బీసీసీఐ ఆధిపత్యాన్ని పొరుగుదేశాలు భరించలేకపోతున్నాయా?

భారత క్రికెట్

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా

వన్డే క్రికెట్ ప్రపంచకప్ ముగిసింది. భారత జట్టు ట్రోఫీ గెలవకపోయినా టోర్నమెంట్ ఆసాంతం తన ఆధిపత్యాన్ని చూపింది.

ఈ టోర్నమెంట్ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియాల బలమేమిటో చూపింది. దీంతోపాటు క్రికెట్ ప్రపంచంలో ఉన్న కొన్ని విభేదాలను, విభజనలను కూడా బయటపెట్టింది.

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేకంగా కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. భారత పొరుగు దేశాలు బీసీసీఐపై అసంతృప్తిగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

అఫ్గానిస్తాన్, నేపాల్‌ను మినహాయిస్తే దక్షిణాసియాలో క్రికెట్ ఆడే పెద్ద దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇటీవల ఇండియన్ క్రికెట్ బోర్డు తీరుపై తమ అసంతృప్తిని వెళ్ళగక్కాయి.

భారత క్రికెట్ బోర్డు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రపంచకప్‌లో భారత అభిమానుల ఉత్సాహం

జయ్ షా పై రణతుంగ మండిపాటు

శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సి) వ్యవహారాలను బీసీసీఐ అధ్యక్షుడు జయ్ షా ప్రభావితం చేస్తున్నారని శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ ఆరోపించారు. దీనిపై శ్రీలంక ప్రభుత్వం రణతుంగను వివరణ కోరింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు కొంతకాలంగా సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే ప్రపంచకప్‌లో శ్రీలంక ఓటమి తరువాత బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీలంక బోర్డును సస్పెండ్ చేసింది.

ఈ మొత్తం వ్యహారంపై అర్జున్ రణతుంగ మాట్లాడుతూ ‘‘శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, జయ్ షా మధ్య ఉన్న సంబంధాల కారణంగా, శ్రీలంక క్రికెట్ బోర్డు తమ చేతుల్లో ఉంటుందనుకుంటున్నారు’’ అని చెప్పారు.

‘‘శ్రీలంక క్రికెట్ బోర్డును జయ్ షా నడిపిస్తున్నారు. జయ్ షా ఒత్తిడి వల్లనే బోర్డు పతనమైంది. భారత్‌లోని ఒక వ్యక్తి ఇదంతా చేస్తున్నారు. ఆయన చాలా శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన తండ్రి ఇండియా హోం మినిస్టర్’’ అని రణతుంగా చెప్పారు.

రణతుంగ వ్యాఖ్యల అనంతరం శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు తెలిపింది.

ఈ అంశాన్ని శ్రీలంక మంత్రి కంచన విజయశేఖర పార్లమెంట్‌లో లేవనెత్తారు. తమ సంస్థల తప్పులను ఆసియా క్రికెట్ మండలిపైనో, మరో దేశంపైనో రుద్దలేమని చెప్పారు.

భారత క్రికెట్ బోర్డు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత మ్యాచులు ఆడేటప్పుడు స్టేడియం నీలిసంద్రంగా మారింది.

‘‘ప్రపంచకప్ బీసీసీఐ టోర్నమెంట్‌గా మారిందా’’?

ఐసీసీ టోర్నమెంట్లలో సాధారణంగా తమ జట్లకు మద్దతు పలికేందుకు ఆయా దేశాల నుంచి అభిమానులు తరలివస్తుంటారు.

కానీ ఈసారి చాలామంది పాకిస్తాన్ అభిమానులకు వీసా లభించలేదు. దీంతో వారు తమ జట్టును ఉత్సాహపరిచేందుకు భారత్ రాలేకపోయారు.

అక్టోబరు 14న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, జయ్ షా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు, భారత్ జట్టుకు మద్దతుగా బ్లూజెర్సీలు ధరించిన అభిమానులతో స్టేడియం నీలిసంద్రాన్ని తలపించింది.

దీనిపై పాకిస్తాన్ టీమ్ డైరక్టర్ మికీ ఆర్థర్ మాట్లాడుతూ ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇది ఐసీసీ ఈవెంట్‌లా కనిపించడం లేదు. ఇదో ద్వైపాక్షిక సిరీస్‌లానూ, బీసీసీఐ ఈవెంట్‌లా ఉంది’’ అన్నారు.

