తెలంగాణలో సోషల్ మీడియా ప్రచారం గీత దాటుతోందా... బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ యాడ్స్‌పై నిషేధం ఎందుకు?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, గులాబీ జెండాలే... అంటూ రామక్క పాట..
కాస్త కిందకు స్క్రోల్ చేస్తే, మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ మరో ప్రచార గీతం.
ఇంకొంచెం కిందకు వెళితే.. సాలు దొర, సెలవు దొర అంటూ ప్రకటనలు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఊదరగొట్టేస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం హద్దులు దాటి సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది.
ఇవన్నీ బహిరంగ సభలలోనో.. ప్రచార ర్యాలీలో కంటే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతున్నాయి.
పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రమవ్వడంతో ఎన్నికల సంఘం కూడా చర్యలకు దిగింది.

ఆ ప్రకటనలు కనిపించవిక
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు రాజకీయ పార్టీల యాడ్స్(ప్రకటనల)ను ఎన్నికల సంఘం నిషేధించింది.
ఇందులో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు యాడ్స్ ఉండగా, బీజేపీకి చెందిన ఐదు యాడ్స్, బీఆర్ఎస్‌కు చెందిన నాలుగు యాడ్స్ ఉన్నాయి.
వీటిల్లోని కంటెంట్ ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ఉండటంతో వాటిపై నిషేధం విధించాలని ఎన్నికల ప్రకటనల స్ర్కీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్.
‘‘ఎన్నికల ప్రవర్తన నియమావళిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఉంటుంది. అక్టోబరు 9 నుంచి 416 ప్రకటనలకు సర్టిఫికెట్ జారీ చేశాం. వీటిల్లో 15 ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ప్రదర్శించకూడదని స్పష్టం చేశాం’’ అని వికాస్ రాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, BRS
రూ. 4.82 లక్షల కోట్ల లూటీ ప్రకటనలపై వివాదం
ఈసీ నిషేధం విధించిన ప్రకటనల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు ప్రకటనలు ఉన్నాయి.
కేసీఆర్‌ను పోలినట్టు ఉండే వ్యక్తి వచ్చి ప్రకటన చేయడం.. ప్రజలు ప్రశ్నించడం.. చివరికి కారు గాలి తీసేయ్యడం.. ఈ తరహాలో సాగే ప్రకటనలను ఎన్నికల సంఘం నిలిపివేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ విడుదల చేసిన పాటపై ఫిర్యాదు అందడంతో దాన్ని నిలిపివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
పత్రికల్లో ఫుల్ పేజీలో ఇస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
‘‘స్కాంగ్రెస్.. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీస్ హిస్టరీ ఆఫ్ కరెప్షన్ తో పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. రూ.4.82 లక్షల కోట్ల విలువైన ప్రజాధనం కాంగ్రెస్ పార్టీ లూటీ చేసిందంటూ ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో వచ్చిన యాడ్స్‌కు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని పర్యవేక్షణ కమిటీ ఎలా అనుమతి ఇచ్చింది’’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

వాట్సాప్ గ్రూపులు.. లైవ్ స్ట్రీమింగ్
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ప్రత్యేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ టీంను నియమించుకుని ప్రచారం చేస్తున్నారు.
రూరల్ ప్రాంతాల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపిస్తోందని చెప్పారు హౌస్ ఫుల్ స్టూడియో ప్రతినిధి, డిజిటల్ క్యాంపెయినర్ నకుల్ వడ్లకొండ. వీరి బృందం దుబ్బాకలో బీఆర్ఎస్ తరఫున సోషల్ మీడియా ప్రచారాన్ని పర్యవేక్షిస్తోంది.
నకుల్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘రూరల్ ప్రాంతాల్లోనూ యూట్యూబ్, వాట్సాప్ ప్రచారం ఎక్కువగా ఉంది. అభ్యర్థుల ప్రచారం ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. కమ్యూనిటీ క్రియేట్ చేస్తుంటాం. వాటిల్లో కంటెంట్ పోస్టు చేసి గ్రామాల్లో అందరికీ చేరుకునేలా ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా కంటెంట్ చేయడం ఎంతో ముఖ్యం. యువతను చేరుకునేందుకు సోషల్ మీడియానే కీలకంగా మారింది’’ అని చెప్పారు.
‘‘ప్రస్తుతం గ్రామాల్లో ప్రచారం 80-90 శాతం వాట్సాప్ గ్రూపులతోనే జరుగుతోంది. తర్వాత స్థానాలది ఫేస్ బుక్, యూట్యూబ్. ఇన్ స్టాగ్రాం, ట్విటర్ లో ప్రచారం తక్కువే’’అని నకుల్ బీబీసీకి వివరించారు.

