‘పిల్లల పట్ల లైంగికంగా ఆకర్షితులయ్యే నా భర్త నుంచి నా కూతుర్ని కాపాడుకునేందుకు 30 లక్షలు ఖర్చు చేశాను’

ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సాంచియా బెర్గ్, కేటీ ఇన్మాన్
    • హోదా, బీబీసీ న్యూస్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులో తన భర్త జైలుకు వెళ్లినప్పుడు, తిరిగి విడుదలైన తర్వాత కూతురితో సంబంధం పెట్టుకునేందుకు వేధిస్తాడేమోనని బెతాన్ చాలా భయపడ్డారు.

కూతురి విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఆమె అసలు ఇష్టపడలేదు. కూతురితో భర్తకు ఎటువంటి సంబంధం లేకుండా చేసేందుకు ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కారు.

వేల్స్‌లోని కార్డిఫ్ కోర్టు బయట, హుందాగా తయారైన ఒక మహిళ చాలా టెన్షన్‌గా వేచి చూస్తున్నారు.

బెతాన్ అంతకుముందు ఎప్పుడూ ఫ్యామిలీ కోర్టు లోపలికి వెళ్లలేదు. కానీ, కూతుర్ని భర్త నుంచి రక్షించుకునేందుకు తొలిసారి ఆమె కోర్టు గడప తొక్కారు.

బెతాన్ భర్త ప్రస్తుతం పెడోఫిలియా నేరాలు చేయడం వల్ల జైలులో ఉన్నారు. పెడోఫిలియా అంటే చిన్నారుల పట్ల లైంగికంగా ఆకర్షితులై ఉండడం. ఇలా ఉన్నవారు చిన్నపిల్లల్ని లైంగిక వేధింపులకు గురిచేస్తుంటారు.

గత కొన్ని నెలల క్రితం ఆయనకు జైలు శిక్ష పడినప్పుడు, తన కూతురితో భవిష్యత్తులో ఎలాంటి సంప్రదింపులు జరపకూడదని ఆదేశాలు జారీ చేశారు.

కానీ, తన సొంత కూతుర్ని కలవకుండా భర్తను అడ్డుకొనలేనని బెతాన్ భావించారు. తండ్రి అనే హక్కుతో ఆయన కూతుర్ని కలిసే అవకాశం ఉంటుంది.

పాప ఆరోగ్యం, విద్య, ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు కనీసం ఒకసారైనా ఆయన కలుస్తారు. భర్త జైలు నుంచి విడుదలైన తర్వాత కూతురి పరిస్థితి ఏంటని బెతాన్ చాలా భయపడ్డారు. తనకు తెలియకుండా కూతుర్ని స్కూల్ నుంచి తీసుకెళ్లిపోతే ఎలా అని ఆలోచించారు.ఈ భయమే ఆమెను ఫ్యామిలీ కోర్టు దాకా తీసుకెళ్లింది.

ఇతర పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేసిన మాదిరి కూతుర్ని కూడా చేస్తాడేమోనని బెతాన్ భయపడ్డారు. ‘‘అప్పుడు నన్ను నేను క్షమించుకోలేను’’ అని బెతాన్ అన్నారు.

తల్లిదండ్రుల మద్దతుతో, బెతాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల హక్కుల నుంచి మాజీ భర్తను తొలగించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

కూతురికి 18 ఏళ్లు వచ్చేంత వరకు నేరుగా కానీ, పరోక్షంగా కానీ, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా కూడా భర్తకు ప్రమేయం లేకుండా చేయాలని ఆమె కోర్టును కోరారు.

తన మాజీ భర్త తీవ్రమైన నేరాలు చేసినప్పటికీ, ఈ ప్రక్రియ చాలా కష్టమవుతుందని భావించానన్నారు. ఎందుకంటే తన మాజీ భర్త చాలా మానిపులేటివ్ అని, కోర్టు తనవైపుకి తిప్పుకుంటాడేమోనని భయపడ్డానని బెతాన్ చెప్పారు.

బెతాన్‌కు తొలుత ఎలాంటి న్యాయ సాయం అందలేదు. తొలి విచారణకు ముందే తన న్యాయవాది ఫీజులను పెంచేశారు.

ఈ కేసులను ఇప్పటి వరకు ప్రైవేట్‌గానే విచారించే వారు. అంటే, విచారణలో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేసేందుకు కనీసం జర్నలిస్ట్‌లను కూడా అనుమతించే వారు కాదు.

కానీ, ఇంగ్లాండ్‌లోని లీడ్స్, కార్లిస్లే, వేల్స్‌లోని కార్డిఫ్‌లోని ఫ్యామిలీ కోర్టులలో విచారణకు హాజరయ్యేందుకు ఈ జనవరి నుంచే అక్రిడేటెడ్ జర్నలిస్ట్‌లకు అనుమతిస్తున్నారు.

