వరల్డ్ కప్ ఫైనల్లో ఓడినా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించిన ఇండియా

ఫొటో సోర్స్, ANI
భారత క్రికెట్ జట్టు 2023 క్రికెట్ ప్రపంచకప్‌ను గెలవలేకపోయినా ఈ టోర్నీలో అనేక మైలురాళ్ళను దాటింది. ఏళ్ళ తరబడి పదిలంగా ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
క్రికెట్ ప్రపంచకప్‌లో ఇండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంతో మొదలుపెట్టి, వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
ప్రపంచకప్‌లో వరుసగా పది మ్యాచ్‌లు గెలవడం ఇండియాకు ఇదే మొదటిసారి. అంతకుముందు 2003, 2015లో ఇండియా వరుసగా ‘8 మ్యాచ్‌లలో గెలిచింది. అయితే, వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా పేరుమీద ఉంది. ఈ జట్టు 2003, 2007లో ఈ ఫీటు సాధించింది.
2023 ప్రపంచకప్‌లో భారతజట్టు ప్రదర్శన అందరినీ అభిమానులుగా మార్చేసింది. భారతజట్టు వరుసగా గెలవడమే కాదు, భారీ తేడాతో గెలిచింది. అదికూడా ఒక్కోసారి ప్రత్యర్థి స్థైర్యం దెబ్బతినేంత తేడాతో గెలిచింది.
తన తొలి మ్యాచ్‌లో ఇండియా ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తరువాత రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
ఇక మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆడి ఏడు వికెట్ల తేడాతో గెలవడమే కాక, మ్యాచ్‌ను 31 ఓవర్లలోనే ముగించింది.
తదుపరి బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన న్యూజీలాండ్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇంగ్లండ్‌పై బ్యాటింగ్‌లో తడబడినా, బౌలర్లు చెలరేగి వందపరుగుల తేడాతో మ్యాచ్ గెలిపించారు. ఆపైన ఈ టోర్నమెంట్‌లో ఇండియా రెండు భారీ విజయాలు నమోదు చేసింది. శ్రీలంకను కేవలం 55 పరుగలకే ఆలౌట్ చేసి 302 పరుగుల తేడాతో గెలిచింది. ఆపైన దక్షిణాఫ్రికాపై కూడా 243 పరుగుల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో అయితే న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచి ఉండవచ్చు. కానీ, ఈ ప్రపంచకప్‌లో భారత్ బలమైన జట్టు అనేది ఎవరూ కాదనలేని విషయం.

ఫొటో సోర్స్, ANI
బౌలింగ్‌లో కింగ్‌లయ్యారు
భారతజట్టు విజయయాత్రలో బౌలర్ల పాత్ర అమోఘం. ఒకప్పుడు భారతజట్టు ఫ్యాబులస్ ఫైవ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందింది.
ఆ సమయంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్రసెహ్వాగ్ భారతజట్టులో ఆడుతుండేవారు. ఈ ఐదుగురిని భారతజట్టు బ్యాటింగ్ వెన్నెముక అని భావించేవారు.
తాజా ప్రపంచకప్‌లో మరోసారి ఆనాటి రోజుల గురించి చర్చ మొదలైంది. కాకపోతే ఈసారి ఫ్యాబులస్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ కారు, ఐదుగురు అద్భుతమైన బౌలర్లు..
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అత్యంత ప్రమాదకరమైన సీమ్, పేస్ ఎటాకర్స్ గా ఈ ప్రపంచకప్‌లో గుర్తింపు పొందారు. వీరికితోడు రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్ కూడా అత్యంత ప్రమాదకరమైన స్పిన్ బౌలర్లుగా ఆవిర్భవించారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ వారిని ఫ్యాబలస్ ఫైవ్‌గా పిలిస్తే, రికీపాంటింగ్ వీరిని భారతజట్టు ఆల్‌టైమ్ అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ దాడిగా అభివర్ణించారు.
ఈ టోర్నమెంట్‌లో షమీ 24 వికెట్లు తీసుకోగా, బుమ్రా 20, జడేజా 16, కులదీప్ 15, సిరాజ్ 14 వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, ANI
ఈ రికార్డులను ఎవరైనా బ్రేక్ చేయగలరా?
ప్రపంచంలో భారత బ్యాటర్లు ఎప్పటి నుంచో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లుగా గుర్తింపు పొందుతున్నారు.
ఈ వరల్డ్ కప్‌లో ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను దాటి ఓడీఐ ర్యాంకింగ్‌లో మొదటి స్థానాన్ని పొందాడు.
అదే సమయంలో విరాట్ కోహ్లీ ఎవరికీ సాధ్యం కాని రికార్డులు నెలకొల్పాడు.
కోహ్లీ వన్డేలలో టెండూల్కర్ చేసిన 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తూ 50 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్, డేవిడ్ బెక్‌హామ్ లాంటి దిగ్గజాల ముందు కిక్కిరిసిపోయిన ముంబయి స్టేడియంలో కోహ్లీ ఈ రికార్డును సాధించాడు.
కోహ్లీ తరువాత స్థానంలో సచిన్ ఉండగా, రోహిత్ శర్మ 31 సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. టాప్ ఫైవ్‌లో రిటైర్డ్ ఆటగాళ్ళు రికీపాంటింగ్, సనత్ జయసూర్య 4,5 స్థానాలలో వరుసగా కొనసాగుతున్నారు.
వన్డేల స్థానాన్ని టీ20లు ఆక్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో వన్డేలలలో కోహ్లీ సాధించిన ఈ రికార్డును బహుశా ఎవరూ చేరుకోలేకపోవచ్చు.

