బంగ్లాదేశ్‌ ఎన్నికలు: అతిపెద్ద ఇస్లామిక్ పార్టీపై నిషేధాన్ని తొలగించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు... ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది?

యాంటీ జమాత్ బంగ్లాదేశీల నిరసనలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జమాత్ నేత నిజామీ పోస్టర్లతో 2016లో యాంటీ జమాత్ బంగ్లాదేశీలు నిరసనలు

బంగ్లాదేశ్‌లో అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ జమాత్-ఇ-ఇస్లామీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది.

2013లో తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జమాత్‌పై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరించింది.

లౌకికవాదానికి చెందిన రాజ్యాంగపరమైన నిబంధనలను ఉదహరిస్తూ.. జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ సమయంలో సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎన్నికల సంఘం వద్ద ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసింది.

అయితే, రాజకీయాల్లో పాలుపంచుకోకుండా ఆ పార్టీని నిషేధించలేదు. కానీ, ఏ ఎన్నికల గుర్తుపై కూడా ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలిపింది.

జమాత్‌పై పూర్తి నిషేధం విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న సమయంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది.

1971లో పాకిస్తాన్‌తో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి జమాత్ వ్యతిరేకం.

ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)తో జమాత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

బీఎన్‌పీ పార్టీకి చెందిన ఖలీదా జియా 2001 నుంచి 2006 మధ్యలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో జమాత్ పార్టీ భాగస్వామిగా ఉండేది.

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జనవరి 7న జరగనున్నాయి. బీఎన్‌పీతో సహా చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాయి.

అవామీ లీగ్, ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలో పారదర్శకమైన ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలంటున్నాయి.

జమాత్ నేత రెహ్మాన్ నిజామి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడటాన్ని వ్యతిరేకించిన జమాత్ నేత మోతియుర్ రెహ్మాన్ నిజామి, 73 ఏళ్ల వయసులో 2016లో నిజామీకి ఉరిశిక్ష విధింపు. నిజామీతో సహా జమాత్‌కు చెందిన పలువురు నేతలకు బంగ్లాదేశ్‌లో మరణ శిక్ష, జీవిత ఖైదు శిక్షలు

జమాత్ వివాదాస్పదమైన చరిత్ర

జమాత్-ఇ-ఇస్లామీ పిటిషన్‌ను బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ విచారణ చేపట్టింది.

వ్యక్తిగత కారణాలతో జమాత్ చీఫ్ కౌన్సిల్ ఈ విచారణకు గైర్హాజరు అయ్యారు.

విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని కోరారు. కానీ, జమాత్ చీఫ్ కౌన్సిల్ అభ్యర్థనను, పార్టీ అప్పీల్‌ను కోర్టు కొట్టేసింది.

సుప్రీంకోర్టు ఆదివారం ఈ నిర్ణయం తర్వాత, జమాత్ రాజకీయ కార్యకలాపాలను చేపట్టవచ్చా? లేదా? అన్న దానిపై కూడా స్పష్టత వీడలేదు.

సాధారణంగా, దేశ వ్యతిరేక కార్యకలాపాల కింద ఏదైనా సంస్థను నిషేధించే బాధ్యత హోమ్ మంత్రిత్వ శాఖకు ఉంటుంది.

2009లో అవామీ లీగ్ అధికారంలోకి వచ్చి, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన తర్వాత జమాత్ పార్టీ, ఖలీదా జియా పార్టీ బీఎన్‌పీకి చెందిన ప్రధాన నేతలను జాతి విధ్వంసం, యుద్ధ నేరాల కింద జైలుకు పంపారు.

2013 నుంచి ఇప్పటి వరకు జమాత్‌కు చెందిన చాలా మంది నేతలకు మరణ శిక్ష, జీవిత ఖైదు శిక్షలను విధించారు.

బంగ్లాదేశ్‌లో జమాత్ నాలగవ అతిపెద్ద పార్టీ.

బంగ్లాదేశ్‌కు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం నుంచి జమాత్ పార్టీ గత 15 ఏళ్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

చాలా మంది నేతలను ఇది కోల్పోతున్నప్పటికీ, పెద్ద మొత్తంలో ప్రజల మద్దతును మాత్రం చూరగొంటోంది.

జమాత్ నిర్వహించే ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.

ఎన్నికల నిర్వహణపై అనుమానాలు

జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత, అవామీ లీగ్ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని ఖలీదా జియా పార్టీ హెచ్చరిస్తోంది.

హసీనా అధికారంలో ఉన్నందున తాము కూడా ఎన్నికలను నిషేధిస్తామని జమాత్-ఇ-ఇస్లామీ చెబుతోంది.

జమాత్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత, ఈ పార్టీ నేరుగా ఎన్నికల్లో పోటీ దిగే అవకాశాలు లేవు.

పాకిస్తాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడటాన్ని తొలుత జమాత్ వ్యతిరేకించింది.

బంగ్లాదేశ్‌లో ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే, తూర్పు పాకిస్తాన్‌లో(ప్రస్తుత బంగ్లాదేశ్‌లో) కొందరు చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో పాకిస్తాన్ సైనికులు ఊచకోత చేసినట్లు ఆరోపణలున్నాయి.