మీమ్స్ కల్చర్ బాగా పెరిగింది...
సోషల్ మీడియా ప్రచారం అంటే ఊకదంపుడు ఉపన్యాసాలుంటే జనంలోకి వెళ్లవు. అందుకే దీనికి తగ్గట్టుగా ప్రచార సరళిని కూడా సోషల్ మీడియా క్యాంపెయినర్లు మార్చుకున్నారు.
గతంతో పోల్చితే మీమ్స్ కల్చర్ బాగా పెరిగిందని బీబీసీతో చెప్పారు పొలిటికల్ కన్సల్టెంట్ కిరణ్. నేడు రీల్స్, షాట్స్, వాక్స్ పాప్, పంచ్ డైలాగులతో వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారని అన్నారు.
ఈ విషయంపై విధాత కన్సల్టింగ్ క్యాంపెయిన్ మేనేజర్ చైతన్య కుమార్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ప్రచారం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభుత్వ లేదా పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం ఉంటుంది. రెండోది ప్రత్యర్థి పార్టీల పరాజయాలపై మీమ్స్ లేదా ట్రోల్స్ ఉంటాయి. మూడోది మ్యానిఫెస్టో ఆధారంగా అర్బన్, రూరల్ ఏరియాగా విభజించి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం ఆధారంగా 30-40 కిలోమీటర్ల రేడియస్‌లో బూస్టింగ్ తీసుకుని ప్రచారం చేస్తుంటాం. దానివల్ల నియోజకవర్గ ప్రజల సోషల్ మీడియా అకౌంట్లకు నేరుగా చేరేందుకు వీలుంటుంది’’ అని ఆయన చెప్పారు.
ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేసేందుకు ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్, ఆర్మీ పేరుతో అకౌంట్లు తెరిచి ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు.
దీనివల్ల ఏదైనా ఒక ఖాతాను అధికారులు బ్లాక్ చేసినా, మరో ఖాతాతో ఆపరేట్ చేసేందుకు వీలు కలుగుతోంది.
29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.
వీరిలో 9.99లక్షల మంది 18-19 వయసులో ఉన్న కొత్తగా నమోదైన ఓటర్లే.
వీరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని చెప్పారు పొలిటికల్ కన్సల్టెంట్ కిరణ్.
దీనిపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘యువతను లక్ష్యంగా చేసుకునే సోషల్ మీడియా ప్రచారం ఉంటోంది. అంశాల వారీగా మహిళలు, వయోధికులను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తుంటారు. వ్యూస్‌ను బట్టి కంటెంట్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి’’ అని ఆయన చెప్పారు.
శ్రావణభార్గవి, శ్రీముఖి, దీప్తి సునయన, మెహబూబ్, శివజ్యోతి, అషురెడ్డి, హరిక, నిఖిల్ విజయేంద్ర, లాస్య.. ఇలా యూట్యూబర్లు, యాంకర్లు సోషల్ మీడియా ప్రచారంలో పార్టీలకు అనుకూలంగా వీడియోలు చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్‌తో లోక్‌సత్తా వ్యవస్థాపకులు జేపీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, గోరటి వెంకన్న చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి.
మరో యూట్యూబర్ సందీష్ భాటియా చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభావం చూపే వ్యక్తులు, యూట్యూబర్లతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం సాగిస్తోంది.
ఇందుకు ఏకంగా తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లతో కలిపి దాదాపు 150 మంది వరకు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, my village show
కేటీఆర్ తో ఇంటర్వ్యూపై ‘మై విలేజ్ షో’ టీం ఏం అంటోంది..?
తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన మై విలేజ్ షో యూట్యూబ్ బృందంతో మంత్రి కేటీఆర్ నాటుకోడి పులుసు చేసిన వీడియో వైరల్ అయ్యింది.
ఆ తర్వాత మై విలేజ్ షో టీం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. ఇదే టీంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమావేశమయ్యారు.
తొలుత ఈ టీం సభ్యులతో కలిసి మంత్రి కేటీఆర్ వీడియో చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయంపై మై విలేజ్ షో టీం సభ్యుడు గీలా అనిల్ బీబీసీతో మాట్లాడారు. ‘‘మంత్రి కేటీఆర్‌తో వీడియో చేసేందుకు వస్తా అన్నప్పుడు వద్దు అని చెప్పలేం. అంత స్థాయి వ్యక్తులం కాదు మేము. ఆయన గతంలో ఓ స్టేజీ మీద ఇచ్చిన హామీ మేరకు వీడియో చేసేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలో చేస్తున్నాం కాబట్టి కచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే ఊహించాం’’ అని అనిల్ చెప్పారు.
