ఉత్తర కాశీ: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు డ్రిల్లింగ్ దాదాపు పూర్తయింది... మరి ఆలస్యం దేనికి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అనంత్ ఝణాణే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను కాపాడేందుకు గత 12 రోజులు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
బుధవారం రాత్రంతా డ్రిల్లింగ్ చేపట్టిన సహాయక సిబ్బంది, గురువారం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు.
వర్టికల్ డ్రిల్లింగ్ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ సొరంగ నిపుణులు అర్నాల్డ్ డిక్స్ చెప్పారు.
"ప్రస్తుతం సహాయక చర్యలు తుది దశకు చేరాయి. చెప్పాలంటే, ఇప్పుడు మనం గుమ్మం దగ్గరకు చేరుకుని, తలుపు కొడుతున్నట్లే అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను" అని అర్నాల్డ్ చెప్పారు.
‘‘దేశమంతా కోరుకుంటున్న ఆశను మేం నెరవేరుస్తాం’’ అని ఉత్తరఖాండ్ ప్రభుత్వ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు.
‘‘బుధవారం రాత్రి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో నాలుగు ఇనుప రాడ్లు డ్రిల్లింగ్ మిషిన్‌కు అడ్డుగా రావడంతో, పనులు ఆగిపోయాయి. ఆరు గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన తర్వాత, వాటిని కత్తిరించి, బయటికి తీశాం’’ అని తెలిపారు.
‘‘ప్రస్తుతం వెల్డింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే డ్రిల్ చేసిన 45 మీటర్ల పైప్‌లైన్‌కు, మరో 6 మీటర్ల పైప్‌ను కలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వా త దాన్ని ఆగర్‌తో ముందుకు నెడతాం’’ అని చెప్పారు.
విదేశీ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. ఈ విదేశీ నిపుణులు ప్రమాద స్థలం నుంచి వచ్చే వైబ్రేషన్లను రికార్డు చేస్తారు.
వీటిని బట్టి ఇక్కడ ఏ మేరకు సురక్షిత ప్రమాణాలను అనుసరించారో చెబుతారు.
‘‘కార్మికుల సహనం చాలా మెచ్చుకోదగ్గది. బుధవారం రాత్రి కట్టింగ్ పనులు జరుగుతున్నప్పుడు, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు వారికెలా అనిపిస్తుందో చెప్పారు. ఎందుకంటే, కట్టింగ్ సమయంలో గ్యాస్‌ను వాడారు. దీని వల్ల పొగ విడుదలైంది. సొరంగంలో అటువైపున్న కార్మికులు తమకు పొగ వాసన వస్తున్నట్లు చెప్పారు’’ అని ఖుల్బే తెలిపారు.
దీని తర్వాత పైప్ గుండా ‘‘మీరు మాకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని అన్నారు.
కానీ, వీరిని బయటికి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టమన్నారు.
‘‘ఎంత సమయం పడుతుందో చెప్పడం ఇప్పుడు సరైంది కాదు. దేశమంతా కోరుకుంటున్న మాదిరి ఎంత వీలైతే అంత త్వరగా బయటికి తీసుకొస్తాం’’ అని చెప్పారు.
‘‘ప్రతి 6 మీటర్ల పైప్‌ను మరో పైప్‌కు కలిపేందుకు వెల్డింగ్ ప్రక్రియ చేపట్టేందుకు 4 గంటలు పడుతుంది. ఇంకా 18 మీటర్లు ఉందని మేం అంచనావేస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి ఈ వెల్డింగ్ ప్రక్రియ చేపట్టేందుకు మరో 12 గంటల సమయం పట్టొచ్చు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
సొరంగంలోకి వెళ్లిన తర్వాత సహాయక సిబ్బంది ఏం చేస్తారు?
సిల్క్యారా సొరంగ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు ఇవాల్టితో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నారు.
అయితే, సహాయక సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్న తర్వాత ఏం చేస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సొరంగంలోకి సహాయక సిబ్బంది పైప్ చేరుకున్న తర్వాత, తొలుత కార్మికుల వద్దకు వైద్యులను పంపిస్తారు.
ఎందుకంటే, గత 12 రోజులుగా కార్మికులు సొరంగం లోపలే ఉండిపోయారు. కేవలం పండ్లను తింటూ తమ ప్రాణాలను కాపాడుకున్నారు. గత రెండు రోజుల క్రితమే వారికి తొలిసారి వేడివేడి కిచిడీని పంపించారు. ఇన్ని రోజులు సరైన ఆహారం లేకపోవడంతో వారు బలహీనంగా ఉండొచ్చు.
బయట వాతావరణం కంటే సొరంగం లోపల వెచ్చగా ఉంటుందని అధికారులు బీబీసీకి చెప్పారు. సహాయక సిబ్బంది దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోనుంది.

ఫొటో సోర్స్, ANI
మెషిన్ ఆపరేటర్ ఏం చెప్పారు?
శిథిలాలను తొలగించే ప్రక్రియలో ఆగర్ మెషిన్ ఆపరేటర్ నౌషాద్ అలీ బీబీసీతో మాట్లాడారు.
సొరంగం లోపల 80 శాతం డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యాయని ఇవాళ ఉదయం చెప్పారు.
అంతకుముందు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇనుప రాడ్లు, పైప్‌లు అడ్డుగా రావడంతో డ్రిల్లింగ్ కాస్త కష్టమైందన్నారు.
ఇది సహాయక చర్యలపై ప్రభావం చూపిందని చెప్పారు.
డ్రిల్లింగ్ పనులు కేవలం 20 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరగా చేపడతామని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
సంఘటన స్థలానికి వచ్చిన ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లారు. సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు గబ్బర్ సింగ్ నేగి, సబా అహ్మద్‌తో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని భరోసా ఇచ్చారు.
ప్రమాద స్థలానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి.
గురువారం ఉదయం కొద్దిసేపు డ్రిల్లింగ్ పనులు ఆగాయి.
డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నప్పుడు మధ్యలో ఇనుప రాడ్లు రావడంతో డ్రిల్లింగ్ పనులు ఆగినట్లు ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ హర్పాల్ సింగ్ తెలిపారు. ఈ రాడ్లను ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్ కత్తిరించిందని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
నిర్మాణంలో ఉన్న అన్ని సొరంగాలకు సేఫ్టీ ఆడిట్
ఈ ప్రమాదాలను నిర్మూలించేందుకు దేశంలో నిర్మిస్తున్న 29 సొరంగాలకు సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ(ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
ఈ సేఫ్టీ ఆడిట్ పని కోసం ఎన్‌హెచ్ఏఐ అధికారులకు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు సహకరించనున్నారు.
ఈ రెండు సంస్థలు కలిసి సేఫ్టీ ఆడిట్ చేపట్టి, తమ నివేదికను వారంలోగా సమర్పించనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 29 సొరంగాల్లో 12 టన్నెళ్లను హిమాచల్ ప్రదేశ్‌లో చేపడుతుండగా.. ఆరు జమ్మూ, కశ్మీర్‌లో నిర్మిస్తున్నారు. మిగిలిన సొరంగాలను ఉత్తరఖాండ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- డీప్ ఫేక్ ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటే...
- అమెరికాలో సిక్కు వేర్పాటువాది గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందన్న వైట్ హౌస్... భారత్ స్పందన ఏంటి?
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
- క్రికెట్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ఐసీసీ టీ20, చాంపియన్స్ టోర్నీల్లో ఆడతారా?
- ‘బర్రెలక్క’, యశస్విని రెడ్డి, కేసీఆర్, రేవంత్, ఈటల.. అందరిదీ ఒకటే లక్ష్యం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














