సామ్ ఆల్ట్‌మాన్: ఓపెన్‌ఏఐ సంస్థలో ఏం జరుగుతోంది? 38 ఏళ్ల వ్యక్తి గురించి ప్రపంచమంతా ఇంతగా ఎందుకు చర్చిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లీన్‌మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్, బీబీసీ ముండో
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరున్న ఒక వ్యక్తిని, గత శుక్రవారం ఉద్యోగంలో నుంచి తొలగించడం టెక్నాలజీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
విశ్వాసాన్ని కోల్పోయిన కారణంగా సామ్ ఆల్ట్‌మాన్‌ను ఉద్యోగం నుంచి తప్పిస్తున్నట్లు ‘ఓపెన్‌ఏఐ’ సంస్థ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.
ఓపెన్‌ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ.
సామ్ ఆల్ట్‌మాన్, బోర్డుతో నిజాయతీగా వ్యవహరించడం లేదని ఓపెన్‌ఏఐ బోర్డు పేర్కొంది. దీనివల్ల బోర్డు తన విధులను సరిగ్గా నిర్వహించలేకపోతోందని ఆరోపించింది.
ఓపెన్‌ఏఐ సంస్థను నడిపించే విషయంలో సామ్ ఆల్ట్‌మాన్ సామర్థ్యంపై బోర్డుకు ఇక నమ్మకం లేదని వ్యాఖ్యానించింది.
వారాంతంలో జరిగిన నాటకీయ పరిణామాల తర్వాత, ఓపెన్‌ఏఐ సంస్థలో సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంటాడేమో అని ఒక్క క్షణం అనిపించింది.
కానీ, సామ్ ఆల్ట్‌మాన్‌ను నియమించుకుంటున్నట్లుగా సోమవారం మైక్రోసాఫ్ట్ ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.
ఓపెన్‌ఏఐ సంస్థలో మైక్రోసాఫ్ట్ ఒక ప్రధాన ఇన్వెస్టర్.
మైక్రోసాఫ్ట్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఒక అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను సామ్ ఆల్ట్‌మాన్ లీడ్‌గా నడిపిస్తారని ట్విటర్‌లో మైక్రోసాఫ్ట్ హెడ్ సత్య నాదెళ్ల ప్రకటించారు.
తన కొత్త ఉద్యోగ నియామకాన్ని ధ్రువీకరిస్తూ, ‘‘మిషన్ కొనసాగుతుంది’’ అంటూ ఆల్ట్‌మాన్ స్పందించారు.
ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుల్లో 38 ఏళ్ల సామ్ ఆల్ట్‌మాన్ ఒకరు.
చాట్ జీపీటీ రూపకర్తగా ఓపెన్‌ఏఐకి చాలా పేరు వచ్చింది.
కృత్రిమ మేధ రంగంలో చాలా ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా సామ్ ఆల్ట్‌మాన్‌కు గుర్తింపు ఉంది.
అలాంటి ఆయనను ఉద్యోగం నుంచి తప్పించడం టెక్నాలజీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఓపెన్‌ఏఐ కంపెనీలోని చాలామందికి కోపాన్ని కలిగించింది.
మైక్రోసాఫ్ట్ మరింత బలపడిందని, అదే సమయంలో ఓపెన్ ఏఐ తీవ్రంగా నష్టపోయిందని పెట్టుబడి సంస్థ వెడ్‌బుష్ సెక్యూరిటీస్‌కు చెందిన డాన్ ఈవ్స్ అన్నారు.
ఓపెన్‌ఏఐలో జరిగిన వారాంతపు డ్రామా, మైక్రోసాఫ్ట్ బరిలోకి దిగడంతో ముగిసిందని డాన్ ఈవ్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బోర్డు రాజీనామా చేయాలంటూ డిమాండ్లు
మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్ట్‌మాన్‌ను నియమించుకుంటున్నట్లుగా ప్రకటించిన సమయంలోనే ఓపెన్‌ఏఐ సంస్థ సిబ్బంది, బోర్డు డైరెక్టర్లకు ఒక లేఖను సమర్పించారు.
