క్యాన్సర్: పొగతాగే వారిలో లంగ్ క్యాన్సర్ దారుణంగా పెరుగుతోంది... హెచ్చరిస్తున్న తాజా నివేదికలు

ఫొటో సోర్స్, Getty Images
ఖగపతి అమృతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క భూమిని రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్
అని గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కంలో గిరీశం అంటారు.
పొగ తాగకపోతే దున్నపోతుగా పుడతామో లేదో తెలియదు కానీ, పొగతాగితే ఆరోగ్యం దెబ్బతినడం మాత్రం ఖాయమని నివేదికలు, అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ పీల్చడం వలన ఊపిరితిత్తులు మసిబొగ్గులా మారి ప్రాణాలకు ప్రమాదమనే హెచ్చరికలను పెడచెవిన పెట్టొద్దని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
పొగతాగడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతోంది. క్యాన్సర్ మరణాలలో లంగ్ క్యాన్సర్‌వే ఎక్కువ. 2020లో 1 కోటి 80 లక్షలమంది లంగ్ క్యాన్సర్ తో చనిపోయినట్టు అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్స్ ఏజెన్సీ (ఐఏసీఆర్) నివేదిక పేర్కొంది.
అదే ఏడాది నమోదైన మొత్తం 19.3 మిలియన్ క్యాన్సర్ కేసులలో 2.2 మిలియన్ కేసులు అంటే 11.4 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వే. వీటిల్లో 14 లక్షల కేసులు పురుషులవి కాగా, 7,70,000 కేసులు మహిళలవి.
లాటిన్ అమెరికాలో మరణాలకు ప్రధానకారణాలలో లంగ్ క్యాన్సర్ కూడా ఒకటని ఐఏసీఆర్ గణాంకాలు చెపుతున్నాయి. వివిధరకాల వ్యాధుల కారణంగా మరణించినవారిలోనూ 12 శాతం మంది లంగ్ క్యాన్సర్ బాధితులే.
పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పీఏహెచ్ఓ) ప్రకారం 2020 లో అమెరికాలో 1.4 మిలియన్ల మంది క్యాన్సర్ బారినపడి చనిపోయారు. వీరిలో 47శాతం 69 ఏళ్ళ వయసునుంచి యువకుల దాకా ఉన్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇప్పుడొక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
లంగ్ క్యాన్సర్ లక్షణాలేంటి?
ఊపిరితిత్తుల క్యాన్సర్ ను చివరి నిమిషంలో గుర్తించడమే సమస్యగా మారుతోంది.
‘‘ఊపిరి తిత్తుల క్యాన్సర్ ముదిరాకే లక్షణాలు బయటపడుతున్నాయి. ఆ దశలో దానికి చికిత్స సాధ్యమయ్యే పనికాదు’’ అని అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ మెడిసిన్‌లో థోరాయిక్ అంకాలజీ విభాగంలో పల్మోనాలలజీ స్పెషలిస్ట్‌గానూ, కోఆర్డినేటర్‌గానూ పనిచేస్తున్న డాక్టర్ ఐరిస్ బాయేరాస్ నవారో తెలిపారు.
నాలుగు కేసులలో ఒకటి మాత్రమే సకాలంలో గుర్తించి, శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తున్నట్టు చెప్పారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను గుర్తించడం సమస్యే కానీ..
దగ్గు, రక్తం పడటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, చాతీలో నెప్పి, ఆందోళన ఊపిరితిత్తుల క్యాన్సర్ లో ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
’’ ఈ లక్షణాలు కనపడేసరికి , రోగం ముదిరి ఉంటుంది’’ అని బోయెరాస్ వవారో చెప్పారు.
దీనిని ముందుగా గుర్తించేందుకు ఏడాదికోసారి చెస్ట్ సీటీ స్కాన్ తీసుకోవాలి. రోజుకో పాకెట్ చొప్పున 20 ఏళ్ళకు పైగ సిగిరెట్లు తాగే అలవాటున్న 40 ఏళ్ళ వయసుపైబడినవారందరూ స్కానింగ్ తీయించుకోవడం మంచిది.
‘‘ ఇది చాలా సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న అధ్యయనం. పైగా రేడియేషన్ ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది. అందుకే దీనిపై రొమ్ము క్యాన్సర్ పై చేసినట్టుగా అధ్యయనం చేయలేకపోతున్నాం. రొమ్ము క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం చాలా తేలిక, కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో అది సాధ్యం కాదు. అందుకే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి’’ అని డాక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం
ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రధాన కారణం పొగతాగడమే. లంగ్ క్యాన్సర్ కేసులలో 85శాతం పొగతాగడం వలన వచ్చినవే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది.
