ఆదికేశవ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మాస్ మసాలాలో కొత్తదనం ఉందా?

ఫొటో సోర్స్, Sithara Entertainments/X
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
మాస్ మసాలా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించడం అంత తేలిక కాదు. నాలుగు పాటలు, మూడు ఫైట్లు, హీరోయిజం, ఎలివేషన్లు.. ఇలాంటి వాణిజ్య అంశాలన్నీ సమతూకంగా కుదరాలి. అందులోనే కొత్తదనం చూపించాలి. అప్పుడే ఈ తరహా సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయి.
మరి, వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన మాస్ మసాలా కమర్షియల్ మూవీ 'ఆదికేశవ'లో ఈ అంశాలన్నీ ఎంత మేర కుదిరాయి?
మాస్ హీరోగా ఆయన తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? సినిమాలో శ్రీలీల ఎలా ఉంది?
డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్.రెడ్డి ఎంత మేరకు విజయవంతమయ్యారు?

ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
బ్రహ్మసముద్రంలో 'కేజీఎఫ్' కట్టుబానిసలు
అనంతపురంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో మొదలయ్యే కథ ఇది.
చెంగారెడ్డి( జోజు జార్జ్) దుర్మార్గుడు. గ్రామాన్ని, ప్రజలను తన అక్రమాలతో కాల్చుకుతింటుంటాడు. అన్యాయంగా పిల్లలతో తన క్వారీలో ‘కేజీఎఫ్’ కట్టుబానిసల్లా పని చేయిస్తుంటాడు. చివరికి గ్రామంలోని శివాలయాన్ని కూడా కూల్చి క్వారీలో కలిపేయాలని ప్రయత్నిస్తుంటాడు.
బాలు (వైష్ణవ్ తేజ్) సిటీ కుర్రాడు. బాలు తండ్రి( జయప్రకాష్), తల్లి( రాధిక శరత్ కుమార్) గృహిణి.
బాధ్యత లేకుండా జల్సాగా తిరిగే బాలుని ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని ఒత్తిడి చేయడంతో ఓ కాస్మోటిక్ కంపెనీలో జాబ్‌లో చేరతాడు. ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)కి దగ్గరౌతాడు. వాళ్ళ మధ్య ప్రేమ ఎపిసోడ్.
ఇంతలో బాలుకి తన గతానికి సంబధించిన ఓ నిజం తెలియడంతో బ్రహ్మసముద్రానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
ఈ కథలో మహాకాళేశ్వర్ రెడ్డి (సుమన్), వజ్ర కాళేశ్వర్ రెడ్డి (అపర్ణ దాస్) ఎవరు, చెంగారెడ్డి అరాచకాలను బాలు ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెరపై చూడాలి.

ఫొటో సోర్స్, Sithara Entertainments/X
సెకండ్ హాఫ్ వరకు కథలోకి రాని కథానాయకుడు
కథ పరంగా చూసుకుంటే ఆదికేశవ రెగ్యులర్ కమర్షియల్ కథ. కథానాయకుడు దుర్మార్గుడి ఆట కట్టిస్తాడు. క్లుప్తంగా కథ ఇదే. దాదాపు కమర్షియల్ సినిమాల కథలన్నీ ఈ సూత్రంలోనే ఉంటాయి.
అయితే, ‘ఆదికేశవ’లో కమర్షియల్ అంశాలన్నీ ఉన్నప్పటికీ అవి అంత జనరంజకంగా అనిపించవు. కారణం.. కథానాయకుడి పాత్రని సెకండ్ హాఫ్ వరకు కానీ కథలోకి తీసుకురాలేకపోవడమే.
బ్రహ్మసముద్రం గ్రామంలో కథ మొదలౌతుంది. కథకు మూలం అక్కడే ఉంటుంది. కథానాయకుడు అక్కడికి వచ్చి అన్యాయాన్ని ఎదుర్కోవడమే అసలు పాయింట్.
అయితే, ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమకథ, పాటలు, కామెడీతో సమయం గడిపేశారు. అందులో కొత్తదనం ఉంటే ఏ ఇబ్బందీ లేదు. అవన్నీ తెరపైకి చాలా రొటీన్‌గా వచ్చాయి. దీంతో కథలోకి వెళ్ళకుండా ఎందుకు సమయం వృథా చేస్తున్నారనే భావనలోకి జారుకుంటారు ప్రేక్షకులు.

ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
ట్రీట్మెంట్‌లో కొత్తదనం ఉందా ?
తొలి సన్నివేశంలోనే కథని ఓపెన్ చేసిన దర్శకుడు శ్రీకాంత్.. తర్వాత ఇంటర్వెల్ వరకూ దాని జోలికి పోలేదు. బాలు పాత్రతో సన్నివేశాలని పేర్చుకుంటూ వెళ్ళాడు. హీరోయిన్ పరిచయం కూడా రొటీనే.
అయితే, ఎంట్రీలోనే సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేస్తూ పరిచయం కావడం మాస్ ఆడియన్స్‌కి కొంత నచ్చేలా ఉంటుంది.
ఇక హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చాలా కృత్రిమంగా, కమర్షియల్ సినిమాల్లో ఇలానే ఉంటుందనే విధంగా చాలా రొటీన్‌గా ఉంది. ఆ పాత్రలు నడిచిన తీరులో కొత్తదనం, సంఘర్షణ ఏదీ ఉండదు.
ఒక రొటీన్ మలుపుతో ఈ కథకు విరామం ఇచ్చిన దర్శకుడు, రెండో సగంలో అసలు కథని నడిపాడు. అయితే అప్పటివరకూ హీరో పాత్రని నడిపిన తీరు కారణంగా.. ఆ కథలోని ఎమోషన్‌ని హీరో కూడా ఫీలవ్వడు. దీంతో చాలా సన్నివేశాలను అతనిలో ఎమోషన్ తీసుకురావడానికే అన్నట్టుగా వాడుకున్నారు.
హీరో పాత్రలో ఒక ట్విస్ట్ ఉంది. అది చివర్లో తెలుస్తుంది. అందుకే ఈ సన్నివేశాలని అలా పైపై నడిపారని అనుకున్నా.. అలాంటి సోసో సన్నివేశాల్ని చూడటానికి ప్రేక్షకుడిలో ఆసక్తి సన్నగిల్లుతుంది. చిన్నారుల నేపథ్యంలో ఒక ఎమోషన్ సీన్‌ని రాసుకున్నారు. అది కొంతమేరకు వర్కౌట్ అయ్యింది.
అంత రక్తపాతం అవసరమా?
నగరంలో పెరిగే చాక్లెట్ బాయ్ లాంటి కుర్రాడు, వైట్ షర్టు వేసి ఒక్కసారిగా సీమ ఫ్యాక్సనిస్ట్‌గా మారిపోయి రక్తం ఏరులై పారిస్తాడు. దీంతో తెరపై జరుగుతున్న రక్తపాతం, దారుణమైన చావులు.. శ్రుతిమించిన భావనని కలిగిస్తాయి.
ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌ని తీర్చిద్దిన తీరు బోయపాటి శ్రీను మాస్ ట్రీట్మెంట్‌ను గుర్తుతెస్తాయి. అయితే వైష్ణవ్ తేజ్‌కి అంత మాస్ ఇమేజ్ లేదు. దీంతో ఆ సన్నివేశాన్నీ ప్రేక్షకులు ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు.

ఫొటో సోర్స్, Sithara Entertainments/X
హుషారుగా చేసిన వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్‌కి ఇది తొలి మాస్ మసాలా సినిమా. తను హుషారుగా చేశాడు. యాక్షన్ సీన్స్‌లో ఈజ్ చూపించాడు. అయితే కొన్ని సీన్స్‌లో పవన్ కళ్యాణ్‌తోపాటు చాలా మంది మెగా హీరోలని ఇమిటేట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది.
మాస్ యాక్షన్ సీన్స్‌లో బావున్నాడు కానీ, అవి కాస్త సహజంగా ఉండేలా తీసుకుంటే బావుండేది.
శ్రీలీల అందంగా సగటు కమర్షియల్ హీరోయిన్ లానే కనిపించింది. తన డ్యాన్సులు బావున్నాయి. లీలమ్మా పాట మాస్‌కి నచ్చుతుంది.
జోజు జార్జ్ నటన బావున్నప్పటికీ విలనిజంలో బలం లేదు. మహిళని అడ్డుపెట్టుకొని అతను చేసిన విలనిజం అంతగా మెప్పించదు.
సుమన్ పాత్రలో ఓ మలుపు ఉంది.
రాధిక శరత్ కుమార్ ఫ్రెండ్లీ మదర్‌లా కనిపించింది.
సుదర్శన్ కొన్ని నవ్వులు పంచాడు.
సదా, అపర్ణ దాస్, తనికెళ్ళ భరణి, మిగతా పాత్రలు పరిధిమేర ఉన్నాయి.

ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
కమర్షియల్ సినిమాకు తగ్గ నిర్మాణం
జీవీ ప్రకాష్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కమర్షియల్ కొలతల్లో సాగాయి. యాక్షన్ సీన్స్‌లో లౌడ్ మ్యూజిక్ ఇచ్చారు.
లీలమ్మా పాటలో డ్యాన్సులు అలరిస్తాయి.
డడ్లీ కెమెరా పనితనం కలర్ ఫుల్‌గా ఉంది.
మాటల్లో కొత్తదనం కనిపించలేదు.
నిర్మాతలు కథకు కావాల్సింది సమకూర్చారు.
మాస్ మసాలా కమర్షియల్ సినిమాగానే ఆదికేశవ ప్రయాణం సాగింది. అయితే, మసాలా దినుసులు ఉంటే సరిపోదు. దర్శకుడికి వంటకం తెలిసుండాలి. వాటి మిశ్రమాన్ని పసందైన విందుగా అదించే నేర్పు ఉండాలి. ఈ విషయంలో ఓ రొటీన్ వంటకంగానే మిగిపోయింది ఆదికేశవ.
ఇవి కూడా చదవండి:
- అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప దాకా... తగ్గేదేల్యా
- చంద్రుడిపై స్థలాన్ని కొనుక్కోవచ్చా?
- ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఏం జరుగుతుంది, ఆ ఆలోచనలను ఎలా పసిగట్టాలి?
- బ్లాక్ స్వాన్ - శ్రియ: కే-పాప్‌లో భారత యువతి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి?
- మేడ్ ఇన్ హెవెన్: అట్టహాసంగా జరిగే వివాహ వేడుకల వెనుక దాగిన చేదు నిజాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















