చాట్ జీపీటీ: సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ను ఎందుకు తొలగించారు... ఓపెన్ ఏఐలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, జోయి క్లీన్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టెక్ ప్రపంచం షాక్‌లో ఉంది. చాట్‌జీపీటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తులలో ఒకరైన సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపు టెక్నాలజీ రంగాన్ని కుదిపేసింది.
ఆల్ట్‌మాన్‌ను సీఈవో బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఓపెన్ ఏఐ బోర్డు. ఆ కంపెనీకి ఆల్ట్‌మాన్ సహ వ్యవస్థాపకుడు కూడా.
కృత్రిమ మేధ అనేది శక్తిమంతమైన టెక్నాలజీ. చాలామంది నిపుణులు ఇది ప్రపంచాన్ని రక్షించగలదని, నాశనం కూడా చేయగలదని అభిప్రాయపడుతున్నారు.
అయితే, దాన్ని సరైన దిశలో నడిపించగల అతి తక్కువమందిలో ఆల్ట్‌మాన్ ఒకరు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
నాటకీయ పరిణామాలు
ఓపెన్ ఏఐ (చాట్‌జీపీటీని తయారు చేసిన సంస్థ) నుంచి ఆల్ట్‌మాన్ తొలగింపు నాటకీయంగా జరిగింది.
ఆల్ట్‌మాన్ నాయకత్వ సామర్థ్యాలపై తమకు నమ్మకం లేదని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీతో ఆల్ట్‌మాన్ కమ్యూనికేషన్ స్పష్టంగా లేదని కూడా ఆరోపించింది.
కంపెనీ ప్రకటన పరిశీలిస్తే ఆల్ట్‌మాన్‌తో ఏదో జరిగిందని, ఆయన ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచారని సూచిస్తోంది.
దీనిపై వదంతులు చాలానే వ్యాపిస్తున్నాయి కానీ, వాస్తవం ఏంటనేది తెలియదు.
టెక్ సంస్థల్లో బాస్ తొలగింపు గురించి దారితీసే విషయాలు అంత సీక్రెట్‌గా ఏమీ సాగవు, కానీ 'ఓపెన్ ఏఐ' విషయంలో దీనిపై ఎలాంటి వార్తలూ రాలేదు.
అక్టోబర్‌లో కంపెనీ విలువ రూ. 6.7 లక్షల కోట్ల పై మాటే, కాబట్టి డబ్బు సమస్య లేదని తెలుస్తోంది. మరి టెక్నికల్ సమస్య ఏమైనా ఉందా?
కొన్నిరోజుల క్రితం చాట్ జీపీటీ గురించి ఆల్ట్‌మాన్ చేసిన ప్రకటన చర్చకు దారి తీసింది.
చాట్‌జీపీటీకి డిమాండ్ పెరగడంతో దానికి తగ్గట్లు సర్వీస్ అందించడానికి చేస్తున్న ప్రయత్నాలు, టాప్ లెవల్ సబ్‌స్క్రిప్షన్ సమస్యల గురించి ఆయన మాట్లాడారు. కానీ, అవి ఓపెన్ ఏఐ 'తొలగింపులకు' తగిన వివరణలేమీ కావు.

ఫొటో సోర్స్, Getty Images
చైర్మన్ కూడా...
ఆల్ట్‌మన్ తర్వాత బోర్డు నుంచి కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్ గ్రెగ్ బ్రోక్‌మాన్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ హఠాత్పరిణామం చూసి ఇద్దరమూ ఆశ్చర్యపోయామని గ్రెగ్ అంటున్నారు.
కాగా, ఆ బోర్డులో బ్రోక్‌మాన్, ఆల్ట్‌మన్ సహా ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ నిర్ణయం కేవలం నలుగురే తీసుకున్నారని అర్థమవుతోంది.
ఈ కొద్దిమంది ఉన్న బోర్డు ఇలాంటి నిర్ణయం, అది కూడా ఇంత త్వరగా తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి?