‘‘దిల్ దిల్ పాకిస్తాన్ నా మైక్రోఫోన్‌లో పెద్దగా వినిపించలేదు’’ అని ఆర్ధర్ చెప్పారు. ఈ పాట క్రీడలలో పాకిస్తాన్ జాతీయగీతం. కొన్నిరోజుల తరువాత పాకిస్తాన్ అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైనప్పడు ఇంగ్లండ్ కెప్టెన్ మాట్లాడుతూ ‘‘చెన్నైలో దిల్ దిల్ పాకిస్తాన్ చెల్లకపోవచ్చు’’ అన్నారు.

దీనికితోడు కొంత మంది పాకిస్తాన్ మాజీలు కుట్రసిద్ధాంతాల గురించి కూడా మాట్లాడారు. టాస్, పిచ్‌ విషయంలో ఇండియా అనుకూలతలు పొందిందని ఆరోపించారు. కానీ వీరి ఆరోపణలు నిజమని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

అయితే, పొరుగుదేశాల క్రికెటర్ల నుంచి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు రావడం కొత్తేమీ కాదు.

ఐసీసీ కేటాయింపులపై పాకిస్తాన్ బోర్డు స్పష్టత కూడా కోరింది. ఆటకు ఆతిథ్యం ఇస్తున్నందున భారత్‌కు పెద్దమొత్తంలో వాటా రావడం సహజమంటూనే ప్రతిపాదిత ఆర్థిక నమూనాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజం సేథి అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే భావోద్వేగాలు ఎక్కువవుతాయి

ఆసియా కప్, ఏకాకిగా పాకిస్తాన్ బోర్డు

ప్రపంచకప్‌కు ముందు ఆసియాకప్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. కిందటేడాది ఆసియాకప్‌ నిర్వహణా బాధ్యత పాకిస్తాన్‌కు వచ్చింది. కానీ భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించింది.

ఈ ఏడాది మే 28న ఐపీఎల్ ఫైనల్‌కు రావాల్సిందిగా శ్రీలంక, అప్గనిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డులకు బీసీసీఐ ఆహ్వానం పంపింది. ఆ సమయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురించిన చర్చలు జరిగాయి. అప్పుడు కూడా పాకిస్తాన్ బోర్డుకు ఆహ్వానం అందలేదు. అంతిమంగా ఆసియాకప్ షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయానికి కట్టుబడి ఉంటాననడంతో పీసీబీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌లో ఏకాకిగా మిగిలింది.

తొలుత తాము సహ నిర్వాహకులుగా యూఏఈలో ఆసియాకప్ నిర్వహిద్దామని పాకిస్తాన్ ప్రతిపాదించింది. కానీ శ్రీలంక, బంగ్లాదేశ్ యూఏఈలోని అధికవేడిని కారణంగా చూపిస్తూ పాకిస్తాన్ నిర్ణయాన్ని అంగీకరించలేదు. చివరకు శ్రీలంకకు సహనిర్వహణా బాధ్యతలు అప్పగించేందుకు పాకిస్తాన్ అంగీకరించక తప్పలేదు. దీనిపై పీసీబీ చీఫ్ ఏసీసీ చీఫ్, బీసీసీఐ కార్యదర్శి జైషా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించారని ట్విటర్‌లో ఓ పెద్ద పోస్టు కూడా పెట్టారు.

దీనిపై జయ్ షా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘సభ్యలందరూ, మీడియా హక్కుదార్లు, స్టేడియంలో హక్కులున్నవారందరూ పాకిస్తాన్‌లోనే పూర్తి టోర్నమెంట్‌ను నిర్వహించే విషయాన్ని వ్యతిరేకించారు, ఇది పాకిస్తాన్‌లో భద్రత, ఆర్థిక పరిస్థితుల కారణంగా వచ్చిందే’’ అని తెలిపారు. దీనికితోడు పాకిస్తాన్ బోర్డు నాయకత్వంలో చీటికిమాటికి వస్తున్న మార్పులు కూడా దీని వెనుక ఉన్నాయని ఆయన చెప్పారు.

ఆసియాకప్ క్రికెట్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇండియా, పాకిస్తాన్ బోర్డుల మధ్య నలిగిపోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ జలాల్ యూనిస్ తమ ఆటగాళ్ళు పాకిస్తాన్, శ్రీలంక మధ్య ప్రయాణం చేస్తూ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుందన్నారు.

ఇండియాతో మ్యాచ్‌కు రిజర్వ్‌డేను కేటాయించడంపై కూడా బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండిక హతురసింఘ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఇండియన్ క్రికెటర్లు కూడా రిజర్వ్ డే నిర్ణయాన్ని తప్పుపట్టారు.

కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు ఇదంతా ఆసియా క్రికెట్ కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని ముక్తాయించాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై చర్చకు ఫుల్‌స్టాప్ పడింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)