తన ఫోన్‌కు అతక్కుపోయే ఉంటున్నారు. తన కుటుంబం యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఆమె ఫోన్‌లోనే ఉంటున్నారు. మేం ఆమెతో మాట్లాడానికి వేచి చూస్తుండగా మె అల్‌జహ్రాలోని అందమైన ప్రదేశాలు, అక్కడి తన అనుభూతులను పంచుకున్నారు.

అల్‌జహ్రాలోని వారందరూ తరచూగా సముద్రపు ఒడ్డున సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ కలుసుకునేవారు. సముద్రానికి దారి తీసే రోడ్డంతా ఆ సమయంలో కిటకిటలాడుతుండేది. శుక్రవారం వేళ హనా, ఆమె స్నేహితులు బీచ్ వద్ద ఆ వారంలో ఏం జరిగిందనే కబుర్లను పంచుకునేవారు.

కానీ యుద్ధం వీటన్నింటినీ మార్చేసిందని చెప్పారు. ఒకనాడు తనతో జోకులు వేసి, సరదాగా కబుర్లు చెప్పిన స్నేహితులే ‘‘ నేను చనిపోతే నా పిల్లలను చూసుకుంటావా’’ అని మెస్సేజ్‌లు పెడుతున్నారని ఆవేదనగా చెప్పారు. ఇంకా కొంతమంది స్నేహితురాళ్ళు కాస్త శుభ్రమైన మంచినీళ్ళు తాగాలని కోరికగా ఉందని మెస్సేజ్ చేస్తున్నారని చెప్పారు.

చాలా నిరీక్షణ తరువాత హన్నా తన కుటుంబంతో కాంటాక్ట్ కాగలిగారు. ఈమె తన సోదరుడు యహ్యా తోనూ మాట్లాడారు. యాహ్యా అల్‌జహ్రాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త. ఈ 30 ఏళ్ళ ఫ్యాషన్ డిజైనర్ ప్రస్తుతం కిక్కిరిసిపోయిన తన ఇంటి కంటే కంటే గతంలో తమ జీవితం ఎంతబావుందో చెప్పడానికే ఇష్టపడ్డారు. తన ఇల్లు ధ్వంసమైన తరువాత తన కుటుంబసభ్యులతో కలిసి ఆయన అనేక గంటలు నడిచి ప్రస్తుతమున్న ఇంటికి చేరుకున్నారు.

ఆయన వాట్సాప్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఒక్కోసారి హఠాత్తుగా వాట్సాప్ సంభాషణ ఆపేసేవారు. దగ్గరలో బాంబు ఉంది. నేను వెళ్ళనా’ అని అడిగేవారు.

యహ్యా రెండుబ్యాగులతో అల్‌జహ్రాను వదిలిపెట్టారు. వీటిల్లో ఐపాడ్, డాక్యుమెంట్స్, ఒక హుడీ, మంచినీళ్ళబాటిల్, పాసుపోర్టు, చాక్లెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్నాయి. ఆయన ఎంతో కష్టపడి రూపొందించిన డిజైన్లు, డ్రస్సులను వదిలేసి రావాల్సి వచ్చింది.

ఇవి ఒక్కటే కాదు, ‘‘కుట్టు మిషన్లు, ఎన్నో అందమైన జ్ఞాపకాలను కూడా’’ అని చెప్పారు.

అల్‌జహ్రా సముద్రతీర ప్రాంతం
ఫొటో క్యాప్షన్, అల్‌జహ్రా ప్రజల ఆనందానికే కాదు, విషాదానికీ ఈ సముద్రం ఓ మౌనసాక్షి

అల్‌జహ్రా తిరిగి మమ్మల్ని పిలుస్తుంది

జర్నలిస్టు అబ్దుల్లా అల్ ఖాతిబ్ తన నాలుగు ఇళ్ళు దాడులలో ధ్వంసమైనట్టు చెప్పారు. తన కొడుకు ఎప్పడు ఇంటికి తిరిగి వెళతాం, పార్కులో స్నేహితులతో ఎప్పుడు ఆడుకుంటాను అని అడుగుతున్నాడని తెలిపారు. కానీ మేం ఎప్పటికీ వెనుదిరిగి పోలేమోనని బాధపడ్డారు.

‘‘ఇప్పుడు మా ఇల్లు రోడ్డు. అన్నీ ధ్వంసమైపోయాయి’’ అని చెప్పారు.

తన ఇరుగుపొరుగును ఖాళీ చేయమని చెప్పిన డెంటిస్ట్ మహమ్మద్ ప్రస్తుతం సెంట్రల్ గాజాలోని ఓ వైద్య కేంద్రంలో స్వచ్ఛందసేవ చేస్తున్నారు.

‘‘దారుణమైన దుర్వాసనను పీల్చాల్సి వస్తోంది. బట్టలు ఉతుక్కోవడానికి లేదు. 130 మందితో కలిసి ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి’’అని మహమ్మద్ చెప్పారు.

నిత్యం పెరిగిపోతున్న వస్తువుల ధరలను తట్టుకునేందుకు అదృష్టవశాత్తు తన వద్ద డబ్బు ఉందని మహమ్మద్ చెప్పారు. అల్‌జహ్రాలోని ఓ విల్లాలో నివసిస్తున్న ఆయన స్నేహితులు ఇటీవల పిండిని పంపించారు. దాంతో ఆయన రొట్టెలు చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి వస్తువుల సరఫరా రానురానూ తగ్గిపోతోంది.

‘‘ఈరోజు నిత్యావసరాలు కొనుక్కుందామని షాపుల వెంట తిరిగాను. నేనేమీ ఎక్కువ చేసి చెప్పడం లేదు. పప్పుల కోసం కనీసం 40 షాపులు తిరిగాను. ఎక్కడా దొరకలేదు. సమయం వృథా చేసుకోవద్దని ఓ దుకాణదారు అన్నారని అని మహమ్మద్ వివరించారు.

"అల్‌జహ్రాకు తిరిగి వస్తామనే నమ్మకం ఉంది. భగవంతుడు మమ్మల్ని ప్రాణాలతో ఉంచితే మిగిలిన విషయాలను మేం చూసుకుంటాం’’ అని చెప్పారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)