క్రికెట్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ఐసీసీ టీ20, చాంపియన్స్ టోర్నీల్లో ఆడతారా?

కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చంద్రశేఖర్ లూథ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచకప్‌లో సత్తా చాటిన రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లీల వయసు 35 ఏళ్లు దాటింది. ఇపుడు వారిద్దరూ ఎన్ని రోజులు క్రికెట్ ఆడతారనేది అందరిలో మెదిలే ప్రశ్న.

రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌-2023 కల చెదిరిపోయింది.

గురువారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌తో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను ప్రారంభించనుంది ఇండియా.

ప్రపంచకప్‌ ఆడిన భారత జట్టు నుంచి ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే పాల్గొంటున్నారు.

హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో జట్టు బాధ్యతలను సూర్య కుమార్ యాదవ్‌కు అప్పగించింది మేనేజ్‌మెంట్.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందు తలెత్తిన అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, టీమిండియాలోని ఇద్దరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్ ఏమిటి? ఎన్ని రోజులు క్రికెట్ ఆడే అవకాశముంది?

ఈ ప్రశ్నకు అంత త్వరగా సమాధానం దొరక్కపోవచ్చు. అయితే వారిద్దరూ క్రికెట్‌కు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొనే అవకాశముంది, ఆ తర్వాత తమకు తాము ఈ ప్రశ్న వేసుకోవడం ఖాయం.

విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ వయస్సు పరంగా రోహిత్, కోహ్లీలకు ఇకనుంచి ప్రతికూలత ఎదురుకావొచ్చు.

అయితే, కనీసం రెండు-మూడేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా వారిద్దరికీ ఉందని ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల అభిమానులూ చెబుతున్నారు.

ఈ మూడేళ్ల కాలంలో టీమిండియా మూడు ఐసీసీ టోర్నమెంట్లలో ఆడొచ్చు, అయితే ఈ ఇద్దరూ ఆ మూడింటి బరిలో దిగే అవకాశమెంత?

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

రాబోయే రెండేళ్లలో ఎదురయ్యే సవాళ్లేంటి?

2024లో టీ-20 ప్రపంచకప్‌, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడనుంది. టీమిండియా అర్హత సాధిస్తే, 2025లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌నూ ఆడవచ్చు.

ఈ మూడు ముఖ్యమైన ఈవెంట్‌లలో రోహిత్, విరాట్ కోహ్లీలు ఉంటారనేది ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే వీరిద్దరూ రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్‌లలో ఆడే అవకాశాలు తక్కువే.

అయితే వచ్చే ఏడాదిలో ఇండియా కేవలం 8 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందుకే రోహిత్, విరాట్‌లపై ఎక్కువ ఒత్తిడి ఉండదు.

అయితే ఈ ఇద్దరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మరికొన్ని నెలల్లో తేలిపోనుంది. ఎందుకంటే ఆర్నెళ్ల తర్వాత అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

ఈ టోర్నీ కోసం సెలక్టర్లు రోహిత్-విరాట్‌లపై విశ్వాసముంచినా, యువ ఆటగాళ్లను ప్రయత్నించినా.. అందరి లక్ష్యం టోర్నీ విజేతగా నిలవడంపైనే.

గత టీ20 ప్రపంచకప్‌ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారు. అయితే, ఇప్పుడు టీం మేనేజ్‌మెంట్ యువకులకు అవకాశాలిస్తోంది, ఈ క్రమంలో టీ20లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది.

తాజా పరిస్థితులు పరిశీలిస్తే 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచ కప్ తర్వాత రెండు ముఖ్యమైన ఐసీసీ టోర్నీలు ఉన్నాయి. దీంతో జట్టు మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను 2025 వరకు జట్టులో ఉంచే అవకాశం ఉంది.

ఇదే సందర్భంలో 37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్‌కు వన్డే, టీ-20 క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కడం లేదు. 34 ఏళ్ల రవీంద్ర జడేజా, 33 ఏళ్ల మహ్మద్ షమీలు కూడా పని భారం నిబంధనల ప్రకారం ఫార్మాట్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.

కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

కీలకంగా ఫిట్‌నెస్

ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత, చాలామంది సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా కెరీర్, రిటర్మైంట్ గురించే ఆలోచిస్తారు.

కానీ ఈ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ కేలండర్ చాలా బిజీగా ఉంది, ఆలోచనలు, ఆత్మపరిశీలన, షాక్‌ను అధిగమించేంత సమయం వారికి దొరకడం లేదు.

అంతేకాదు వారికి బయట కూడా చాలా అవకాశాలున్నాయి. ఆటగాళ్లు తమ కెరీర్‌ను టెస్ట్ లేదా టీ20 స్పెషలిస్ట్‌గా కొనసాగించవచ్చు. వీటన్నింటితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడవచ్చు.

ఫిట్‌నెస్ కీలక భూమిక పోషించనుంది. అయితే, సచిన్ తెందూల్కర్ మాదిరి అందరూ 23-24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడకపోవచ్చు.

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి ఇలాగే కొనసాగించగలిగితే 2025 తర్వాత కూడా కొద్దికాలం ఆడగలడు.

అంతేకాదు విరాట్ ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేస్తుంటాడు. కాబట్టి విరాట్ టెస్ట్ క్రికెటర్‌గా పరిమితం చేసుకునే అవకాశం ఉంది.

మరోవైపు రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్ ఘనంగా ఉంది. మరికొన్నేళ్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 765 పరుగులు సాధించగా, రోహిత్ శర్మ 597 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

ఇపుడు వీరిద్దరూ తమ క్రికెట్ కెరీర్ పొడిగించుకోవడానికి త్వరలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి రావొచ్చు.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

యువ తారలు సిద్ధం

ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన ఏ ఆటగాడు లేదా టీం మేనేజ్‌మెంట్ విమర్శలను ఎదుర్కోలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు వరుసగా పది మ్యాచ్‌లు గెలిచింది.

రాహుల్, శ్రేయస్ ఇలా ప్రతీ ఆటగాడు టోర్నీలో తనదైన ముద్రవేశారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు వరకు టీమిండియాను అత్యుత్తమ వన్డే జట్టుగా పరిగణించడానికి ఇదే కారణం. రానున్న రోజుల్లో కూడా భారత జట్టు ఈ స్థాయి ప్రదర్శనను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా వన్డే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీల వారసత్వాన్ని ఈ ఆల్‌రౌండర్ ముందుకు తీసుకువెళతాడని పలువురు భావిస్తున్నారు.

రోహిత్ శర్మ ఎలాంటి దూకుడుతో టీమిండియాను తీర్చిదిద్దాడో, అదే దూకుడు హార్దిక్ పాండ్యాలో కనిపిస్తోంది.

ఇదే సమయంలో పాండ్యాకు తనదైన కెప్టెన్సీ శైలీ ఉంది. అయితే రోహిత్, విరాట్‌లు నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండటమనేది వారి ఫిట్‌నెస్ బట్టి తెలుస్తుంది.

కాగా, టీమిండియాలో 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్, 25 ఏళ్ల ఇషాన్ కిషన్, 26 ఏళ్ల రితురాజ్ గైక్వాడ్, 28 ఏళ్ల శ్రేయస్ అయ్యర్, 21 ఏళ్ల యశస్వి జైస్వాల్, 26 ఏళ్ల రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు ఉండటం శుభపరిణామం.

ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా నిరూపించుకున్నారీ కుర్రాళ్లు. టీమిండియా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వీరంతా సిద్దంగానూ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)