గతంలో ప్రపంచ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో టెక్నాలజీ నష్టాలు, ప్రయోజనాల గురించి ఆల్ట్‌మాన్ మాట్లాడారు.
ఏఐ అనేది ఒక టూల్ అని, జీవి కాదని వ్యాఖ్యానించారు. ఆల్ట్‌మాన్ ప్రసంగం ద్వారా ఏదో ఒకరోజు ఏఐ అదుపు తప్పుతుందనే భయాన్ని వెల్లడించడం ఆయనలోని నిజాయితీ చూపించింది.
రెండు వారాల క్రితం యూకేలో జరిగిన ప్రపంచ మొదటి ఏఐ సేఫ్టీ సమ్మిట్‌కు ఆల్ట్‌మాన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ నలుమూలల నుంచి 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
తర్వాత ఏం జరగనుందో ఆయనకూ తెలియకపోవచ్చని అనుకోవడమే మంచిది.
ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ దిగ్గజాల్లో కొందరు ఆల్ట్‌మాన్‌కు మద్దతు పలికారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ఎరిక్ స్క్మిడ్త్ కూడా తన 'హీరో' ఆల్ట్‌మాన్ అని సంబోధించారు.
అంతేకాదు 'ఓపెన్ ఏఐ' కంపెనీపై నమ్మకమున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల కూడా చెప్పారు. అయితే ఆయనకిది అవసరం. మైక్రోసాఫ్ట్ ఆ కంపెనీలో వేల కోట్ల పెట్టుబడి పెట్టింది.
చాట్‌జీపీటీ సాంకేతికతను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్‌లలో పొందుపరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది కూడా కారణమా?
ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకుండా నిశ్శబ్ధంగా ఉన్న మరో వ్యక్తి ఎలాన్ మస్క్. ఆయన గతంలో ఆల్ట్‌మాన్‌తో కలిసి 'ఓపెన్ ఏఐ' సంస్థని ఏర్పాటు చేశారు. కానీ, ఆదాయం రాదనే కారణంతో మస్క్ దాని నుంచి వైదొలిగారు.
అయితే, కంపెనీలో డబ్బు సంపాదించడానికి ప్రాధాన్యం ఇవ్వాలా లేక లాభాపేక్ష లేని లక్ష్యానికి కట్టుబడి ఉండాలా అనే దానిపై భిన్న వాదనలే ఈ తొలగింపులకు కారణమనే పుకార్లూ వినిపిస్తున్నాయి.
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (ట్విటర్) కంపెనీ ఇంతకుముందే గ్రోక్ అనే చాట్‌బోట్ ఆవిష్కరించింది.
ఇదే సందర్భంలో ఓపెన్ ఏఐ సంక్షోభాన్ని మస్క్ పట్టించుకోకపోవచ్చని కొందరు భావిస్తున్నారు, ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని తన కంపెనీకి ఒక ప్రయోజనం చేకూర్చవచ్చు.
కాగా, ఇపుడు ఓపెన్ ఏఐ తాత్కాలిక సీఈవోగా 'చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్' మీరా మురాటీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె గతంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లాలో పనిచేశారు.
అయితే, అకస్మాత్తుగా ఒడిదొడుకులకు గురైన ఓపెన్ ఏఐ కంపెనీని ఆమె గాడిలో పెట్టగలరా?
ఇవి కూడా చదవండి
- రోహిత్ శర్మ: 275 రూపాయల స్కాలర్షిప్ నుంచి వరల్డ్ కప్ ఫైనల్ టీమ్ కెప్టెన్ దాకా...
- బ్లాక్ స్వాన్ - శ్రియ: కే-పాప్‌లో భారత యువతి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి?
- ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ వయసు ఇప్పుడు 92 ఏళ్ళు- ఆ మహా విషాదం ఎలాంటిదో ఆయన మాటల్లోనే...
- హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