తొమ్మిది నెలల పాటు జరిగిన ఈ ఘర్షణల సమయంలో పెద్ద మొత్తంలో ప్రజలు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలివచ్చారు.

తూర్పు పాకిస్తాన్‌కు చెందిన బహిష్కృత ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు భారత్ అప్పట్లో సాయం చేసింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ముజిబుర్ రెహ్మాన్ తండ్రి.

ఖలీదా జియా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఖలీదా జియా

ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరికలు

12వ పార్లమెంటరీ ఎన్నికలకు అధికార పార్టీ అవామీ లీగ్ సిద్ధమవుతోంది. కానీ, ఈ ఎన్నికలు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికలు నిర్వహించడాన్ని బీఎన్‌పీ, ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

చర్చల ద్వారా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగే వాతావరణాన్ని సృష్టించాలని కోరుతూ అవామీ లీగ్, బీఎన్‌పీలకు ఇటీవల అమెరికా పరిపాలన విభాగం ఒక లేఖను పంపింది.

ఇది ప్రభుత్వ బాధ్యతని బీఎన్‌పీ చెప్పింది. మరోవైపు చర్చలకు తమ వద్ద సమయం లేదని అవామీ లీగ్ అంటోంది.

ఎన్నికల నిర్వహణపై అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉంది. బంగ్లాదేశ్‌లో కార్మికుల హక్కుల విషయంలో కనుక రాజీపడితే, వాణిజ్యంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది.

కొట్లాటలు, గొడవలు లేని వాతారణంలో, నమ్మకమైన ఎన్నికలు జరిగే వాతావరణాన్ని సృష్టించే బాధ్యత అవామీ లీగ్ ప్రభుత్వంపైనే ఉందని ఢాకా యూనివర్సిటీ అధ్యాపకులు, రాజకీయ నిపుణుడు జుబైదా నస్రీన్ బీబీసీ బంగ్లాతో అన్నారు.

అప్పుడైతేనే ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగలుగుతారని చెప్పారు.

2014లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు తీవ్ర హింసాత్మక పరిస్థితుల మధ్య జరిగాయి. అప్పుడు కూడా బీఎన్‌పీ లాంటి పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి.

2018 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పాలుపంచుకున్నప్పటికీ, ఆ తర్వాత రిగ్గింగ్ జరిగినట్లు పార్టీలు ఆరోపించాయి.

‘‘ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగాలని ప్రపంచమంతా ఆశిస్తోంది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల భాగస్వామ్యాన్ని అవామీ లీగ్ ఎలా పొందుతుందనేదే దాని ముందున్న అతిపెద్ద సవాలు’’ అని ప్రొఫెసర్, రాజకీయ నిపుణులు నజ్ముల్ అహ్సన్ కలీముల్లాహ్ బీబీసీ బంగ్లాతో అన్నారు.

చాలా పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని అవామీ లీగ్ నేత అబ్దుర్ రెహ్మాన్ అన్నారు.

‘‘ఓడిపోతామనే భయంతో ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటే ఎవరైనా ఏం చేయగలరు? చాలా పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ప్రతి సీటు నుంచి పోటీకి దిగుతాయి’’ అని అబ్దుర్ రెహ్మాన్ చెప్పారు.

ప్రధానమంత్రి షేక్ హసీనా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి షేక్ హసీనాపై పెరుగుతోన్న ఒత్తిడి

అవామీ లీగ్‌పై ఒత్తిడి

అవామీ లీగ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. 14 పార్టీల కూటమితో అవామీ లీగ్ బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉంది.

ఒకవేళ బీఎన్‌పీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తే, అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాజ్యాంగ పార్టీలు అవామీ లీగ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అన్నారు.

అవామీ లీగ్‌ కూటమిలో భాగమైన బంగ్లాదేశ్ జాతీయ పార్టీ గత ఎన్నికల్లో ప్రతిపక్షంగా బరిలోకి దిగింది.

ఈ సారి కూడా ఎన్నికల్లో తాము ఎవరితో జతకట్టకుండా, నేరుగా బరిలోకి దిగుతామని చెబుతోంది. ఇప్పటికే ఈ సన్నాహాలను కూడా ప్రారంభించింది.

ఈ పార్టీలో కూడా చాలా విషయాల్లో భిన్నత్వం కనిపిస్తోంది. ప్రముఖ పార్టీ నేత రోషన్ ఇర్షాద్ అవామీ లీగ్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కానీ, చైర్మన్ జీఎం ఖాదిర్ మాత్రం వేరుగా బరిలోకి దిగాలని అంటున్నారు.

‘‘ఒకవేళ ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని అధికార పార్టీ ఎలా తట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ ఎన్నికలను కోర్టు గుర్తించదు’’ అని రాజకీయ నిపుణులు జుబైదా నస్రీన్ అన్నారు.

పారదర్శకమైన, సామరస్య ఎన్నికలు జరగాలని అంతర్జాతీయ సమాజం చెబుతోంది. అవామీ లీగ్ కూడా దీన్నే కోరుకుంటుందని అవామీ లీగ్ నేత అబ్దుర్ రెహ్మాన్ చెప్పారు.

‘‘ఏది సవాలుతో కూడుకున్నది కాదు. పారదర్శకంగా జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని మేం అనుకుంటున్నాం’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)