ఈ విస్కీ బాటిల్ ధర రూ. 22 కోట్లు

ఖరీదైన విస్కీ

ఫొటో సోర్స్, TRISTAN FEWING

ఫొటో క్యాప్షన్, 1926 నాటి మెకాలెన్ విస్కీని లండన్‌లో వేలం వేశారు.

1926 నాటి అరుదైన విస్కీ బాటిల్ వేలంలో 2.7 మిలియన్ డాలర్లకు అంటే 22 కోట్ల 48 లక్షల 87వేల 725 రూపాయలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

మెకాలెన్ కంపెనీ ఈ విస్కీని 1926లో తయారుచేసింది. మద్యం ప్రియులకు ఈ విస్కీ అంటే ఎంతో మక్కువ.

ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ అయిన సోథిబీ శనివారం లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో ఈ విస్కీ బాటిల్‌ ఊహించినదానికంటే రెండింతలు ఎక్కువ ధర పలికింది.

వేలంపాట నిర్వాహకుడికి దీనిలో ఓ చుక్కను రుచిచూడటానికి ముందుగానే అనుమతి లభించింది.

‘‘ఇది చాలా గొప్పగా ఉంది. ఊహించినట్టుగానే ఎండిన పండ్లు, మసాలా, చెక్క రుచి ఇందులో ఉంది’’ అని వేలం సంస్థ విస్కీ విభాగపు అధ్యక్షులు జానీ ఫౌల్ ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

1926లో మెకాలెన్ కంపెనీ ఈ విస్కీని తయారుచేసి 60 ఏళ్ళపాటు నిల్వ చేసింది. 1986లో 40 బాటిళ్ళలోకి ఆ విస్కీని నింపింది.

మెకాలెన్ కంపెనీ వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకురాలేదు కానీ, తన టాప్ క్లైంట్‌లలో కొంత మందికి అందించింది.

వీడియో క్యాప్షన్, విస్కీ బాటిల్‌కు రూ. 22.5 కోట్లు, చుక్క నోట్లో వేసుకుంటే ఎలా ఉందంటే..

ఎప్పుడైనా ఇలాంటి మద్యం బాటిళ్ళు అమ్మకానికి వచ్చినప్పుడు వేలంలో రికార్డు ధర పలకడం రివాజుగా మారింది.

గతంలోనూ ఇటువంటి బాటిలే 15 కోట్ల 98 లక్షల 38 వేల రూపాయలకు అమ్ముడుపోయింది.

కిందటి నెలలో ఈ వేలానికి సన్నాహకాలు చేస్తున్న సమయంలో ఫౌల్ మాట్లాడుతూ- ప్రతి వేలందారు మెకాలెన్ 1926 లాంటి విస్కీ బాటిల్ అమ్మాలనుకుంటాడని, వేలంలో పాల్గొనే వారందరూ దీనిని తమ సొంతం చేసుకోవాలనుకుంటారని చెప్పారు.

1926 ఎడిషన్ నుంచి ఈ 40 బాటిళ్ళు వివిధ రకాలుగా లేబుల్ అయ్యాయని సోథెబీ తెలిపింది.

అయితే రెండు బాటిళ్ళకు ఇప్పటిదాకా ఎటువంటి లేబుల్స్ లేవు. మొత్తంగా ఓ 14 బాటిళ్లను ఐకానిక్ ఫైన్, రేర్ లేబుల్స్‌తో అలంకరించినట్టు, 12 బాటిళ్ళను పాప్ కళాకారుడు సర్ పీటర్ బ్లేక్‌ డిజైన్ చేసినట్టు తెలిపారు.

శనివారం అమ్ముడైన బాటిల్‌తో కలిపి 12 బాటిళ్ళను ఇటాలియన్ పెయింటర్ వాలేరియో అడామీ డిజైన్ చేశారు.

అయితే మెకాలెన్ 1926 సిరీస్‌లోని బాటిళ్ళు ఇంకా ఎన్ని ఉనికిలో ఉన్నాయో తెలియదు.

2011లో జపాన్‌లో వచ్చిన భూకంపంలో ఒకటి ధ్వంసమైనట్టు చెపుతారు. మరొకదానిని తెరిచి వినియోగించినట్టుగా నమ్ముతున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)