‘బర్రెలక్క’, యశస్విని రెడ్డి, కేసీఆర్, రేవంత్, ఈటల.. అందరిదీ ఒకటే లక్ష్యం

sirisha, revanth, kcr, eatala, yasashwini reddy

ఫొటో సోర్స్, facebook

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీల కీలక నేతలూ ప్రజాక్షేత్రంలో విరామం లేకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు.

దిల్లీ నుంచి రాహుల్, సోనియా, ఖర్గే, ప్రియాంక సహా పొరుగు రాష్ట్రం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అక్కడి కీలక నేత డీకే శివకుమార్, ఇంకా అనేకమంది కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే తెలంగాణలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలలో ప్రచారానికి షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి కూడా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ముఖ్య నేతలు బహిరంగ సభలలో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలను రంగంలోకి దించుతున్నారు. వీరితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారానికి రెడీ అయిపోయారు.

ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, ఇతర కీలక నేతలు హరీశ్, కవిత అంతా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.

బీఎస్సీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ జాతీయ నేత మాయవతి తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు.

వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి కూడా అధికారం అందుకోవాలని తపిస్తుండగా, ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో కీలకశక్తిగా నిలవాలని అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ ఎన్నికలలో కీలకమైన 8 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం..

రేవంత్, కేటీఆర్

ఫొటో సోర్స్, twitter

కామారెడ్డి: ముఖ్యనేతల ముఖాముఖి పోరు

ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత కానీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఏ ఎన్నికలలోనూ పెద్దగా చర్చలో లేదు.

కానీ, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో హైప్రొఫైల్ అభ్యర్థులు పోటీలో ఉండడంతో అందరి దృష్టీ కామారెడ్డిపైనే ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సిటింగ్ స్థానం గజ్వేల్‌తో పాటు పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డి. ఈసారి ఆయన గజ్వేల్, కామారెడ్డి.. రెండు నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మినహా ఇంకే నేత కూడా ఇలా రెండు నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నికల బరిలో లేరు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నికల క్షేత్రంలో నేరుగా ఢీకొడతానంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. రేవంత్ గత ఎన్నికలలో పోటీ చేసిన కొడంగల్‌లో ఈసారి పోటీ చేస్తూనే కామారెడ్డిలోనూ నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌ పార్టీలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నది రేవంత్ ఒక్కరే.

సీఎంను ఢీకొట్టేందుకు పార్టీ ఆయనకు అలాంటి అవకాశం ఇచ్చింది.

బీజేపీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన వెంకట రమణారెడ్డే ఈసారి ఇక్కడ అభ్యర్థి.

కేసీఆర్, రేవంత్ ఇక్కడ పోటీ పడుతుండడంతో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై ఈసారి అందరి కళ్లూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రేవంత్ ఓడించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ... రేవంత్ విజయం అసాధ్యమంటూ బీఆర్ఎస్.. ఇలా ఎవరికి వారు చెప్పుకొంటుండగా కేసీఆర్, రేవంత్ ఇద్దరూ బయటి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని, స్థానికుడినైన తనకే ప్రజల మద్దతు ఉందని బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి అంటున్నారు.

గంప గోవర్దన్

ఫొటో సోర్స్, twitter/Gampa Govardhan

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర చూసుకుంటే 1952 నుంచి 2018 వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 సార్లు గెలిచింది. తెలుగుదేశం 5 సార్లు, బీఆర్ఎస్ 3 ఎన్నికలలో విజయం సాధించాయి. ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు గెలిచిన మైనారిటీ నేత షబ్బీర్ అలీ మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ రెండు సార్లు టీడీపీ నుంచి మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఈ స్థానంలో అత్యధిక విజయాలు సాధించిన నేతగా గుర్తింపు పొందారు.

2018 ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి గంప గోవర్దన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవగా కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బీజేపీ నుంచి వెంకట రమణా రెడ్డి పోటీ చేశారు.

ఈసారి కేసీఆర్ రావడంతో గోవర్దన్‌కు టికెట్ రాలేదు. కాంగ్రెస్‌లో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీకి దిగడంతో షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ స్థానం కేటాయించారు.

బీజేపీ మాత్రం తమ అభ్యర్థిగా గత ఎన్నికలలో పోటీ చేసిన వెంకట రమణారెడ్డికే మళ్లీ అవకాశం ఇచ్చింది.

