నెపోలియన్ టోపీ ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఎమిలీ మెక్‌గార్వే, విక్కీ వోంగ్
- హోదా, బీబీసీ న్యూస్
19వ శతాబ్దంలో ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ పారిస్‌లో జరిగిన వేలంలో 1.9 మిలియన్ యూరోల (17.28 కోట్ల రూపాయలు) ధర పలికింది.
ఈ బైకార్న్ (రెండు వైపుల కోపుగా ఉండడం) బ్లాక్ బీవర్ టోపీ 6 లక్షల యూరోల నుంచి 8 లక్షల యూరోల (రూ.5.46 కోట్లు నుంచి రూ.7.28 కోట్లు) వరకూ పలుకుతుందని భావించారు.
అయితే, ఈ టోపీని వేలంలో సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలు బయటికి వెల్లడించలేదు.
ఈ టోపీ నెపోలియన్ బ్రాండ్ అని చరిత్రకారులు చెబుతున్నారు. టోపీని పక్కకు ధరించడం వల్ల యుద్ధంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన వద్ద దాదాపు 120 టోపీలు ఉండేవి.
వాటిలో ప్రస్తుతం 20 మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తున్నారు. మిగిలిన టోపీలు ప్రైవేట్ వ్యక్తుల వద్దకు చేరాయి.
నిరుడు మరణించిన ఒక పారిశ్రామికవేత్త సేకరించిన నెపోలియన్ ఇతర వస్తువులతో పాటు ఈ టోపీని వేలం వేశారు.
ఈ టోపీ అత్యంత అరుదైన వస్తువని వేలందారులు చెప్పారు.
ఫ్రెంచ్ చక్రవర్తి తన టోపీని భుజానికి సమాంతరంగా, అంటే తలకు అడ్డంగా పెట్టుకునేవారు. ఆయన అధికారుల్లో చాలా మంది టోపీలను తలపై నిలువుగా ధరించేవారు.

ఫొటో సోర్స్, REUTERS
''ఈ టోపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. యుద్ధభూమిలో ఈ టోపీని చూసే నెపోలియన్ అక్కడ ఉన్నాడని అందరికీ తెలిసేది'' అని వేలందారు జీన్ పియెర్రె ఒసెనాట్ చెప్పారు.
''ఎప్పుడూ టోపీ తలపైనే ధరించి ఉండేవారు. లేదంటే చేతిలో పెట్టుకుని ఉండేవారు. కొన్నిసార్లు ఆ టోపీని నేలకేసి కొట్టేవారు. ఈ టోపీ చక్రవర్తికి ప్రతిరూపం.''
నెపోలియన్ ప్యాలెస్ క్వార్టర్‌మాస్టర్ నుంచి అన్ని ఆధారాలతో ఈ టోపీ కొనుగోలుదారులకు చేరుతుందని వేలందారులు చెప్పారు.
ఫాంటైన్‌బ్లూలో ఒసెనాట్ ఆక్షన్ హౌస్ వేలం వేసిన టోపీపై ఒక చిహ్నం ఉంది. 1815లో ఎల్బా నుంచి యాంటీబ్స్‌కు వెళ్తూ మధ్యదరా సముద్రం దాటుతున్న సమయంలో నెపోలియన్ దానిని తన టోపీపై ధరించారు. అక్కడ కొద్దికాలం ఆయన పాలన సాగించారు.
అలాగే, నెపోలియన్ 1815లో వాటర్‌లూలో ఓడిపోయిన సమయంలో ఆయన క్యారేజ్ నుంచి దొంగిలించిన వెండి పళ్లెం, రేజర్లు, వెండి టూత్ బ్రష్, కత్తెర, ఇతర వస్తువులతో కూడిన చెక్క పెట్టె కూడా వేలంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- Oscor-Sacheen Littlefeather: ఆస్కార్ వేదిక మీదనే ఆమెను అవమానించారు, 50 ఏళ్ల తర్వాత సారీ చెప్పారు
- అటల్ బిహారీ వాజ్‌పేయి మాటల్ని జవహర్లాల్ నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- Period Date Chart: పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- న్యూజీలాండ్: ఈ అరుదైన అంటార్కిటికా పెంగ్విన్ 3 వేల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