గత ఆరు నెలలుగా బెతాన్ కేసు విచారణను బీబీసీ ఫాలో అవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫ్యామిలీ కోర్టులో బెతాన్ స్క్రీన్‌కు వెనుకాల కూర్చుని ఉన్నారు. బెతాన్ మాజీ భర్త జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు హాజరయ్యారు.

ఆయనకు న్యాయవాది లేరు. పెద్ద స్క్రీన్‌లో బెతాన్ మాజీ భర్త కనిపించారు. చూడటానికి చిన్నగా ఉన్న ఆయన పెద్ద టేబుల్‌ వెనుకాల కూర్చుని ఉన్నారు. ఆయన ఎదురుగా టేబుల్‌పై పేపర్లున్నాయి.

వెల్ష్ చిల్డ్రెన్, ఫ్యామిలీ కోర్ట్స్ అడ్వయిజరీ సర్వీసుకు చెందిన సామాజిక కార్యకర్త కూడా ఈ విచారణకు వచ్చారు.

తీవ్రమైన నేరాలు చేయడం వల్లనే తాను జైలులో ఉన్నానని బెతాన్ భర్త అంగీకరించారు. కూతురు కోసం జైలులో ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి వారం ఆయన కూతురికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ, వాటిని పంపించలేకపోతున్నారు.

కూతురు కోసం జైలులో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పినప్పుడు ఆయన గొంతు జీరబోయింది. ఆ మాటలను బెతాన్ వినేందుకు కూడా తట్టుకోలేకపోయారు.

చిన్న పిల్లల్ని ఇంతటి నరకంలోకి నెట్టిన ఆ వ్యక్తిని క్షమించడం, రాజీకి రావడం అన్నది ఆమెకు భరించరానిదిగా అనిపించింది. కుటుంబ హక్కుల విషయంలో ప్రైవేట్‌గా జరుగుతున్న 80 వేలకు పైగా కేసులలో బెతాన్ కూతురి కేసు కూడా ఒకటి.

2022లో ఇంగ్లాండ్‌లో ప్రైవేట్ ఫ్యామిలీ లా కేసులు సగటున సుమారు 10 నెలల పాటు అంటే 45 వారాల పాటు సాగాయి.

ప్రస్తుతం ప్రైవేట్ ఫ్యామిలీ కోర్టు వ్యవస్థ సంక్షోభంలో ఉందని లా సొసైటీ (ఇంగ్లాండ్, వేల్స్ బార్ అసోసియేషన్) చెప్పింది.

చట్టం ప్రకారం తల్లిదండ్రుల హక్కులనేవి సంపూర్ణమైనవి. కోర్టు ఆదేశాల మేరకే వీటిని నిర్వహించగలమని ఫ్యామిలీ లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హన్నా మార్కమ్ అన్నారు.

‘‘ఒకవేళ ఎవరైనా తీవ్రమైన పెడోఫిలియా నేరాలు చేసి జైలులో ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల హక్కులు వారికుంటాయి’’ అని మార్కమ్ చెప్పారు. బెతాన్ ఈ కేసు పోరాటంలో చాలా తెగువను చూపించారని కొనియాడారు.

ఒక సామాజిక కార్యకర్త కూడా కొన్ని వారాల పాటు కోర్టు విచారణకు హాజరయ్యారు. బెతాన్, ఆమె కూతురితో పాటు జైలులో ఉన్న బెతాన్ మాజీ భర్తను కలిశారు.

బెతాన్ మాజీ భర్తకు ఈ కేసు చాలా క్లిష్టమైందని, మనో వేదనకు గురిచేసిందని ఆ సామాజిక కార్యకర్త చెప్పారు. బెతాన్ మాజీ భర్త ఈ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టుకు కృతజ్ఞతలు చెప్పడానికి ముందు, తన కూతురికి తగిన తండ్రిగా ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నానని అన్నారు. విడుదలైన తర్వాత తనను తాను మార్చుకుంటానని తెలిపారు.

కూతురు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఒక రిపోర్టు ఇవ్వాలని ఆయన కోరారు. ఇలాంటి పరోక్ష సంప్రదింపులను కూడా బెతాన్ అంగీకరించడం లేదు.

ఆ రిపోర్ట్ వల్ల ఏం లాభమని న్యాయవాది అడగగా.. ఇది తనకు చాలా విలువైనదని అన్నారు బెతాన్ మాజీ భర్త. ఈ కేసు నడుస్తున్నప్పుడు బెతాన్ కోర్టు ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి.

బెతాన్ ఖర్చులు భరించేందుకు ఆమె తల్లిదండ్రులు వారి ఇంటిని తనాఖా పెట్టారు. ఆమె భవిష్యత్‌ను మారుస్తుందని వారి ఆశించారు. బెతాన్ తొలి కర్తవ్యం తన కుటుంబాన్ని కాపాడటమేనని భావించారు.

