విమానంలో ప్రయాణిస్తే మీ వయసు ఎందుకు తగ్గుతుంది?

ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రిస్ లింటాట్
    • హోదా, ఖగోళ నిపుణుడు

టైమ్ అందరికీ ఒకేలా ఉంటుందా? ఒక వ్యక్తి అంతరిక్షంలో ఆరు నెలలు గడిపి భూమిపైకి వస్తే, ఆయన లేదా ఆమె వయసు పెరుగుతుందా? లేదా ఇతరులతో పోలిస్తే కాస్త తగ్గుతుందా? లేదా అసలు వారి వయసులో ఎలాంటి మార్పూ ఉండదా?

ఇలాంటి చాలా ప్రశ్నలు నేడు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అయితే, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని పరిశీలిస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకొచ్చు.

సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, విశ్వం అంతటా టైమ్ ఒకేలా ఉండదు. అంటే ఇక్కడ సమయం స్థిరంగా ఉండదు. అంటే కొన్నిచోట్ల ముందుకు వెళ్లొచ్చు. మరికొన్నిచోట్ల వెనక్కి వెళ్లొచ్చు. పరిస్థితులకు అనుగుణంగా టైమ్ మారొచ్చు కూడా. దీన్ని మెరుగ్గా మీరు గమనించాలంటే కృష్ణ బిలంలోకి వెళ్లాలని ఖగోళ నిపుణుడు క్రిస్ లింటోట్ చెబుతున్నారు.

ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం

ఫొటో సోర్స్, Getty Images

క్లాక్ టెస్ట్

నాకు ఇష్టమైన సైన్స్ పరిశోధనల్లో ప్రపంచాన్ని నాలుగు గడియారాలతో రెండుసార్లు చుట్టిరావడమూ ఒకటి. దీనిలో భాగంగా అత్యంత కచ్చితత్వంతో పనిచేసే నాలుగు గడియారాలతో తూర్పు నుంచి పశ్చిమానికి ఒకసారి, పశ్చిమం నుంచి తూర్పుకు ఒకసారి విమానాల్లో ప్రయాణించాలి. దీని ద్వారా టైమ్ అన్నిచోట్ల ఒకేలా ఉంటుందా? లేదా కొన్నిసార్లు వేగంగా గడుస్తుందా? లేదా నెమ్మదిస్తుందా? లాంటివి పరిశీలించొచ్చు. 1971లో భౌతిక శాస్త్రవేత్తలు జోసెఫ్ హాఫెల్, రిచర్డ్ కీటింగ్ ఈ పరిశోధన చేపట్టారు. ప్రతి 30 మిలియన్ల ఏళ్లకు కేవలం ఒక సెకను మాత్రమే అటూఇటయ్యేంత కచ్చితత్వముండే గడియారాలను ఈ పరిశోధనలో వారు ఉపయోగించారు.

వాణిజ్య విమానాల్లో వారు ప్రయాణించారు. మొదట పశ్చిమం నుంచి, ఆ తర్వాత తూర్పు నుంచి ప్రపంచాన్ని వీరు చుట్టివచ్చి చివరగా వాషింగ్టన్ డీసీలోని తమ ల్యాబొరేటరీకి చేరుకున్నారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే సామర్థ్యమున్న వీరి పరమాణు గడియారాల టైమ్‌ను సాధారణ గడియారాలతో సరిపోల్చారు. అయితే, ఇక్కడ రెండు గడియారాల మధ్య సమయం సరిపోలేదు. టైమ్‌ మారే వేగాన్ని ట్రావెలింగ్ ప్రభావితం చేసినట్లు వీరి పరిశోధనలో తేలింది.

ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం

ఫొటో సోర్స్, ALAMY

‘‘టైమ్ అన్నిచోట్లా ఒకేలా లేదు’’

టైమ్ అన్నిచోట్లా ఒకేలా ఉండదని చెప్పే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు ఆ పరిశోధన చేపట్టారు. మీరు వేగంగా ప్రయాణిస్తే, మీకు సమయం నెమ్మదిగా గడుస్తుందని దీనిలో తేలింది. అయితే, మీరు లండన్ నుంచి న్యూయార్క్‌కు వేగంగా ప్రయణించినంత మాత్రాన ఈ ప్రభావాన్ని మీరు చూడలేరు. ఎందుకంటే సాధారణ గడియారంతో పోలిస్తే, ఇక్కడ కేవలం పది మైక్రోసెకన్లు మాత్రమే పరమాణు గడియారం వెనక్కి ఉంటుంది. ఇది చాలా స్వల్పం. కానీ, మీరు ఇంట్లో కూర్చొనేకంటే, ఆ ప్రయాణం చేస్తే, కొన్ని మైక్రోసెకన్లు వయసు తక్కువగా ఉండొచ్చు.

ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభావితం చూపిస్తుందని సాపేక్ష సిద్ధాంతం చెబుతోంది. ఉదాహరణకు మీరు భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి దూరంగా వెళ్లేటప్పుడు టైమ్ వేగంగా మారుతుంది. ఈ ప్రభావం మన శరీరంపైనా ఉంటుంది. ఇక్కడ మీ పాదాలతో పోలిస్తే, మీ తలకు కాస్త వేగంగా వయసు పైబడొచ్చు. అయితే, ఇక్కడ కూడా మీరు భూమి నుంచి ఎంత దూరం ప్రయాణిస్తే, ఈ ప్రభావాన్ని అంత మెరుగ్గా చూడొచ్చు.

ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ అనంత విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ బిలాలైతే భూమి లాంటి గ్రహాలను తమవైపు లాక్కోగలిగే ఖగోళ వస్తువులను కూడా స్వాహా చేస్తాయి. ఇలాంటి చోట టైమ్‌లో మార్పులను మరింత కచ్చితత్వంతో గమనించొచ్చు.

ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం

ఫొటో సోర్స్, Getty Images

కృష్ణ బిలంలోకీ..

అసలు సమయం ఎందుకు అన్నిచోట్లా ఒకేలా ఉండదో తెలుసుకోవాలంటే.. అసలు బ్లాక్ హోల్ దగ్గర ఏం జరుగుతోందో మీరు గమనించాలి. కృష్ణ బిలం తనవైపుగా లాక్కునేటప్పుడు ఆ ఖగోళ వస్తువు సాగతీతకు లోనవుతుంది. విపరీతమైన గురుత్వాకర్షణ ప్రభావమే దీనికి కారణం. అయితే, ఈ ప్రభావాన్ని తట్టుకునే ఓ ‘‘మ్యాజికల్ స్పేస్‌క్రాఫ్ట్’’ మీరు ఉన్నారని అనుకోండి.

మీరు లోపలకు వెళ్లేటప్పుడు మీరుగానీ, మీ చుట్టుపక్కల పరిస్థితుల్లో గానీ పెద్దగా ఎలాంటి టైమ్‌లో తేడానూ గమనించలేరు.

ఇక్కడ మీరు మీ గడియారాన్ని గమనించినా లేదా హృదయ స్పందన రేటును గమనించినా పెద్దగా తేడా ఉండదు.

అయితే, అక్కడి నుంచి మీరు కృష్ణ బిలం అవతలి పరిస్థితులను గమనిస్తే, సమయంలో తేడా కనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి టెలిస్కోప్‌లో భూమిని గమనిస్తే, అన్నీ పరిగెడుతున్నట్లుగా అనిపిస్తాయి. మీకు ఆ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి టీవీ చూస్తే, కార్యక్రమాలు కాస్త వేగంగా వెళ్తున్నట్లుగా కనిపిస్తాయి.

ఇప్పుడు మీరు ఆ కృష్ణ బిలానికి దూరంగా భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష కేంద్రంలో ఉన్నారని అనుకోండి. మీ స్నేహితుడు ఆ కృష్ణ బిలంలోకి వెళ్తున్నట్లుగా భావించండి.

వీడియో క్యాప్షన్, అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది

బ్లాక్‌ హోల్ దగ్గర ఏం జరుగుతోంది?

