గగన్‌యాన్: శ్రీహరికోట నుంచి కాసేపట్లో టెస్ట్ ఫ్లైట్ ప్రయోగించనున్న ఇస్రో

గగన్‌యాన్

ఫొటో సోర్స్, ISRO

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇస్రో చేస్తున్న ప్రయత్నాల్లో తొలి అడుగు పడబోతోంది. ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల ప్రాజెక్ట్ గగనయాన్‌లో భాగంగా టెస్ట్ ఫ్లైట్‌ను మరికాసేపట్లో శ్రీహరి కోట నుంచి ప్రయోగించబోతోంది.

ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టబోతోంది.

చంద్రయాన్, ఆదిత్య L1 ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించుకున్న ఇస్రో అక్టోబర్ 21న ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి గగన్‌యాన్ TV-D1 టెస్ట్ ఫ్లైట్ ప్రయోగిస్తోంది.

గగన్‌యాన్

ఫొటో సోర్స్, ISRO

ప్రయోగం ఎలా?

మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న కార్యక్రమమే గగన్‌యాన్. 2025లో ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో మూడు రోజులు ఉంచి, సురక్షితంగా భూమ్మీదకు తిరిగి తీసుకురావడమే ఈ ప్రయోగం అంతిమ లక్ష్యం.

ఇది విజయవంతమైతే, భారత్ ఆపై నిర్వహించబోయే మావన అంతరిక్ష యాత్రలు, ఇతర ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుంది.

అక్టోబర్ 17న ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సహా పలువురు శాస్త్రవేత్తలు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై, గగన్‌యాన్ ప్రాజెక్ట్ గురించి వివరించారు.

ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

ఈ 20 రకాల పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్‌ ప్రయోగాన్ని అక్టోబర్ 21న నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.

ఈ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు.

ఫస్ట్ టెస్ట్ వెహికిల్ ఫ్లైట్‌ మిషన్‌లో క్రూ మాడ్యూల్‌ను సింగిల్ స్టేజ్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్‌తో ప్రయోగించనున్నారు.

ఆ తర్వాత బంగాళాఖాతంలో పారాచూట్ల సాయంతో ల్యాండయ్యే క్రూ మాడ్యూల్‌ను తిరిగి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తారు.

ఈ ప్రయోగం మొత్తం సుమారు పది నిమిషాల్లో పూర్తవుతుంది.

మాడ్యుల్

ఫొటో సోర్స్, ISRO

ఇండియన్ స్పేస్ స్టేషన్ కోసం ప్రయోగాలు

ఈ సమావేశంలో ఇస్రోకు మోదీ సరికొత్త దిశా నిర్ధేశం చేసినట్లుగా ప్రధాని కార్యాలయం తెలిపింది. 2035 నాటికల్లా ఇండియన్ స్పేస్ స్టేషన్ నిర్మించాలని, 2040 నాటికి చంద్రుడి మీదకు మావన సహిత ప్రయోగాలు నిర్వహించాలని మోదీ సూచించినట్లు చెప్పింది.

వాటితో పాటుగా చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయాలని, ఇందుకోసం నెక్ట్స్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీ, అత్యాధునిక లాంచింగ్ ప్యాడ్‌లు, హ్యూమన్ సెంట్రిక్ ల్యాబొరేటరీల నిర్మాణం వంటివి చేయాలని తెలిపారని పీఎంవో వివరించింది.

వీటితో పాటు వీనస్ ఆర్బిటార్, మార్స్ ల్యాండర్‌ల వంటి మరిన్ని గ్రహాంతర ప్రయోగాలు చేపట్టాలని ప్రధాని నిర్దేశించారు.

మాడ్యుల్ ప్రయోగం తీరు

ఫొటో సోర్స్, ISRO

మానవ అంతరిక్ష ప్రయాణం ఎంత కష్టం?

ఇప్పటివరకు ఇస్రో జరిపిన చంద్రయాన్, ఆదిత్య L1, మంగళ్ యాన్ ప్రయోగాలన్నీ ఒక ఎత్తు. గగన్‌యాన్ ప్రయోగం మరో ఎత్తు. ఎందుకంటే ఆ ప్రయోగాల్లో భూమ్మీద నుంచి పంపే చంద్రయాన్ ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ వంటివి తిరిగి వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ మానవ అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాముల్ని సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాలి. ఇదే అసలు సవాలు.