కంపెనీ బోర్డు డైరెక్టర్లు అందరూ రాజీనామా చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డు నిర్ణయాత్మక సామర్థ్యంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. కంపెనీ పనిని బోర్డు అణదొక్కిందంటూ ఆరోపించారు. ఆల్ట్‌మాన్‌ను మళ్లీ కంపెనీలోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు.
లేఖలో పేర్కొన్న డిమాండ్లను నేరవేర్చకుంటే తామంతా రాజీనామా చేస్తామని సంస్థలోని సీనియర్ అధికారులతో సహా లేఖపై సంతకాలు చేసిన సిబ్బంది అందులో రాశారు.
తమ కంపెనీలో చేరాలనుకునే ఓపెన్‌ఏఐ సిబ్బంది అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కంపెనీ హామీ ఇచ్చిందని వారు లేఖలో పేర్కొన్నారు.
బోర్డుకు రాసిన ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఓపెన్‌ఏఐ ప్రధాన శాస్త్రవేత్త ఇల్యా సుత్‌స్కేవర్ ఉన్నారు.
ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డు డైరెక్టర్లలో ఇల్యా సుత్‌స్కేవర్ సభ్యుడు కూడా.
తాను ఒక తప్పు చేసినట్లు ట్విటర్ వేదికగా ఇల్యా సుత్‌స్కేవర్ అంగీకరించారు.
‘‘బోర్డు తీసుకున్న చర్యల్లో నా ప్రమేయానికి సంబంధించి ఇప్పుడు నేను తీవ్రంగా చింతిస్తున్నా. ఓపెన్‌ఏఐ సంస్థకు నేనెప్పుడూ హాని చేయాలని అనుకోలేదు. కంపెనీని ఒక తాటిపైకి తీసుకురావడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ ట్విచ్ మాజీ హెడ్ ఎమ్మట్ షీర్, ఓపెన్‌ఏఐ సంస్థకు తాత్కాలిక కొత్త అధిపతి కానున్నారు.
ఇది జీవితంలో ఒకేసారి లభించే అవకాశం అంటూ ఓపెన్‌ఏఐకి కొత్త అధిపతిగా ఉద్యోగం గురించి ఎమ్మట్ షీర్ ట్వీట్ చేశారు.
అయితే, ఆల్ట్‌మాన్‌ను తొలగించిన విధానం చాలా పేలవంగా ఉందని, కంపెనీ నమ్మకాన్ని ఇది దెబ్బతీసిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వివాదానికి కారణం ఏంటి?
సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపుకు, ఈ రగడకు కారణం ఏంటి? నిజానికి ఇంకా కారణాలు తెలియవు. కానీ, దీనికి కారణమయ్యే కొన్ని అంశాలను చూద్దాం.
ఒక ఏఐ చిప్‌కు నిధులు సమకూర్చడం, అభివృద్ధి చేయడం వంటి కొన్ని హార్డ్‌వేర్ ప్రాజెక్టులను ఆల్ట్‌మాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డుకు తెలియకుండా ఆయన వేరే పనులు చేశారా? లేదా ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారమా?
ఆల్ట్‌మాన్‌పై ఎలాంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు లేవని ఓపెన్‌ఏఐ కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది. ఈ మెమోలోని అంశాలు వార్తలుగా ప్రచురితమయ్యాయి కూడా.
ఇంకో అంశాన్ని చూద్దాం. ఓపెన్‌ఏఐ సంస్థ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా ఏర్పడింది. డబ్బు ఆర్జించాలనే లక్ష్యంతో ఇది పనిచేయదు.
కానీ, 2019లో ఓపెన్‌ఏఐ సంస్థలో లాభాలు సంపాదించే ఉద్దేశంతో (ప్రాఫిట్ ఓరియంటెడ్) ఒక కొత్త విభాగం ఏర్పడింది. ఈ రెండు శాఖలు కలిసి ఎలా నడవాలనే అంశాన్ని సంస్థ నిర్ణయించింది.
లాభాలు సాధించాలనే ఉద్దేశంతో ఏర్పడిన విభాగానికి నాన్ ప్రాఫిట్ విభాగం నాయకత్వం వహిస్తుంది. పెట్టుబడిదారులు పొందే రిటర్న్‌లపై పరిమితి ఉంటుంది. అయితే, ఈ అంశం అందరికీ రుచించలేదు.
