గూఢచర్య ఉపగ్రహాన్ని నింగిలోకి పంపామని ప్రకటించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, క్యాథరీన్ ఆర్మ్‌స్ట్రాంగ్, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ న్యూస్

గూఢచర్య ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో చుట్టుపక్కల దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

మలిగ్యాంగ్-1 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.

ఈ ప్రయోగాన్ని తమ నాయకుడు కిమ్ జోంగ్ దగ్గర నుంచి పరిశీలించారని కూడా కేసీఎన్ఏ వివరించింది.

అయితే, ఈ ప్రయోగాన్ని జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద ఖండించారు. ఈ ఉపగ్రహం జపాన్‌లోని ఒకినావా ద్వీపం గుండా పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లింది.

ఉత్తర కొరియా గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం

ఫొటో సోర్స్, REUTERS

ఈ ప్రయోగంతో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని అమెరికా వ్యాఖ్యానించింది.

ప్రయోగ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ఒకినావాలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

ఈ ఏడాది రెండుసార్లు ఉత్తర కొరియా సైనిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది. దీంతో మూడోసారి ఈ ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ఇదివరకే ఉత్తర కొరియా సంకేతాలు ఇచ్చింది.

తాజా ప్రయోగాన్ని కిషిద తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియా ఎదుట నిరసన కూడా వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు.

‘‘వారు ఉపగ్రహాన్ని ప్రయోగించి ఉండొచ్చు. కానీ, దాని కోసం బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమే’’ అని కిషిద వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన. మా ప్రజల భద్రతకు ఇలాంటి ప్రయోగాలతో చాలా ముప్పు పొంచివుంది’’ అని ఆయన అన్నారు.

ఉత్తర కొరియా గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం

ఫొటో సోర్స్, REUTERS

తాజా ప్రయోగం అనంతరం ఉత్తర కొరియాతో సరిహద్దుల వెంబడి నిఘాను మళ్లీ మొదలుపెట్టినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. సరిహద్దుల్లో సైనిక పరమైన ఘర్షణలను తగ్గించేందుకు నిఘా చర్యలకు స్వస్తి పలకాలని 2018లో రెండు దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఎంచుకున్న తేదీలపై జపాన్‌కు ఇచ్చిన సమాచారం కంటే ముందే ఉత్తర కొరియా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. వాస్తవానికి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 23.59 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.

చైనాకు సరిహద్దుల్లోని వాయువ్య ప్రాంతంలోనున్న సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపినట్లు ఉత్తర కొరియా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించినట్లు కేసీఎన్ఏ తెలిపింది.

అయితే, ఈ ప్రయోగం విజవంతమైనట్లు ఉత్తర కొరియా చేసిన ప్రకటనను ధ్రువీకరించడానికి వీలుకాలేదు.

ఉత్తర కొరియా గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

తాజాగా ప్రయోగించిన రాకెట్.. గూఢచర్య ఉపగ్రహమైతే దీని కోసం ఈ ఏడాది ఉత్తర కొరియా చేపట్టిన మూడో ప్రయోగం ఇది.

ఈ ప్రయోగం వల్ల అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని, అందుకే దీన్ని చేపట్టొద్దని ఇదివరకు ఉత్తర కొరియాకు జపాన్ సూచించింది. ఈ విషయంలో దక్షిణ కొరియా, అమెరికాలతో కలిసి పనిచేస్తున్నట్లు కూడా జపాన్ తెలిపింది.

ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన రాకెట్ వ్యర్థాలు పడే అవకాశమున్న మూడు సముద్ర ప్రాంతాలపై ఉత్తర కొరియా ప్రకటనలో సమాచారముందని జపాన్ కోస్టు గార్డ్ తెలిపింది.

వీటిలో రెండు ప్రాంతాలు కొరియా పీఠభూమికి పశ్చిమాన ఉండగా, మూడోది ఫిలిప్పీన్స్‌లోని లూజన్ దీవికి తూర్పున ఉంది.

ఈ విషయంలో దక్షిణ కొరియా తగిన చర్యలు తీసుకుంటుందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చీఫ్ డైరెక్టర్ హెచ్చరించారు.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి గూఢచర్య ఉపగ్రహాలతో ఉత్తర కొరియా నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుంది. దీని ద్వారా తమపై జరిగే దాడులను మెరుగ్గా గుర్తించొచ్చు. అలాగే తాము చేపట్టే దాడుల్లోనూ కచ్చితత్వం పెరుగుతుంది.

అయితే, ఉత్తర కొరియా ఉపగ్రహాలను ప్రయోగించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇలాంటి పరీక్షల పేరుతో మిసైల్ టెక్నాలజీని ఉత్తర కొరియా ప్రయోగించొచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

గత మే నెలలో చేపట్టిన తొలి గూఢచర్య ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన వ్యర్థాలను దక్షిణ కొరియా పరిశీలించింది. అయితే, ఇది సైనిక అవసరాలకు ఉపయోగపడదని తేల్చింది. ఆ తర్వాత ఆగస్టులో మరోసారి ఇలాంటి ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత అక్టోబరులో మరోసారి నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. కానీ, ఆ ప్రయోగం జరగలేదు.

ఉత్తర కొరియా ఉపగ్రహ కార్యక్రమం కోసం తాము సాయం చేస్తామని కిమ్ జోంగ్ ఉన్‌ను కలిసిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత సెప్టెంబరులో చెప్పారు. అయితే, రష్యా ఎలాంటి సాయం చేయబోతోందో స్పష్టత లేదు.

నవంబరు చివరినాటికి తాము కూడా సొంత నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నట్లు దక్షిణ కొరియా ఇటీవల తెలిపింది. ఈ ఉపగ్రహాన్ని అమెరికా కంపెనీ స్పేస్ ఎక్స్ తీసుకెళ్లబోతోంది.

దక్షిణ కొరియా 2025 నాటికి గూఢచర్య నిఘా ఉపగ్రహాలను నింగిలోకి పంపించాలని భావిస్తోంది. వీటిలో మొదటి ఉపగ్రహాన్నే స్పేస్ ఎక్స్ ద్వారా నింగిలోకి పంపిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)