సహారా గ్రూప్ భవిష్యత్తేంటి... సుబ్రతా రాయ్ తరువాత కంపెనీని నడిపించేదెవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ వ్యాపార ప్రముఖులలో సుబ్రతా రాయ్ పేరు కచ్చితంగా ఉంటుంది. చిన్న సంస్థగా మొదలైన సహారా ఇండియా ప్రయాణం 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ స్థాయి వరకూ వెళ్ళింది.
ఒకానొక సమయంలో సహారా గ్రూప్‌కు లండన్ నుంచి న్యూయార్క్ వరకు హోటల్స్, సొంత విమానయాన సంస్థ, ఐపీఎల్ నుంచి ఫార్ములా 1 జట్ల వరకు ఉండేవి.
అంతేకాదు, సహారా సంస్థ భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ కూడా చేసింది. భవన నిర్మాణం నుంచి ఆర్థిక సేవలు, పట్టణాభివృద్ధి, మ్యూచువల్ ఫండ్స్, జీవిత బీమా వంటి రంగాలలోకి సహారా విస్తరించింది.
'సహారశ్రీ' సుబ్రతారాయ్ తొలినాళ్లలో స్కూటర్ నడిపేవారు. రాజకీయ, క్రికెట్, సినీ రంగాల నుంచి సెలబ్రెటీలు సహారా పార్టీలకు హాజరయ్యే స్థాయికి సంస్థను తీసుకెళ్లారు. ఆయనే వార్తాపత్రికల హెడ్‌లైన్స్‌లో నిలిచేవారు.
కాగా, నవంబర్ 14న సుబ్రతా రాయ్ మరణవార్త వచ్చినప్పుడు కంపెనీ పరిస్థితి మునుపటి కంటే భిన్నంగా ఉంది. అప్పటికే సహారా గ్రూప్ చాలా ఆస్తులను విక్రయించింది.
ప్రస్తుతం సహారా కంపెనీ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఇపుడు కంపెనీ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే విషయంపై క్లారిటీ లేదు.
ఆయన ఇద్దరు కుమారులూ భారతదేశంలో లేనట్లు వార్తలొస్తున్నాయి. బీబీసీ దీనిని ధ్రువీకరించలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
'ఆయన ఒక మోసగాడు, ఆకర్షణీయమైన వ్యక్తి'
సుబ్రతా రాయ్‌ను దగ్గరగా చూసిన వ్యక్తులు ఆయన గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు.
సుబ్రతా రాయ్ డైనమిక్, సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని ఆయన దగ్గరి వ్యక్తి ఒకరు అభివర్ణించారు. సుబ్రతా రాయ్ ఆకర్షణీయమైన వ్యక్తని ఆయనను ఎవరు కలిసినా ఆరాధకులుగా మారిపోతారన్నారు.
సుబ్రతా రాయ్ కెరీర్‌ను చాలాకాలంగా ఫాలో అవుతున్న సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ మాత్రం ఆయనను 'పేదల కలలను అమ్మిన ఆర్థిక మోసగాడు'గా ఆరోపించారు.
"సహారా వ్యాపార కార్యకలాపాలు చాలావరకు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని పేద ప్రాంతాలలో ఉన్నాయి, ఇక్కడి ప్రజలు ఆశతో జీవిస్తారు, ఎందుకంటే వారి జీవన స్థితిగతులు అంతగా మెరుగుపడలేదు" అని శరత్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
16 రకాల వ్యాపారాలు, 4,799 కార్యాలయాలు
సహారాకు గరిష్టంగా 4,799 కార్యాలయాలు, 16 రకాల వ్యాపారాలున్నాయని ఆ సంస్థపై 'ది అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తకం రాసిన పాత్రికేయుడు, రచయిత తమల్ బందోపాధ్యాయ తెలిపారు.
అయితే ఈ కొత్త వాతావరణంలో సహారా గ్రూపు మనుగడ సాగించడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత సుబ్రతా రాయ్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటున్నారు.
