చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ న్యూస్
మసీదులను చైనా ధ్వంసం చేస్తోందని, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్‌డబ్ల్యూ) తాజా నివేదికలో ఆరోపించింది.
చైనాలో ‘పక్కా ప్రణాళిక’ ప్రకారం ఈ అణచివేత కొనసాగుతోందని హెచ్ఆర్‌డబ్ల్యూ తెలిపింది.
చైనాలో దాదాపు 2 కోట్ల మంది ముస్లింలు జీవిస్తున్నారు. అధికారికంగా తమది నాస్తిక దేశంగా చెప్పుకొనే చైనా.. ఇక్కడ ప్రజలకు మతపరమైన స్వేచ్ఛ ఉంటుందని వివరిస్తోంది.
అయితే, కొన్ని మతాలపై ఇక్కడ అణచివేత నానాటికీ పెరుగుతోందని, ఈ మతాలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్ఆర్డబ్ల్యూ నివేదికపై స్పందన కోసం చైనా విదేశాంగ శాఖ, మైనారిటీ వ్యవహారాల కమిషన్‌లను బీబీసీ కోరింది. అయితే, వార్త ప్రచురితమయ్యే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.
‘‘చైనాలో ఇస్లాంకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మసీదులను మూసివేయడం, ధ్వంసం చేయడం, వాటి స్వరూపాలనే మార్చేయడం లాంటి చర్యలను తీసుకుంటున్నారు’’ అని హ్యూమన్ రైట్స్ వాచ్ చైనా విభాగం డైరెక్టర్ మయా వాంగ్ చెప్పారు.
వాయువ్య చైనాలోని షిన్‌జియాంగ్ ప్రాంతంలో వీగర్ ముస్లింలపై చైనా అణచివేత కొనసాగిస్తోందనే ఆరోపణలపై ఆధారాలు బయటపడిన అనంతరం తాజా నివేదిక ప్రచురించారు. అయితే, ముస్లింలపై అణచివేత కొనసాగిస్తోందనే ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది.
చైనాలో ముస్లింలు ఎక్కువగా షిన్‌జియాంగ్, క్వింఘై, గాన్షు, నింగ్షియా లాంటి వాయువ్య ప్రాంతాల్లో జీవిస్తుంటారు.
స్వతంత్ర ప్రతిపత్తి గల నింగ్షియా ప్రాంతంలో లియాఖియావో.. ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామం. అయితే, ఇక్కడున్న ఆరు మసీదుల్లో మూడింటికి పైన గుమ్మటాలు, మినార్లను తొలగించినట్లు హెచ్ఆర్‌డబ్ల్యూ ఆరోపించింది. మిగతా మూడింటిలోనూ ప్రధాన ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
హెచ్ఆర్‌డబ్ల్యూ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో 2018 అక్టోబరు నుంచి 2020 జనవరి మధ్య లియాఖియావోలోని ఓ మసీదుపై గుమ్మటాన్ని తొలగించి చైనా శైలి పగోడాను నిర్మించినట్లు కనిపిస్తోంది.
నింగ్షియాలోనూ 2020 నుంచి ఇప్పటివరకూ 1300 మసీదులను మూసివేశారని, లేదా వాటి స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని చైనాలో ముస్లింలపై అధ్యయనం చేపడుతున్న హన్నా టేకర్ బీబీసీతో చెప్పారు. ఈ ప్రాంతంలోని మొత్తం మసీదుల్లో ఇలా మార్పులకు లోనైన వాటి సంఖ్య మూడింట ఒక వంతు వరకూ ఉందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ హయాంలో కమ్యూనిస్టు పార్టీ ఇక్కడి మతాలను తమ రాజకీయ సిద్ధాంతాలు, చైనా సంస్కృతీ, సంప్రదాయాలకు అనుగుణంగా మారుస్తూ వస్తోంది.
2018లో చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఓ పత్రాన్ని విడుదల చేసింది. దీనిలో మసీదుల నియంత్రణపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. ‘‘పాత కట్టడాలను ఎక్కువగా కూల్చివేయండి, కొత్త ప్రార్థనా స్థలాల నిర్మాణాలను తగ్గించండి, మొత్తంగా వీటి సంఖ్య తగ్గేలా చూడండి’’ అని స్థానిక ప్రభుత్వాలకు దీనిలో సూచించారు.
మసీదుల నిర్మాణం, లేఅవుట్, నిధుల సమీకరణలను జాగ్రత్తగా గమనించాలని స్థానిక అధికారులకు ఈ పత్రంలో సూచనలు చేశారు.
ముఖ్యంగా షిన్‌జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, మరికొన్ని ఇతర ప్రాంతాలకూ ఈ చర్యలు క్రమంగా విస్తరిస్తున్నాయి.
చైనాలో రెండు ప్రధాన ముస్లిం తెగలు కనిపిస్తాయి. వీటిలో మొదటికి హ్యూయ్ తెగ. వీరు 8వ శతాబ్దంలోని టాగ్ హయాంలో చైనాకు వలసవచ్చిన ముస్లింల వారసులు. రెండో తెగ వీగర్లు. వీరు షిన్‌జియాంగ్‌లో జీవిస్తుంటారు.
అయితే, 2017 నుంచి ఇప్పటివరకూ షిన్‌జియాంగ్‌లో మూడింట రెండొంతుల మసీదులను ధ్వంసం చేసినట్లు థింక్ ట్యాంక్ ఆస్ట్రేలియా స్ట్రాటిజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ కూడా ఒక నివేదికలో వెల్లడించింది.
