అమెరికాలో సిక్కు వేర్పాటువాది గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందన్న వైట్ హౌస్... భారత్ స్పందన ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెన్డ్ డీబస్మన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిని చంపేందుకు కుట్ర జరిగినట్లు వచ్చిన ఆరోపణలను భారత 'అత్యున్నత స్థాయి' అధికారుల వద్ద ప్రస్తావించినట్లు వైట్ హౌస్ తెలిపింది.
ఫైనాన్సియల్ టైమ్స్ వార్తా కథనం ప్రకారం అమెరికా, కెనడా ద్వంద్వ జాతీయుడైన గురుపట్వంత్ సింగ్ పన్నును హత్య చేసేందుకు ఈ కుట్ర జరిగింది.
మరో సిక్కు వేర్పాటువాది హత్య వెనుక భారత్ హస్తం ఉండవచ్చని కెనడా ఆరోపించిన కొన్ని వారాల తర్వాత ఈ రిపోర్టు వచ్చింది.
సిక్కుల ప్రత్యేక దేశం కోసం పన్ను వాదిస్తుంటారు. అయితే, భారత్ ఆయనను ఉగ్రవాదిగా పరిగణిస్తోంది.
పన్నును చంపే కుట్రను అమెరికా అధికారులు తిప్పికొట్టారని, దీనిపై భారత్‌కు హెచ్చరిక సైతం జారీ చేసినట్లు పేరు తెలుపని వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాసంస్థ బుధవారం ఒక కథనంలో తెలిపింది.
కుట్ర వివరాలను భారత అధికారులతో పంచుకున్నపుడు వారు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశారని వైట్‌హౌస్ తెలిపింది.
"ఇలాంటివి తమ పాలసీలో లేవని చెప్పారు" అని వైట్‌హౌస్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.
"భారత ప్రభుత్వం ఈ సమస్యను మరింత లోతుగా పరిశీలిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతాం" అని అడ్రియన్ చెప్పారు.
"బాధ్యతగా వ్యవహరించే వారెవరైనా జవాబుదారీగా ఉండాలని అమెరికా తెలియజేసింది" అని వాట్సన్ చెప్పారు.
అయితే, భారత్‌కు అమెరికా నిరసన తెలిపినందుకు ఆపరేషన్ ఆగిందా? లేక అమెరికా అధికారులే అడ్డుకున్నారా అనేది స్పష్టంగా తెలియదని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
ఇది అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు: పన్నూ
అమెరికా కేంద్రంగా నడిచే సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)కు పన్నూ జనరల్ కౌన్సిల్(ముఖ్య న్యాయవాది). ఈ సంస్థ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తుంటుంది.
సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ఖలిస్తాన్ ఉద్యమం సాగుతోంది.
తన హత్యకు జరిగిన కుట్ర ఒక విఫల యత్నమని, అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అంతర్జాతీయ ఉగ్రవాదమని పన్ను బీబీసీతో ఒక ప్రకటనలో తెలిపారు.
"దీనిపై అమెరికా ప్రభుత్వమే మాట్లాడాలి" అని చెప్పారు.
1980లలో పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం తార స్థాయికి చేరుకుంది, అయితే, కాలక్రమేణ అది తగ్గిపోయింది. ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు ఉద్యమానికి దూరంగా ఉంటున్నాయి.
సిక్కు ప్రవాసుల మద్దతుదారులు ప్రత్యేక దేశం కోసం నినదిస్తూనే ఉన్నారు, అంతేకాదు, ఇటీవలి కాలంలో స్వాతంత్య్రం కోసం పిలుపులు తీవ్రమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఏమంటోంది?
వ్యవస్థీకృత నేరస్థులు, అక్రమ తుపాకీ వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు, ఉగ్రవాదులు తదితరుల మధ్య సంబంధాల గురించి అమెరికా తమకు కొంత సమాచారాన్ని అందించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
"ఇండియా ఆ వివరాలను తీవ్రంగా పరిగణిస్తుంది, ఎందుకంటే, ఇది జాతీయ భద్రతా ప్రయోజనాలను కూడా ప్రభావితం చేస్తుంది" అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
అయితే, ఈ ప్రకటనలో పన్ను గురించి ప్రస్తావించలేదు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) గ్రూప్‌ను 2019లో భారత అధికారులు "చట్టవిరుద్ధమైన అసోసియేషన్"గా పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాది పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించారు.
ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని, అది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని సిక్కులకు పన్నూ చెబుతున్నట్లు ఒక వీడియో కూడా ఇటీవల బయటికి వచ్చింది.
భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ వారం ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. అయితే, విమానయాన సంస్థ బహిష్కరణను ప్రస్తావించానని, బెదిరించలేదని పన్ను వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజ్జర్ హత్యతో మొదలు
మరోవైపు పన్నూ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన విశ్వసనీయ వివరాలను కెనడాతో పంచుకుంది అమెరికా.
2023 జూన్‌లో వాంకోవర్ శివారులోని సిక్కు దేవాలయం వెలుపల సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (48)ను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
ఈ హత్యలో భారత అధికారుల ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆరోపణలు చేశారు.
ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ భారత్ ఖండించింది. కెనడా అధికారులు నిజ్జర్ మృతిపై విచారణ జరుపుతున్నారు.
ట్రూడో ఆరోపణల తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి, రెండు దేశాలు తమ రాయబారులను బహిష్కరించాయి.
భారత్ ప్రమేయం ఉందని నమ్మడానికి దారితీసిన సాక్ష్యాలను లేదా గూఢచార్య సమాచారాన్ని కెనడా ఇప్పటికీ బహిరంగపరచలేదు.
ఇవి కూడా చదవండి:
- మచిలీపట్నం హిందూ కాలేజీ భూముల్ని ఎందుకు అమ్మకానికి పెట్టింది?
- ఇండియా X ఆస్ట్రేలియా: 2003, 2023 ఫైనల్స్ మధ్య ఆశ్చర్యకర పోలికలు ఏమిటి? ఈ ‘సెంటిమెంట్స్’ ఏం చెబుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