కంపెనీ భవిష్యత్తు గురించి స్పందించడానికి ఆ కంపెనీ ప్రతినిధులెవరూ అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం కుటుంబ సభ్యులెవరూ మాట్లాడే పరిస్థితి లేదని సుబ్రతా రాయ్‌కి అత్యంత సన్నిహిత వ్యక్తి ఒకరు తెలిపారు.
రూ. 2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు
1948 జూన్ 10న బిహార్‌లోని అర్‌రియాలో పుట్టిన సుబ్రతా రాయ్.. కోల్‌కతా హోలీ చైల్డ్ స్కూల్‌లో చదువుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.
1978లో 2 వేల రూపాయల పెట్టుబడితో సహారా ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలో భారతీయ రైల్వే తర్వాతి స్థానంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారా గ్రూప్ 12 లక్షల మంది ఉద్యోగులతో వార్తల్లో నిలిచింది.
సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు.
రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్‌సైట్ చెబుతోంది.
అయితే, సెబీతో సహారా గ్రూప్ వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. 2010లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది.
నిర్ణీత గడువులోగా రూ. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించలేకపోయినందున 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది.
రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు సుబ్రతా రాయ్.
2020 నవంబర్‌లో సుబ్రతా రాయ్ చెల్లించాల్సిన మొత్తం రూ.62,600 కోట్ల రూపాయలు అని సుప్రీంకోర్టుకు సెబీ నివేదించింది.

ఫొటో సోర్స్, Getty Images
సహారా బాధ్యతలు చేపట్టేదెవరు?
అయితే, ఇపుడు సహారా భవిష్యత్ ఏంటి? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇది.
సుబ్రతా రాయ్ లేకపోవడం కంపెనీపై భారీ ప్రభావం చూపుతుందని సుబ్రతా రాయ్‌తో సన్నిహితంగా ఉండే పండిట్ కృష్ణ గోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
''ఇంత పెద్ద సంక్షోభం వచ్చినా ఆయన దేశం విడిచి వెళ్లలేదు. సెబీకి ఇవ్వాల్సింది మొత్తం డిపాజిట్ చేశారు. జనాలు ఆయన్ను ప్రేమించారు, నమ్మారు. ఇలా చేస్తే అన్నీ మెల్లగా సర్దుకుంటాయనే నమ్మకం ఎక్కడో ఉండేది" అని గోపాల్ మిశ్రా తెలిపారు.
సహారా కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లేవు కాబట్టి ఇపుడు ఆ కంపెనీ ధర ఎంత ఉందో తెలియదని రచయిత తమల్ బందోపాధ్యాయ అంటున్నారు.
'కంపెనీకి చాలా నగరాల్లో స్థలాలున్నాయి, లక్నోలో 320 ఎకరాల సహారా సిటీతో సహా ఇతర ఆస్తులూ ఉన్నాయి, అయితే లిక్విడ్ క్యాష్ అంతగా లేదు' అని చెప్పారు తమల్.
"గత దశాబ్ద కాలంలో సహారా అనేక వ్యాపారాల నుంచి వైదొలిగింది. కంపెనీ బెస్ట్ టైం గడిచిపోయింది" అని తెలిపారు తమల్.
అయితే ఈ సంక్షోభ సమయంలో కుటుంబ సభ్యులెవరైనా సహారా బాధ్యతను తీసుకుంటారా? లేదా సుబ్రతా రాయ్‌కు సన్నిహితుడైన ఓపీ శ్రీవాస్తవ ముఖ్యపాత్ర పోషిస్తారా? అనేది స్పష్టంగా తెలియదు.
ఓపీ శ్రీవాస్తవను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించినా కుదరలేదు.
అయితే, సుబ్రతారాయ్ తమ్ముడు జేబీ రాయ్ ఈ కంపెనీని పునరుద్ధరించవచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు సుబ్రతా రాయ్ చిన్ననాటి స్నేహితుడు అజయ్ ఛటర్జీ.
ఇవి కూడా చదవండి
- ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించగలదా?
- విష ప్రాణులు, చెట్లపై నుంచి శరీరంపై పడే జలగలు.. ఆ భయంకర పర్వతం ఎక్కి శాస్త్రవేత్తలు ఏం చేశారు?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