కంపెనీ నుంచి ఎలాన్ మస్క్ వెళ్లిపోవడానికి కూడా ఇదే కారణమని చెబుతుంటారు.
అయితే, ఇప్పుడు ఓపెన్‌ఏఐ సంస్థ వద్ద చాలా డబ్బు ఉంది.
ప్రాఫిట్ సంపాదించే విభాగాన్ని మరింత శక్తిమంతంగా మార్చాలనే ఉద్దేశాలు సంస్థలో ఉత్పన్నమయ్యాయా? అదే దీనంతటికీ కారణమైందా?

ఫొటో సోర్స్, Getty Images
సిలికాన్ వ్యాలీ మేధావి ఆల్ట్‌మాన్
ఆపిల్ తొలి తరం కంప్యూటర్లలో ఒకటైన మాకింటోష్‌ను ప్రోగ్రామ్ చేయడం, వేరు చేయడం వంటివి తన ఎనిమిదేళ్ల వయస్సులోనే నేర్చుకున్నానని ది న్యూయార్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్యూల్ హెచ్ ఆల్ట్‌మాన్ చెప్పారు.
కంప్యూటర్ సైన్స్ చదవడం కోసం అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆల్ట్‌మాన్ చేరారు. కానీ, డిగ్రీ పూర్తి చేయలేదు.
కొందరు స్నేహితులతో కలిసి ఒక ఆప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇతరులకు లొకేషన్‌ను షేర్ చేసే ‘లూప్ట్’ అనే ఆప్లికేషన్ అభివృద్ధికే వారంతా తమ పూర్తి సమయాన్ని వెచ్చించాలని అనుకున్నారు. 2005లో ఇదంతా జరిగింది. అప్పటికీ వాట్సాప్ రాలేదు. ఫేస్‌బుక్ అప్పుడప్పుడే పుట్టింది.
అప్పట్లో లూప్ట్ అప్లికేషన్ పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ, వ్యాపారవేత్తగా ఆల్ట్‌మాన్ కెరీర్ ప్రారంభించడానికి ఇది ఉపయోగపడింది. భారీ సాంకేతిక పెట్టుబడుల ప్రపంచానికి తలుపులు తెరిచింది.
లూప్ట్‌కు మద్దతు ఇచ్చిన కంపెనీల్లో ‘వై కాంబినేటర్ (వైసీ)’ ఒకటి. ఎయిర్‌బీఎన్‌బీ, డ్రాప్‌బాక్స్ వంటి ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక, విజయవంతమైన స్టార్టప్ కంపెనీ ఇది.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్ట్‌మాన్ తన మొదటి ప్రాజెక్టును రూ. 333 కోట్ల (40 మిలియన్ డాలర్లు)కు విక్రయించారు. వైసీ గొడుగు కింద తన ఆలోచనలను విస్తరించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది ఆయనకు ఉపయోగపడింది. 2014-2019 మధ్య వైసీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు.
అదే సమయంలో ఎలాన్ మస్క్‌తో కలిసి ఓపెన్‌ఏఐ అనే కంపెనీని నెలకొల్పారు ఆల్ట్‌మాన్.
ఈ కంపెనీ నుంచి ఎలాన్ మస్క్ తప్పుకున్నప్పటికీ, ఆల్ట్‌మాన్ మాత్రం ఏఐ కార్యక్రమాల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు.
ఏఐ కలిగించే పరిణామాలపై తన భయాలను బహిరంగంగా వ్యక్తపరిచారు ఆల్ట్‌మాన్.
అమెరికా కాంగ్రెస్‌లో దీని గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది మే నెలలో ఆల్ట్‌మాన్ తన వాంగ్మూలాన్ని సమర్పించారు.
సెనెట్ ప్రైవసీ అండ్ టెక్నాలజీ కమిటీ ముందు ఆల్ట్‌మాన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుంది? ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు ఏంటి? అని ఆల్ట్‌మాన్‌ను కమిటీ ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి:
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