కృష్ణ బిలం చివర్లో ఒక వలయం ఉంటుంది. కాంతి వేగంతో ప్రయాణించే ఖగోళ వస్తువులు కూడా దీని నుంచి తప్పించుకోలేవు. మీ స్నేహితుడు కూడా నెమ్మదిగా ఆ వలయం వరకూ వెళ్లి అక్కడి నుంచి మాయం కాబోతున్నాడు.

మీ స్నేహితుడు మీకు కృష్ణ బిలం వలయం నుంచి చేయి ఊపారు అనుకోండి. మీకు ఆయన చాలా నెమ్మదిగా చేయి ఊపుతున్నట్లు కనిపిస్తుంది. మీ స్నేహితుడి వ్యోమనౌకపై ఏర్పాటుచేసిన గడియారంతో పోలిస్తే, మీ అంతరిక్ష కేంద్రంలోని గడియారంలో తేడా కనిపిస్తుంది.

ఇంటర్‌స్టెల్లార్ సినిమాలో ఈ విషయాన్నే సరిగ్గా చూపించారు. కృష్ణ బిలానికి సమీపంలోని ఓ గ్రహంపై అధ్యయనం చేపడుతున్న శాస్త్రవేత్తలు వారి మిషన్ పూర్తయ్యేనాటికి ఆ గ్రహం సమయం వేగంగా ముందుకు వెళ్లినట్లు గ్రహిస్తారు. ఇక్కడ ఏది సరైన సమయం అని ప్రశ్న అడగడం సరికాదు. ఎందుకంటే ఇక్కడ సరైన సమయం అంటూ ఏమీలేదు.

చివరగా కృష్ణ బిలంలోకి వెళ్తున్న మన స్నేహితుడు లోపలికి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి మళ్లీ బయటకు రావడం సాధ్యంకాదు. కానీ, అతడు టైమ్‌లో ముందుకు లేదా వెనక్కి కూడా వెళ్లొచ్చు.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మనిషి కాలు పెట్టి ఈ రోజుకు 51 ఏళ్లు

బ్లాక్ హోల్ ఒక టైమ్ మెషీన్

ఎందుకు ఇలా జరుగుతుంది? కృష్ణ బిలానికి దూరంగా భూమిపై త్రీడైమెన్షనల్ స్పేస్‌లో మనం ఎటు కావాలంటే అటు కదలొచ్చు. కానీ, ఇక్కడ ఫోర్త్ డైమెన్షన్ కూడా ఉంటుంది. అదే టైమ్. దీనిలో మనం ముందుకు వెళ్లడం మాత్రమే సాధ్యం. కానీ, బ్లాక్ హోల్‌ సరిహద్దుల్లో మీరు వెనక్కి కూడా వెళ్లొచ్చు.

అందుకే బ్లాక్ హోల్‌ను టైమ్ మెషీన్‌గా చెప్పొచ్చు. ఇక్కడ బ్లాక్ హోల్ లోపలికి పూర్తిగా వెళ్లే లోపు మీరు కావాలంటే వెనక్కి కూడా ప్రయాణించొచ్చు. నేరుగా బ్లాక్ హోల్ పుట్టినప్పటి పరిస్థితుల వరకూ మీరు వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే, వెనక్కి, ముందుకు వెళ్లొచ్చు కానీ, బ్లాక్ హోల్ నుంచి బయటకు రావడం మాత్రం కుదరదు. కాబట్టి భవిష్యత్ నుంచి ఒక టైమ్ ట్రావెలర్ వచ్చి మనల్ని ప్రస్తుతం పలకరిస్తారని మనం ఊహించుకోకూడదు.

ఈ విషయాల ద్వారా టైమ్‌ను బ్లాక్ హోల్స్ ఎలా నియంత్రిస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని మరింత మెరుగ్గా పరీక్షించేందుకు శాస్త్రవేత్తలకు వీటి ద్వారా ఒక అవకాశం కూడా దొరకొచ్చు.

చివరగా అసలు టైమ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడొచ్చు. బహుశా ప్రపంచాన్ని చుట్టివచ్చేటప్పుడు చేతిలో గడియారం పెట్టుకొని సమయాన్ని కొలవడం కంటే మెరుగైన మార్గాలు మనకు దొరకొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)