సామ్ ఆల్ట్‌మాన్: ఓపెన్ ఏఐ బాస్‌గా తిరిగొచ్చారు.. తీసేసిన తరువాత ఎలా వచ్చారు, అసలేం జరిగింది?

సామ్ ఆల్ట్‌మాన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నాలుగు రోజుల నాటకీయ పరిణామాల నడుమ ఆల్ట్‌మాన్ ఓపెన్ ఏఐకు తిరిగొస్తున్నారు
    • రచయిత, థామస్ మెకింతోష్, క్రిస్ వల్లాన్స్
    • హోదా, బీబీసీ న్యూస్

టెక్ ప్రపంచంలో గత వారం రోజుల నుంచి సంచలనంగా మారిన సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపు కథ సుఖాంతమైంది.

ఆయన తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా వస్తున్నట్టు బోర్డు తెలిపింది. అలాగే బోర్డులో కొత్త సభ్యుల నియామకంపై సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్టు పేర్కొంది.

ఈనెల 17న ఆల్ట్‌మాన్‌ను తొలగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించగానే టెక్ ప్రపంచం షాక్‌కు గురైంది. ఈ కంపెనీ ఉద్యోగులందరూ ఆల్ట్‌మాన్‌ను తిరిగి తీసుకురాకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నారు.

‘‘ఓపెన్ ఏఐకు తిరిగిరావడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ఆల్ట్‌మాన్ ఎక్స్ ఖాతాలో చెప్పారు.

‘‘నేను ఓపెన్ ఏఐను ప్రేమిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నేను చేసిందంతా ఈ బృందాన్నంతా ఒక చోట చేర్చడం, దాని లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే’’ అని చెప్పారు.

కిందటివారం సామ్‌ ఆల్ట్‌మాన్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నాకా మరో సహవ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్ కూడా రాజీనామా చేయడం ఈ కృత్రిమ మేథ కంపెనీని సంక్షోభంలోకి నెట్టేసింది.

ఈ నిర్ణయాన్ని నాన్ ఎంప్లాయీ బోర్డు మెంబర్ల అయిన ఆడమ్ డి ఏంజెలో, తాషా మెక్‌కలి, హెలెన్ టోనర్, మూడో సహవ్యవస్థాపకుడు అయిన కంపెనీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్‌స్కేవర్ కలిసి తీసుకున్నారు.

అయితే, ఇల్యా సట్‌స్కేవర్ ఈనెల 20న ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పడంతోపాటు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే సిబ్బంది లేఖపైన సంతకం కూడా చేశారు.

ఓపెన్ ఏఐలో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన మైక్రోసాఫ్ట్ తన అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించమంటూ సామ్ ఆల్ట్‌మాన్‌కు ఆఫర్ ఇచ్చింది.

సామ్ అల్ట్‌మాన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, ఇటీవల యూకేలో జరిగిన తొలి ఏఐ సేఫ్టీ సమ్మిట్‌కు హాజరైన ఆల్ట్‌మాన్

బోర్డు ప్రక్షాళన తప్పదా...

సామ్‌ ఆల్ట్‌మాన్ తిరిగి రావడానికి సూత్రపాయంగా అంగీకరించారని పేర్కొన్న ఓపెన్ ఏఐ కంపెనీ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన బోర్డును పాక్షికంగా ప్రక్షాళన చేస్తున్నట్టు ప్రకటించింది.

సేల్స్‌ఫోర్స్ సహ సీఈఓ బ్రెట్ టేలర్, అమెరికా మాజీ ఖజానా మంత్రి లారీ సమ్మర్స్ ప్రస్తుత బోర్డు సభ్యుడు ఆడమ్ డి ఏంజెలో స్థానంలో చేరతారని ఓపెన్ ఏఐ తెలిపింది.

తాను కూడా ఓపెన్ ఏఐకు తిరిగొస్తున్నట్టు సహవ్యవపాస్థపకుడు బ్రాక్‌మెన్ ‘ఎక్స్’లో తెలిపారు.

