వరల్డ్ కప్ ఫైనల్: భారత్ ఓటమికి అసలు కారణం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రభాకర్ వద్ది
- హోదా, బీబీసీ ప్రతినిధి
వరల్డ్ కప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు తడబడింది. బ్యాటర్లు విఫలమవడంతో వన్డే ప్రపంచకప్-2023 ట్రోఫీ చేజారింది.
ఇక అభిమానులైతే మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ చేసిన తీరే విజయంపై ఆశలు సన్నగిల్లేలా చేసిందంటున్నారు.
కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం టీమిండియా బ్యాటర్లకు మద్దతుగా నిలిచాడు. భారత బ్యాటర్లు రక్షణాత్మకంగా ఆడలేదని, గేమ్ పరిస్థితిని బట్టి ఆడారని చెప్పారు.
“మేం భయంలేని ఆట ఆడాం, మొదటి పవర్‌ప్లేలో 80 పరుగులు చేశాం. అయితే, వికెట్లు పడటంతో ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించవలసి ఉంటుంది. అంతేకానీ, డిఫెన్స్‌లోకి వెళ్లలేదు” అని విలేకరుల సమావేశంలో అన్నారు.
ఇంతకీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ సరిగ్గా ఎక్కడ ఓడింది? డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించిన టీమిండియా, ఆస్ట్రేలియాను ఎందుకు నిలువరించలేకపోయింది?

ఫొటో సోర్స్, Getty Images
భారత్ 81/3, ఆసీస్ 47/3
ఈ ప్రపంచకప్‌లో మొదటి నుంచి భారత జట్టు ఆకట్టుకుంది.
కొందరు మాజీ క్రికెటర్లైతే టీమిండియా ఛాంపియన్‌లా ఆడుతోందని, టీంను ఓడించే జట్టు టోర్నీలోనే లేదని ప్రశంసించారు కూడా. కానీ, అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అంతా తలకిందులైంది. భారత్ ఓడింది.
మొదటి పది ఓవర్ల ఆటలో ఇరు జట్లది ఒకే పరిస్థితి. కానీ, ఆ తర్వాతి ఆటతీరే ఫైనల్ మ్యాచ్‌ను శాసించింది.
మూడు వికెట్లు పడటంతో భారత బ్యాటర్లైతే పూర్తి రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 47 పరుగులు) అవుటయ్యాక అప్పటివరకు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ డిఫెన్స్‌లోకి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా అదే ధోరణిలో ఆడాడు. ఈ ఇద్దరూ మొదటి పవర్ ప్లే తర్వాత 15 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కొట్టలేకపోయారు.
కోహ్లీ (63 బంతుల్లో 54 పరుగులు) ఔటయ్యాక పరిస్థితి ఇంకాస్త దిగజారింది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో రాహుల్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు.
బౌండరీలపై దృష్టి పెట్టకుండా సింగిల్స్, డబుల్స్‌తో లాక్కొచ్చాడు. 107 బంతుల్లో 66 పరుగులు చేసిన రాహుల్ కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు.
భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బౌండరీని తాకడమే గగనమైపోయింది. 29 ఓవర్ల పాటు కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టారంటే భారత బ్యాటింగ్ సాగిన తీరుకు అద్దం పడుతోంది.
క్రికెట్ మ్యాచ్‌లకు ఏళ్లుగా కామెంటరీ చేస్తున్న హర్షా బోగ్లే కూడా సోషల్ మీడియా వేదికగా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
''ఇలాంటి కీలక మ్యాచ్‌లో 29 ఓవర్లలో ఒక బౌండరీ మాత్రమే కొట్టడం నాకైతే గుర్తులేదు!'' అని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. ఈ ట్వీట్‌ను దాదాపు 17 లక్షల మంది వీక్షించారు.
దీనికి కోహ్లీ, రాహుల్‌లు రిస్క్ తీసుకోలేకపోయారని, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో నిలదొక్కుకునే వాళ్లు లేకపోవడంతోనే వాళ్లు అలా ఆడారని పలువురు నెటిజన్లు రిప్లై ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా కామెంటరీ చేస్తూ ఇండియా బ్యాటర్లు కనీసం సింగిల్స్ కూడా సులువుగా తీయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
“పిచ్ నెమ్మదిగా ఉండటం, వికెట్ల పతనం కారణంగా సింగిల్స్, డబుల్స్ తీసుకోవడం సరైంది. అయితే అది కూడా రెగ్యులర్‌గా జరగడం లేదు. కోహ్లీ, రాహుల్ ఏం చేశారో అర్థం కావడం లేదు. వారు బౌండరీలు కొట్టలేదు. కనీసం సింగిల్స్, డబుల్స్ కూడా ఎక్కువ తీయలేదు” అని అన్నారు.
మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఎంత ఒత్తిడిలోకి వెళ్లిపోయారో గవాస్కర్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ, పార్ట్ టైమ్ బౌలర్లపై కూడా ఎదురు దాడి చేసే సాహసం చేయలేదు.
మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, లబుషేన్ బౌలింగ్‌లో సైతం పరుగులు వేగంగా సాధించలేదు. వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులే ఇచ్చారు.
ఈ టోర్నీ మొత్తం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి ఇండియా మ్యాచ్‌లు గెలిచింది. కానీ ఫైనల్లో దానికి పూర్తి విరుద్దంగా ఆడింది. ఆసీస్ ఒత్తిడికి భారత్ తలొగ్గింది.