2018 ఎన్నికలలో గోవర్దన్ 5 వేల ఓట్ల తేడాతో షబ్బీర్ అలీపై గెలవగా వెంకటరమణారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

kcr, eatala rajender

ఫొటో సోర్స్, brs

గజ్వేల్: పాత మిత్రుల తొలి ప్రత్యక్ష యుద్ధం

గజ్వేల్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో, ఆ తరువాత 2018లో కేసీఆర్ ఇక్కడి నుంచే గెలిచారు.

ఇక్కడ రెండు సార్లూ తనపై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన వంటేరు ప్రతాపరెడ్డిని కూడా బీఆర్ఎస్‌లోకే తీసుకొచ్చి పదవులు ఇవ్వడంతో కేసీఆర్‌‌కు ఈ ఎన్నికలలో పెద్దగా పోటీ ఉండబోదని అంతా భావించారు.

కానీ, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే సాగి, రాష్ట్రమేర్పడిన తరువాత కేసీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా కీలక పదవుల్లో ఉండి కొద్దికాలం కిందట విభేదించి బీజేపీలో చేరిన బీసీ నేత ఈటల రాజేందర్ ఇప్పడు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు.

బీఆర్ఎస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో సుదీర్ఘ కాలంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికలలోనూ రాజేందర్ విజయం సాధించి బీజేపీలో కొనసాగుతున్నారు.

తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ ఇప్పుడు ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీకి అనుమతించింది.

ఈటల రాజేందర్ తన సిటింగ్ స్థానం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ నుంచి రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థి ఈటల రాజేందర్.

కేసీఆర్‌తో దశాబ్దాల పాటు ప్రయాణం చేసిన ఈటల తొలిసారి ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికలలో ఎదుర్కొంటున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని బరిలో నిలిపింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేసినా ఆ తరువాత ఆయన బీఆర్ఎస్‌లో చేరడంతో తూముకుంటకు పార్టీ అవకాశం ఇచ్చింది.

ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ రెండు కంటే ఎక్కువసార్లు వరుసగా గెలిచిన చరిత్ర లేకపోవడం.. కేసీఆర్, ఈటలలు పోటీ పడుతుండడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.

2018లో కేసీఆర్ ఇక్కడ 60.45 శాతం ఓట్లు సాధించి 58 వేల ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు.

2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆకుల విజయ డిపాజిట్ కూడా కోల్పోయారు.

Bandi Sanjay Kumar

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar

కరీంనగర్: ‘బండి’కి స్పీడ్ టెస్ట్

తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో కరీంనగర్ అసెంబ్లీ కూడా ఒకటి. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న గంగుల కమలాకర్, బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

కమలాకర్ 2014 నుంచి వరుసగా మూడు సార్లు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుస్తుండగా 2014, 2018లో కమలాకర్ చేతిలో సంజయ్ ఓటమి పాలయ్యారు.

రెండు ఎన్నికలలోనూ రెండు స్థానంలో నిలిచిన సంజయ్ 2018 ఎన్నికల ఓటమి తరువాత 2019 లోక్ సభ ఎన్నికలలో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు.

అనంతరం పార్టీ ఆయన్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికలకు కొద్ది నెలల ముందు సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసింది పార్టీ.

పదునైన ప్రసంగాలు, యువతలో క్రేజ్ కారణంగా బండి సంజయ్... మంత్రిగా.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో కమలాకర్ ఇద్దరూ ఇక్కడ విజయం కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పురుమళ్ల శ్రీనివాస్ పోటీ పడుతున్నారు.

ktr

ఫొటో సోర్స్, brs

సిరిసిల్ల: నేతన్నలు గెలిపించేది ఏ నేతనో?

చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సిరిసిల్ల ప్రజలు 2009 నుంచి బీఆర్ఎస్ నేత కేటీఆర్‌‌ని గెలిపిస్తున్నారు.

2009 ఎన్నికలలో తొలిసారి పోటీ చేసినప్పటి నుంచి 2010 ఉప ఎన్నిక సహా 2018 వరకు వరుసగా నాలుగు సార్లు కేటీఆర్ ఇక్కడి నుంచి గెలిచారు.

ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ మరోసారి ఇక్కడ బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ పోటీ చేస్తున్నారు.