ఫొటో సోర్స్, ANI
వెన్నెముక సమస్య తీరింది
ఏ జట్టుకైనా వెన్నుముక మిడిలార్డరే. భారతజట్టును ఏళ్ళ తరబడి వేధిస్తున్న మిడిలార్డర్ సమస్య ఈ వరల్డ్‌కప్ పుణ్యమా అని తీరిపోయింది.
యువరాజ్ సింగ్, సురేష్ రైనా తరువాత 4వ నెంబరు స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు భారతజట్టుకు కరువయ్యాడు. పదేళ్ళుగా భారతజట్టు ఈ సమస్యను ఎదుర్కొంటోంది.
మనీష్‌పాండే, అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, అంబటి రాయుడులాంటి వారిని ఈ స్థానంలో ప్రయత్నించింది. కానీ, వీరెవరూ కూడా అక్కడ సెటిలవ్వలేకపోయారు.
ఈ ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో నెంబర్ 4 సమస్యకు ముగింపు పలికాడని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీతో కలిసి చక్కని భాగస్వామ్యాలు నిర్మించాడు. కెఎల్ రాహులతోనైతే ఏకంగా భారత్ స్కోరును శిఖరస్థాయికి తీసుకువెళ్ళాడు.
అలాగే ఐదోనెంబరు బ్యాటర్‌గా కే.ఎల్. రాహుల్ చక్కగా ఆడాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు 4, 5 స్థానాలకు తామెంతగా నప్పుతామో చూపారు.
ఈ ప్రపంచకప్ ముందు భారతజట్టు గాయాలతో సతమతమైంది. బౌలింగ్ ప్రారంభాన్ని భుజాన వేసుకునే జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు చాలా రోజులు దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా గాయాలతో జట్టునుంచి తప్పుకున్నారు. శస్త్రచికిత్సలు చేయించుకుని తిరిగి జట్టులోకి వచ్చారు.
వీరంతా ఫిట్‌గా లేకపోయినా మేనేజ్‌మెంట్ వీరిపై నమ్మకం ఉంచడంతో కష్టపడి ఫిట్‌నెస్ సాధించి జట్టులో చోటు సంపాదించారు.
కేవలం జట్టులోకి పునరాగమనం చేయడమే కాదు, చక్కనైన ఆటతీరుతో మేనేజ్‌మెంట్ నిర్ణయం సరైనదేనని నిరూపించారు.

ఫొటో సోర్స్, ANI
మ్యాజిక్ చూపించిన షమీ
వరల్డ్‌కప్ ప్రారంభంలో భారతజట్టు 11మంది సభ్యులలో మహ్మద్ షమీ లేదు.
టీమ్ మేనేజ్‌మెంట్ శార్దూల్ ఠాకూర్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ షమీకి అనివార్యంగా వచ్చిన అవకాశంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీశాడు.
తరువాత షమీ ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అయితే ఏకంగా 7 వికెట్లు తీశాడు.
ఇండియా ప్రపంచకప్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడితే షమీ 7 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, ANI
ప్రేక్షకులూ సూపరే
ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు ప్రజలు బారులు తీరారు. మ్యాచ్‌లను ప్రసారం చేసిన టీవీ చానళ్ళకు కూడా రికార్డు స్థాయిలో నెంబర్లు వచ్చాయి.
ఫైనల్ మ్యాచ్ ప్రసార సమయంలో డిజిటల్ బ్రాడ్ కాస్టర్ హాట్‌స్టార్ ను 5.9 కోట్లమంది వీక్షించారు. ఇదో రికార్డు.
ఫైనల్ మ్యాచ్ జరిగిన నరేంద్రమోదీ స్టేడియానికి లక్షమందికిపైగా ప్రేక్షకులు వచ్చారు. ఇది 2015లో మెల్‌బోర్న్‌కు వచ్చిన 90వేల ప్రేక్షకుల రికార్డును చెరిపేసింది.
ఫైనల్ తరువాత ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ రోజు ఫలితం మాకు అనుకూలంగా రాకపోయినా ఈ టోర్నమెంట్ ఆసాంతం మేమాడిన తీరుకు గర్విస్తున్నాను అని చెప్పాడు.
త్వరలోనే కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి బీబీసీ ఫైనల్ ఓటమికి కారణాలపై నివేదిక అడగొచ్చు. ఆ తరువాత మరోసారి దీనిపై చర్చలు మొదలవుతాయి.
భారతజట్టు ఈ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోయి సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. ఆటలో గెలుపు ఓటములు సహజం.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