ఈ డబ్బు కూడా దొరకని వారి పరిస్థితి గురించి తలుచుకుంటే బాధేస్తుందన్నారు బెతాన్ తండ్రి. అది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పారు.

ఇతర ఫ్యామిలీ కోర్టు కేసులతో పోలిస్తే ఈ కేసు కాస్త త్వరగానే విచారణకు వచ్చింది. రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలోనే తుది విచారణకు పిలుపునిచ్చింది కోర్టు.

సామాజిక కార్యకర్త ఈ కేసు విచారణ సమయంలో సేకరించిన విషయాలను జడ్జి ఒక దగ్గర క్రోడీకరించారు. తన కూతురి ఇక పూర్తిగా ఆమె వద్దనే ఉండనుందని తెలియగానే బెతాన్ చాలా ఊరట పొందారు.

మాజీ భర్తకున్న హక్కులను కోర్టు పూర్తిగా పరిమితం చేసింది. చిన్నారులను లైంగికంగా వేధించే అంశాలను చూసినట్లు, ఒక యువ బాలికను లైంగికంగా వేధించినట్లు బెతాన్ మాజీ భర్త ఒప్పుకున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

ఇది అత్యంత తీవ్రమైన ప్రమాదమని చెప్పారు. వార్షిక రిపోర్టుల కోసం అభ్యర్థనలు పెట్టుకునేందుకు కూడా కోర్టు అనుమతించలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత బెతాన్ మాజీ భర్త తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు వీలు లేకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఒకవేళ మీ కూతురు అనారోగ్యంతో ఉన్నా లేదా వేరే దేశానికి వెళ్లినా కూడా వారెక్కడున్నారో కనీసం సమాచారం కూడా ఇవ్వరని న్యాయమూర్తి చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

బెతాన్‌కు ఈ నిర్ణయం చాలా ఊరటనిచ్చింది. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు బెతాన్ తెలిపారు. బెతాన్ తల్లిదండ్రులు కూడా కోర్టు ఆదేశాలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘‘మూడేళ్లలో మొట్టమొదటిసారి నా కూతురు బెతాన్ తన కూతుర్ని సాధారణ జీవితంలో సంతోషంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచనుంది’’ అని బెతాన్ తల్లి అన్నారు.

ఆమె ఎంత మానసిక వేదనను భరించిందో తాము వివరించలేమన్నారు. భావోద్వేగపరమైన ఈ కేసుతో 30 వేల యూరోలు అంటే దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చును బెతాన్ భరించారు.

పెడోఫైల్స్ కేసుల్లో జైలు శిక్ష పడిన తర్వాత తల్లిదండ్రుల హక్కులను ఆటోమేటిక్‌గా రద్దు చేసేలా చట్టాన్ని మారిస్తే ఇతరులు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చులను భరించడాన్ని తప్పించుకోవచ్చని బెతాన్ కుటుంబం భరిస్తోంది.

పిల్లల్ని సురక్షితంగా ఉంచేందుకు తల్లిదండ్రుల హక్కులను తాము చాలా జాగ్రత్తగా సమీక్షిస్తున్నామని బ్రిటీష్ న్యాయ మంత్రిత్వ శాఖ బీబీసీకి చెప్పింది.

న్యాయ సాయం త్వరగా పొందేలా చేయడంతో పాటు, బెతాన్ లాగా మరింత మంది తల్లిదండ్రులు కోర్టుకు వచ్చేందుకు సమర్థవంతమైన విధానాన్ని తీసుకురానున్నామని న్యాయవాది హన్నా మార్కమ్ చెప్పారు.

ఈ విషయాలపై ఎంత ఎక్కువగా ప్రచురితమై, ఆ విషయాలను చర్చించుకుంటారో అప్పుడు ఇతరులకు కూడా ఈ విషయంలో అవగాహన వస్తుందన్నారు.

తాము చేయాల్సిన సరైన పని ఇదేనని చెప్పారు. పారదర్శకత కోసం ఫ్యామిలీ కోర్టులలోకి జర్నలిస్ట్‌లను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల తాము చాలా ప్రయోజనం పొందినట్లు బెతాన్, ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

భవిష్యత్‌లో ఇది ఇతరులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడిక తన కూతురు సురక్షితమైన, సాధారణ బాల్యాన్ని గడుపుతుందని బెతాన్ చెప్పారు.

కూతురికి ఒక వయసు వచ్చాక ఆమె తండ్రి గురించి మెల్లగా చెబుతానని, ఇది చాలా సున్నితమైన, జాగ్రత్తతో వ్యవహరించాల్సి విషయమని తెలిపారు.

బెతాన్ గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కథనంలో ఆమె పేరును మార్చాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)