న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న కేకే మహేందర్ రెడ్డి 2009 నుంచి మూడు సార్లు కేటీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2009లో, 2010 ఉప ఎన్నికలలో 2018లో ఆయన కాంగ్రెస్ నుంచి ఇక్కడ పోటీ చేశారు.

2009లో కేటీఆర్ తొలిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు కేకే మహేందర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో కేవలం 171 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అయితే, 2018 ఎన్నికలకు వచ్చేనాటికి కేటీఆర్ మెజారిటీ భారీగా పెరిగింది. 2018 ఎన్నికలలో ఆయన కేకే మహేందర్ రెడ్డిపై 89,009 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికలలో కేటీఆర్ ఏకంగా పోలైన ఓట్లలో 70.89 శాతం సాధించారు.

ప్రస్తుత ఎన్నికలలో కేటీఆర్, కేకే మహేందర్ రెడ్డిలు పాత ప్రత్యర్థులే కాగా బీజేపీ నుంచి రాణి రుద్రమ బరిలో నిలిచారు. అయిదో సారి గెలుపు కోసం కేటీఆర్, ఎలాగైనా కేటీఆర్‌పై గెలవాలని కేకే, కాషాయ జెండా ఎగరవేయాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

mamidala yasashwini reddy

ఫొటో సోర్స్, mamidala yasashwini reddy

పాలకుర్తి: ఎర్రబెల్లిని ఓడిస్తానంటున్న 26 ఏళ్ల అమ్మాయి

ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల అమ్మాయి రాజకీయంగా ఢీకొడుతున్న నియోజకవర్గం ఇది.

పాత మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగి వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్న 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి అనూహ్యంగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు.

తెలంగాణకే చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో రాణించి పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక కార్యక్రమాలు చేపడుతుండేవారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే.. భారత పౌరసత్వం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు బదులు ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది.

రాజకీయాలలో ఆరితేరి, ఇంతవరకు ఓటమి తెలియని నేతగా పేరున్న ఎర్రబెల్లిపై ఆమె పోటీ చేస్తుండడంతో రాష్ట్రంలో అందరి దృష్టీ ఆమెపై పడింది.

1994 నుంచి 2009 వరకు వర్ధన్నపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు గెలిచిన ఎర్రబెల్లి 2008లో టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడు వచ్చిన ఉప ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచి ఎంపీగానూ పనిచేశారు.

అయితే, 2009 డీలిమిటేషన్ తరువాత వరంగల్ లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. ఆ సమయంలో ఎర్రబెల్లి పాలకుర్తి అసెంబ్లీ స్థానానికి మారి 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయన టీడీపీ నుంచే పోటీ చేసి పాలకుర్తిలో గెలిచారు. అనంతరం 2016లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి గెలిచారు.

కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న ఆయన ఈ ఎన్నికలలో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. గెలిచాక పాలకుర్తిలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని.. మళ్లీ అమెరికా వెళ్లేది లేదని ఆమె తన ప్రచార ఉపన్యాసాలలో చెప్తున్నారు. ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

బీజేపీ నుంచి ఇక్కడ లేగ రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఓటమి ఎరుగని ఎర్రబెల్లిని ఒక ఫస్ట్ టైమర్ ఢీకొంటుండడంతో పాలకుర్తిలో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

sireesha kollapur

ఫొటో సోర్స్, UGC

కొల్లాపూర్: జూపల్లి, బీరం మధ్యలో బర్రెలక్క

గత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొల్లాపూర్‌లో 1999 నుంచి 2014 వరకు ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి మొత్తం వరుసగా 5 గెలిచిన బలమైన నాయకుడు జూపల్లి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ కేబినెట్లలో పనిచేసిన అనుభవశాలి. అయితే, 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి విజయం సాధించడంతో పాటు ఆ తరువాత కాలంలో బీఆర్ఎస్‌లో చేరిపోయారు.

అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న జూపల్లి కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్‌కు దూరంగా జరిగి ఈ ఎన్నికలకు ముందు పొంగులేటితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.

దీంతో గత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జూపల్లి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా... గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్థన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఇక్కడ.

అయితే... నామినేషన్లకు ముందు వరకు ఇది జూపల్లి, బీరం మధ్య పోరుగా భావించి మిగతా అన్ని నియోజకవర్గాల మాదిరిగానే దీన్నీ లెక్కేశారు చాలామంది.