‘‘చైనీకరణ విధానాలకు నింగ్షియాను పైలట్ ప్రాంతంగా ఎంచుకున్నారు. అందుకే అక్కడి మసీదుల స్వరూపం మార్చడం, ఇతర ప్రార్థనా స్థలాలతో వీటిని కలిపేయడం లాంటివి ఇక్కడ ముందుగానే మొదలయ్యాయి’’ అని అమెరికాకు చెందిన డేవిడ్ స్ట్రౌప్‌తో కలిసి తాజా రిపోర్టును రూపొందించిన డాక్టర్ టేకర్ చెప్పారు. ఇక్కడ చైనా సంస్కృతీ, సంప్రదాయాలకు అనుగుణంగా మతపరమైన విశ్వాసాలను మార్చేందుకు షీ జిన్‌పింగ్ చేస్తున్న ప్రయత్నాలనే చైనీకరణగా పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, రెండు, మూడు మసీదులను కలిపి ఒకటిగా ఏర్పాటుచేయడమనే విధానాలతో ముస్లింలపై ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే, హ్యూయ్ ముస్లింలు మాత్రం తమను కమ్యూనిస్టు పార్టీకి బద్ధులుగా మార్చేందుకే చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.
అయితే, ఈ చైనీకరణ విధానాలను కొంతమంది బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే, వీరి ప్రతిఘటనకు ఫలితం కనిపించడం లేదు. ఏళ్ల నుంచీ మసీదుల మూసివేత, ధ్వంసాలపై అధికారులతో విభేదించిన వారిని నిర్బంధిస్తున్నారు.
మసీదు వెలుపలి కట్టడాలను కూల్చేవేసిన అనంతరం లోపల కూడా చేతులు కాళ్లు శుభ్రంచేసుకునే ప్రాంతాలు, ప్రసంగమిచ్చే ఎత్తైన పోడియంలను తొలగిస్తున్నారని అమెరికాకు హ్యూయ్ ఉద్యకర్త మా జు చెప్పారు.
‘‘ప్రజలు ఇలాంటి మందిరాలకు రావడం తగ్గిస్తే.. దీన్ని సాకుగా చూపించి ఎకంగా మసీదులను మూసివేస్తున్నారు’’ అని ఆయన చెప్పినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలో పేర్కొన్నారు.
దక్షిణ నింగ్షియాలోని లియుజిగోవ్ మసీదుకు చెందిన రెండు మినార్లు, ఒక గుమ్మటాన్ని తొలగించిన అనంతరం కాళ్లు, చేతులు కడుక్కునే హాల్‌ను కూడా కూల్చివేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను హెచ్‌ఆర్‌డబ్ల్యూ ధ్రువీకరించింది కూడా.
నింగ్షియాతో సరిహద్దులున్న గాన్షు ప్రావిన్స్‌లోనూ మసీదుల మూసివేత, రెండు మూడు మసీదులను కలిపేయడం, లోపలి నిర్మాణాల స్వరూపాలను పూర్తిగా మార్చేయడానికి సంబంధించిన ప్రకటనలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి.
చైనా మక్కాగా పిలుచుకునే లింషియా నగరంలో 16 ఏళ్ల కంటే తక్కువ వయసుండే మైనర్లు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా 2018లో ఆంక్షలు విధించారు. ఇక్కడ కొన్ని మసీదులను ‘‘కల్చరల్ సెంటర్లు’’, ‘‘వర్క్ స్పేస్’’లుగా మార్చినట్లు స్థానిక టెలివిజన్‌లో ఒక కథనం ప్రసారం చేశారు.
అయితే, ఈ చైనీకరణ కార్యక్రమాలకు ముందు, చాలా మంది హ్యూయ్ ముస్లింలకు ప్రభుత్వం నుంచి మద్దతు అందేదని డాక్టర్ టేకర్ చెప్పారు.
‘‘కానీ, చైనీకరణ కార్యక్రమంతో చైనాలో ముస్లింగా జీవించడం కష్టం అవుతోంది. ఇక్కడ మతం వర్సెస్ దేశ భక్తి అనే వాదన వస్తోంది’’ అని ఆమె అన్నారు.
‘‘దేశం అనుసరిస్తున్న ఇస్లాం వ్యతిరేక విధానాలు దీనితో స్పష్టం అవుతున్నాయి. దీంతో ముస్లింలు అన్నింటికంటే దేశభక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఇక్కడ విదేశీ ప్రభావం ఏదైనా ముప్పుగానే చూస్తున్నారు’’ అని ఆమె చెప్పారు.
ఈ విషయంపై ప్రపంచ దేశాల్లోని అరబ్, ముస్లిం నాయకులు గళమెత్తాలని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ అన్నారు.
అయితే, ఇక్కడ ముస్లింలతోపాటు ఇతర మతపరమైన మైనారిటీలు కూడా ప్రభుత్వ విధానాలతో ప్రభావితం అవుతున్నారు.
ఉదాహరణకు టిబెట్ పేరును ‘షిజాంగ్’గా ఇటీవల చైనా మార్చింది. టిబెట్‌ను మాండరిన్‌లో ఇలానే పిలుస్తారు. మరోవైపు ఇక్కడి చర్చిలపై శిలువ గుర్తులనూ తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ఆన్‌లైన్ స్టోర్‌లలో బైబిల్ అమ్మకాలపైనా నిషేధం విధించింది. చాలా మంది పాస్టర్‌లనూ అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి పాకిస్తానీపై ప్రశంసల జల్లు ఎందుకు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