ప్రపంచం మొత్తం మీద ఉన్న వందకోట్లకుపైగా పొగతాగేవారిలో అమెరికా ప్రాంతంలోనే 12 కోట్ల 70 లక్షలమంది ఉన్నట్టు పీఏహెచ్‌ఓ తెలిపింది. పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను దేశాలన్నీ తప్పనిసరిగా గౌరవించాలని, వాటిని అమలు చేయాలని పీఏహెచ్‌ఓ సూచించింది.
2003లో ప్రపంచ ఆరోగ్య సదస్సులో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం 2005 నుంచి అన్నిదేశాలలోనూ నాలుగు ముఖ్యమైన విషయాలు అమల్లోకి వచ్చాయి.
- బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, పనిప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధించి, సిగరెట్ల కంపు, పొగలేని వాతావరణాన్ని సృష్టించడం.
- పొగతాగడం వలన కలిగే నష్టాలను సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరిక రూపంలో పెద్దగా బొమ్మలతో ముద్రించడం
- పొగాకు ఉత్పత్తుల ప్రచారం, ప్రమోషన్లు, స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం విధించడం.
- పొగాకు ఉత్పుత్తులపై భారీగా పన్ను విధించడం ద్వారా వాటి ధరలు పెంచడం
ప్రస్తుతం ఈ ఒప్పందంపై 180 దేశాలు సంతకం చేయగా, అందులో అమెరికా ప్రాంతంలోనివే 30 ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తాగేవారికంటే పీల్చేవారికి ముప్పెక్కువ
పొగతాగేవారికంటే ఆ పొగబారినపడివారే అధికంగా క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. మొత్తం కేసులలో 20 నుంచి 25శాతం దాకా అసలెప్పుడు పొగతాగనివారివే ఉంటున్నాయి. వీటిల్లో ఎక్కువమంది మహిళలే అని డాక్టర్ రిస్ బోయేరా నవారో చెప్పారు.
‘‘ కొన్ని కారణాలను విశ్లేషిస్తే కట్టెల పొగ, సిగరెట్లు తాగేవారిపక్కన నుంచోవడం, జన్యుపరమైన కారణాలు, మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తరువాత చేయించుకునే హర్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తదతర కారణాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి’’ అని బోయెరా తెలిపారు.
అమెరికాలో క్యాన్సర్ కేసులలో రెండో అతిసాధారణమైనవి లంగ్ క్యాన్సర్ వే. మరణాల ముప్పు ఎక్కువగా ఉన్నది కూడా ఇదే.
2020లో అమెరికాలో 40 లక్షల క్యాన్సర్ కేసులు ఉన్నాయని అంచనా వేయగా, 2040 నాటికి ఇది 60 లక్షలకు చేరుకుంటుందని పీఏహెచ్‌ఓ చెప్పింది.
లంగ్ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి పొగాకు వాడకం , మద్యసేవనాన్ని వదిలేయడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను వదులుకోవాలని, అలాగే బద్ధకాన్ని వీడి కాస్త చురుకుగా ఉండాలని పీఏహెచ్‌ఓ సూచించింది.
పీఏహెచ్ఓ ప్రకారం అమెరికా ప్రాంతంలో మగవారిలో తరచుగా గుర్తిస్తున్న క్యాన్సర్ లలో ప్రొస్టేట్ 8.6 శాతం కాగా, లంగ్ క్యాన్సర్ 11.7 శాతం, కోలరెక్టర్ 10.2 శాతం, బ్లాడర్ క్యాన్సర్ 5.9 శాతం ఉంది.
మహిళల విషయానికొస్తే రొమ్ము క్యాన్సర్ 30.7 శాతం, లంగ్ క్యాన్సర్ 10.3 శాతం, కొలెక్టరాల్ 9.6 శాతం, యూటెరైన్ బాడీ క్యాన్సర్ 6.4 శాతం ఉంది.
మరణాన్ని కలగచేస్తున్న క్యాన్సర్ లలో పురుషులలో లంగ్ క్యాన్సర్ శాతం 20.6గా ఉండగా, ప్రొస్టేట్ 14.5 శాతం, కొలొరెక్టాల్ 10.6 శాతం, పాంక్రియాస్ 7 శాతం, లివర్ 6.6శాతంగా ఉంది.
మహిళల్లోనైతే లంగ్ క్యాన్సర్ కారణంగా చనిపోయేవారి శాతం 18.4 శాతం ఉండగా, రొమ్ము క్యాన్సర్ వలన 17.5 శాతం, కొలొరెక్టాల్ క్యాన్సర్ 10.6 శాతం, పాంక్రియాస్ క్యాన్సర్ తో 7.2 శాతంగా ఉంది.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