చివర్లో బ్యాట్ ఝులిపించాల్సిన జడేజా (22 బంతుల్లో 9 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 18 పరుగులు) సైతం డిఫెన్స్‌కే పరిమితమవడంతో భారత్ 240 పరుగులే చేయగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
మేం భయంతో ఆడలేదు: రాహుల్ ద్రావిడ్
భారత్ బ్యాటింగ్ తీరుపై మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు.
తమ బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడాల్సి వచ్చిందని, భాగస్వామ్యం నెలకొల్పడంపై దృష్టి పెట్టడంతో రన్‌రేట్ తగ్గిందన్నాడు.
స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు సాధించాలనుకున్నామని, కానీ అలా జరగలేదన్నాడు ద్రావిడ్. కీలక సమయాల్లో మళ్లీ వికెట్లు పడటంతో స్కోరు వేగం మందగించిందని తెలిపాడు.
కాగా, భారత్ బ్యాటింగ్ సమయంలో బంతిని ఆడటం కష్టమైందని, ఆసీస్ బ్యాటింగ్ సమయంలో మాత్రం బంతి బ్యాట్ మీదకు వచ్చిందని గుర్తుచేశాడు ద్రావిడ్.
అయితే, ఓటమికి ఒక నిర్దిష్ట కారణమంటూ లేదన్నాడు టీమిండియా కోచ్.

ఫొటో సోర్స్, Getty Images
తేడా ఇదే..
7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ సమయోచిత ఆటతీరుతో మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు.
లబుషేన్ డిఫెన్స్‌కే పరిమితమైనా ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137 పరుగులు) మాత్రం భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.
వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఇది లబుషేన్ (110 బంతుల్లో 58 పరుగులు)పై ఒత్తిడి తగ్గించింది.
వీరిద్దరి జోడీ 35 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి, 192 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
ఫలితంగా ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి, ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్‌గా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా ప్రత్యేకత అదే..
ఆస్ట్రేలియా జట్టును క్రికెట్‌లో ఛాంపియన్ జట్టుగా పిలుస్తుంటారు చాలామంది అభిమానులు. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌లలో ఆ జట్టు ఆటతీరే భిన్నం.
లీగ్ వరకు ఓ లెక్క.. తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఆ జట్టు ఆట సాగుతుంది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా ఒత్తిడి దరిచేరనివ్వరు.
ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే కనిపించింది.
భారత జట్టుది బలమైన బ్యాటింగ్ లైనఫ్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు భారత్ సొంతం. అయినా కూడా ఆరంభంలో కీలకమైన వికెట్లు పడగొట్టి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఆత్మరక్షణ ధోరణిలో ఆడేలా చేయడంలో విజయవంతమయ్యారు ఆసీస్ బౌలర్లు.
ఫైనల్లో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భారత్ గ్యాప్‌లో కొట్టినా.. బౌండరీకి వెళ్లేలోపే ఆస్ట్రేలియా ఫీల్డర్లు చాలాసార్లు అడ్డుకున్నారు. తమ ఫీల్డింగ్ తో కనీసం 20 నుంచి 30 పరుగులను ఆస్ట్రేలియా అడ్డుకుంది.
మరోవైపు ఆసీస్ బ్యాటింగ్ సమయంలో భారత్ ఫీల్డింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. 18 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకుంది టీమిండియా.
ఛేజింగ్‌లో కూడా ఆసీస్ తన మార్క్ ఆటతీరు చూపించింది. కీలక సమయంలో మూడు వికెట్లు కోల్పోయినా బెదరలేదు. రన్ రేట్ తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. విజయం సాధించింది.
గత మూడు దశాబ్ధాల గణాంకాలు చూసినా ఆసీస్ ఆటతీరు అర్థమవుతుంది. క్రికెట్‌లో అత్యధికంగా వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన జట్టు కూడా ఇదే.
1975 నుంచి ఇప్పటివరకు 13 వన్డే ప్రపంచకప్ టోర్నీలు జరగగా ఆస్ట్రేలియా ఆరు సార్లు (2023తో సహా) విజేతగా నిలిచింది. రెండు సార్లు రన్నరఫ్‌గా నిలిచింది.
ఐదుసార్లు ఛాంపియన్స్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదని, ఫైనల్స్ ఎలా గెలవాలో వాళ్లకు తెలుసని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనడం ఆసీస్ ఆటతీరుకు అద్ధం పడుతోంది.
ఇవి కూడా చదవండి
- గంగూలీకి వేసిన ఆ బౌన్సర్లే షమీ కెరీర్‌ను మలుపు తిప్పాయి
- రోజుకు 4 సెం.మీ. కుంగిపోతున్న పట్టణం.. అక్కడేం జరుగుతోంది?
- అఫ్గానిస్తాన్: 'పదేళ్ళ వయసు వరకూ నన్ను మా నాన్న అబ్బాయిగానే పెంచారు... అలానే అందర్నీ నమ్మించి నన్ను కాపాడారు'
- గాజా: బాంబుల శబ్దాలతో మహిళలకు గర్భస్రావాలు, పెయిన్ కిల్లర్స్ లేకుండానే ప్రసవాలు... చెప్పతరం కాని గర్భిణుల కష్టాలు
- గాజా: అల్-షిఫా హాస్పిటల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా... ఇజ్రాయెల్ సైన్యంతో లోపలికి వెళ్ళిన బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