ఈ వీడియో చేయడం వెనుక మా గ్రామంలో ఉన్న రెండు సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోచ్చన్నది మా ఉద్దేశమని చెప్పారు అనిల్.
‘‘మిగిలిన యూట్యూబర్ల తరహాలో మేం ఎక్కడా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తూ వీడియో చేయలేదు. సాధారణంగా ఊళ్లలో ప్రజల్లో ప్రభుత్వంపై ఉండే సందేహాలను మాత్రమే అడిగాం. ముందుగా స్క్రిప్టు రాసుకుని చేసిన వీడియో కాదు’’ అని అన్నారు.
మై విలేజ్ షో టీంకు బీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులు ముట్టజెప్పిందని ఆరోపణలు వినిపించాయి.
ఈ ఆరోపణలను ఖండించారు మై విలేజ్ షో టీం సభ్యుడు గీలా అనిల్. ‘‘మేం వీడియో చేసినప్పుడు రెండు, మూడు కోట్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మేం ఎక్కడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. విమర్శలు వస్తాయని తెలిసినా, కేవలం ఊరి సమస్యల కోసమే చేశాం.
మేం పార్టీ పరంగా సపోర్టు చేయాలని లేదు. అందుకే రేవంత్ రెడ్డిని కలిశాం. బండి సంజయ్‌ను కలిశాం. మేం పారదర్శకంగా ఉన్నాం. మమ్మల్ని పొలిటికల్ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఉన్నప్పటకీ, మా ఊళ్లో ఉన్న సమస్యలు పరిష్కరిష్కారమవుతాయనే ఉద్దేశంతోనే వీడియో చేశాం’’ అని బీబీసీతో అనిల్ చెప్పారు.
మై విలేజ్ షో లో చేయడంపై వచ్చిన విమర్శలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘‘గంగవ్వకు కనీసం రెండు రూపాయల చాయ్ కూడా తాగించలేదు. కానీ, ఏదో డబ్బులు ఇచ్చినట్లుగా ప్రచారం చేశారు. ఆమెను ఎందుకు బద్నాం చేస్తున్నారు. నా ప్రచారానికి హెల్ప్ అవుతుందని వెళ్లా. వీడియో చేశాం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, REVANT REDDY
యూట్యూబర్లపై కాంగ్రెస్ విమర్శలు
బీఆర్ఎస్ ప్రచారంలో బాగా హీట్ పెంచుతున్న పాటలలో ‘గులాబీ జెండాలే రామక్క.. గుర్తును గుర్తుంచుకో రామక్క’’ ఒకటి. దీనికి యూట్యూబర్లు, యాంకర్లు స్టెప్పులు వేస్తూ ప్రమోషన్ వీడియోలు చేశారు.
దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ తరఫున మరో వీడియోను విడుదల చేశారు. ‘గులాబీ జెండాలే రామక్క.. ఈ దొంగలను గుర్తుంచుకో రామక్క’ అంటూ లిరిక్స్ ఉన్న పాటను కాంగ్రెస్ విడుదల చేసింది.
ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు వీడియోలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్‌కు అనుకూలంగా వీడియోలు చేసిన యూట్యూబర్లపై కాంగ్రెస్ వీడియో చేసింది.
కొందరు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారంటూ అప్పటి వీడియోలతో ఒక వీడియోను పోస్టు చేసింది.
అభ్యర్థుల ఖర్చు దాటకుండా ఉండేలా...
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో చేసే ప్రచారం ఖర్చు అభ్యర్థుల ఖాతాలోకి వెళితే ఖర్చు పరిమితి పెరిగే అవకాశం ఉంది. అందుకే పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఎక్కడా అభ్యర్థుల పేరు రాకుండా పార్టీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలలో ఎక్కడా కూడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. నేరుగా పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు చెప్పారు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ వస్తోంది.. అందులో పెడుతున్న ఖర్చు చూపిస్తున్నారా.. లేదా...? ఎన్నికల్ కోడ్ నిబంధనలు పాటిస్తున్నారా..? అనే అంశాలపై నిఘా పెట్టాం. ఇందుకు ప్రత్యేకంగా సీఈవో లేదా డీఈవో కార్యాలయాలలో ప్రత్యేక టీం పనిచేస్తోంది’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి పాకిస్తానీపై ప్రశంసల జల్లు ఎందుకు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