కానీ, ‘బర్రెలక్క’గా పేరొందిన యూట్యూబర్ శిరీష ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో ఇక్కడి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.

ఉద్యోగం రాక బర్రెలు మేపుకొంటున్నానంటూ కొంత కాలం కిందట యూట్యూబ్‌లో వీడియో పెట్టిన ఆమె అది వైరల్ కావడంతో అప్పటి నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తూ కొంత జనంలో గుర్తింపు పొందారు. ఇప్పుడామె అదే నిరుద్యోగ సమస్యను జనంలోకి తీసుకెళ్తూ ఎన్నికలలో పోటీ పడుతుండడంలో పెద్ద సంఖ్యలో యూట్యూబర్లు, సామాజిక ఉద్యమకారులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.

దీంతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆమె పేరు కూడా అందరి నోళ్లలో నానుతోంది. దీంతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు కూడా ఆమెపై విమర్శలు చేస్తుండడం వంటివి మరింతగా ఆమె పేరు వార్తల్లో నిలిచేలా చేశాయి.

కేసీఆర్, కేటీఆర్ వంటివారు కూడా తమ ప్రసంగాలలో ఆమె ప్రస్తావన కూడా పరోక్షంగా తేవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ఆమె పేరు కూడా వినిపిస్తోంది.

PONGULETI SRINIVASA REDDY

ఫొటో సోర్స్, PONGULETI SRINIVASA REDDY

పాలేరు బరిలో పొంగులేటి..

రూ. 434 కోట్ల ఆస్తులతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రెండో సంపన్న అభ్యర్థిగా తేలిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది.

అభ్యర్థిత్వాలు ప్రకటించడానికి ముందు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం విపరీతంగా చర్చల్లో నిలిచింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్కడ నుంచి పోటీ చేస్తారన్న అంచనాలు వెలువడడంతో అంతా పాలేరు వైపు చూశారు.

అయితే.. కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇచ్చి పొంగులేటిని పాలేరు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్ఆర్‌టీపీ ఈ ఎన్నికలలో పోటీయే చేయడం లేదు.

ఇక బీఆర్ఎస్ తన సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ ఇక్కడి టికెట్ ఇచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతో ప్రభావం చూపిన సీపీఎం నుంచి ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం ఇక్కడ పోటీ చేస్తున్నారు.

పాలేరు నియోజకవర్గం 2009 డీలిమిటేషన్‌తో ఏర్పడింది. దాంతో అప్పటివరకు ఉన్న సుజాతనగర్ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చిన కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకట్రెడ్డి 2009లో పాలేరులో పోటీ చేసి గెలిచారు. 2014లోనూ ఆయనే విజయం సాధించారు. అనంతరం ఆయన మరణించడంతో 2016లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటికి బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో బీఆర్ఎస్ నుంచి గెలిచారు.

అయితే, 2018లో ఆయన ఓటమి పాలయ్యారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేత తుమ్మలపై గెలిచారు.

అనంతరం కందాల బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కందాలకే టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ నుంచి నున్న రవికుమార్ గెలిచారు.

కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సంపన్న పారిశ్రామికవేత్త పొంగులేటి ఇక్కడ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపై ఉంది.

TWITTER/KOMATIREDDY RAJGOPALREDDY

ఫొటో సోర్స్, TWITTER/KOMATIREDDY RAJGOPALREDDY

మునుగోడు: ఏడాదిలో రెండు సార్లు ఎన్నికలు.. ఓటరు తీర్పు ఎలా ఉండనుంది?

పాలకుర్తిలాగే ఇది కూడా సంపన్న అభ్యర్థి ఉన్న నియోజకవర్గం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరి కంటే ఎక్కువ ఆస్తులు రూ. 458 కోట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.

సరిగ్గా ఏడాది కిందట మునుగోడుకు ఉప ఎన్నిక జరిగింది. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి 2022లో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది.

కానీ, ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు.

అయితే... ఆ ఉప ఎన్నికలో విజయం కోసం బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా పోటీ పడడంతో పార్టీలు, అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి.

ఏడాది తిరిగేటప్పటికి వివిధ కారణాలతో రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సంపాదించారు.

ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి చలమల కృష్ణారెడ్డి పోటీపడుతున్నారు.

అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం చేస్తుండడం.. ఏడాది కాలంలోనే రెండుసార్లు ఎలక్షన్లు రావడంతో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)