ఓపెన్ ఏఐకు తాత్కాలిక సీఈఓగా నియమితుడైన ఎమ్మెట్ షియర్ కూడా ఆల్ట్‌మాన్ పునరాగమనాన్ని స్వాగతించారు. ఓపెన్ ఏఐకు సంబంధించినంతవరకు ఏది సరైన మార్గమో నాకు కచ్చితంగా తెలియదు. కానీ ఆల్ట్‌మాన్ పునరాగమనం మాత్రం సరైన పనిచేయడానికి అవకాశం ఇస్తుంది అని తెలిపారు.

ఓపెన్ ఏఐ బోర్డులో మార్పులకు తమ ప్రోత్సాహం ఉంటుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ చెప్పారు. ‘‘ చక్కని పాలనకు, స్థిరత్వానికి, పారదర్శకతకు ఇది ముఖ్యమైన తొలి అడుగు’’ అని చెప్పారు.

ఇప్పటిదాకా సాగిన వ్యవహారం అంతా ఓపెన్ ఏఐకు భంగం కలిగిస్తోందని కొందరు చెపుతున్నారు. ఓపెన్ ఏఐ ఎపిసోడ్ పెట్టుబడిదారులపైనా, నియామకాలపైన ప్రభావం చూపిందని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కు చెందిన నిక్ పేటియన్స్ అభిప్రాయపడ్డారు.

ఈ ప్రశ్నలకు బదులేది?

సామ్‌ ఆల్ట్‌మాన్‌ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయామని బోర్డు ప్రకటించినప్పటినుంచి ఈ యుద్ధం మొదలైంది.

ఆయన బోర్డుకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బోర్డు ఆరోపించింది. శుక్రవారం నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో సామ్ ఆల్ట్‌మాన్ ఏ విషయంలో నిజాయితీగా లేరనే అంశాన్ని చెప్పలేకపోయింది.

బోర్డు చెప్పిన వివరణ ఎలా ఉన్నప్పటికీ ఈ కంపెనీలోని 700మంది ఉద్యోగులు సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపుపై తీవ్ర అసంతృప్తికి గురై బోర్డు రాజీనామా చేయకపోతే తాము సామూహిక రాజీనామాలకు దిగుతామంటూ ఓ బహిరంగ లేఖలో హెచ్చరించారు.

తామందరికీ మైక్రోసాఫ్ట్‌ అవకాశం ఇస్తానని చెప్పినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తరువాత మైక్రోసాఫ్ట్ కూడా వారికి ఓపెన్ ఏఐలో ప్రస్తుతమిస్తున్న జీతాలు ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది.

మంగళవారం పొద్దుపోయేసరికే ఆల్ట్‌మాన్ తిరిగి రావడానికి జరుగుతున్న చర్చలలో పురోగతి కనిపిస్తున్నట్టు అర్థమైంది.

గత కొన్నిరోజులుగా జరిగిన పరిణామాలు ఓ ప్రశ్నను లేవనెత్తాయి. కేవలం నలుగురు వ్యక్తులు వందలకోట్ల డాలర్ల టెక్నాలజీ వ్యాపారాన్ని చేసే కంపెనీకి సంబంధించిన నిర్ణయాన్ని అంత తేలికగా ఎలా తీసుకోగలిగారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది కేవలం ఓపెన్ ఏఐ అసాధారణ నిర్మాణం వలనే సాధ్యమైంది.

మానవాళికంతటికి భద్రతతో కూడిన కృత్రిమమేథ అందించేందుకు 2015లో లాభాపేక్ష లేని సంస్థగా ఓపెన్ ఏఐ ప్రారంభమైంది. అయితే ఈ లక్ష్యంలో వాటాదారుల ప్రయోజనాలను పొందుపరచలేదు. 2019లో లాభాపేక్ష కలిగిన ఓ అనుబంధ సంస్థను దీనికి జోడించింది కానీ,బోర్దు మాత్రం మారలేదు.

సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపుపై బోర్డు సభ్యులు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాల్సి ఉంది. ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా బోర్డు సభ్యులు దీనిపై మాట్లాడాలని కోరారు.