ప్రయోగ దశ నుంచి పూర్తయ్యే వరకూ ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

సాధారణంగా శాటిలైట్లను, ఇతర పరికరాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్ ప్రయోగాలు ఫెయిలైతే డబ్బు, సమయం మాత్రమే నష్ట పోవాల్సి ఉంటుంది. కానీ మానవ అంతరిక్ష యాత్రల్లో చిన్న పొరపాటు జరిగినా వ్యోమగాముల ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది.

మానవ అంతరిక్ష యాత్రలు ఇంత కష్టం కాబట్టే అమెరికా, రష్యా తొలినాళ్లలో ముందుగా కుక్కలు, కోతులు వంటి జంతువులను అంతరిక్షంలోకి పంపి ప్రయోగాలు చేసి, అన్ని స్థాయుల్లోనూ ప్రయోగాలు విజయవంతమైన తర్వాతే మానవ అంతరిక్ష యాత్రలు మొదలుపెట్టాయి.

అయితే ఇస్రో నేరుగా వ్యోమగాముల్నే అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ప్రతి అంశలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ బీబీసీకి తెలిపారు.

గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు ప్రయోగిస్తున్న క్రూ మాడ్యూల్‌ 1.2 మాక్ వేగంతో ప్రయాణించబోతుంది. అంటే ఇది ధ్వని వేగం కన్నా 1.2 రెట్లు ఎక్కువ వేగం.

ఇంత వేగంతో వ్యోమగాములు ప్రయాణించాలి కాబట్టే, ప్రతి చిన్న అంశంలోనూ కఠినమైన పరీక్షలు నిర్వహిస్తోంది.

రాకెట్

ఫొటో సోర్స్, ISRO

అక్టోబర్ 21 ప్రయోగ లక్ష్యం ఏమిటి?

ఈ గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవులు అంతరిక్షంలోకి వెళ్లేటపుడు ఏ దశలో సాంకేతిక లోపాలు తలెత్తినా, అందులోని వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేలా ప్రతి దశలోనూ పరీక్షలు నిర్వహిస్తారు.

అక్టోబర్ 21న ఇస్రో నిర్వహించబోయే మిషన్ లక్ష్యం కూడా ఇదే. దీనినే ‘ఇన్ ఫ్లైట్ అబార్ట్ డిమానిస్ట్రేషన్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్’ అని అంటారు.

నూతనంగా అభివృద్ధి చేసిన టెస్ట్ వెహికల్‌లో క్రూ మాడ్యూల్ సెపరేషన్ అండ్ సేప్టీ రికవరీని పరీక్షించడమే అక్టోబర్ 21 నాటి ప్రయోగ లక్ష్యం.

అక్టోబర్ 21న ప్రయోగించబోయే లిక్విడ్ ప్రొపెల్లెడ్ సింగిల్ స్టేజ్ టెస్ట్ వెహికల్‌కు ఆధునీకరించిన వికాస్ ఇంజిన్ అమర్చారు. దీనికి పై భాగంలో క్రూ మాడ్యూల్, దీంతోపాటు క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను అమర్చారు.

శ్రీహరికోట నుంచి క్రూ మాడ్యూల్‌తో నింగిలోకి రాకెట్ ఎగురుతుంది. 11 దశల తర్వాత 531.8 సెకెన్లకు చివరగా ఆ క్రూ మాడ్యూల్‌ బంగాళాఖాతంలో సముద్ర జలాలపై పారాషూట్ల సాయంతో సురక్షితంగా దిగుతుంది.

ఆపై భారత నౌకాదళం ఈ క్రూ మాడ్యూల్‌ను సేకరించి ఒడ్డుకు తీసుకువస్తుంది.

మావన సహిత గగన్‌యాన్ ప్రయోగం కన్నా ముందు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, పాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికిల్ ఫ్లైట్ వంటి చాలా పరీక్షలను ఇస్రో నిర్వహించాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, అంతరిక్షంలో ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు తొలి అడుగు గగన్‌యాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)