ఆల్ట్‌మాన్ తిరిగివస్తున్నారనే వార్తరాగానే టోనర్ ఎక్స్‌లో ‘‘ ఇకపై మనందరం కాస్త నిద్రపోవచ్చు’’ అని పోస్టు చేశారు.

సామ్ ఆల్ట్‌మాన్

ఫొటో సోర్స్, Getty Images

టెక్ మేధావి ఆల్ట్‌మాన్

ఆపిల్ తొలి తరం కంప్యూటర్లలో ఒకటైన మాకింటోష్‌ను ప్రోగ్రామ్ చేయడం, వేరు చేయడం వంటివి తన ఎనిమిదేళ్ల వయస్సులోనే నేర్చుకున్నానని ది న్యూయార్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్యూల్ హెచ్ ఆల్ట్‌మాన్ చెప్పారు.

కంప్యూటర్ సైన్స్ చదవడం కోసం అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆల్ట్‌మాన్ చేరారు. కానీ, డిగ్రీ పూర్తి చేయలేదు.

కొందరు స్నేహితులతో కలిసి ఒక ఆప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఇతరులకు లొకేషన్‌ను షేర్ చేసే ‘లూప్ట్’ అనే ఆప్లికేషన్ అభివృద్ధికే వారంతా తమ పూర్తి సమయాన్ని వెచ్చించాలని అనుకున్నారు. 2005లో ఇదంతా జరిగింది. అప్పటికీ వాట్సాప్ రాలేదు. ఫేస్‌బుక్ అప్పుడప్పుడే పుట్టింది.

అప్పట్లో లూప్ట్‌ అప్లికేషన్ పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ, వ్యాపారవేత్తగా ఆల్ట్‌మాన్ కెరీర్ ప్రారంభించడానికి ఇది ఉపయోగపడింది. భారీ సాంకేతిక పెట్టుబడుల ప్రపంచానికి తలుపులు తెరిచింది.

లూప్ట్‌కు మద్దతు ఇచ్చిన కంపెనీల్లో ‘వై కాంబినేటర్ (వైసీ)’ ఒకటి. ఎయిర్‌బీఎన్‌బీ, డ్రాప్‌బాక్స్ వంటి ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక, విజయవంతమైన స్టార్టప్ కంపెనీ ఇది.

ఆల్ట్‌మాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏఐ విషయంలో ఓపెన్‌ఏఐ విధానం గురించి ఆల్ట్‌మాన్‌ను అమెరికా కాంగ్రెస్ ప్రశ్నించింది

ఆల్ట్‌మాన్ తన మొదటి ప్రాజెక్టును రూ. 333 కోట్ల (40 మిలియన్ డాలర్లు)కు విక్రయించారు. వైసీ గొడుగు కింద తన ఆలోచనలను విస్తరించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది ఆయనకు ఉపయోగపడింది. 2014-2019 మధ్య వైసీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు.

అదే సమయంలో ఎలాన్ మస్క్‌తో కలిసి ఓపెన్‌ఏఐ అనే కంపెనీని నెలకొల్పారు ఆల్ట్‌మాన్.

ఈ కంపెనీ నుంచి ఎలాన్ మస్క్ తప్పుకున్నప్పటికీ, ఆల్ట్‌మాన్ మాత్రం ఏఐ కార్యక్రమాల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు.

ఏఐ కలిగించే పరిణామాలపై తన భయాలను బహిరంగంగా వ్యక్తపరిచారు ఆల్ట్‌మాన్.

అమెరికా కాంగ్రెస్‌లో దీని గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది మే నెలలో ఆల్ట్‌మాన్ తన వాంగ్మూలాన్ని సమర్పించారు.

సెనెట్ ప్రైవసీ అండ్ టెక్నాలజీ కమిటీ ముందు ఆల్ట్‌మాన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుంది? ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు ఏంటి? అని ఆల్ట్‌మాన్‌ను కమిటీ ప్రశ్నించింది.

ఇవికూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)